Dr Jitendra Singh

2035 నాటికి భారత్ సొంత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మిస్తుంది

Dr Jitendra Singhభారత అంతరిక్ష ఆకాంక్షలకు గగన్ యాన్ ఒక కీలక ఘట్టంగా మారనుందని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. మానవ అంతరిక్షయానం సామర్థ్యాలను పునరుద్ఘాటిస్తూ ఈ కార్యక్రమం భూమికి ఉపయోగపడే ఆవిష్కరణలతో శాస్త్రీయ పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేస్తుందని అన్నారు. 2035 నాటికి భారతీయ అంతరిక్ష స్టేషన్ పేరుతో భారత్ తన సొంత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయనుందన్నారు. అంతరిక్ష ప్రయోగాలు కక్ష్యలో ఉన్న వ్యోమగాములకు మాత్రమే పరిమితం కాదని, అవి భూమిపై ఉన్న ప్రజలకు ప్రయోజనాలను అందిస్తాయని పేర్కొన్నారు. ‘విశ్వగురు భారత్’ ఆలోచనను ముందుకు తీసుకెళ్తాయని స్పష్టం చేశారు. ఒక ఆంగ్ల వార పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అనేక అంశాలను ప్రస్తావించారు. అందులోని ముఖ్యాంశాలు చూద్దాం.

ప్ర: గగన్ యాన్ ఫలితాల్లో భారత్ అంతరిక్ష భవిష్యత్తును నిర్దేశించే కీలకమైన ఫలితం ఏమిటి?

జ: అంతరిక్ష రంగంలో భారత్ ప్రస్థానం ఇప్పటికే ప్రారంభమై ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. మనం ఇప్పుడు ఇతరులను అనుసరించే వాళ్ళం కాదు, అంతర్జాతీయ సహకారాలలో సమాన భాగస్వాములం. గగన్ యాన్ మిషన్ మరో కీలక ఘట్టానికి నాంది పలకనుంది. ఇది మానవ అంతరిక్షయానంలో భారతదేశ సామర్థ్యాలను పునరుద్ఘాటించడమే కాకుండా మన శాస్త్రీయ జ్ఞానాన్ని పెంచుతుంది. మైక్రోగ్రావిటీ (అంతరిక్షంలో భారరహిత స్థితి), వ్యవసాయం, జీవ శాస్త్రాలపై అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో వ్యోమగామి శుభాంశు శుక్లా చేసిన ప్రయోగాలతో పాటు భూమిపై ఉపయోగాలతో కూడిన అవగాహనను ఈ మిషన్ అందిస్తుంది. మౌలిక సదుపాయాలు, అభివృద్ధి, జీవన సౌలభ్యం కోసం అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూనే అంతరిక్ష అన్వేషణలో భారత్ ను అగ్రగామిగా నిలుపుతుంది.

ప్ర: శుక్లా వంటి యువ వ్యోమగాములు తయారవుతున్న నేపథ్యంలో మానవ అంతరిక్ష ప్రయాణాన్ని తీర్చిదిద్దడంలో యువత పాత్ర ఎంత కీలకం?

జ: అంతరిక్షం సహా ప్రతి రంగంలోనూ భారత్ భవిష్యత్తులో యువత పాత్ర అనివార్యం. మన జనాభాలో 70 శాతానికి పైగా 40 ఏళ్ల లోపు వారే కాబట్టి సహజంగానే వారు వికసిత్ భారత్ కు దిక్సూచిగా నిలుస్తున్నారు. అంతరిక్షంలో అవసరమైన శారీరక, మానసిక పరిస్థితుల కారణంగా యువతకు ఎక్కువ సానుకూలత ఉంది. ఉదాహరణకు, గగన్ యాన్ కోసం శిక్షణ పొందిన నలుగురు వ్యోమగాముల్లో శుభాన్షు చిన్నవాడు. అది చాలా అనుకూలమైన అంశం. పరిస్థితులకు వేగంగా అలవాటుపడగలగడం అంతరిక్ష యాత్రలకు అవసరం. దీనిని యువకులు మరింత సమర్థంగా నిర్వహించగలరు.

