సైబర్ భద్రతకు 5,000 మంది సైబర్ కమాండోలు
భారతీయ జనసంఘ్ అభ్యర్థి, సర్దార్ వల్లభాయ్ పటేల్ కుమార్తె మణిబెన్ పటేల్ కోసం పోస్టర్లు అతికించడం ద్వారా కేంద్ర హోం మంత్రి అమిత్ షా 13 ఏళ్ళ వయసులో 1977 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. దాదాపు అర్ధశతాబ్దం అనుభవం ఉన్న అరుదైన రాజకీయవేత్త అయిన ఆయన భారత అంతర్గత భద్రతా సవాళ్లను ఎదుర్కోవడంలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో పటిష్టమైన విధానానికి సారథ్యం వహించారు. ఒకప్పుడు అంతర్గత భద్రతకు అతిపెద్ద ముప్పుగా భావించిన వామపక్ష తీవ్రవాదాన్ని దాదాపు నిర్మూలించడం వంటి కీలక విజయాలను సాధించారు. ఈశాన్య తిరుగుబాటుదారులను ప్రధాన స్రవంతిలో విలీనం చేయడం; జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాద వ్యవస్థను నిర్మూలించే ప్రయత్నాల మధ్య ఆర్టికల్ 370 రద్దును పర్యవేక్షించడం; భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య అధినియం అనే మూడు కొత్త చట్టాల ద్వారా క్రిమినల్ న్యాయ వ్యవస్థలో సంస్కరణలకు శ్రీకారం చుట్టడంలో ప్రధానపాత్ర వహించారు.
వేగవంతమైన డిజిటలైజేషన్ మోసాలకు కొత్త ద్వారాలు తెరుస్తున్నందున సైబర్ మోసగాళ్ళు చేతుల్లో మోసపోయిన అనేక కుటుంబాలను రక్షించడానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖలో అంతర్గత భద్రతలో కొత్త విభాగాన్ని ఏర్పాటు చేయడానికి అమిత్ షా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘జాతీయ భద్రత మొదటి ప్రాధాన్యం’ విధానానికి సారథ్యం వహిస్తున్నారు. ఒక ఆంగ్ల వార పత్రికకు ఇచ్చిన ఈ ఇంటర్వ్యూలో ఆయన సురక్షితమైన డిజిటల్ ఇండియా కోసం నిర్మిస్తున్న కొత్త సైబర్ మౌలిక సదుపాయాలతో సైబర్ నేరాలు విసురుతున్న సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అంతర్గత భద్రతపై షాకు ఉన్న పట్టు పౌరులు, చట్టాన్ని అమలు చేసే సంస్థలు, నిపుణులను ఒకే చట్రంలోకి తెస్తూ ఏకీకృత జాతీయ ప్రతిస్పందనను రూపొందించేటట్టు చేసింది. సైబర్ మోసాలను గుర్తించడానికి, సామాన్యులకు ఉపశమనం కలిగించడానికి రాష్ట్రాలకు సహాయపడే యంత్రాంగం ఈ వ్యూహంలో ప్రధానమైనది. సాంకేతిక పరిజ్ఞానాన్ని, నూతన ఆవిష్కరణలను అందిపుచ్చుకుంటూ సైబర్ మోసగాళ్లను, ప్రత్యర్థులను ఓడించడమే నేడు సామాన్యుల ప్రధాన కర్తవ్యంగా ఆయన గుర్తించారు. అనేక సైబర్ నేరాలకు అంతర్జాతీయ కోణాలు ఉన్నాయని షా అంగీకరించారు. దాడుల మూలాలను కనుగొనడానికి, వారి ఆట కట్టించేందుకు ఆయన అంతర్జాతీయ చట్ట అమలు సంస్థలు, సైబర్ భద్రతా సంస్థలు, ఇంటెలిజెన్స్ నెట్‌వర్క్‌లతో చురుకుగా పనిచేస్తున్నారు. “వర్చువల్ ప్రపంచంలో మేం జాతీయ సార్వభౌమత్వాన్ని బలోపేతం చేస్తున్నాం,” అని అమిత్ షా చెప్పారు, సైబర్ నేరాలను కేవలం సాంకేతిక లేదా పోలీసింగ్ సమస్యగా కాకుండా, భారతదేశ అంతర్గత, ఆర్థిక భద్రతకు ప్రత్యక్ష ముప్పుగా పరిగణించాలన్నారు. ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు:
ప్రశ్న: సైబర్ నేరాల సవాలును ఎదుర్కోవడానికి బహుముఖ వ్యూహం గురించి మీరు అనేకసార్లు మాట్లాడారు. మీ మార్గదర్శకత్వంలో రూపొందించిన కొత్త వ్యూహాన్ని వివరించగలరా?
