ఉగ్రవాదంపై ఉక్కుపాదమే!
జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదులు దాడి చేసింది పర్యాటకులపై మాత్రమే కాదు, వారు భారతదేశ ఆత్మపై పాశవిక దాడికి తెగబడ్డారు. దీనికి ప్రతీకారంగా భారతదేశం ఉగ్రవాదంపై పోరు సూత్రాలనే తిరగరాసింది. దేశ భద్రతపై రాజీ పడే ప్రసక్తే లేదనీ, మన దేశానికి ముప్పు కలిగించాలని చూసేవారిని వదిలిపెట్టేది లేదని ‘ఆపరేషన్ సింధూర్’ ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. దీన్నే మోదీ సిద్ధాంతమంటున్నాం. జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ఆయన ఈ సిద్ధాంతాన్ని ప్రకటించారు. ఇటీవలి పరిణామాల దృష్ట్యా ఉగ్రవాదాన్నీ, విదేశీ శక్తుల ముప్పునూ సమర్థంగా ఎదుర్కోవడానికి ఉద్దేశించిన సిద్ధాంతమది.
పహల్గాం ఉగ్రదాడి జరిగిన వెంటనే సింధు జలాల ఒప్పందాన్ని రద్దుచేయడం మొదలుకుని ఉగ్రవాద శిబిరాలపై విరుచుకుపడటం వరకు ప్రధాని మోదీ ప్రతి అడుగూ పకడ్బందీగా వేశారు. ఏ సమయంలో ఏ పని చేయాలో అదే చేశారు. అంతేతప్ప, ఆవేశంతో ఏ పనీ చేయలేదు. ఆచితూచి కట్టుదిట్టమైన వ్యూహంతో ముందుకుసాగారు. దాంతో పహల్గాం దాడికి భారత్ ఎలా స్పందిస్తుందో పాకిస్థాన్ కానీ, ఉగ్రవాదులు కానీ ముందే ఊహించలేకపోయారు. అనూహ్యంగా వచ్చిపడిన దాడికి అతలాకుతలమయ్యారు. శక్తియుక్తులు మోహరించి గురితప్పని మెరుపుదాడితో శత్రువును నివ్వెరపరచడంలో ఆపరేషన్ సింధూర్ సఫలమైంది.
ఇక నుంచి ఇదే విధానం
‘ఉగ్రదాడులపై భారతదేశ వ్యూహంలో నిర్ణయాత్మక మార్పు వచ్చింది. ఉగ్రవాదులపై పోరుకు భారత్ ఇక నుంచి అనుసరించే విధానమే ఆపరేషన్ సింధూర్’ అని ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో స్పష్టం చేశారు. ఉగ్రవాదం అణచివేతకు ఆపరేషన్ సింధూర్ సరికొత్త ప్రమాణాలను నెలకొల్పిందనీ, ఇక నుంచి ఇదే మన పంథా అవుతుందనీ పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్ అంటే కేవలం ఏదో కార్యక్రమం పేరు కాదు- అది కోట్లమంది భారతీయుల మనోభావమని మోదీ పేర్కొన్నారు. కిరాతక చర్యలను సమన్వయీకృతంగా ఎదుర్కొంటామనీ, సరైన మోతాదులో ఎదురుదాడి చేసి బుద్ధిచెబుతామనీ హెచ్చరించారు. పొరుగుదేశం పనిగట్టుకుని ఉగ్రవాదాన్ని రెచ్చగొడుతూ దౌత్యం ముసుగులో దాక్కొంటోందనీ, అణ్వస్త్ర బూచితో బెదరగొట్టాలని చూస్తోందనీ, ఇకపై ఈ ఆటలు సాగవనీ మోదీ యావత్ ప్రపంచానికి స్పష్టం చేశారు.
మూడు మూలస్తంభాలు
ఉగ్రవాదంపై భారతదేశం తనదైన పంథాలో నిర్ణయాత్మకంగా ప్రతీకారం తీర్చుకుంటుంది- ఇదే మోదీ సిద్ధాంతానికి మొదటి మౌలిక సూత్రం. ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించేస్తామనీ, ఉగ్రవాదులను వెనకనుంచి ఎగదోస్తున్న ప్రాయోజకులనూ వదిలేది లేదనీ ఈ సూత్రం హెచ్చరిస్తోంది. ఎప్పుడు ఎలా ప్రతీకారం తీర్చుకోవాలో తానే నిర్ణయించుకుంటానని భారత్ స్పష్టం చేస్తోంది.