ప్ర: శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, మహిళా వ్యోమగాములకు గగన్ యాన్ అవకాశాలు పెంచుతుందని భావిస్తున్నారా?

జ: నిక్షేపంగా. అంతరిక్ష రంగంలో స్త్రీ, పురుషుల మధ్య వ్యత్యాసం లేదు. 2018 ఆగస్టు 15న ప్రధాని నరేంద్ర మోదీ గగన్ యాన్ ను ప్రకటించినప్పుడు భారత్ కా ఏక్ బేటా యా బేటీ అంతరిక్షంలోకి వెళతారని చెప్పారు. ప్రస్తుతం ఎంపికైన నలుగురు వ్యోమగాములు వైమానిక దళానికి చెందిన వారే కావడం యాదృచ్ఛికం. వారు అధునాతన శిక్షణ పొంది ఉండటం వారికి కలిసి వచ్చింది. కానీ భవిష్యత్తులో మహిళలతో సహా బయటి వారిని వ్యోమగాములుగా చూస్తాం. ప్రపంచవ్యాప్తంగా అంతరిక్ష పరిశోధనల్లో మహిళలు ముందంజలో ఉన్నారు. భారతదేశంలో కూడా అనేక ఇస్రో ప్రాజెక్టులకు మహిళా శాస్త్రవేత్తలు నాయకత్వం వహించారు, అది చంద్రయాన్, ఆదిత్య లేదా మరొకటి కావచ్చు.

ప్ర: అంతర్జాతీయ మానవ అంతరిక్ష యాత్రల్లో చేరడానికి లేదా సొంతంగా అంతరిక్ష కేంద్రం (స్పేస్ స్టేషన్) ఏర్పాటు చేయడానికి గగన్ యాన్ భారత్ కు మార్గం సుగమం చేస్తుందా?

జ: 2035 నాటికి భారతీయ అంతరిక్ష స్టేషన్ పేరుతో భారత్ తన సొంత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. దేశ భద్రతలో అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానం కీలక పాత్ర పోషించే ‘సుదర్శన సురక్షా చక్రం’ను ప్రధాని ప్రస్తావించారు. కాబట్టి, 2035 ఒక మైలురాయి సంవత్సరం…. ఆ తర్వాత ఐదేళ్ల అనంతరం చంద్రుడి ఉపరితలంపైకి మనుషులతో అంతరిక్ష నౌకలను పంపాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది.

ప్ర: సెమీకండక్టర్, కృత్రిమ మేధ (ఏఐ) టెక్నాలజీల్లో భారత్ పురోగతి సాధిస్తున్న నేపథ్యంలో సెమీకండక్టర్ కార్యక్రమాన్నీ భారతీయ అంతరిక్ష స్టేషన్ వంటి ప్రాజెక్టులకు ప్రభుత్వం ఎలా అనుసంధానం చేస్తోంది?

జ: సెమీకండక్టర్లు అంతరిక్ష యాత్రలతో సహా విస్తృత ఉపయోగాలను కలిగి ఉంటాయి. అదేవిధంగా చిన్న మాడ్యులర్ రియాక్టర్లు భూమిపై దుర్గమమైన ప్రాంతాలలో మాత్రమే కాకుండా దీర్ఘకాలిక అంతరిక్ష యాత్రలకు కూడా ముఖ్యమైనవి. స్పేస్ స్టేషన్ వంటి భవిష్యత్ ప్రాజెక్టులను కొనసాగించడానికి ఈ సాంకేతికతలు కీలకం కానున్నాయి.

ప్ర: చంద్రుడు లేదా అంగారక గ్రహంపైకి వెళ్లే సమయంలో భారతీయ వ్యోమగాములు ఎలాంటి ప్రయోగాలు చేయాలనుకుంటున్నారు?

