Digital Security

దేశ డిజిటల్ భద్రతకు భరోసా

భారత్ లో టెలికాం పాత్ర ప్రజలను అనుసంధానించడం మాత్రమే కాదు, అభివృద్ధికి దూరంగా మనుగడ సాగించే వారి జీవితాల్లోకి అభివృద్ధిని తీసుకురావడంలో కూడా అది కీలకపాత్ర వహిస్తోంది. గత పదేళ్ళ కాలంలో దేశంలో డిజిటల్ అనుసంధానత గణనీయంగా పెరిగింది. మొబైల్ డేటా ధరలు అతి తక్కువగా ఉన్న దేశాల్లో భారత్ ఒకటి. దేశంలో ఇప్పుడు 95.44 కోట్ల మంది ఇంటర్నెట్ చందాదారులు ఉన్నారు. వారిలో 39.83 కోట్ల మంది మంది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారు. గత దశాబ్ద కాలంలో బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ల సంఖ్య 6.4 కోట్ల నుంచి 9.24 కోట్లకు పెరిగింది. ఈ విస్తృత అనుసంధానత డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు చోదక శక్తిగా పనిచేసింది. ఇప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థలో డిజిటల్ ఆర్థిక వ్యవస్థ వాటా 10 శాతంగా ఉంది. ఇది 2026 నాటికి స్థూల జాతీయోత్పత్తిలో 20 శాతానికి లేదా ఆర్థిక వ్యవస్థలో ఐదవ వంతుకు చేరుకుంటుందని అంచనా. బ్యాంకింగ్ సర్వీసులు, కేవైసీ ధ్రువీకరణ, డిజిటల్ చెల్లింపులు, మొబైల్ ఆధారిత ధ్రువీకరణ భారతీయ డిజిటల్ విప్లవానికి వెన్నెముకగా నిలిచాయి.

జనధన్, ఆధార్, మొబైల్ (జామ్) త్రయం ద్వారా సేవలు అభివృద్ధి చెందడానికి ఈ పరిస్థితి దోహదం చేసింది. 2024 అక్టోబర్లో భారత్ ఆధార్ ఆధారిత చెల్లింపు వ్యవస్థ ద్వారా 12.6 కోట్ల డిజిటల్ లావాదేవీలు నిర్వహించింది. అయితే ఈ డిజిటల్ విప్లవం కొన్ని పెను సవాళ్లను కూడా మన ముందు ఉంచింది. ముఖ్యంగా మన పౌరులను సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందినప్పుడు ఏర్పడే సమస్యలు నుంచి కాపాడటం ఇందులో ఒకటి. మనకు ఎంతో ఉపయోగపడే మొబైల్ మోసకారులకు కూడా సాధనంగా మారింది. విసిగించే టెలి మార్కెటింగ్ కాల్స్, మోసపూరిత సందేశాలు, అవాంఛిత మార్కెటింగ్ ఆఫర్లు, ఫిషింగ్ స్కామ్ లు, నకిలీ మదుపు రుణ అవకాశాలకు సంబంధించిన ప్రతిపాదనలు సాధారణ పౌరులను తీవ్రమైన ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. వీటిల్లో ఒక ప్రధానమైన సవాలు డిజిటల్ అరెస్టు మోసాలు. వీటి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇందులో భాగంగా మోసగాళ్లు ప్రభుత్వ ఉద్యోగులలాగా నటిస్తూ పౌరులను భయభ్రాంతులను చేసి వారి నుంచి డబ్బులు కాజేస్తున్నారు. దీనివల్ల ఆర్థికంగా నష్టం జరగటమే కాకుండా ఈ దుర్మార్గపు కార్యకలాపాలు ప్రజల జీవనోపాధులను దెబ్బతీస్తున్నాయి. పౌరుల్లో విశ్వాసాన్ని సన్నగిల్ల చేసి డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో వారు పూర్తిగా పాల్గొనలేని పరిస్థితిని సృష్టిస్తున్నాయి. అయితే తీవ్రరూపం దాలుస్తున్న ఈ ముప్పును ఎదుర్కోవడానికి మన అధికారులు క్రియాశీలంగా వ్యవహరిస్తున్నారు. తప్పుడు మార్గాల ద్వారా తీసుకున్న మొబైల్ కనెక్షన్లను నిలిపి వేస్తున్నారు 7.6 లక్షల సైబర్ ఫిర్యాదులు నమోదు కాగా 2,400 కోట్ల సొమ్మును వెనక్కి రాబట్టారు. ఇవి కేవలం నేరాలకు సంబంధించిన అంకెలు మాత్రమే కాదు, బాధితుల జీవితాలు, స్వప్నాలకు సంబంధించిన అంకెలు కూడా.

