ఉగ్రవాదాన్ని ఎలా ఓడించాలో చూపించిన భారత్
ఉగ్రవాదం మానవాళికి ఒక శాపంగా పరిణమించింది. ఇది విప్లవం, బలిదానం, హింస గురించి ఒక కాల్పనిక, తప్పుదారి పట్టించే భావనలపై వృద్ధి చెందుతుంది. “ఒక వ్యక్తికి ఉగ్రవాదిగా అనిపించేవారు మరొక వ్యక్తికి స్వాతంత్య్ర సమరయోధుడు” అనే వాదన ప్రమాదకరమైన తప్పుడు వాదన. ఎందుకంటే నిజమైన స్వేచ్ఛను భయం, రక్తపాతంపై ఎన్నటికీ నిర్మించలేం. ఉగ్రవాదానికి ఇంధనం భయం. అయినప్పటికీ భయాన్ని వ్యాప్తి చేయడంలో కూడా వారు నిరాశావాద భావనను కలిగించడంలో విఫలమయ్యారు. ఇందుకు భారత్ నిదర్శనం. అది 26/11 లేదా 2001 పార్లమెంటు దాడి లేదా ఇటీవలి పహల్గాం దాడి కావచ్చు, భారతదేశం మునుపటి కంటే ఉన్నతంగా, బలంగా, మరింత దృఢంగా ఉంది.
ఈ విపత్తును శాశ్వతంగా నిర్మూలించడానికి శాంతికాముక దేశాలన్నీ ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉంది. ఇది ఎలా చేయవచ్చో భారత్ చూపించింది. దశాబ్దాలుగా పాకిస్తాన్ నుంచి పుట్టుకొచ్చిన సీమాంతర ఉగ్రవాదానికి బలైపోతున్నాం. ఇటీవలి పహల్గాం దాడి భారత ఐక్యతను విచ్ఛిన్నం చేయడానికి క్రూరమైన విఫల ప్రయత్నం. ఉగ్రవాదులు పర్యాటకులను చంపే ముందు వారి మతం గురించి ఆరా తీసిన తీరు ఇందుకు నిదర్శనం. వివిధ మతాలకు చెందిన వివిధ మత ప్రదేశాలపై దాడులు చేయడానికి పాకిస్తాన్ డ్రోన్లను, ఫిరంగులను ఉపయోగించినప్పుడు కూడా పాకిస్తాన్ భారత ఐక్యతను దెబ్బతీసే ఇటువంటి ప్రయత్నమే చేసింది. ఇలాంటి నీచమైన చర్యలను ఏ మతమూ అనుమతించదు. ఉగ్రవాదులు తమ అనాగరికతను సమర్థించుకోవడానికి వ్యూహాత్మకంగా మతాన్ని ప్రయోగిస్తారు. మతాన్ని దుర్వినియోగం చేయడం యాదృచ్ఛికం లేదా అప్పటికప్పుడు జరిగేదికాదు. దౌర్జన్యాలకు తప్పుడు చట్టబద్ధత కల్పించడానికి జాగ్రత్తగా రూపొందించిన వ్యూహం ఇది.
ఉగ్రవాదాన్ని ఏమాత్రం సహించరాదన్న (జీరో టాలరెన్స్) విధానం తమదని భారత్ స్పష్టం చేసింది. చర్చలు, ఉగ్రవాదం కలిసి సాగలేవు. పాకిస్థాన్‌తో భవిష్యత్తులో జరిగే చర్చలన్నీ ఉగ్రవాదం, పాక్ ఆక్రమిత కశ్మీర్‌పైనే కేంద్రీకృతమవుతాయి. పాక్ కు చిత్తశుద్ధి ఉంటే సాక్షాత్తూ ఐక్యరాజ సమితి ఉగ్రవాదులుగా ప్రకటించిన హఫీజ్ సయీద్, మసూద్ అజహర్ వంటి వారిని అప్పగించాలి. దీర్ఘకాలిక దార్శనికత, వ్యూహం కోసం అన్వేషిస్తూనే ఉగ్రవాద చర్యలపై చాలాకాలంగా స్పందిస్తున్నాం. మన సాయుధ దళాలను ఇంతకుముందు రక్షణాత్మక చర్యలో పాల్గొనడానికి మాత్రమే అనుమతించారు. లక్షిత దాడులు (సర్జికల్ స్ట్రైక్స్) (2016), బాలాకోట్ దాడులు (2019), ఇప్పుడు ఆపరేషన్ సింధూర్‌తో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల పట్ల భారత్ వైఖరి, విధానాల్లో మౌలికమైన మార్పు వచ్చింది. టెర్రరిస్టులు ఎక్కడున్నా వారిని నిర్మూలించాలన్నది ఇప్పుడు మా విధానం. ఏ ఉగ్రవాద చర్యనైనా ఇప్పుడు యుద్ధ చర్యగా పరిగణిస్తాం. భారత్ పై ఉగ్రదాడి జరిగితే ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న ప్రభుత్వానికి, ఉగ్రవాదులకు మధ్య వ్యత్యాసం లేకుండా ధీటైన సమాధానం చెబుతాం. పాక్ తన గడ్డపై నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న ఉగ్రవాదులను కట్టడి చేయలేకపోతే మూల్యం చెల్లించుకోక తప్పదు.
