రాష్ట్రాన్ని దివాళా తీయించానని ఒప్పుకొన్న రేవంత్ రెడ్డి
2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఆర్థికంగా మిగులు రాష్ట్రంగా, గుజరాత్ తర్వాత దేశంలో సంపన్న రాష్ట్రంగా గుర్తింపు పొందింది. అయితే, పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పులకుప్పగా మారింది. ఇప్పుడు 16 నెలల కాంగ్రెస్ పాలనలో అప్పులు కూడా పుట్టని విధంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దిగజారింది. ఈ మాటలను స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోటి నుండి రావడం విస్మయం కలిగిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం అంటే అప్పులు అడుగుతారని బ్యాంకుల వారెవ్వరూ ఇంటర్వ్యూ కూడా ఇవ్వడం లేదని, ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టే పరిస్థితుల్లో లేమంటూ తన నిస్సహాయతను వ్యక్తం చేశారు. పాలన సాగించలేని, ఎన్నికల హామీలను నెరవేర్చలేని ప్రభుత్వ అసమర్థతనే ఆయన మాటలు వెల్లడి చేస్తున్నాయి.
రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజానీకానికి భరోసా కల్పించాల్సిన ముఖ్యమంత్రి.. రాష్ట్రంలో అప్పులు పుట్టడం లేదని, అప్పుకోసం వెళ్తే దొంగలను చూసినట్లు చూస్తున్నారంటూ ప్రజలను భయాందోళనకు గురిచేసే విధంగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్‌ను లండన్, న్యూయార్క్ వంటి నగరాల మాదిరిగా చేస్తామంటూ చెప్పిన కేసీఆర్ అధికారం కోల్పోయారు. తమకు పోటీ దేశంలో మరే ఇతర రాష్ట్రం కాదని, సంపన్న దేశాలే అంటూ ప్రగల్భాలు పలికిన రేవంత్ రెడ్డి ఇప్పుడు చేతులు ఎత్తేస్తున్నారు.
వాస్తవంగా వందల సంవత్సరాలుగా తెలంగాణ సంపన్న ప్రాంతంగా పేరొందింది. నిజాం పాలనలో సైతం దేశంలోని సంపన్న ప్రాంతాలలో ఒకటిగా వెలుగొందింది. దేశంలో మరే ఇతర నగరాలలో లేనివిధంగా మౌలిక సదుపాయాలు స్వాతంత్ర్యానికి పూర్వమే హైదరాబాద్‌లో ఏర్పడ్డాయి. ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాలు వాటిని మరింతగా అభివృద్ధి చేయలేక పోయాయి. నిజాం కాలం నాడే తెలంగాణలో రైల్వే వ్యవస్థ, ట్రాన్స్ పోర్ట్ వ్యవస్థ, రామప్ప, లక్నవరం లాంటి కాకతీయులు కట్టిన చెరువులతో దేశంలోనే అత్యధిక చెరువులు కలిగి వరి పండించే ప్రాంతంగా, సన్నబియ్యం అన్నం తినే ప్రాంతంగా వెలుగొందింది.
పరిపాలించడం చేతగాక, చేవలేక, అనుభవం లేక, మాటల్లో, చేతల్లో గంభీరత లేని రేవంత్ రెడ్డి చివరికి తెలంగాణ రాష్ట్రాన్నే ఒక దివాళాకోరు రాష్ట్రంగా, తెలంగాణ ప్రజలను ఎందుకు పనికిరానివారుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. వరి ఉత్పత్తిలో, జీఎస్డీపీ వృద్ధిలో, తలసరి ఆదాయంలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా నిలిచింది. ఇటీవల ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో నాలుగు కోట్ల జనాభా ఉన్న రాష్ట్రం రూ.3.04 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టిన రాష్ట్రాన్ని దివాళా రాష్ట్రంగా చిత్రీకరించే ప్రయత్నం కేవలం పాలించే అసమర్థతనే వెల్లడి చేస్తుంది. మొత్తంగా, 2014లో రాష్ట్ర రెవెన్యూ రూ.51,000 కోట్లు ఉండగా, 2025 నాటికి అది రూ.1,56,000 కోట్లకు చేరింది. ఒకవేళ అప్పు తీసుకునేందుకు అర్హత లేకపోతే, బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు అంగీకరించకపోతే మరి బ్యాంకుల నుంచి రూ.64,457 కోట్ల అప్పు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలా తెచ్చుకోగలిగింది? సమాధానం చెప్పాలి.