జ: 2014కు ముందు మా వ్యూహాలు విడివిడిగా, అస్తవ్యస్తంగా ఉండేవి. అయితే, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో సైబర్ నేరాలను ఎదుర్కొనేందుకు సమగ్రమైన, సమీకృత సైబర్ కవచాన్ని రూపొందించేలా మా వ్యూహాన్ని మార్చాం. నేరస్తుల నుంచి కాపాడుకోవడమే కాకుండా ముందుగానే ఆలోచించి వారి కుట్రలను కచ్చితత్వంతో భగ్నం చేస్తున్నాం. ఈ వ్యూహం ఐదు స్తంభాలపై ఆధారపడి ఉంటుంది. మన రాష్ట్ర బలగాలు, ఏజెన్సీలను అత్యాధునిక సాంకేతిక మౌలిక సదుపాయాలతో సన్నద్ధం చేయడం మొదటి స్తంభం. సైబర్ నేరగాళ్లు ఏ టెక్నాలజీని ఉపయోగించినా సమర్థవంతంగా స్పందించే సత్తా మనకు ఉంటుంది. రెండో స్తంభం దేశీయంగా కేంద్ర, రాష్ట్ర సంస్థల మధ్య, అంతర్జాతీయ సంస్థలతో సహకారం. సైబర్ నేరాలకు రాజకీయ హద్దులు ఉండవని మనందరికీ తెలుసు. అందువల్ల, ఏజెన్సీల మధ్య ఉమ్మడి యుద్ధం ఎజెండా ద్వారా అంతరాయం లేని సమన్వయంతో జాతీయ, అంతర్జాతీయ నేర ముఠాలను చావుదెబ్బ తీయడం వీలవుతుంది. ఈ వ్యూహంలో మూడవ స్తంభం అవగాహన కలిగిన పౌరులు. ప్రజలకు అవగాహన ఉంటే సైబర్ నేరగాళ్లు ఎక్కువ దూరం వెళ్లలేరు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు దేశవ్యాప్తంగా ప్రచారం చేపట్టాం. ప్రజలు సైబర్ హెల్ప్ లైన్ 1930కు కాల్ చేయవచ్చు లేదా cybercrime.gov.in ఫిర్యాదు చేయవచ్చు. పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాలతో ఈ ముప్పును ఎదుర్కొనేందుకు మన ఏజెన్సీల సంసిద్ధత నాలుగో స్తంభం. మన దర్యాప్తు సంస్థలకు కొత్త తరం నేరాలను విచారించడానికి తాజా నిబంధనలతో అధికారం ఇచ్చే చట్టాలు ఐదవ స్తంభం.
ప్రశ్న: సైబర్ ముప్పు ఎంత తీవ్రమైనదో ప్రపంచం గుర్తించింది. ఈ సవాలును ఎదుర్కోవడానికి సమన్వయంతో వ్యవహరించాల్సిన అవసరాన్ని మీరు పునరుద్ఘాటించారు. హోం మంత్రిత్వ శాఖ మరింత సహకారాన్ని ఎలా సాధిస్తోంది?
జ: సైబర్ సెక్యూరిటీ ముప్పులు ప్రపంచవ్యాప్తంగా పెనుముప్పుగా పరిణమించాయి. అందుకే వాటిని తిప్పికొట్టేందుకు అవసరమైన సహకారాన్ని ప్రధాని నరేంద్ర మోదీ గుర్తించి, ప్రోత్సహించారు. ప్రస్తుతం భారత్ ఇంటర్‌పోల్, జీ7, ఐక్యరాజ్యసమితి, బ్రిక్స్ వంటి సంస్థలతో కలిసి పనిచేస్తోంది. అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ సహా పలు దేశాలతో సైబర్ సెక్యూరిటీ ఒప్పందాలు కుదుర్చుకున్నాం. అదేవిధంగా ఐక్యరాజ్యసమితి, ఎస్సీఓ, బ్రిక్స్ దేశాలతో భాగస్వామ్యాన్ని పెంపొందించి, మన సైబర్ భద్రతను బలోపేతం చేశాం. కొత్త వ్యూహాలు, సహకారాన్ని పెంపొందించడానికి పలు దఫాలుగా భారత్-అమెరికా సంయుక్త సమావేశాలు జరిగాయి. సీమాంతర సైబర్ నేరాలపై సీబీఐ, ఇంటర్‌పోల్ కలిసి పనిచేస్తున్నాయి. ప్రస్తుతం, సీబీఐ కూడా జీ7 దేశాల 24×7 నెట్‌వర్క్‌లో భాగంగా ఉంది, ఇది డేటాను సురక్షితంగా మార్పిడి చేసేలా చూస్తోంది. 2025 జనవరి 17న అమెరికాకు చెందిన సీ3 (సైబర్ క్రైమ్స్ సెంటర్), భారత్‌కు చెందిన ఐ4సీ (ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. భారత్‌పోల్ పోర్టల్, జీ7 24×7 నెట్వర్క్ ద్వారా ఇతర దేశాల పోలీసు, నిఘా సంస్థలకు కూడా ఐ4సీ సహకరిస్తోంది. సైబర్ మోసం, సైబర్ టెర్రరిజం, డేటా భద్రతపై సంయుక్త కార్యాచరణ ప్రణాళికలను రూపొందిస్తున్నారు. ఇది భారతీయ, విదేశీ ఏజెన్సీల మధ్య వేగవంతమైన, అంతరాయం లేని సమన్వయాన్ని సులభతరం చేసే వేదిక.