ఉగ్రవాదులకు నిధులను అరికట్టడంపై న్యూఢిల్లీలో జరిగిన 3వ ‘నో మనీ ఫర్ టెర్రర్’ మంత్రుల సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టంగా చెప్పారు: “ఒక దాడి జరిగినా, ఒక్క ప్రాణం పోయినా కూడా చాలా ఎక్కువ అని మేం భావిస్తున్నాం. కాబట్టి ఉగ్రవాదాన్ని రూపుమాపే వరకు విశ్రమించబోం.” ఆపరేషన్ సింధూర్‌తో భారత ప్రభుత్వం, సాయుధ బలగాలు ఉగ్రవాద నిర్మూలనకు కట్టుబడి ఉన్నామని యావత్ ప్రపంచానికి చాటిచెప్పాయి. ఉగ్రవాదులపై సైనిక చర్య అవసరమని మనకు తెలుసు, కానీ అది ఒక్కటే సరిపోదు. ఉగ్రవాద మౌలిక సదుపాయాలను సమూలంగా నాశనం చేయాల్సిన అవసరం ఉంది. పాక్ టెర్రరిజాన్ని ఆయుధంగా వాడుకుంటున్నందున దౌత్యపరంగా, ఆర్థికంగా పాక్ ను భారత్ విజయవంతంగా ఏకాకిని చేయగలిగింది. సీమాంతర ఉగ్రవాదానికి పాకిస్తాన్ తన మద్దతును ఉపసంహరించుకునే వరకు సింధూ నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తున్నాం. కోటీ 60 లక్షల హెక్టార్ల వ్యవసాయ భూమిలో 80 శాతం, దేశం మొత్తం నీటి వినియోగంలో 93 శాతం సింధు నదీ వ్యవస్థపై ఆధారపడిన పాకిస్తాన్‌డీకు ఈ నిర్ణయం తీవ్రమైన చిక్కులను కలిగిస్తుంది. 23.7 కోట్ల మంది ప్రజలకు సింధు జలాలే ఆధారం. పాకిస్తాన్ జీడీపీలో నాలుగింట ఒక వంతు ఈ జలాల వల్లనే లభిస్తుంది.
ఉగ్రవాదం కేవలం భారతీయ సమస్య మాత్రమే కాదు. ఇది ప్రపంచ సమస్య. ఉగ్రవాద వ్యవస్థలను సమర్థంగా నిర్మూలించాలంటే చిన్నచిన్న ప్రయత్నాలతో సరిపుచ్చక ముందుకు సాగాలి. ఇందులో ఐదు కీలక చర్యలు ఉన్నాయి. ముందుగా ‘టెర్రరిజం’ అనే పదాన్ని నిర్వచించండి. ఉగ్రవాదం అంటే ఏమిటి అనే దానిపై ఇంకా ఏకాభిప్రాయం లేదు. పదబంధ చర్చలు ఉగ్రవాదంపై పోరు పరిధిని కుదించకూడదు; ఉగ్రవాద చర్యలపై దర్యాప్తు చేయడానికి లేదా ప్రాసిక్యూట్ చేయడానికి, విదేశాలలోని ఉగ్రవాదులను అప్పగించేలా చూడటానికి మనకు విస్తృత ఆమోదం పొందిన నిర్వచనం అవసరం.
