ఆర్థిక వృద్ధికి అవరోధం మతవిద్వేషాలు
ప్రపంచ బ్యాంకు అంచనాల ప్రకారం దక్షిణాసియా ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో ఒకటిగా మారబోతోంది. భారత్‌లో బలమైన అంతర్గత డిమాండ్, అనేక దక్షిణాసియా దేశాల్లో కోలుకుంటున్న ఆర్థిక వ్యవస్థల కారణంగా ఈ ప్రాంతం వేగవంతమైన వృద్ధిని సాధించబోతుందని ప్రపంచ బ్యాంకు అభిప్రాయం. ఈ ప్రాంతంలో వృద్ధిరేటు రానున్న రెండు మూడు సంవత్సరాల్లో 6.4 శాతంగా ఉంటుందని బ్యాంకు అంచనా వేసింది. అయితే బంగ్లాదేశ్ లో నెలకొన్న అస్థిరత, వృద్ధిరేటును 5.2 నుంచి 3.2 శాతానికి ఏడాదిలో తగ్గిస్తుందని అంటున్నారు. కానీ భారత్‌లో వృద్ధిరేటు 7 శాతానికి మించి ఉండబోతుంది. భూటాన్ కూడా 7.2 శాతం, మాల్దీవులు 4.7 శాతం, నేపాల్ 5.1 శాతం వృద్ధిరేటు సాధిస్తాయని అంచనా. చివరికి ఆర్థిక సమస్యలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న పాకిస్తాన్, శ్రీలంక కూడా కొత్త ఆర్థిక ప్రోత్సాహకాలు, కార్యక్రమాలు టూరిజం, పారిశ్రామిక కార్యకలాపాలలో వృద్ధి కారణంగా రానున్న కొద్ది సంవత్సరాల్లో ఆరోగ్యకరమైన వృద్ధిరేటుని నమోదు చేయవచ్చని అంచనా. ప్రపంచ బ్యాంకు అంచనాలు చాలామందికి ఏదో అద్భుతమైన పిల్లలకథలా కనిపించవచ్చు. జనాభాపరమైన అసమానతలు, రాజకీయ వైరుధ్యాలు, మతపరమైన సంఘర్షణలతో అట్టుడుకుతున్న ప్రాంతం అత్యంత వేగవంతమైన ఆర్థిక అభివృద్ధి సాధించగల ప్రాంతంగా ఎలా మారగలదన్నది వారి సందేహం.
శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల్లో ఇటీవల కాలంలో పెద్దయెత్తున ప్రజల తిరుగుబాట్లను, కల్లోలాలను అనుభవించింది. బంగ్లాదేశ్ లో మూకలు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూలగొట్టి ఒక తాత్కాలిక ప్రభుత్వాన్ని అధికారంలో ప్రతిష్టించాయి. ఆ దేశంలో ఇప్పుడప్పుడే ప్రజాస్వామ్య పాలన పునరుద్ధరణ జరిగే అవకాశాలు కల్పించడం లేదు. పాకిస్థాన్ లో దేశంలోనే అత్యంత ప్రజాదరణ గల నాయకుడు జైల్లో ఉన్నాడు. అతని మద్దతుదారులు తరచుగా రోడ్లపై నిరసనలకు దిగి ప్రభుత్వాన్ని నడుపుతున్న సైన్యంతో ఘర్షణలకు దిగుతున్నారు. వీటికి తోడు ఈ ప్రాంతం అత్యంత అధ్వాన్నమయిన మతవిద్వేషాలను వారసత్వంగా పొందింది. దీనికి ప్రధాన కారణం బ్రిటిష్ వలస పాలకులు అయినప్పటికీ అప్పటి భారత నాయకత్వం 1947లో దేశ విభజనకు అంగీకరించడం కూడా ఇందుకుకు ఒక కారణం. హిందువులు, ముస్లింల మధ్య ఘర్షణలు భారత ఉపఖండంలో ఆనాటి నుంచి సర్వసాధారణంగా మారాయి. ఒక బలమైన, అందరినీ కలుపుకొని పోయే రాజ్యాంగం, కృతనిశ్చయంతో కూడిన ప్రభుత్వ చర్యలు, స్వతంత్ర న్యాయ వ్యవస్థ ద్వారా ఈ సవాళ్ళను ఎదుర్కోవడానికి భారత్ కృషి చేసింది. దేశంలో మెజారిటీగా ఉన్న హిందువుల సహనశీలత, కలుపుగోలు మనస్తత్వం కూడా ఈ ప్రక్రియకు తోడ్పడ్డాయి. సంభల్ ఉదంతం వంటి సంఘటనలు అప్పుడప్పుడు చోటు చేసుకున్నప్పటికీ 140 కోట్ల మంది జనాభాలో దాదాపు 20 శాతం మంది మైనారిటీ ఉన్న విస్తారమైన దేశంలో మొత్తం మీద సుస్థిరత, సామరస్యాలు నెలకొన్నాయి.