ప్ర: చట్టాల అమలుకు, సకాలంలో చర్యలు తీసుకోవడానికి ఐ4సీ ఏం చర్యలు తీసుకుంటుంది?
జ: సైబర్ భద్రతతో కూడిన దేశం కోసం ప్రధాని నరేంద్ర మోదీ దార్శనికతను అనుసరించి, సైబర్ నేరాలను ఎదుర్కోవడానికి దేశవ్యాప్త సమన్వయాన్ని సాధించేందుకు సమగ్ర యంత్రాంగమైన ఐ4సీని రూపొందించడానికి మేం అధికారులతో ఆరు నెలల పాటు మేధోమథనం నిర్వహించాం. చట్ట సంస్థలు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, ఇతర భాగస్వాముల మధ్య అన్ని సైబర్ క్రైమ్ సంబంధిత విషయాలను సమన్వయం చేయడానికి ఇది నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది. ఇది నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ద్వారా ఫిర్యాదులకు కేంద్రీకృత వేదికను అందిస్తుంది. ఇది సామర్థ్యాన్ని పెంపొందించడం, శిక్షణ, పరిశోధన, ఆవిష్కరణ, అవగాహనను కూడా సులభతరం చేస్తుంది.
సైబర్ నేరాల స్వభావాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాత ఏడు విభాగాలను రూపొందించాం. నేషనల్ సైబర్ క్రైమ్ థ్రెట్ అనలిటికల్ యూనిట్ అనేది ఐ4సీలో ఒక విభాగం, దీని గురించి ప్రజలకు తెలియదు. కానీ ఇది హ్యాకింగ్, క్రిప్టోకరెన్సీ, నకిలీ ఖాతాలు లేదా ఎవరి బ్యాంక్ ఖాతా నుండి దొంగతనం అయినా సంభవించే అన్ని రకాల సైబర్ క్రైమ్ ముప్పులను విశ్లేషిస్తుంది. సైబర్ నేరాలపై ఫిర్యాదులు నమోదు చేసి సత్వర చర్యలు తీసుకునే సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ మరో విభాగం. మూడో విభాగం నేషనల్ సైబర్ క్రైమ్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ (NCFL). నేషనల్ సైబర్ క్రైమ్ ట్రైనింగ్ సెంటర్ మన ఏజెన్సీలకు దేశవ్యాప్త శిక్షణ ఇస్తుంది. మరోవైపు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో సమాంతర దర్యాప్తుల్లో సహకారానికి జాయింట్ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేశారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్, 1,500కు పైగా బ్యాంకుల సమ్మేళనం సైబర్ క్రైమ్ ఎకోసిస్టమ్ మేనేజ్మెంట్ యూనిట్ సైబర్ క్రైమ్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ సైబర్ నేరాల నివారణలో కొత్త పరిణామాలు, పద్ధతులపై పరిశోధనలు నిర్వహిస్తుంది. భారతదేశంలో మొదటిసారిగా, 2020లో సైబర్ నేరాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త, వ్యవస్థీకృత దాడి వ్యూహాన్ని ప్రారంభించారు.
