North East

‘ఈశాన్యం’ వైపు పెట్టుబడిదారుల చూపు

దుబాయిలోని సందడిగా ఉండే మార్కెట్లలో ప్రజలు ఒక వింత పదార్ధం కోసం గుమికూడతారు – అది త్రిపుర నుంచి వచ్చే గోల్డెన్ క్వీన్ పైనాపిల్. దాని మాధుర్యం వర్షాలలో మునిగిన కొండలను, ఏళ్ల తరబడి ఒకతరం నుంచి మరొక తరానికి సంక్రమించిన గిరిజన జ్ఞానాన్ని గుర్తుకు తెస్తుంది. పదకొండేళ్ల క్రితం భారతదేశంలోని మారుమూల ప్రాంతం నుండి వచ్చిన ఈ పండును మధ్యప్రాచ్య వీధుల్లో వడ్డిస్తారని ఎవరు ఊహించారు? కానీ ఇక్కడ మనం దాదాపు 10,000 టన్నుల త్రిపుర ఫలం ఖండాలు దాటి ప్రయాణించడాన్ని చూస్తున్నాం. కథ కేవలం పైనాపిల్స్ గురించే కాదు. ఇది ఒక ప్రాంతం అభివృద్ధిచెందడం, మేల్కొనడం గురించి!

 ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం కారణంగా, ఒకప్పుడు భారతదేశ అభివృద్ధి నమూనాలో ఒక మూలకు నెట్టివేయబడిన ఈశాన్య ప్రాంతం (ఎన్ఇఆర్) తన గతాన్ని పక్కనపెట్టి దేశానికి తూర్పు ముఖద్వారంగా ఎదుగుతోంది. ‘అర్థశాస్త్ర’లో పేర్కొన్న సువర్ణకుడ్యక, బంగారు పట్టును ఉత్పత్తి చేసిన పురాతన కామరూప్ వాణిజ్య మార్గాల నుండి సిలికాన్ కలలకు హామీ ఇచ్చే సెమీకండక్టర్ ఫ్యాబ్స్ వరకు, ఈ ప్రాంతం తన సొంత గమ్యాన్ని తిరగరాస్తోంది. 2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా వికసిత భారత్ గా ఎదగాలన్న భారత్ లక్ష్య సాధనలో కేవలం కొన్ని ప్రాంతాలు మాత్రమే ఈశాన్య ప్రాంతం వలె కీలకపాత్ర వహించగలవు. పదకొండేళ్ల క్రితం ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం చేసినప్పుడు భారత్ అభివృద్ధి పయనం వేగం పుంజుకుని ఈశాన్య రాష్ట్రాలు కూడా ప్రగతిపథంలో పరుగు ప్రారంభించాయి. ఈశాన్య రాష్ట్రాలను భారత అష్టలక్ష్మిగా ప్రధాని మోదీ ప్రకటించారు. అధికారం చేపట్టిన తొలి కొన్ని నెలల్లోనే ఆయన ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటనలు ప్రారంభించారు. ఆయన ఈశాన్య భారతానికి ఇస్తున్న ప్రాధాన్యాన్ని ఆ సమయంలో ఆ ప్రాంతం వెలుపల కొద్దిమంది మాత్రమే గమనించారు. దాని ప్రాముఖ్యతను చాలా తక్కువ మంది అర్థం చేసుకున్నారు. ఏదేమైనా, ఆ పర్యటన, ఆ గడ్డపై చేసిన వాగ్దానాలు ఒక దశాబ్దకాలం పాటు సాగిన కార్యక్రమానికి నాంది పలికాయి. నిర్లక్ష్యానికి గురైన ఈశాన్య ప్రాంతాన్ని అభివృద్ధి, భద్రత, అంతర్జాతీయ అవకాశాల జాతీయ సరిహద్దుగా మార్చడమే ఈ కార్యక్రమం.