ఎక్కడైనా సవాళ్లు ఎదురైనా న్యాయ ప్రక్రియ, స్వేచ్ఛాయుతమైన మీడియా, సామాజిక రాజకీయ ఉద్యమాల ద్వారా బాధితులకు న్యాయం జరిగింది. గత అనేక దశాబ్దాలుగా మైనారిటీ రాజకీయాలు కూడా వర్థిల్లాయి. కొన్ని సమయాల్లో అవి అవసరంలో ఉన్న వర్గాలకు అండగా నిలిచాయి కానీ తరచుగా అవి సంకుచిత ధోరణితో రాజకీయ లబ్ధి పొందడానికి మాత్రమే ప్రయత్నించాయి. కానీ పొరుగు దేశాల్లో మైనారిటీలైన హిందువులకు, క్రిస్టియన్లకు, బౌద్ధులకు, సిక్కులకు చివరికి ముస్లిం మతంలోని ఇస్మాయిలీలు, అహ్మదీలు వంటి కొన్ని వర్గాలకు కూడా పరిస్థితి ప్రమాదకరంగానే ఉంటూ వచ్చింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్ లలో ఇస్లాం అధికార మతంగా ఉండటం వల్ల మైనారిటీలపై అనేక ఆంక్షలను విధించారు. వారి హక్కులను ఉల్లంఘించారు. పాకిస్తాన్లో ప్రభుత్వమే అణచివేత చర్యలకు పాల్పడి తమ దేశంలోని చాలామంది మైనారిటీలను వెళ్ళగొట్టింది. దైవదూషణ చట్టాలు, ఆ దేశంలోని ముస్లిం నాయకుల దౌర్జన్యపూరిత ధోరణలు మైనారిటీలకు రక్షణ లేకుండా చేశాయి. కానీ బాధాకరమైన విషయం ఏమిటంటే మత రాజకీయాలను ఎదిరించి ఒక దేశంగా ఆవిర్భవించిన బంగ్లాదేశ్ కూడా చివరికి ఇస్లామిక్ రాజ్యంగా మారడం. ఐదు దశాబ్దాల క్రితం బెంగాలీ జాతిని సృష్టించేందుకు సమానంగా కష్టపడిన హిందువులు, ఇతర మైనారిటీలు ఇప్పుడు అదే దేశంలో దాడులకు, దౌర్జన్యాలకు గురవుతున్నారు.
1977లో బెంగాలీ జాతీయవాదులపై పాకిస్తాన్ సైన్యం చెప్పలేని దారుణాలకు, దురాగతాలకు పాల్పడింది. ప్రముఖ అమెరికన్ విద్యావేత్త గ్యారీ జె బాస్ ‘ది బ్లడ్ టెలిగ్రామ్’ అనే పుస్తకంలో ఈ దారుణాలను గ్రంథస్తం చేశారు. ఈ సంఘటనలో మొట్టమొదటిది 1971 మార్చి 25న ఢాకా యూనివర్సిటీలోని హిందూ డార్మెటరీలో జగన్నాథ్ హాల్‌పై పాకిస్తాన్ సైన్యం జరిపిన దాడి ఒకటి. బంగ్లాదేశ్ విముక్తం అయ్యేవరకు హిందువుల హత్యలు, వారిపై అత్యాచారాలు, ఇతర దురాగతాలు పెద్ద ఎత్తున కొనసాగాయి. ఈ దాడుల్లో లక్షల మంది చనిపోయారు, దాదాపు కోటి మంది భారత్‌కు శరణార్థులుగా తరలివచ్చారు. 1971లో బంగ్లా శరణార్థుల శిబిరాలను సందర్శించిన అమెరికా సెనెటర్ టెడ్ కెనడి ఈ యుద్ధాన్ని పాకిస్తాన్ సైన్యం జరిపిన ఒక ‘వ్యవస్థాగత ఉగ్రవాద చర్య’గా అభివర్ణించారు. “ఈ యుద్ధంలో అందరికంటే ఎక్కువగా నష్టపోయింది హిందువులే. వారి భూములను, దుకాణాలను లాగేసుకున్నారు. ఒక పద్ధతి ప్రకారం వారిని ఊచకోత కోశారు. కొన్ని ప్రాంతాల్లో వారి ఇళ్లకు పసుపు రంగులో హెచ్ అని గుర్తులు పెట్టి మరీ వారిని చంపారు,” అని ఆయన అన్నారు. 1972లో ఇందిరాగాంధీ-ముజిబుర్ రెహమాన్ ల మధ్య జరిగిన ఒప్పందంలో బంగ్లాదేశ్ లో మైనారిటీల రక్షణకు అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్న నిబంధన ఉంది. పలువురు హిందూ శరణార్థులు బంగ్లాదేశ్ లోని తమ సొంత స్థలాలకు కూడా తిరిగి వెళ్లారు. కానీ దురదృష్టవశాత్తు ఆ తర్వాత ప్రభుత్వాలు కొన్ని పైపై చర్యలు తీసుకున్నప్పటికీ బంగ్లాదేశ్ లో తరచుగా వారిపై దాడులు, దౌర్జన్యాలు కొనసాగుతూనే వచ్చాయి.