ప్ర: మహిళలను, చిన్నారులను సైబర్ నేరాల బారి నుంచి రక్షించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
జ: మహిళలు, పిల్లల భద్రత మోదీ ప్రభుత్వ ప్రాధాన్యాల్లో ఒకటి. దాన్ని సాధించేందుకు సమగ్ర విధానాన్ని అనుసరిస్తున్నాం. మహిళలకు సురక్షితమైన వాతావరణాన్ని సృష్టించడానికి ప్రధాన దశలలో ఒకటి లైంగిక నేరస్థుల జాతీయ స్థాయి డేటాబేస్ ను సృష్టించడం. అత్యాచారాలు, వేధింపులు, వెంటాడడం, పిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడిన 20.37 లక్షల మంది నేరస్థుల వివరాలతో కూడిన రిజిస్ట్రీ ఇది. నేరస్థుల పేరు, చిరునామా, ఫొటో, వేలిముద్రల వివరాలు కూడా ఇందులో ఉంటాయి. ఈ జాబితా నేరస్థులను గుర్తించడానికి, ఆచూకీ తెలుసుకోడానికి వీలుకల్పిస్తుంది, మహిళలకు భద్రతా కవచాన్ని సృష్టిస్తుంది.
బహిరంగ ప్రదేశాల్లో మహిళలు, పిల్లలు, వృద్ధులకు సురక్షితమైన వాతావరణాన్నికల్పించేందుకు రూ.2,840 కోట్ల సేఫ్ సిటీ ప్రాజెక్టును ఎనిమిది నగరాల్లో అమలు చేస్తున్నారు. లైంగిక నేరాల బాధితులకు న్యాయం చేసేందుకు ఇన్వెస్టిగేషన్ ట్రాకింగ్ సిస్టం ఫర్ సెక్సువల్ అఫెన్సెస్ (ITSSO)ను ప్రారంభించారు. ఇది ప్రతి రెండు నెలలకు ఒకసారి పోలీసు దర్యాప్తును తనిఖీ చేస్తుంది. గత ఏడేళ్లలో ITSSO అమలు రేటు 2018లో 43 శాతం నుంచి 2025 నాటికి 57 శాతానికి పెరిగింది. ఇది దాని సమర్థతకు స్పష్టమైన నిదర్శనం. నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్ ప్లాయిటెడ్ చిల్డ్రన్ ద్వారా 70 లక్షల సైబర్ హెల్ప్ లైన్ నివేదికలను సంబంధిత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు పంపించింది. మహిళలు అంతర్జాతీయ మోసాల ఉచ్చులో పడకుండా నిరోధించడానికి, వైవాహిక వివాదాలు, వీసా మోసం, అక్రమ వలసలు, నైజీరియన్ లాటరీ కుంభకోణాలు, ఇతర సైబర్ నేరాలు వంటి సమస్యలపై నేషనల్ డేటాబేస్ ఆఫ్ అఫెండర్స్ ఆఫ్ ఫారిన్ ఆరిజిన్ (NDOFO) అవగాహన కల్పిస్తుంది. సైబర్ దోస్త్ కార్యక్రమం ద్వారా సైబర్ సెక్యూరిటీ చిట్కాలతో నిరంతరం సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తున్నాం. మహిళలకు సైబర్ భద్రతను ముమ్మరం చేస్తూ, వచ్చే ఐదేళ్లలో 5,000 మంది సైబర్ కమాండోలను తయారుచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. వారు సైబర్ పెట్రోలింగ్ ద్వారా మహిళలకు మన సైబర్ స్పేస్ ను సురక్షితంగా మారుస్తారు. అవగాహనను వేగవంతం చేయడానికి, ప్రతి నెలా మొదటి బుధవారం సైబర్ అవగాహన దినంగా పాటిస్తున్నాం.
ప్రశ్న: ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య గణనీయంగా పెరగడంతో పౌరుల భద్రతపై ఆందోళనలు డిజిటల్ రంగంలోకి మారాయి. ఈ సవాలు ఎంత పెద్దది?
