Semi Conductor

సెమీకండక్టర్ల రంగంలో స్వయం సమృద్ధి దిశగా భారత్

నేటి ఆధునిక సాంకేతిక యుగంలో సెమీకండక్టర్ చిప్‌లు చాలా కీలకమైనవి. డ్రోన్‌లు, ఎలక్ట్రిక్ వాహనాలు, స్మార్ట్‌ఫోన్‌లు, కంప్యూటర్లు, రోబోలు, లేజర్ల వంటి అనేక సాధనాల్లో వీటిని ఉపయోగిస్తారు. అంతేకాకుండా, అంతరిక్ష పరిశోధన, రక్షణ, వ్యవసాయం, వైద్యం, టెలికాం, ఆటోమొబైల్ రంగాల్లోనూ వీటి పాత్ర ఎంతో ఉంది. భారతదేశపు సెమీకండక్టర్ మార్కెట్ దేశీయంగా, అంతర్జాతీయంగా వివిధ రంగాలకు ఊతమిస్తోంది. భారత్ ఇప్పుడు సెమీకండక్టర్ సాంకేతికతలో పెద్ద ముందడుగు వేస్తోంది. ‘వోకల్ ఫర్ లోకల్’ (స్వదేశీ ఉత్పత్తి, వినియోగం) నినాదంతో, దేశంలోనే చిప్‌లను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ చిప్‌ల ద్వారా సమాచారాన్ని చాలా వేగంగా, అధిక బ్యాండ్‌విడ్త్‌తో పంపవచ్చు. ఈ పరిశ్రమ అవసరాలను తీర్చడానికి, ఫ్యూచర్‌స్కిల్స్ ప్రైమ్, స్వయం ఎన్‌పీటీఈఎల్, వర్చువల్ ల్యాబ్స్ వంటి అనేక ప్లాట్‌ఫామ్‌ల ద్వారా యువతకు నైపుణ్యాలను నేర్పిస్తున్నారు. దీనివల్ల భారతదేశం సెమీకండక్టర్ రంగంలో నిపుణుల దేశంగా మారనుంది. తక్కువ ఖర్చుతో కూడిన స్వదేశీ ‘సిస్టమ్ ఆన్ చిప్ (ఎస్ఓసీ)’ సాంకేతికతను అభివృద్ధి చేయాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. దీనివల్ల తక్కువ స్థలం, తక్కువ విద్యుత్ వినియోగం, తక్కువ ఖర్చుతో చిప్‌లను రూపొందించవచ్చు.

‘ఇండియా సెమీకండక్టర్ మిషన్’ ప్రారంభంతో భారతదేశం సెమీకండక్టర్ రంగంలో విజయవంతమైన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. దేశవ్యాప్తంగా అత్యాధునిక సెమీకండక్టర్ పరిశ్రమ యూనిట్లు ఏర్పాటు అవుతున్నాయి. ‘నేషనల్ సెమీకండక్టర్ కార్యక్రమం, ‘డిజిటల్ ఇండియా’, ‘మేక్ ఇన్ ఇండియా’, ‘స్టార్టప్ ఇండియా’ వంటి కార్యక్రమాలతో భారత్ 21వ శతాబ్దంలో ‘ఇండస్ వ్యాలీ’ నుండి ‘సెమీకండక్టర్ వ్యాలీ’గా మారుతోంది. ఈ మార్పు భారత ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం చూపుతోంది. యువ ఇంజనీర్లకు అపారమైన అవకాశాలను సృష్టిస్తోంది. ఈ యూనిట్లు మరిన్ని ఉద్యోగాలను సృష్టించి, మన దేశ సెమీకండక్టర్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. భారతీయ శాస్త్రవేత్తలు, స్టార్టప్‌లు శక్తి ప్రాసెసర్, డిజిటల్ ఆర్ఐఎస్సి-V వంటి స్వదేశీ సెమీకండక్టర్ ఉత్పత్తులను రూపొందించారు. ఇవి మన స్వదేశీ సాంకేతిక సత్తాను చాటి చెబుతున్నాయి. దేశంలోనే అభివృద్ధి చేసిన ఈ సెమీకండక్టర్ వ్యవస్థలు మన జాతీయ అంతరిక్ష పరిశోధనలు, రక్షణ వ్యవస్థల్లో గొప్ప విజయాలకు కారణమయ్యాయి.

