కవిత సస్పెన్షన్ కేసీఆర్ ఎత్తుగడలో భాగమా!
మొన్నటి వరకు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షునిగా అన్న కేటీఆర్ మొత్తం పార్టీ వ్యవహారాలపై ఆధిపత్యం వహిస్తూ తనకు ఎటువంటి ప్రాధాన్యత లేకుండా చేస్తున్నారన్న అసంతృప్తితోనే కల్వకుంట్ల కవిత కొంతకాలంగా బీసీల సాధికారికత, ఇతర అంశాలపై గళం విప్పుతున్నారనే ప్రచారం జరిగింది. అయితే అకస్మాత్తుగా కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై జస్టిస్ పి.సి. ఘోష్ కమిషన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టి, సీబీఐ దర్యాప్తు జరిపించాలని నిర్ణయించగానే ఆమె స్వరం మార్చి మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎంపీ సంతోష్ రావులపై తీవ్రమైన ఆరోపణలు చేయడం ప్రారంభించారు. పరోక్షంగా తండ్రి కేసీఆర్ పాలనలో విపరీతమైన అవినీతి, అక్రమాలు జరిగాయని స్వయంగా వెల్లడించడం ద్వారా ఆమె బీఆర్ఎస్ లో కలకలం రేపారనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఏది ఏమైనా కేసీఆర్ కుటుంబంలో అధికారం పంచుకోవడంలో, అవినీతి సొమ్మును కాజేయడంలో చిచ్చు రేగింది మాత్రం స్పష్టం అవుతుంది.
దిల్లీ మద్యం కుంభకోణంలో కవిత క్రియాశీల పాత్ర స్పష్టమై అరెస్ట్ కావడంతో రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రతిష్ట దిగజారిందని, ఎన్నికలలో వరుసగా పరాజయాలు ఎదురవుతున్నాయని బీఆర్ఎస్ నాయకులు, శ్రేణులు భావిస్తున్నారు. అందుకే జైలు నుండి బైటకు రాగానే కొంతకాలం ఆమెను రాజకీయాలకు దూరంగా ఉండమని కేసీఆర్, కేటీఆర్ సూచించారని ప్రచారం కూడా జరిగింది. తాను దూరం జరిగితే శాశ్వతంగా దూరం కావాల్సి వస్తుందనే భయంతో ఆమె బీసీ నినాదం తీసుకుందని అభిప్రాయం బలపడుతుంది. అయితే, ఎన్నడూ హరీష్ రావు గురించి పరోక్షంగా కూడా ప్రస్తావించని కవిత మొత్తం కాళేశ్వరం అవినీతికి ఆయనే బాద్యుడని, తండ్రి కేసీఆర్ కు ఏమీ తెలియదని, అందుకనే హరీష్ రావును నీటిపారుదల మంత్రిత్వ శాఖకు దూరం చేసారని అంటూ ఆమె చెప్పుకురావడం వ్యూహాత్మకంగా వేస్తున్న అడుగుగా పలువురు భావిస్తున్నారు. హరీష్ రావును పక్కకు నెట్టేందుకు కేసీఆర్ వ్యూహంలో భాగంగానే ఆమె ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారనే ప్రచారం కూడా ఈ సందర్భంగా జరుగుతుంది.
పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షునిగా పలు సంవత్సరాలుగా కేటీఆర్ కు పార్టీ పగ్గాలను దాదాపుగా అప్పగించినా పార్టీ శ్రేణులలో తగు పట్టు సాధింపలేకపోయారనే అభిప్రాయం బలపడుతుంది. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలలో పార్టీ ఘోర పరాజయాలకు ఆయననే బాధ్యుడిగా పలువురు పార్టీ నాయకులు భావిస్తున్నారు. పార్టీ పెట్టినప్పటి నుండి నాయకులు, పార్టీ శ్రేణులతో హరీష్ రావు ఏర్పర్చుకున్న సన్నిహిత సంబంధాలను కేటీఆర్ ఏర్పర్చుకోలేక పోతున్నారని కూడా స్పష్టం అవుతుంది. ప్రతి జిల్లాలోని పార్టీ నేతలు, శ్రేణులతో ఆయనకు మంచి సంబంధాలు కొనసాగుతున్నాయి. హరీష్ రావును మెదక్ జిల్లాకు పరిమితం చేసే ప్రయత్నాలు గత ఐదారేళ్లుగా చేస్తున్నా సాధ్యం కావడం లేదు. పైగా, కేటీఆర్ అహంకార ధోరణులు పార్టీలో ఆయనకు వ్యతిరేకులను పెంచుతుంది. హరీష్ రావు పార్టీలో ఉన్నంతకాలం కేటీఆర్ కు పార్టీపై పట్టు ఏర్పడదనే అభిప్రాయంతో ఆయన ఇమేజ్ ను దెబ్బతీసేందుకు కవితను అస్త్రంగా వాడుతున్నారనే అభిప్రాయం పార్టీ శ్రేణులలో ఇప్పుడు బలంగా వ్యాప్తి చెందుతుంది.
హరీష్ రావును కవిత టార్గెట్ చేయడం, వెంటనే ఆమెను పార్టీ నుండి సస్పెండ్ చేయడం, తానే పార్టీ పదవికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం అంతా కేసీఆర్ రూపొందించిన స్క్రిప్ట్ ప్రకారమే జరుగుతున్నట్లు కూడా ప్రచారం జరుగుతుంది. కవిత ఆరోపణల తర్వాత ఇప్పుడు హరీష్ రావుపై సోషల్ మీడియాలో చర్చలు విపరీతంగా జరుగుతున్నాయి. 30 ఏళ్ళ కిందట ఆయన ట్రంకుపెట్టె, రబ్బరు చెప్పులతో కేసీఆర్ వద్దకు వచ్చారని, ఇప్పుడు ఆయన ఆర్థిక స్థాయి ఎంత? ఎలా సంపాదించారన్న ప్రశ్నలు ఎక్కువగా వస్తున్నాయి. ఇవి రాను రాను పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేసీఆర్.. తన పిల్లల కంటే ఎప్పుడూ ఎవరికీ ప్రాధాన్యత ఇవ్వరని, వారు చెప్పింది ఖచ్చితంగా వింటారని చాలా మందికి తెలుసు. కవిత అంటే కేసీఆర్‌కు ఇంకాస్త ఎక్కువ అభిమానం. ఈ ఎపిసోడ్ కల్వకుంట్ల కుటుంబంలో చీలిక కాదని, కేసీఆర్ స్క్రిప్టేనని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ కవిత మరో పార్టీని ప్రారంభించినా బీఆర్ఎస్ లో అసంతృప్తి నేతలు బిజెపి, కాంగ్రెస్ లలో చేరకుండా కాపాడుకొనే ప్రయత్నంగా మారే అవకాశం ఉంది. మరోవంక, కవిత సస్పెన్షన్ వ్యవహారంతో కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవినీతి అంశం నుండి ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం కూడా జరుగుతున్నట్లు కనిపిస్తున్నది.
ప్రవీణ్