ప్ర : గత ఐదేళ్లలో సైబర్ నేరాలను అరికట్టేందుకు భారత్ తన బ్యాండ్ విడ్త్‌ను గణనీయంగా విస్తరించింది. 2020 జనవరిలో ప్రారంభించిన సైబర్ క్రైమ్ పోర్టల్ (www.cybercrime.gov.in) 56 లక్షల ఫిర్యాదులు, 1.53 లక్షల ఎఫ్ఐఆర్లను నమోదు చేసింది. హెల్ప్ లైన్ నంబర్ 1930కి కాల్ చేయడం ద్వారా కేవలం 60 సెకన్లలో బ్యాంకులోని మొత్తాన్ని బ్లాక్ చేయవచ్చు, ఎందుకంటే దీనికి 419 బ్యాంకులు, ఆర్థిక మధ్యవర్తిత్వ సంస్థలు అనుసంధానమయ్యాయి. 14.47 లక్షల మందికి చెందిన రూ.4,725 కోట్లను మా ఏజెన్సీలు రికవరీ చేశాయి. 1930 హెల్ప్ లైన్ కింద ఫిర్యాదుదారుడికి ఏ రాష్ట్రంలో కాల్ వచ్చిందో ఆ రాష్ట్ర భాషలోనే స్పందిస్తారు. ‘సైట్రెయిన్’ అనే మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సు (ఎంఓఓసీ) ప్లాట్ ఫారంపై లక్ష మందికి పైగా పోలీసు అధికారులకు శిక్షణ ఇస్తున్నాం. ఇప్పటి వరకు సుమారు 81 వేల సర్టిఫికెట్లు జారీ చేశారు. 33 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో సైబర్ క్రైమ్ ఫోరెన్సిక్ ట్రైనింగ్ ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తున్నాం. ఐ4సీ సిఫార్సు మేరకు 827 యాప్స్, 3,266 వెబ్సైట్ లింకులను బ్లాక్ చేశారు. పోలీసు బలగాల ఆధునికీకరణ పథకం అమలును కూడా పూర్తి చేశాం. హైదరాబాద్ లోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (CFSL) లోని నేషనల్ సైబర్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీని జాతికి అంకితం చేశాం. అదేవిధంగా సైబర్ క్రైమ్ హాట్ స్పాట్ లకు ఏడు జేసీసీటీలను (జాయింట్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ టీమ్స్) నియమించారు. సైబర్ క్రైమ్ ఫోరెన్సిక్ ట్రైనింగ్ ల్యాబ్‌లు 33 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్నాయి.
ప్ర: సైబర్ మోసాలు జరిగినప్పుడు బ్యాంకులు, టెలికాం పరిశ్రమ బాధ్యతను ఎలా నిర్ధారిస్తాం?
జ: సైబర్ మోసాలకు వాడే దొంగ (మ్యూల్) ఖాతాల కోసం ఏఐ సాఫ్ట్ వేర్‌ను అభివృద్ధి చేసే పనిలో ఉన్నాం. ఆర్బీఐ సహకారంతో ఇది జరుగుతోంది. ఇది దానంతట అదే దొంగ ఖాతాలను గుర్తించి వాటిపై చర్యలు తీసుకునేందుకు వీలు కల్పిస్తుంది. దీంతో సైబర్ నేరాలను చాలా వరకు అరికట్టవచ్చు. ఇందులో ప్రధాన బ్యాంకులు, ఆర్థిక మధ్యవర్తిసంస్థలు, పేమెంట్ అగ్రిగేటర్లు, ఐటీ మధ్యవర్తులు, రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల చట్ట అమలు సంస్థల ప్రతినిధులు సైబర్ నేరాలను ఎదుర్కోవడానికి సత్వర చర్యలు, అంతరాయం లేని సమన్వయం కోసం కలిసి పనిచేస్తున్నారు.
ప్రశ్న: మోసపూరిత మొబైల్ నంబర్లు ప్రబలంగా ఉన్నాయి. ఈ సమస్య పరిష్కారానికి ఏమి చేస్తున్నారు?
జ: ఇది నిజంగా తీవ్రమైన సమస్య. మేము సైబర్ ఫ్రాడ్ మిటిగేషన్ సెంటర్ ద్వారా పెద్ద సంఖ్యలో మొబైల్స్,ఐఎమ్ఇఐ నంబర్లను బ్లాక్ చేశాం.
ప్రశ్న: ఐదేళ్లలో 5 వేల మంది సైబర్ కమాండోలను సిద్ధం చేస్తామని చెప్పారు?
జ: దేశవ్యాప్తంగా సైబర్ సెక్యూరిటీ బెదిరింపులను ఎదుర్కోవడానికి శిక్షణ పొందిన సైబర్ కమాండోలతో ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయడమే లక్ష్యం. NFSU (నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ), RRU (రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ) గాంధీనగర్, ఐఐటీ కాన్పూర్, ఐఐటీ మద్రాస్, ఐఐఐటీ కొట్టాయం వంటి సంస్థల నుంచి 247 మంది అభ్యర్థులు ఫేజ్-1 శిక్షణ పూర్తి చేసుకున్నారు. 2025 చివరి నాటికి 406 మంది కమాండోలకు శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. NFSU మూల్యాంకనం అనంతరం 1,038 మంది అభ్యర్థులను శిక్షణకు అర్హులుగా ప్రకటించారు. టాస్క్ కేటాయింపు, కమ్యూనికేషన్, సమన్వయం కోసం ప్రధాన కేంద్రంగా పనిచేయడానికి సమీకృత నిర్వహణ వేదిక అయిన సైబర్ కమాండో ప్లాట్ ఫారం ను కూడా అభివృద్ధి చేస్తున్నాం.
