01

భారత శ్రామిక శక్తికి సాధికారిత

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో మన శ్రమశక్తిని సాధికారం చేయడానికి, వికసిత్ భారత్ కు పునాది వేయడానికి భారతదేశం గణనీయమైన చర్యలను చేపట్టింది. భారతదేశం 2047లో స్వాతంత్ర్య శతాబ్ది దిశగా చేసే ప్రయాణంలో ఉపాధి కల్పన, సామాజిక భద్రత వికసిత్ భారత్ లో ప్రధాన అంశంగా ఉన్నాయి. గత 11 సంవత్సరాలుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశ శ్రామిక శక్తి ప్రభుత్వ విధానం, ప్రణాళిక, పురోగతికి కేంద్ర బిందువుగా ఉంది. ఈ ప్రాధాన్యం ఉపాధి కల్పనలో చారిత్రాత్మక మెరుగుదలకు, సామాజిక భద్రత కవరేజీ విస్తరణకు దారితీసింది.

2014లో భారతదేశం ఉపాధి రంగం చిన్నాభిన్నంగా, సామాజిక భద్రతా కవరేజీ పరిమితంగా ఉండేవి. మెజారిటీ కార్మికులు, ముఖ్యంగా అసంఘటిత రంగంలో ఉన్నవారు సంక్షేమ పథకాల వెలుపల ఉన్నారు. ఈ పరిస్థితిని వెంటనే చక్కదిద్దవలసిన అవసరాన్ని గుర్తించిన మోదీ ప్రభుత్వం సాహసోపేతమైన, నిర్మాణాత్మక సంస్కరణలను చేపట్టింది. మేక్ ఇన్ ఇండియా, స్కిల్ ఇండియా, డిజిటల్ ఇండియా, భారీ మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలు ఉపాధి కల్పనకు అపూర్వమైన ఊపునిచ్చాయి. రిజర్వ్ బ్యాంకు లెక్కల ప్రకారం 2004-14 మధ్య కేవలం 2.9 కోట్ల ఉద్యోగాలు మాత్రమే సృష్టిస్తే.. 2014-24 మధ్య కాలంలో 17 కోట్లకు పైగా ఉద్యోగాలు వచ్చాయి. పీఎల్ఎఫ్ఎస్ సమాచారం ప్రకారం ఉపాధి రేటు (WPR) 2017-18లో 46.8 శాతం నుండి 2023-24లో 58.2 శాతానికి పెరిగింది. అదే సమయంలో నిరుద్యోగిత రేటు (UR) 6 శాతం నుండి 3.2 శాతానికి తగ్గింది. అంతేకాదు, అధికారిక రంగంలో ఉపాధి కల్పన కూడా గణనీయమైన పురోగతిని చూసింది. గత ఏడేళ్లలో అధికారిక రంగంలో 7.5 కోట్లకు పైగా ఉద్యోగాల సృష్టి జరిగినట్లు EPFO (ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ) గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

యువ, నారీ శక్తి సాధికారత

భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో యువత, నారీ శక్తి సాధికారత ప్రధాన పాత్ర పోషిస్తుంది. దీనికి నిదర్శనంగా మహిళా ఉపాధి రేటు (WPR) 2017–18లో 22 శాతం నుండి 2023–24లో 40.3 శాతానికి పెరిగింది, అదే సమయంలో నిరుద్యోగ రేటు 5.6 శాతం నుండి 3.2 శాతానికి పడిపోయింది. ఈ మార్పు గ్రామీణ భారతదేశంలో మరింత గణనీయంగా ఉంది. ఇక్కడ మహిళా ఉపాధి 96 శాతం పెరుగుదల సాధించగా, పట్టణ ప్రాంతాలలో 43 శాతం పెరిగింది. గత 11 ఏళ్లలో మోదీ ప్రభుత్వం అమలు చేసిన పరివర్తనాత్మక సంస్కరణలు, లక్షిత కార్యక్రమాల ఫలితమే ఈ ఫలితాలు. నేడు 15 మంత్రిత్వ శాఖలలో 70కి పైగా కేంద్ర ప్రాయోజిత పథకాలు మహిళా వ్యవస్థాపకతకు మద్దతు ఇస్తూ, వారికి ఆత్మనిర్భరతను అందిస్తున్నాయి.  

