శ్యామా ప్రసాద్ స్మరణలో
జూలై 6న భారతీయ జనసంఘ్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలను బిజెపి నాయకులు, కార్యకర్తలు ఘనంగా జరుపుకొన్నారు. జాతీయం నుంచి బూత్ స్థాయి వరకు బిజెపి కార్యకర్తలు శ్యామా ప్రసాద్ ను స్మరించుకున్నారు. దిల్లీలోని పార్లమెంట్ హౌజ్ సెంట్రల్ హాల్ లోని శ్యామా ప్రసాద్ చిత్రపటానికి బిజెపి జాతీయ అధ్యక్షుడు, కేంద్రమంత్రి జె.పి. నడ్డా పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఇక రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజి రెడ్డి తదితరులు.. శ్యామ ప్రసాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు గొట్టాల ఉమారాణి, కొల్లి మాధవి, రాష్ట్ర కోశాధికారి బండారి శాంతి కుమార్, తదితర నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎన్. రాంచందర్ రావు మాట్లాడుతూ.. ‘‘జన సంఘ్ వ్యవస్థాపకుడిగా, సైద్ధాంతికంగా దిశను చూపిన మహానేతగా శ్యామా ప్రసాద్ ముఖర్జీ బిజెపి నాయకులు, కార్యకర్తలంతా కార్యకర్తలందరికీ గొప్ప స్ఫూర్తి ప్రదాత. చిన్న వయస్సులోనే అనేక పోరాటాలు చేసి, జనసంఘ్‌ను స్థాపించి, కాశ్మీర్ సమస్యపై ధీటుగా పోరాడిన గొప్ప నాయకుడు. దేశంలో ఇద్దరు ప్రధాన మంత్రులు, రెండు జెండాలు, రెండు రాజ్యాంగాలు ఉండకూడదని పోరాడిన నేతగా ఆయన చరిత్రలో చిరస్థాయిగా నిలిచారు. శ్యామా ప్రసాద్ ముఖర్జీ మరణం అనుమానాస్పద పరిణామాల్లో జరిగింది. వారి జీవితం త్యాగానికి ప్రతీకగా, ధైర్యానికి ప్రతిరూపంగా నిలిచింది. ముఖర్జీ ఆశయాలకు అనుగుణంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆర్టికల్ 370ని రద్దు చేశారు. “ఒకే దేశం – ఒకే చట్టం – ఒకే రేషన్ – ఒకే ఎన్నికలు” అనే భావనను ముందు ఉంచి, దేశ సమగ్రత కోసం ప్రతి కార్యకర్త శ్రమించాలి. మనమంతా శ్యామా ప్రసాద్ ముఖర్జీ బాటలో ముందుకెళ్తూ, దేశ ఐక్యత, పార్టీ పటిష్టత కోసం కృషి చేయాలి.’’ అని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి బూత్ లోనూ శ్యామా ప్రసాద్ జయంతి సందర్భంగా నివాళులు అర్పించి, వారు చేసిన త్యాగాలు, సేవలను స్మరించుకున్నారు. శ్యామా ప్రసాద్ కు నివాళిగా బిజెపి నాయకులు, కార్యకర్తలు చాలా చోట్ల మొక్కలు నాటారు.