ప్రశ్న: దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సైబర్ భద్రతా ముప్పులు ఏమిటి?
జ: దీనికి రెండు కోణాలుంటాయి. విస్తృత స్థాయిలో, సైబర్ నేరాల నుండి ప్రధాన ముప్పు మన డేటా (సమాచారం), మన కీలకమైన సంస్థలకు ఉంది. వ్యక్తిగత స్థాయిలో పార్ట్ టైమ్ ఉద్యోగాలు, తక్షణ లోన్లు ఇప్పిస్తామంటూ నకిలీ హామీలతో ప్రజలను మోసం చేయడం వంటి కీలక సైబర్ నేరాలకు గురవుతున్నారు. ఇన్వెస్ట్ మెంట్ కుంభకోణాలు, మోసాలు, డిజిటల్ అరెస్టులు కూడా ప్రధాన ముప్పుగా పరిణమించాయి. అదేవిధంగా ప్రభుత్వ అధికారి, బ్యాంకు ఉద్యోగి, టెలికాం ఉద్యోగి లేదా విద్యుత్ శాఖ అధికారిగా నటించి నకిలీ మొబైల్ యాప్ లను డౌన్ లోడ్ చేసుకునేలా చేయడం లేదా వాట్సప్ గ్రూపులలో ప్రజలను చేర్చడం ద్వారా సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లు సమాచారం. అయితే, అవసరమైన కమాండోలు, మానవ, సాంకేతిక మౌలిక సదుపాయాలతో ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి మేం బాగా సన్నద్ధమయ్యాం.
ప్రశ్న: మీరు కూడా డీప్ ఫేక్ స్కామ్ బాధితుడయ్యారు. ఈ ముప్పును అరికట్టడానికి ఒక నిర్దిష్ట విధానం అవసరమని మీరు భావిస్తున్నారా?
జ: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధ), దాని దుర్వినియోగంపై నిరంతరం అధ్యయనం చేస్తున్నాం. అవసరమైతే ప్రస్తుతం ఉన్న చట్టాల్లో మార్పులు చేయాలి. కానీ కృత్రిమ మేధ ఇంకా చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. మార్పులకు గురవుతోంది. కాబట్టి అలా చేయడంలో మనం ఓపికగా ఉండాలి. ఈ రోజు మనకు తెలిసినవాటికి రేపు కాలం చెల్లిపోవచ్చు. దీనికి చాలా శ్రద్ధ అవసరం, ఏదైనా చర్య తీసుకునే ముందు దాని అన్ని కోణాలను అధ్యయనం చేయాలి. తొందరపాటు నిర్ణయాలు నేరస్థులకు ఉపయోగపడతాయి.
ప్రశ్న: సైబర్ నేరాల విషయంలో పౌరులు ఏం చేయాలి?
జ: మొదటిగా 1930కు కాల్ చేయాలి లేదా www.cybercrime.gov.in పోర్టల్‌లో నమోదు చేయాలి. సమీపంలోని సైబర్ పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించాలి. ఆర్థిక మోసాలు జరిగినప్పుడు ముందుగా బ్యాంకుకు సమాచారం అందించి, ఆ తర్వాత రిపోర్ట్ చేయాలి. సోషల్ మీడియా ఖాతాలను హ్యాక్ చేసిన సందర్భాల్లో, ప్లాట్‌ఫామ్ ఫిర్యాదు విభాగానికి నివేదించండి. తరువాత 1930 కు కాల్ చేయండి.
ప్రశ్న: అత్యంత ప్రబలంగా ఉన్న సైబర్ బెదిరింపులలో ఒకటి డిజిటల్ అరెస్టులు. అయితే ఇలాంటి నేరాలను నిరోధించడంలో అవగాహన కీలక పాత్ర పోషిస్తుంది. ప్రభుత్వం చేపట్టిన అవగాహన కార్యక్రమం ఎలా సాగింది?