రాష్ట్రం దివాళా తీసిందని పదేపదే చెప్పడం కేవలం తన అసమర్థతను కప్పిపుచ్చుకొనే ప్రయత్నంగానే కనిపిస్తున్నది. ఇచ్చిన హామీలను తప్పించుకునే కుతంత్రంగా, ఒకవైపు ఉద్యోగులను భయపెడుతూ, బ్లాక్ మెయిల్ చేస్తూ, మరోవైపు ప్రజలలో ఆర్థిక సంక్షోభ భయం రేకెత్తించి సంక్షేమాన్ని తుంగలో తొక్కేందుకు కుట్రపూరితంగా చేస్తున్న ప్రయత్నంగా కనిపిస్తున్నది. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలను తుంగలో తొక్కేందుకు ప్రజలను సిద్ధం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఆరోజు అధికారం కోసం అనేక హామీలిచ్చి, ఈరోజు ఏదోరకంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు, దివాళా తీసింది, సంక్షేమ పథకాలను ఇవ్వలేమనట్లుగా ప్రజలను సిద్ధం చేస్తున్న పరిస్థితి చూస్తే దీని వెనుక పెద్ద కుట్రే ఉన్నట్లు కనిపిస్తుంది. ప్రజలకు భరోసా కల్పించాల్సిన ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్ల ప్రభుత్వాన్ని నిలదీస్తున్న ఉద్యోగులపై ప్రజలను ఉసిగొల్పే విధంగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారు.
బడా కాంట్రాక్టర్లకు వేల కోట్ల రూపాయలతో బి-ట్యాక్సులు తీసుకొని బిల్లులు పాస్ చేసినప్పుడు ఆర్థిక సమస్యలు కనిపించడం లేదా? రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, రైతు భరోసాలు ప్రస్తావనకు వచ్చిన్నప్పుడే ఆర్థిక సమస్యలు గుర్తుకు వస్తున్నాయా? ఉద్యోగులకు జీతభత్యాలు, పెండింగ్ బిల్లులు, రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇవ్వకుండా, ప్రజలకు ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలకు తిలోదకాలిచ్చేందుకు కుట్రపూరితంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. రబీ, ఖరీఫ్ పంటకాలంలో ఇవ్వాల్సిన రైతు భరోసా నిధులు విడుదల చేయకుండా, అదే డబ్బును బడా కాంట్రాక్టర్ల బిల్లులకు వినియోగించడమే రైతులపై ప్రభుత్వం చూపిన నిర్లక్ష్యానికి నిదర్శనం. ఉచిత కరెంట్, వృద్ధాప్య పెన్షన్ వంటి పథకాలను ఎత్తివేయాలని, మహాలక్ష్మి పథకాన్ని కొనసాగించకుండా విరమించేందుకు ప్రభుత్వం చూస్తోందని భావించాల్సి వస్తుంది. కొత్త రేషన్ కార్డుల జారీని నిలిపివేయడం, రైతు భరోసా వంటి పథకాలపై వెనకడుగు వేయడం ప్రభుత్వ ధోరణిని వెల్లడి చేస్తుంది. వ్యూహాత్మకంగానే అప్పులు పుట్టడం లేదంటూ బీద పలుకులు పలుకుతున్నారని స్పష్టం అవుతుంది.
హామీల ఎగవేతకే
ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను ఇగ అమలు చేయలేనని సీఎం తేల్చేశారు. ఇక వృద్ధులకు రూ.4 వేల ఫించన్ ఇయ్యరు. మహిళలకు నెలనెలా రూ.2500లు, తులం బంగారం ఒట్టిమాటేనని తేలింది. నిరుద్యోగులకు రూ.4 వేల భృతి ఇయ్యనట్లే. విద్యార్థులకు రూ.5 లక్షల భరోసా కార్డు ఇయ్యరని తేల్చేసినట్లే. రైతులకిచ్చిన హామీలను గాలికొదిలేసినట్లే. భారత రాజ్యాంగం పుస్తకం పట్టుకుని తెలంగాణ ప్రజలకిచ్చిన హామీలన్నీ అమలు చేస్తానని గతంలో హామీ ఇచ్చిన రాహుల్ గాంధీ ఇప్పుడేం సమాధానం చెబుతారు? ఇచ్చిన మాట తప్పి చేతులెత్తేసిన కాంగ్రెస్ ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు.
-బండి సంజయ్ కుమార్, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి
తలదించుకునేలా సీఎం మాటలు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న మాటలు యావత్ తెలంగాణ ప్రజలు తలదించుకునేలా, వారి ఆత్మస్థైర్యం దెబ్బతినేలా ఉన్నాయి. మొత్తం తెలంగాణ సమాజమే దిగజారిపోయేందనేలా ఆత్మన్యూనతా భావంతో మాట్లాడుతున్నారు. తెలంగాణ ఎన్నడూ కూడా పేదది కాదు.. తెలంగాణ పేదరికంలో ముంచబడింది. 2024 ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అమలు చేయలేనప్పుడు తెలంగాణ ప్రజల ముందు ముక్కునేలకు రాసి, బేషరతుగా క్షమాపణ చెప్పి పాలన నుంచి తప్పుకో. లేదంటే అట్లనే పాలన చేస్తనంటే.. ప్రజలు కర్రుగాల్చి వాతపెట్టక తప్పదని హెచ్చరిస్తున్నం.
-ఈటల రాజేందర్, మల్కాజ్‌గిరి ఎంపీ
ప్రవీణ్