ఆర్థిక మద్దతు విషయానికివస్తే ప్రధాని మోదీ నాయకత్వంలో ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి చారిత్రాత్మక స్థాయిలో పెట్టుబడులను పెట్టారు. కేంద్ర మంత్రిత్వ శాఖల 10 శాతం స్థూల బడ్జెట్ కేటాయిపుల ద్వారా ఈ ప్రాంతానికి రూ.6.2 లక్షల కోట్లకు పైగా నిధులు సమకూరాయి. కేవలం మౌలిక సదుపాయాల పెట్టుబడులు రూ.5 లక్షల కోట్లు దాటాయి. ఈశాన్య రాష్ట్రాలకు పన్నుల బదలాయింపు అనేక రెట్లు పెరిగి రూ.5.74 లక్షల కోట్లకు చేరుకోగా, గ్రాంట్ ఇన్ ఎయిడ్ దాదాపు రెట్టింపై రూ.5.66 లక్షల కోట్లకు చేరింది. భూపేన్ హజారికా సేతు, బోగీబీల్ వంతెన లేదా సిల్చార్-షిల్లాంగ్ నాలుగు వరుసల ఎక్స్‌ప్రెస్‌ వే నుండి, కొండ ప్రాంతాలలో భారతదేశపు మొదటి హైస్పీడ్ కారిడార్.. ఇలా ప్రతి ప్రాజెక్టు సవాళ్లతో కూడిన భౌగోళిక పరిస్థితులలో సంక్లిష్ట అనుసంధానతను అందించే ప్రభుత్వ సామర్థ్యానికి నిదర్శనంగా నిలుస్తాయి. మిజోరంలో ఇటీవల పూర్తయిన బైరాబీ-సైరంగ్ రైల్వే లైన్ ఐజ్వాల్‌ను జాతీయ రైల్వే నెట్‌వర్క్‌తో కలుపుతుంది, ఇది ఎనిమిది రాష్ట్రాల రాజధానులను రైలు ద్వారా అనుసంధానించే 2027 లక్ష్యానికి చేరువగా తీసుకువస్తుంది. రైల్వేలో రూ.80,000 కోట్ల పెట్టుబడులు పెట్టడం, ఈ ప్రాంతంలోని విమానాశ్రయాల సంఖ్య 9 నుంచి 17కు రెట్టింపు కావడంతో సముద్ర మార్గం లేని ఈశాన్య రాష్ట్రాలు భవిష్యత్తు అవసరాలకు సిద్ధంగా మారాయి.

మౌలిక సదుపాయాలు పునాది వేసినప్పటికీ, ఈ పరివర్తనను నిజంగా నిర్వచించేది ఎనిమిది రాష్ట్రాలపై పెట్టుబడిదారులలో పెరిగిన విశ్వాసం. సుస్థిర పాలన, దూరదృష్టితో కూడిన నాయకత్వం, ప్రధాని మోదీ అనుసరిస్తున్న విధానాల ఫలితం ఇది. ప్రధాని స్వయంగా ప్రారంభించిన రైజింగ్ నార్త్ ఈస్ట్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2025కు ఈ పునాది మార్పు వేదికైంది. ఇది ఈశాన్యంలోని 4.5 కోట్లమంది పౌరులకు ఒక నిర్ణయాత్మక మైలురాయిగా నిలిచింది. అంతేకాదు, 140 కోట్లమంది భారతీయుల ఆకాంక్షలను సమష్టిగా సాధించే దిశగా ఒక నిర్ణయాత్మక అడుగు. ఈ పెట్టుబడిదారుల సదస్సుకు విపరీతమైన ప్రతిస్పందన వస్తోంది. వ్యవసాయం, అగ్రిటెక్, హాస్పిటాలిటీ, టూరిజం లాజిస్టిక్స్, పునరుత్పాదక ఇంధనం, క్రీడలు, సేవలు ఇలా వివిధ రంగాల్లో రూ.4.3 లక్షల కోట్లకు పైగా పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చాయి. వ్యూహాత్మక భాగస్వాములైన జపాన్, యూరోపియన్ యూనియన్ సహా 80కి పైగా దేశాలు పాల్గొన్నాయి. విదేశీ రాయబారులు, ప్రపంచ పెట్టుబడిదారులు, దేశంలోని అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలు ఈ సదస్సుకు హాజరయ్యారు. ఈశాన్య రాష్ట్రాలు తమ సంస్థలకు కొత్త వ్యాపార అవకాశాల కేంద్రంగా, వికసిత్ భారత్ సాధనలో కీలక భాగస్వాములుగా ప్రపంచం గుర్తిస్తోంది.