జ: ఇలాంటి నేరాలను నిరోధించడానికి అవగాహన కచ్చితంగా కీలకం. మోదీ మన్ కీ బాత్‌లో డిజిటల్ అరెస్టుల గురించి మాట్లాడి ప్రజల్లో అవగాహన కల్పించారు. దీనిపై విస్తృతంగా పనిచేశాం. ‘ఆపండి, ఆలోచించండి, చర్య తీసుకోండి’ అనే సందేశాన్ని మోదీ ఇచ్చారు, రేడియోలో ప్రత్యేక కార్యక్రమం ప్రసారమైంది. ఐ4సీ కూడా దేశవ్యాప్తంగా సినిమా హాళ్లలో సైబర్ నేరాల అవగాహనకు సంబంధించిన వివిధ వీడియోలను ప్రసారం చేసింది. ఫేస్ రికగ్నిషన్ యాప్స్ వంటి ఏఐని ఉపయోగించి ఇలాంటి నేరగాళ్లను గుర్తించేందుకు మన ఏజెన్సీలు సర్వసన్నద్ధంగా ఉన్నాయి.
ప్ర: క్రిప్టోకరెన్సీ భారత భద్రతకు, ఆర్థిక వ్యవస్థకు పెను ముప్పుగా పరిణమించింది. దానిని ఎదుర్కోవడానికి అనుసరిస్తున్న వ్యూహాన్ని వివరిస్తారా?
జ : మన ఆర్థిక వ్యవస్థను, మన సైబర్ స్పేస్‌ను పరిరక్షించుకోవాలన్న మోదీ దార్శనికతకు అనుగుణంగా క్రిప్టోకు వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలను ప్రారంభించాం. 2025 మార్చి నాటికి 6,000 మంది పోలీసులకు క్రిప్టోకరెన్సీ దర్యాప్తులో శిక్షణ ఇచ్చారు. ఐ4సీ కింద క్రిప్టోకరెన్సీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు ముసాయిదా ప్రతిపాదనతో సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా, క్రిప్టోకరెన్సీ దర్యాప్తు కోసం ఫోరెన్సిక్ విశ్లేషణ సాధనాలను సేకరించాం. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో వర్చువల్ డిజిటల్ అసెట్స్ (వీడీఏ)కు సంబంధించిన ఫిర్యాదుల నమోదుకు ఒక వెబ్ పేజీ, పూర్తి ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ సిద్ధంగా ఉంది. వీడీఏల సెర్చ్, సీజ్ కోసం ఎస్ఓపీ ఇప్పుడు సిద్ధంగా ఉంది, త్వరలోనే విడుదల చేస్తాం. క్రిప్టోకరెన్సీ శిక్షణ కోసం ఐ4సీలో 20 కంప్యూటర్లు, 40 మంది సామర్థ్యంతో ల్యాబ్‌ను ఏర్పాటు చేస్తున్నారు.
ప్రశ్న: క్రిమినల్ చట్టాల కింద ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్, డిజిటల్ యాక్టివిటీస్ సహా నేరాలను ఎదుర్కోవడానికి ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి. ఇటువంటి ఫిర్యాదులను పరిష్కరించడానికి రాష్ట్ర పోలీసు బలగాలు సిద్ధంగా ఉన్నాయని మీరు భావిస్తున్నారా?
జ: బీఎన్ఎస్ఎస్ నిబంధనలు అత్యాధునిక స్వభావాన్ని కలిగి ఉంటాయి. అందుకే సైబర్ క్రైమ్ వంటి కొత్తతరం నేరాలను ఎదుర్కోవడంలో ఇది అత్యంత సమర్థవంతంగా పనిచేస్తుంది. బీఎన్ఎస్ఎస్ ద్వారా ఎలక్ట్రానిక్ సాక్ష్యాలను కోర్టులో ఆమోదయోగ్యంగా చేయడం ద్వారా దర్యాప్తును వేగవంతం చేసి శిక్షను సులభతరం చేశాం. వాయిస్ లాగ్ లు, డిజిటల్ వాయిస్ మెయిల్‌లకు డాక్యుమెంట్ ల మాదిరిగానే చట్టపరమైన ఆమోదయోగ్యత ఇవ్వబడింది, ఇది న్యాయస్థానాలలో సాక్ష్యాలను వేగంగా, మరింత ప్రామాణికంగా సమర్పించడానికి వీలు కల్పిస్తుంది. పోలీసుల విచారణ సమయంలో ఆడియో-వీడియో రికార్డింగ్, ఫోరెన్సిక్ సాక్ష్యాల వీడియోగ్రఫీ, డిజిటల్ రికార్డింగ్ తప్పనిసరి చేశాం. దీంతో దర్యాప్తులో పారదర్శకత, జవాబుదారీతనం పెరిగాయి.