భారతదేశంలో యువత ఉపాధి నైపుణ్యాలు కూడా గణనీయంగా పెరిగాయి. 2013లో యువతలో ఉపాధి నిపుణత కేవలం 33 శాతం ఉండగా, అది 2024 నాటికి 55 శాతానికి పెరిగింది. బలమైన డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాల ఫలితంగా ఈ పురోగతి సాధ్యమైంది. నేషనల్ కెరీర్ సర్వీస్ (NCS) పోర్టల్ వంటి ప్లాట్ ఫారాలు ఉపాధి సంబంధిత సేవలను ఒకే చోట అందిస్తున్నాయి. 2015లో ప్రారంభమైన NCS ఇప్పటివరకు 5.5 కోట్ల మంది ఉద్యోగార్థులను 46 లక్షల మంది యజమానులతో అనుసంధానం చేసి, 5 కోట్లకు పైగా ఉద్యోగ ఖాళీలను సమీకృతం చేసింది. తత్ఫలితంగా, యువత ఉపాధి రేటు (WPR) 2017–18లో 31.4 శాతం నుండి 2023–24లో 41.7 శాతానికి పెరిగింది. అదే సమయంలో యువత నిరుద్యోగిత రేటు 17.8 శాతం నుండి 10.2 శాతానికి గణనీయంగా పడిపోయింది. ఇది ప్రపంచ సగటు 13.6 శాతం కంటే తక్కువ. డిజిటల్ నైపుణ్య కార్యక్రమాలు, ఎంటర్ ప్రెన్యూర్ షిప్ కార్యక్రమాలు, నవ కల్పన ఆధారిత వేదికల ద్వారా భారత యువత ఉద్యోగార్థుల నుంచి ఉద్యోగ సృష్టికర్తలుగా ఎదుగుతున్నారు.

అసంఘటిత కార్మికులకు గుర్తింపు

దేశంలోని విస్తారమైన అసంఘటిత శ్రామిక శక్తిని గుర్తించడం గత 11 సంవత్సరాలలో అత్యంత పరివర్తనాత్మక విజయాలలో ఒకటి. అసంఘటిత కార్మికుల కోసం 2021లో మోదీ ప్రభుత్వం ఈ-శ్రమ్ పోర్టల్‌ను ప్రారంభించింది. కేవలం నాలుగేళ్లలో గిగ్, ప్లాట్ఫామ్ వర్కర్లతో సహా 30.8 కోట్ల మంది అసంఘటిత కార్మికులు ఈ ప్లాట్ ఫాంలో చేరారు. ఈ పోర్టల్ వివిధ సంక్షేమ పథకాలకు కార్మికులను అనుసంధానం చేస్తూ వారికి అన్ని సేవలను ఒకే చోట అందిస్తోంది. ప్రస్తుతం 13కి పైగా కేంద్ర ప్రభుత్వ సామాజిక సంక్షేమ పథకాలు ఈ-శ్రమ్ తో అనుసంధానమయ్యాయి. ఇవి పలు భాషల్లో సమాచారాన్ని, సేవలను అందిస్తాయి. ఇది కేవలం సాంకేతిక పురోగతి మాత్రమే కాదు, కార్మికుడికి ప్రథమ స్థానం కల్పించే పాలనా నమూనాకు పరివర్తన చెందడం. అదనంగా, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందడాన్ని పరిగణనలోని తీసుకొని, మేం గిగ్, ప్లాట్ఫామ్ కార్మికులను కూడా ప్రభుత్వ విధానాల పరిధిలోకి తీసుకువచ్చాం. ఈ ఏడాది కేంద్ర బడ్జెట్లో వాటిని ఈ-శ్రమ్ పోర్టల్లో చేర్చి ఆయుష్మాన్ భారత్ పీఎం-జన్ ఆరోగ్య యోజన కింద ఆరోగ్య సంరక్షణ కవరేజీని విస్తరిస్తామని ప్రధాని ప్రకటించారు. మోదీ ప్రభుత్వం ఈ అభివృద్ధి చెందుతున్న శ్రామిక శక్తికి తగిన రక్షణ, అవకాశాలను లభించేలా చూస్తోంది.

