బండి సంజయ్ చొరవతో నిలబడిన ప్రాణాలు
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కృషితో సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల గ్రామంలో వరదల్లో చిక్కుకుపోయిన 5 గురు వ్యక్తుల ప్రాణాలు నిలబడ్డాయి. బండి సంజయ్ చొరవ చూపి ఆర్మీ హెలికాప్టర్లను ప్రత్యేకంగా రప్పించి బాధితులను ఎయిర్ లిఫ్ట్ చేసి కాపాడారు. దీంతో ప్రాణభయంతో వరదల్లో చిక్కుకుని బిక్కుబిక్కుమంటున్న బాధితులు క్షేమంగా బయటకు రావడంతో ఊపిరి పీల్చుకున్నారు. క్షేమంగా బయటపడ్డ బాధితులు బండి సంజయ్ వద్దకు వచ్చి తమ ప్రాణాలను కాపాడినందుకు ధన్యవాదాలు తెలిపారు.
రెండ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తోడు ఎగువ నుండి ఊహించని విధంగా వరద నీరు రావడంతో నర్మాల వరదల్లో పిట్ల నర్సింహులు, ధ్యానబోయిన స్వామి, పిట్ల మహేశ్, పిట్ల స్వామి, జంగం స్వామి చిక్కుకుపోయారు. ఈ సమాచారం వచ్చిన వెంటనే బండి సంజయ్ కుమార్ సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాకు ఫోన్ చేసి పరిస్థితిని వాకబు చేశారు. వరదల్లో చిక్కుకున్నందున వారిని కాపాడే పరిస్థితి లేదని, ఆర్మీ హెలికాప్టర్ సాయం కావాలని, అట్లాగే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని రంగంలోకి దించాలని కోరడంతో సానుకూలంగా స్పందించిన బండి సంజయ్ వెంటనే కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు ఫోన్ చేసి ఆర్మీ హెలికాప్టర్లను పంపించాలని కోరారు. బండి విజ్ఞప్తికి అంగీకరించిన రాజ్ నాథ్ సింగ్ తక్షణమే ఆర్మీ హెలికాప్టర్లను పంపించాలని రక్షణ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన ఎయిర్ కమాండర్ వీఎస్.శైనీ, గ్రూప్ కెప్టెన్ హెచ్ సీ ఛటోపాధ్యాయ హకీంపేట నుండి హెలికాప్టర్లను పంపారు. అయితే కొద్దిదూరం వెళ్లిన 2 హెలికాప్టర్లు వాతావరణం అనుకూలించకపోవడంతో వెనుదిరిగాయి. మరునాడు ఆగస్ట్ 28న వర్షం కొంచెం తెరిపినివ్వడంతో హెలికాప్టర్లు వచ్చి బాధితులను ఎయిర్ లిఫ్ట్ చేశారు.
నర్మాల గ్రామస్థులతో పాటు అక్కడికి వచ్చిన జనమంతా బండి సంజయ్ ను ‘‘రియల్ హీరో’’ అంటూ అభివర్ణించారు. వారందరికీ అభివాదం చేస్తూ నర్మాల శివారులో పొంగి పొర్లుతున్న వరద ప్రవాహాన్ని వీక్షించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా బండి సంజయ్ సూచించారు. బండి సంజయ్ మాట్లాడుతూ ‘‘కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా లకు ధన్యవాదాలు. బాధితుల ప్రాణాలను కాపాడేందుకు నిన్నటి నుండి కష్టపడి పనిచేస్తున్న వారందరికీ ధన్యవాదాలు. ప్రత్యేకించి ఆర్మీ చాపర్లను తెచ్చి బాధితుల ప్రాణాలు కాపాడిన రక్షణ శాఖ అధికారులకు అభినందనలు. ప్రస్తుతమున్న రెండు హెలికాప్టర్లతో పాటు అదనంగా మరో రెండు హెలికాప్టర్లు సిరిసిల్లకు వచ్చాయి. వరద బాధిత ప్రాంతాల్లోని ప్రజలను ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నాయి.’’ అని తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ సిరిసిల్ల జిల్లా కలెక్టర్, ఎస్పీలను ప్రత్యేకంగా అభినందించారు. నర్మాలకు వచ్చిన కేంద్ర మంత్రిని జిల్లా కలెక్టర్, ఎస్పీ కలిసి పరిస్థితిని వివరిస్తూ తీసుకుంటున్న సహాయ చర్యలను వివరించారు.