రెండోది, ఉగ్రవాద సంస్థలనే కాకుండా టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తున్న దేశాల ఆర్థిక వ్యవస్థను స్తంభింపజేయాలి. ఉపశమన ప్యాకేజీలను దుర్వినియోగం చేసిన చరిత్ర పాకిస్తాన్‌కు ఉందని, సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడానికి రుణ నిధులను ఉపయోగిస్తుందని బహుళజాతి సంస్థలు, రుణాలిచ్చే దేశాలు గుర్తించాలి. అందువల్ల పాకిస్తాన్‌ను మళ్లీ ఎఫ్ఏటీఎఫ్ (ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ) గ్రే లిస్ట్ లో పెట్టాల్సిన అవసరం ఉంది. (ఈ జాబితాలో ఉన్న దేశాలకు రుణాలు ఇవ్వడంపై ఆంక్షలు ఉంటాయి). ఇస్లామాబాద్ తన ఉగ్రవాద కార్యకలాపాలను నిలువరించేంత వరకు అన్ని నిధులను నిలిపివేయాల్సిన అవసరం ఉంది.
మూడవది, చాలా కాలంగా తెలిసిన, కానీ మరింత స్పష్టంగా కనిపించే విషయం ఏమిటంటే, పాకిస్తాన్లో ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు ఒకే నాణేనికి రెండు వైపులు. ఇటీవల ఉగ్రవాదులకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడం, యూనిఫాం ధరించిన సైనికాధికారులు హాజరుకావడం ఇదే తొలిసారి. పాకిస్తాన్‌లో అణ్వాయుధాలు ప్రభుత్వేతర శక్తుల చేతుల్లోకి చేరే ప్రమాదం ఉంది. అంతర్జాతీయ సమాజం ఈ పెను ప్రమాదాన్ని గుర్తించాలి. పాకిస్తాన్ అణ్వాయుధాలను అంతర్జాతీయ అణుశక్తి సంస్థ పర్యవేక్షణలో ఉంచాలి
నాలుగవది, తమ పొరుగు దేశాలను అస్థిరపరచడానికి అనుబంధ సంస్థలను ఉపయోగించే దేశాల బండారాన్ని బయటపెట్టాల్సిన అవసరం ఉంది. ఉగ్రవాద చర్యలకు ప్రతిస్పందనల పరిధి, తీవ్రత అవి ఎక్కడ జరుగుతాయి లేదా బాధితుల జాతీయతపై ఆధారపడి ఉండవు. సౌలభ్యం లేదా ప్రయోజనాల ఆధారంగా ఏ ఉగ్రవాద చర్యలను ఖండించాలో దేశాలు ఎంచుకున్నప్పుడు, అది సమష్టి ప్రతిస్పందనను బలహీనపరుస్తుంది , నేరస్థులకు ధైర్యాన్ని ఇస్తుంది.
ఐదవది, పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలు వాటి అంతర్జాతీయ పరిధి, అధునాతన చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించడం స్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రభావాలను కలిగి ఉన్నాయి. అందుకే ఈ ముప్పును ఎదుర్కోవడానికి అంతర్జాతీయ సమన్వయం చాలా అవసరం. అంతర్జాతీయ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సమగ్ర ఒప్పందంపై అన్ని దేశాలు ఏకతాటిపైకి వచ్చి సంతకాలు చేయాల్సిన సమయం ఆసన్నమైంది.
9/11 దాడుల అనంతరం నాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో మాట్లాడుతూ ఉగ్రవాదానికి సైద్ధాంతిక, రాజకీయ, మతపరమైన సమర్థనలను గట్టిగా తిప్పికొట్టాలని అన్నారు. రవీంద్రనాథ్ ఠాగూర్‌ను ఉటంకిస్తూ, “ఇక నుంచి ప్రతి దేశం తన సొంత భద్రత గురించి పడే ఆందోళనను మొత్తం ప్రపంచ సంక్షేమానికి విస్తరించాలి,” అని ఆయన అన్నారు. ఉగ్రవాదాన్ని అన్ని విధాలుగా నిర్మూలించాలన్న విషయంలో భారత్ దృఢంగా ఉంది. శాంతికాముక దేశాలన్నీ మాతో చేరాలని కోరుతున్నాం.
రాజ్ నాథ్ సింగ్,
కేంద్ర రక్షణ మంత్రి