డిజిటల్ వ్యవస్థలో భద్రత కోసం ప్రభుత్వం అన్ని రకాల చర్యలూ తీసుకుంటున్నప్పటికీ ప్రజల సహకారం లేనిదే ఈ విషయంలో సంపూర్ణ విజయం సాధ్యం కాదు. “ఆగండి, ఆలోచించండి, అప్పుడు చర్య తీసుకోండి,” అని ప్రధానమంత్రి నరేంద్ర మోది ఇటీవల పౌరులకు ఇచ్చిన పిలుపు పరిస్థితి తీవ్రతకు, ఆయన ముందుచూపునకు అద్దం పడుతుంది. ఇంటర్నెట్ ఆధారంగా జరిగే మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన. హెచ్చరించారు.  ఇది కేవలం పెచ్చరిల్లుతున్న సైబర్ నేరాల గురించి మాత్రమే కాదు, సమాజంలో మరింత జాగ్రత్త, అప్రమత్తత, క్రియాశీలత అవసరాన్ని ఇది నొక్కి చెబుతోంది. ఇటీవలే ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ప్రధానమంత్రి సందేహాస్పదమైన కార్యకలాపాలపై ప్రత్యేక హెల్ప్ లైన్ 1930కి గాని, ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన వెబ్ సైట్ లో గాని ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు. సైబర్ క్రైమ్ పై జరిగే పోరాటంలో ప్రజలు నిర్వహించే పాత్ర చాలా కీలకమైనది. అయినప్పటికీ సైబర్ నేరగాళ్లు రోజురోజుకు తెలివి మీరుతున్నారు. భారతీయ ఫోన్ నెంబర్లుగా కనిపించే విధంగా అంతర్జాతీయ నంబర్ల నుంచి ఫోన్లు చేస్తున్నారు. కాలింగ్ లైన్ ఐడెంటిటీ (సీఎల్ఐ)ని ఏమార్చి వారు చేసే ఈ మోసం వల్ల బాధితులు తమకు వచ్చిన ఫోను దేశంలోని నెంబర్ నుంచి అని భావిస్తున్నారు. దీనివల్ల మోసాలను కనుక్కొని అసలు నేరగాళ్లను పట్టుకోవడం సంక్లిష్టంగా మారింది.

భారత్ లో సైబర్ భద్రతకు మేం అనుసరించే వ్యూహంలో ప్రధానమైనది పౌరులను డిజిటల్ గా సాధికారీకరించటం. ఇందుకోసం ఉద్దేశించిన వేదికల్లో సంచార్ సాథి ఒకటి. ఇందులోని చక్షు అనే సాధనం అనుమానాస్పదమైన సందేశాలు, కాల్స్, వాట్స్అప్ కార్యకలాపాలపై ఫిర్యాదు చేయడానికి వీలు కల్పిస్తుంది. కృత్రిమ మేధా శక్తిని ఉపయోగిస్తూ టెలికాం శాఖ 2.5 కోట్లకు పైగా మోసపూరిత మొబైల్ కనెక్షన్లు కనుగొని వాటిని నిలిపివేసింది. 2.29 లక్షల మొబైల్ హ్యాండ్ సెట్ లను బ్లాక్ చేసింది. 71,000 విక్రయదారులను బ్లాక్ లిస్ట్ చేసింది. టెలికాం సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా 1,900 మంది అనుమానితులపై ఎఫ్ఐఆర్లు దాఖలు చేసింది. యువత, సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన ఉన్న వారు మన జనాభాలో అధికంగా ఉన్నందున సైబర్ నేరాలపై పోరాటానికి అట్టడుగు స్థాయిలో విద్యార్థులను కూడా భాగస్వాములను చేస్తున్నాం. దేశవ్యాప్తంగా విద్యార్థులు ‘సంచార మిత్ర’ వాలంటీర్లుగా ప్రజల వద్దకు వెళ్లి డిజిటల్ భద్రత గురించి ‘సంచార సాథి’ పోర్టల్ ద్వారా వారిలో అవగాహన కల్పిస్తున్నారు. టెలికాం మోసాలను నివారించడానికి ఈ యువ కార్యకర్తలు అందుబాటులో ఉన్న సాధనాల గురించి పౌరులకు తెలియజేస్తున్నారు. 2023 మేలో ప్రారంభించినప్పటి నుంచి ఈ సంచార సాథి పోర్టల్ ప్రజల్లో విశేషమైన ఆదరణ చూరగొన్నది. రోజుకు సగటున రెండు లక్షల మంది ఈ పోర్టల్ ను చూస్తున్నారు. ఇప్పటివరకు 7.7 కోట్ల మంది దీన్ని సందర్శించారు. 12.59 లక్షల దొంగిలించబడిన లేదా పోయిన మొబైల్ ఫోన్ ల ఆచూకిని కనుగొనడంలో కూడా ఈ పోర్టల్ కీలక పాత్ర వహించింది. తమ డిజిటల్ కార్యకలాపాలు సురక్షితంగా ఉండాలని భావించే పౌరులకు ఒక అత్యవసరమైన వనరుగా సంచార సాథి మారింది. సైబర్ రక్షణ, భద్రత ఒక సమష్టి బాధ్యత అనే భావనకు మరింత బలం చేకూర్చింది. పౌరులకు రక్షణ కల్పించడం కోసం టెలికాం నియంత్రణ ప్రాధికార సంస్థ (ట్రాయ్) స్పామ్ కాల్స్, అవాంఛిత ఎస్ఎంఎస్ లు, టెలి మార్కెటింగ్ లకు వ్యతిరేకంగా కఠిన చర్యలు చేపట్టింది. నిబంధనలు ఉల్లంఘించే వారిపై తీవ్రమైన చర్యలు తీసుకుంటున్నారు. పౌరుల్లో డిజిటల్ వ్యవస్థల పట్ల నమ్మకాన్ని క్షీణింపచేసే ఉల్లంఘనల పట్ల ఎంత మాత్రం ఉపేక్ష వహించకూడదని ట్రాయ్ భావిస్తోంది.