సెమీకండక్టర్ కాంప్లెక్స్ లేబొరేటరీ, ఐఐటీ కాన్పూర్‌లోని సెంటర్ ఫర్ ఫ్లెక్సిబుల్ ఎలక్ట్రానిక్స్ వంటి పరిశోధనా సంస్థలు అనేక ఆవిష్కరణలకు మార్గం వేశాయి. ఈ సంస్థలు ‘ల్యాబ్ నుంచి మార్కెట్‌కు’ సెమీకండక్టర్ ఉత్పత్తుల రూపకల్పన, అభివృద్ధి, తయారీకి తోడ్పడ్డాయి. దీనివల్ల భారత్ స్వయం సమృద్ధి సాధించడమే కాకుండా, ప్రపంచ ఆవిష్కరణల సూచీలో కూడా చోటు సంపాదించింది. సెమీకండక్టర్ సాంకేతికతపై నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సీ-డాక్, ఇండియన్ నానో ఎలక్ట్రానిక్స్ యూజర్ ప్రోగ్రామ్ వంటి సంస్థలు ఆన్‌లైన్/సర్టిఫికేషన్ కోర్సులను అందిస్తున్నాయి. ఈ కోర్సులు విద్యార్థులకు సెమీకండక్టర్ రంగంలో ఆచరణాత్మక అనుభవాన్ని, నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి అవకాశాలు కల్పిస్తున్నాయి. ఈ కార్యక్రమాలు జాతీయ నైపుణ్యాల చట్రం (నేషనల్ స్కిల్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్ వర్క్) మార్గదర్శకాలకు అనుగుణంగా ఉన్నాయి. ఐఐఎస్‌సి బెంగళూరు, ఐఐటీ బాంబే, ఐఐటీ దిల్లీ వంటి సంస్థల్లోని విద్యార్థులు, అధ్యాపకులు క్లీన్ రూమ్ సౌకర్యాలను సందర్శించి, నిపుణులతో సంభాషించే అవకాశం పొందుతున్నారు. నైలిట్ (ఎన్ఐఈఎల్ఐటి) కాలికట్ వద్ద ఉన్న ‘స్కిల్డ్ మ్యాన్‌పవర్ అడ్వాన్స్‌డ్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్’ (స్మార్ట్) సదుపాయం ద్వారా దేశవ్యాప్తంగా అధునాతన డిజైన్ శిక్షణ, పరిశోధనలను అందిస్తున్నారు. తమిళనాడు ప్రభుత్వం ఐఐటీ మద్రాసు, కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటి మంత్రిత్వ శాఖల సహకారంతో ‘స్కూల్ ఆఫ్ సెమీకండక్టర్’ను స్థాపించాలని యోచిస్తోంది.

‘డిజైన్ లింక్డ్ ఇనిషియేటివ్ (డిఎల్ఐ)’, ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ)’, ‘జాతీయ తయారీ కార్యక్రమం’ వంటి పథకాల ద్వారా కేంద్ర ప్రభుత్వం సెమీకండక్టర్ రంగానికి పటిష్టమైన పునాది వేసింది. ఈ పథకాలు సహస్ర సెమీకండక్టర్ (నోయిడా), ఆర్ఆర్పీ ఎలక్ట్రానిక్స్ (ముంబై) వంటి సంస్థలకు ప్రోత్సాహాన్ని అందించాయి. ఈ సంస్థలు అంతరిక్ష ఉపగ్రహాలు, వైద్య పరిశోధనలు, రక్షణ వ్యవస్థలు వంటి రంగాలకు ఉపయోగపడే అత్యాధునిక సెమీకండక్టర్ ఉత్పత్తులను అభివృద్ధి చేస్తున్నాయి. ఈ మిషన్ ద్వారా భారతీయ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు కూడా ఈ రంగంలోకి ప్రవేశించడానికి అవకాశాలు పెరుగుతాయి.

-టి. సెంథిల్ శివ సుబ్రమణియన్