ఈఎస్ఐ, ఈపీఎఫ్ఓల సంస్కరణ 

దీర్ఘకాలంగా అసమర్థ నిర్వహణ, అనవసర జాప్యాలతో సతమతమవుతున్న ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO), ఉద్యోగుల ప్రభుత్వ బీమా సంస్థ (ESIC) వంటి సంస్థలను సంస్కరించడానికి గత 11 ఏళ్లలో గణనీయమైన చర్యలు చేపట్టారు. ఈ సంస్కరణలు అపూర్వమైన పారదర్శకతను తీసుకురావడమే కాకుండా వ్యవస్థకు మరింత సమర్థతను తీసుకువచ్చాయి. యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) ప్రవేశపెట్టడం, ఆధార్ అనుసంధానం, సరళీకృత ఆటో క్లెయిమ్ పరిష్కారం, వివిధ పథకాలతో సమన్వయం, బలమైన ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాలు వంటి కార్యక్రమాలు సేవల పంపిణీ తీరును సమూలంగా మార్చి మన శ్రామిక శక్తికి జీవన సౌలభ్యాన్ని పెంచాయి. ఫలితంగా EPFO సభ్యత్వం 2013–14లో 11.78 కోట్ల నుంచి 2024–25 నాటికి 34.63 కోట్లకు పెరిగింది. ఇదే సమయంలో EPFOలో నమోదైన సంస్థల సంఖ్య 7.96 లక్షల నుంచి 27.05 లక్షలకు పెరిగింది. అదనంగా, 2024-25 లో పరిష్కారమైన క్లెయిముల సంఖ్య 6 కోట్లకు చేరుకుంది, ఇది EPFO చరిత్రలో ఎన్నడూ లేనంత అత్యధికం. ఇక ESIC విషయానికి వస్తే 2013-14లో కేవలం 393 జిల్లాలు మాత్రమే ఉంటే, ఇప్పుడు దాదాపు 700 జిల్లాలకు విస్తరించింది. 2013-14 నుంచి 2024-25 మధ్య బీమా పరిధిలోకి వచ్చే కార్మికుల సంఖ్య 1.95 కోట్ల నుంచి 4.09 కోట్లకు పెరిగింది. ఇదే సమయంలో లబ్ధిదారులు 7.89 కోట్ల నుంచి 15.87 కోట్లకు రెట్టింపు అయ్యారు. నేడు, ESIC కీమోథెరపీ, రోబోటిక్ శస్త్రచికిత్సలు, డిజిటలైజ్డ్ హెల్త్ రికార్డులు వంటి అధునాతన ఆరోగ్య సంరక్షణ సేవలను అందిస్తుంది, ఇది కార్మికులకు ఆరోగ్య సంరక్షణ సదుపాయాల లభ్యతను గణనీయంగా పెంచుతుంది.

సామాజిక భద్రత విస్తరణ

మోదీ ప్రభుత్వ నిరంతర ప్రయత్నాల ఫలితంగా సామాజిక రక్షణ కవరేజీని విస్తరించడంలో భారత్ గణనీయమైన పురోగతి సాధించింది. అంతర్జాతీయ కార్మిక సంస్థ (ILO) గణాంకాల ప్రకారం భారతదేశ సామాజిక రక్షణ కవరేజీ 2015లో 19 శాతం నుండి 2025 నాటికి 64.3 శాతానికి, అంటే మూడు రెట్లు పెరిగింది. నేడు 94 కోట్లకు పైగా పౌరులు కనీసం ఒక సాంఘిక సంక్షేమ పథకం నుంచి లబ్ధి పొందుతున్నారు. ఇది లబ్ధిదారుల సంఖ్య పరంగా ప్రపంచంలో రెండవ అతిపెద్ద సంక్షేమ వ్యవస్థగా మారింది. ఆర్థిక వృద్ధి, సామాజిక భద్రత కలిసి సాగే ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’పై మాకున్న నమ్మకానికి భారత సామాజిక రక్షణ నమూనా నిదర్శనం.

గత 11 సంవత్సరాలుగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం మన కార్మిక శక్తిని శక్తిమంతం చేయడానికి, వికసిత్ భారత్ కు పునాది వేయడానికి గణనీయమైన చర్యలను చేపట్టింది. ఉపాధి కల్పనకు ప్రాధాన్యమివ్వడం, సామాజిక రక్షణను విస్తరించడం, సంస్థాగత పంపిణీని బలోపేతం చేయడం, డిజిటల్ మౌలిక సదుపాయాలను పెంపొందించడం ద్వారా ప్రభుత్వం కార్మికులను అభివృద్ధి ఎజెండాలో కేంద్రబిందువుగా ఉంచింది. వికసిత్ భారత్ దార్శనికతను సాకారం చేసే దిశగా మనం అడుగులు వేస్తున్న తరుణంలో, భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద శ్రామిక శక్తి కలిగిన దేశంగా మాత్రమే కాకుండా, అత్యంత నైపుణ్యం, భద్రత, సాధికారత కలిగిన దేశాలలో ఒకటిగా మారడానికి కూడా సన్నద్ధమవుతోంది.

మన్సుక్ మాండవీయ,
కేంద్ర కార్మిక, ఉపాధి, యువజన వ్యవహారాలు, క్రీడల శాఖల మంత్రి