ఈ వేగాన్ని మరింత కొనసాగించడానికి ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ (ఎండీఈఆర్) మొత్తం ఎనిమిది రాష్ట్రాల్లో సింగిల్ విండో అనుమతులు, నిరంతర పెట్టుబడిదారుల మద్దతును అందించడానికి పెట్టుబడి ప్రోత్సాహక సంస్థల (ఐపీఏ) ఏర్పాటుకు వెసులుబాటు కల్పించింది. ముఖ్యమంత్రి నేతృత్వంలోని ఎనిమిది ఉన్నత స్థాయి టాస్క్‌ఫోర్స్‌లు ప్రతి రాష్ట్ర ప్రత్యేక అవకాశాలకు అనుగుణంగా ప్రాంతీయ వ్యూహాలను అమలు చేస్తున్నాయి. ఈ విధానాలు, కార్యక్రమాలు ప్రధాని మోదీ త్రిముఖ సిద్ధాంతం, యాక్ట్ ఈస్ట్, యాక్ట్ ఫాస్ట్, యాక్ట్ ఫస్ట్ స్ఫూర్తికి అనుగుణమైనవి. ఈ ప్రాంతం ఇప్పుడు ఆగ్నేయాసియాకు ముఖద్వారంగా మారింది. మన విస్తృత ఇండో-పసిఫిక్ వ్యూహానికి కీలకమైన పునాదిగా మారింది. అంతర్జాతీయ నగరాలకు ప్రత్యేకమైన భౌగోళిక సామీప్యతతో, ఈశాన్య భారతదేశం ఆర్థిక దౌత్యం, వాణిజ్య సమైక్యతకు ఒక ముఖ్యమైన కారిడార్ గా అవతరించింది. 

ప్రతిదాన్నీ ప్రభావితం చేసే భౌగోళిక సూత్రం ఇక్కడ వర్తిస్తుంది: ఒక ముంబై వ్యాపారవేత్త చెన్నైకి కారులో వెళ్ళడానికి రెండు రోజులు పడుతుంది, గౌహతిలోని అతని సహచరుడు తన కార్యాలయ కిటికీ నుండి, సరదాగా చెప్పాలంటే, సింగపూర్ ను చూడగలడు. గౌహతి, అగర్తలా వంటి నగరాలు భౌగోళికంగా భారతీయ మెట్రోల కంటే ఆగ్నేయాసియా కేంద్రాలకు దగ్గరగా ఉన్నందున, తూర్పు దేశాలతో ఆర్థిక సమైక్యతకు అవకాశాలు బలీయంగా ఉన్నాయి. ప్రత్యేకంగా ఆ ప్రాంతంలోనే తయారయ్యే అధిక-విలువ ఉత్పత్తుల ఎగుమతికి మద్దతు ఇవ్వడానికి ఆధునికీకరించిన ఎయిర్ కార్గో సౌకర్యాల వంటి ప్రత్యేక మౌలిక సదుపాయాల ద్వారా ఈ మెరుగైన అనుసంధానతను బలోపేతం చేస్తున్నాం. భారతదేశం-మయన్మార్-థాయ్ ల్యాండ్ త్రైపాక్షిక రహదారి, కలదాన్ మల్టీ-మోడల్ ట్రాన్సిట్ ట్రాన్స్‌పోర్ట్‌ ప్రాజెక్ట్, సిట్వే పోర్ట్ ను ఉపయోగంలోకి తీసుకురావడం వంటి ప్రాజెక్టులు ఈ ప్రాంతాన్ని భౌతికంగా, వాణిజ్యపరంగా, సాంస్కృతికంగా ఆగ్నేయాసియా, ఇంకా ఇతర ప్రాంతాలతో అనుసంధానిస్తాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవల ప్రధాని పాల్గొన్న ‘రైజింగ్ నార్త్ ఈస్ట్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2025’ ఒక ఆర్థిక సదస్సుకు మించి వ్యూహాత్మక లక్ష్య ప్రకటనగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఇది భారత్ ‘యాక్టింగ్ ఈస్ట్’కు సాహసోపేతమైన ముందుమాట, యాక్ట్ ఫస్ట్, యాక్ట్ ఫాస్ట్ కు మన పెట్టుబడిదారులను ఆహ్వానిస్తుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఆసియా వైపు మొగ్గు చూపుతున్నందున ముందుగా సాహసించి కొత్త ప్రాంతాల్లో అవకాశాలు అందిపుచ్చుకునేవారికి కచ్చితంగా ఉజ్జ్వల భవిష్యత్తు ఉంటుంది. భారతదేశం స్వాతంత్య్ర శతాబ్ది ఉత్సవాలకు చేరువవుతున్న కొద్దీ ఈశాన్యం విజయగాథ జాతీయ కథనంలో మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. ఈశాన్యంలోని ఎనిమిది రాజధానులు అంతర్జాతీయ విలువ వ్యవస్థలో విలీనం కావడానికి సిద్ధమవుతున్న కొద్దీ, కారిడార్లు పసిఫిక్ వైపు విస్తరిస్తున్న కొద్దీ ఈ ప్రాంతం ప్రాధాన్యం పెరుగుతుంది. దీనితో పాటే నవ భారతం ఆవిర్భవిస్తుంది.

జ్యోతిరాదిత్య సింధియా,
కేంద్ర ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖల మంత్రి