బీఎన్ఎస్ఎస్ ప్రవేశపెట్టిన ఇ-ఎఫ్ఐఆర్ మహిళలపై నేరాలను నివేదించడానికి విప్లవాత్మకమైన పద్ధతి. నేరాలను వెంటనే రిపోర్టు చేయడానికి వీలు కల్పిస్తుంది. ఇకపై ఎఫ్ఐఆర్ల నుంచి కేసు డైరీలు, చార్జిషీట్లు, తీర్పుల వరకు అన్నింటిని పూర్తిగా డిజిటలైజ్ చేయనున్నారు. అన్ని పోలీస్ స్టేషన్లు, కోర్టులు ఈ-మెయిల్ చిరునామాలు, ఫోన్ నంబర్లు లేదా ఇతర కాంటాక్ట్ వివరాలతో కూడిన రిజిస్టర్‌ను నిర్వహిస్తాయి.
ప్ర: నేరస్తుల నుంచి డబ్బులు రికవరీ చేసిన తర్వాత సైబర్ మోసాల బాధితులకు డబ్బులు తిరిగి ఇచ్చే విధానాన్ని ప్రభుత్వం రూపొందించిందా?
జ: సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ (CFCFRMS) ద్వారా, బిఎన్ఎస్ఎస్ 2023 కింద తగిన చట్టపరమైన ప్రక్రియ తరువాత స్వాధీనం చేసుకున్న డబ్బును బాధితుడికి తిరిగి ఇస్తారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద సైబర్ క్రైమ్ సంబంధిత కేసుల్లో నిందితుల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వంటి సంస్థలు స్వాధీనం చేసుకోవచ్చు. సైబర్ క్రైమ్ కు సంబంధించిన రూ.20.69 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ ఇటీవల స్వాధీనం చేసుకుంది. ఇప్పటివరకు 14.47 లక్షల మంది బాధితులకు సంబంధించి రూ.4,725 కోట్లు రికవరీ చేశారు.
ప్రశ్న: దిల్లీలో ఐ4సీ కింద NCFLను ఏర్పాటు చేశారు. ఇది రాష్ట్రాలకు సహకరిస్తుందా?
జ: సైబర్ ఫోరెన్సిక్ దర్యాప్తులో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సహాయం చేయడానికి నేషనల్ సైబర్ క్రైమ్ ఫోరెన్సిక్ లాబొరేటరీ తప్పనిసరి. ఇది భారతదేశం అంతటా చట్ట అమలు సంస్థలకు సాంకేతిక మద్దతు, ఫోరెన్సిక్ విశ్లేషణను అందిస్తుంది. సైబర్ క్రైమ్ సవాళ్లను పరిష్కరించడానికి, వారి దర్యాప్తు సామర్థ్యాలను పెంచడానికి సహాయపడుతుంది. ఇది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, కేంద్ర దర్యాప్తు సంస్థల పరిధిలోని చట్ట అమలు సంస్థలకు శిక్షణ కోర్సులను నిర్వహిస్తుంది. ఏ రాష్ట్రమైనా తమ ఏజెన్సీలకు శిక్షణ కోరితే వారికి క్రమం తప్పకుండా శిక్షణ ఇస్తారు. NCFL అందించే ప్రాథమిక కోర్సులో 1,215 మంది పోలీసు, నిఘా సంస్థల సిబ్బందికి, అడ్వాన్స్డ్ కోర్సులో 2025 మార్చి 31 వరకు 440 మందికి శిక్షణ ఇచ్చారు. ట్రైనీలు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందినవారు.
ప్రశ్న: ప్రభుత్వ సంస్థలతో పాటు, సోషల్ మీడియా ప్లాట్ ఫారాలు, బ్యాంకులు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు వంటి ప్రైవేట్ సంస్థలు సైబర్ భద్రతలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇలాంటి విషయాల్లో ప్రభుత్వం సమన్వయాన్ని ఎలా సాధిస్తుంది?
జ: భారత చట్టాల ప్రకారం, భారతదేశంలో పనిచేసే ఏ సోషల్ మీడియా సంస్థ అయినా భారతదేశంలోని చట్ట అమలు సంస్థలకు సంబంధిత డేటాను అందించాల్సి ఉంటుంది. ఇది కాకుండా, ఐ4సీ భారత్‌పోల్ పోర్టల్, జీ7 24×7 నెట్వర్క్ ద్వారా విదేశాలలోని చట్ట అమలు సంస్థలకు కూడా సహకరిస్తోంది. అంతర్జాతీయ సైబర్ నేరాలను, ముఖ్యంగా ఆర్థిక మోసాలు, డార్క్ నెట్ మార్కెట్లను ఎదుర్కోవడంలో మా వ్యూహానికి గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (GPAI) కు భారత్ నాయకత్వం వహించడం కీలకపాత్ర పోషిస్తోంది.