ధ్రువీకరణ పొందకుండా టెలి మార్కెటింగ్ కాల్స్ చేస్తున్న 800 కు పైగా సంస్థలను ఇప్పటివరకు ట్రాయ్ బ్లాక్ లిస్ట్ చేసింది. 18 లక్షలకు పైగా నంబర్లను నిలిపివేసింది. ఎస్ఎంఎస్ మోసాలపై కూడా ట్రాయ్ కొరడా ఝళిపిస్తోంది. ఇప్పటివరకు 3.5 లక్షల ఉపయోగించని లేదా ధ్రువీకరించని మెసేజింగ్ శీర్షికలను, 12 లక్షల మెసేజ్ నమూనాలను బ్లాక్ చేసింది. మా సైబర్ రక్షణ వ్యూహంలో డిజిటల్ ఇంటిలిజెంట్ ప్లాట్ ఫారం (డీఐపీ) ప్రధాన పాత్ర నిర్వహిస్తోంది. 460 బ్యాంకులు, చట్టాన్ని అమలు పరిచే సంస్థలతో సహా 520 పైగా సంబంధిత పక్షాలు ఇందులో భాగస్వాములుగా ఉన్నాయి. ఈ సహకారం సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఇచ్చిపుచ్చుకోవడానికి సైబర్ ముప్పులపై సమన్వయంతో చర్యలు తీసుకోవడానికి వీలు కల్పిస్తుంది.

పరిస్థితులు శరవేగంగా మారిపోయే ఈ డిజిటల్ యుగంలో సైబర్ భద్రతకు ప్రాధాన్యం ఇవ్వడం కేవలం ఒక ముందు జాగ్రత్త చర్య మాత్రమే కాదు. ఇది మన దేశ డిజిటల్ భవిష్యత్తును కాపాడడానికి కూడా చాలా ముఖ్యం. బలమైన డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాల వ్యవస్థ సాంకేతిక పరిజ్ఞానం కలిగిన యువ జనాభా, బలమైన వ్యవస్థాగత చట్రాలు కలిగివున్న భారత్ డిజిటల్ పర్యావరణ వ్యవస్థలో నాయకత్వ పాత్ర వహిస్తోంది. ఈ సంక్లిష్టభరితమైన పరిస్థితుల్లో మనం ముందుకు సాగుతున్న తరుణంలో నిరంతరమైన మెరుగుదల, పరిస్థితులుగా అనుగుణంగా మారగల సామర్థ్యం మనకు ఉన్నాయి. ప్రధానమంత్రి పిలుపునకు అనుగుణంగా మనం సైబర్ భద్రత కు అంకితమైన భారతాన్ని నిర్మిస్తాం. ఇందులో పౌరులకు రక్షణ కల్పిస్తాం. వారిని సాధికారీకరిస్తాం. ఈ డిజిటల్ యుగంలో వారు అభివృద్ధి చెందేలా చూస్తాం.

జ్యోతిరాదిత్య సింధియా,
కేంద్ర కమ్యూనికేషన్లు, ఈశాన్య ప్రాంతాల అభివృద్ధి మంత్రి