1992, 2001, 2021లో మైనార్టీలపై పెద్దయెత్తున దాడులు జరిగాయి. షేక్ హసీనా సారథ్యంలోని అవామి లీగ్ ప్రభుత్వం మైనారిటీలకు రక్షణ కల్పించేందుకు చర్యలు తీసుకుంది. ఈ ప్రభుత్వ హయాంలో పలువురు హిందూ ఎంపీలు పార్లమెంటుకు ఎన్నికయ్యారు. ఒక హిందూ వ్యక్తిని సుప్రీంకోర్టు న్యాయమూర్తిని కూడా చేశారు. హసీనా ప్రభుత్వం ఢాకా లోని ప్రముఖ హిందూ దేవాలయమైన డాకేశ్వరి దేవాలయానికి మద్దతు కూడా ఇచ్చింది. అయినా హిందూ వ్యతిరేక హింస కొనసాగుతూనే వచ్చింది. దేశంలో అస్థిరత్వం కొనసాగుతున్న తరుణంలో హిందువులపై, బౌద్ధులపై దాడులు మరోసారి పరాకాష్టకు చేరాయి. ముస్లిం మతస్తులైన బంగ్లాదేశీయులు కూడా, ముఖ్యంగా అవామీ లీగ్ నాయకులు కూడా దాడులకు దౌర్జన్యాలకు గురవుతున్నారు. ఇస్కాన్ పూజారి చిన్మయిదాసు ఉదంతం నిరూపించినట్టుగా హిందువులు న్యాయం కోసం దేశ న్యాయవ్యవస్థపై కూడా ఆధారపడలేని పరిస్థితి ఏర్పడింది. ఇంతకుముందు ఆర్థిక వృద్ధి గురించి ఎందుకు ప్రస్తావించానంటే ఇటువంటి పరస్పర విద్వేషాలు, అశాంతి కొనసాగుతున్నప్పటికీ దక్షిణాసియా ప్రాంతం వృద్ధి చెందే అవకాశం ఉందని చెప్పడానికి.
రెండో ప్రపంచ యుద్ధ కాలంలో నాజీలను వారి జాతి విద్వేషాన్ని అణచివేయడానికి యూరప్ వెళ్లిన అమెరికా సైన్యంలో తీవ్రమైన జాతి వివక్ష నెలకొని ఉండేది. నల్లజాతి, తెల్లజాతి సైనికులు కలిసి ఉండేవారు కాదు. కలిసి పోరాడేవారు కాదు. గాయపడినప్పుడు కనీసం ఒకరి రక్తాన్ని ఒకరికి ఎక్కించేవారు కూడా కాదు. అయినా వారు యుద్ధంలో విజయం సాధించారు. అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడి “అమెరికన్ జీవనంలోనూ చట్టాల్లోనూ జాతి వివక్షకు తావులేదు” అని ప్రకటించే వరకు జాతి వివక్ష కొనసాగింది. మరి భారత ఉపఖండం నాయకత్వం కూడా ధైర్యంగా నిలబడి మన దేశాల జీవనంలోనూ, చట్టాల్లోనూ మతవిద్వేషాలకు తావు లేదని దృఢంగా ప్రకటించగలదా? తదనగుణంగా చర్యలు తీసుకోగలదా?
రామ్ మాధవ్,
బిజెపి నాయకుడు