అణ్వస్త్రాలతో బ్లాక్ మెయిల్‌ను, బెదిరింపులనూ సహించేది లేదు, వెనక్కు తగ్గేదీ లేదు అనేది మోదీ సిద్ధాంతానికి రెండో మూలస్తంభం. అణ్వస్త్ర బూచిని చూపి యథేచ్ఛగా ఉగ్రవాద దాడులకు పాల్పడతామంటే కుదరదు. అణ్వస్త్రాలను చూసి వెనక్కు తగ్గేదే లేదు, ఉగ్రవాదుల పనిపట్టి తీరతామనీ, గురితప్పకుండా దాడి చేసి మట్టుపెడతామనీ మోదీ సిద్ధాంతంలో రెండో సూత్రం హెచ్చరిస్తోంది.
ఉగ్రవాదులకూ, వారి ప్రాయోజకులకూ మధ్య తేడా చూపేది లేదనేదే మోదీ సిద్ధాంతానికి మూడో ప్రాతిపదిక. ఉగ్రవాదులనూ, వారిని ఎగదోసినవారినీ జవాబుదారులను చేసి ఇద్దరి పనిపడతామని ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత్ స్పష్టీకరించింది. ఉగ్రవాదం కేవలం భారతదేశానికి సంబంధించిన సమస్య కాదనీ, ప్రపంచమంతటా ఎదురవుతున్న సమస్యేనని మోదీ తన ప్రసంగంలో గుర్తుచేశారు. ఉగ్రవాదాన్ని ఎగదోసే దేశాలు చిట్టచివరకు అంతరించిపోతాయని హెచ్చరించారు. ఉగ్రవాదాన్ని సమర్థించడం ఆత్మవినాశానికేనని పేర్కొన్నారు. అందువల్ల ఉగ్రవాద ప్రాయోజక దేశాలు సమయం మించిపోకముందే తమ గడ్డపై ముష్కర స్థావరాలను ధ్వంసం చేయాలనీ, వారికి నిలువనీడ లేకుండా చేయాలనీ పిలుపిచ్చారు. భారత జాతీయ భద్రతా వ్యూహంలో కొత్తగా వచ్చిన మార్పు ఏమిటో మోదీ సిద్ధాంతం విశదీకరిస్తోంది. ఉగ్రవాద నిర్మూలనకు తిరుగులేని సుదృఢ విధానాన్ని చేపడుతోంది. భారత పౌరుల రక్షణకు తన ప్రభుత్వం కట్టుబడి ఉందనీ, సార్వభౌమత్వం విషయంలో రాజీపడబోదనీ మోదీ ఉద్ఘాటించారు.
రాజీలేని పోరు
ఉగ్రవాద నిర్మూలనకు రాజీలేని పోరు సల్పాలని మోదీ ప్రభుత్వం మొదటి నుంచీ కృతనిశ్చయంతో ఉంది. ఇది 2016లో బాలాకోట్ సర్జికల్ దాడితోనే స్పష్టమైంది. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్‌తో మళ్లీ నిరూపితమైంది. తనను రెచ్చగొడితే చావుదెబ్బ తీస్తానని ఉగ్రవాదులకు మళ్లీమళ్లీ తెలిసివచ్చేట్లు చేస్తోంది. ఉగ్రవాదం, వాణిజ్యం చెట్టపట్టాల్‌గా సాగవని పాకిస్థాన్‌కు ఈసారి మోదీ సర్కారు తెగేసి చెప్పింది. పహల్గాం దాడి జరిగిన వెంటనే వాఘా-అట్టారీ సరిహద్దు మార్గాన్ని మూసేసింది. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని నిలిపేసింది. వీసాలను రద్దుచేసింది. నీరు, రక్తం కలసి ప్రవహించలేవంటూ ప్రధాని మోదీ సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేశారు. ఉగ్రవాదానికి వత్తాసు పలకడం ద్వారా పాకిస్థాన్ ఆర్థికంగా, దౌత్యపరంగా నష్టాలను కొనితెచ్చుకొంది. పహల్గాం పాశవిక దాడికి భారత్ సూత్రబద్ధంగా, సరైన మోతాదులో స్పందించిందని చరిత్ర గుర్తుపెట్టుకుంటుంది. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపామనీ మలితరాలకు చెబుతుంది. ఆపరేషన్ సింధూర్ ద్వారా ఉగ్రవాదులను, వారి ప్రాయోజకులను గట్టి దెబ్బతీసి భారత్ సగర్వంగా తలెత్తుకునిలిచింది. ‘ఒకే మాట-ఒకే బాణం’ విధానాన్ని విజయవంతంగా అమలుచేసింది. భారత వ్యతిరేకులపై పోరులో ఆపరేషన్ సింధూర్ చివరి అధ్యాయం కాదు. స్పష్టత, సాహసం, సంకల్పాలతో ఉగ్రవాదాన్ని రూపుమాపే నవశకానికి నాంది అది!
అశ్విని వైష్ణవ్,
కేంద్ర రైల్వే, ఐటీ, సమాచార, ప్రసారాల శాఖ మంత్రి