జ: ఇటీవలి మిషన్ లో ప్రయోగాలను ఏడు రకాలుగా విభజించారు. ముఖ్యంగా జీవ శాస్త్రాలు ప్రధానమైనవి. ఉదాహరణకు, మయోజెనిసిస్ అధ్యయనం, అంటే మైక్రోగ్రావిటీ (భారరహిత స్థితి) లో కండరాల క్షీణత, పునరుత్పత్తి – క్యాన్సర్, డయాబెటిస్ లేదా భూమిపై విరిగిన ఎముకలు తిరిగి అతుక్కోవడం వంటి పరిస్థితులతో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉంది. మరొక బృందం ఎక్కువకాలం ఎలక్ట్రానిక్ తెరలు (టీవీ, కంప్యూటర్, సెల్ ఫోన్) చూడటం వల్ల మనుషుల గ్రాహక శక్తిపై కలిగే ప్రభావాలను అధ్యయనం చేసింది, ఇది నేటి డిజిటల్ యుగంలో చాలా ముఖ్యమైనది. మైక్రోగ్రావిటీలో మెంతికూర వంటి మొక్కలను పెంచడంపై కూడా మనం ప్రయోగాలు చేశాం, ఇది పునరుత్పత్తి జీవశాస్త్రం, జన్యుశాస్త్ర ఉపయోగాలలో పరిశోధనకు సహాయపడుతుంది. అంతరిక్ష ప్రయోగాలు కక్ష్యలో ఉన్న వ్యోమగాములకు మాత్రమే పరిమితం కాదని, అవి భూమిపై ఉన్న ప్రజలకు ప్రయోజనాలను అందిస్తాయని, ‘విశ్వగురు భారత్’ ఆలోచనను ముందుకు తీసుకెళ్తాయన్నది ఇక్కడ ముఖ్యమైన విషయం.

ప్ర: స్పాడెక్స్ (స్పేస్ డాకింగ్ ప్రయోగం) విజయవంతంగా పూర్తిచేసిన భారత్ అంతర్జాతీయ క్లయింట్ల కోసం స్పేస్ డాకింగ్, ఉపగ్రహ సర్వీసింగ్ ద్వారా నగదీకరణ (ఆదాయార్జన) ఎప్పుడు ప్రారంభిస్తుంది?

జ: మేం ఇప్పటికే స్పాడెక్స్ ద్వారా డాకింగ్, అన్ డాకింగ్ లో అనుభవాన్ని సంపాదించడం ప్రారంభించాం. 2028 నాటికి జరగబోయే చంద్రయాన్-4 మిషన్ లో సంక్లిష్టమైన డాకింగ్, అన్ డాకింగ్ విన్యాసాలు చేసే బహుళ మాడ్యూల్స్ ఉంటాయి. దీనివల్ల స్పేస్ స్టేషన్ వంటి పెద్ద ప్రాజెక్టులకు అవసరమైన నైపుణ్యం లభిస్తుంది. స్పేస్ టూరిజం అందుబాటులోకి వస్తే ప్రయాణికుల భద్రతకు డాకింగ్ టెక్నాలజీ కూడా కీలకం కానుంది. కాలక్రమేణా భారతదేశం ప్రపంచ క్లయింట్లకు డాకింగ్, సర్వీసింగ్, పర్యాటక మౌలిక సదుపాయాలను అందిస్తున్నందున నగదీకరణ కొనసాగుతుంది.

ప్ర: ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం ద్వారా ఐదేళ్లలో 52 గూఢచారి ఉపగ్రహాలను ప్రయోగించాలని భారత్ యోచిస్తోంది. ఇలాంటి భాగస్వామ్యం వల్ల జాతీయ భద్రతకు భంగం వాటిల్లకుండా ఎలా చూస్తారు?

జ: ఇప్పటికే రక్షణ చర్యలు చేపట్టారు. అంతరిక్షంలో ప్రభుత్వ- ప్రైవేటు భాగస్వామ్యాన్ని నియంత్రించే ఇన్-స్పాస్ (భారత జాతీయ అంతరిక్ష అభివృద్ధి, ధ్రువీకరణ కేంద్రం)ను ఏర్పాటు చేశాం. ఇది సహకారాల స్థాయి, స్వభావాన్ని నిర్ణయిస్తుంది, భద్రతకు సంబంధించి ఎటువంటి సమస్యలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది. అదే సమయంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించడం ద్వారా ఈ రంగాన్ని సరళీకరించాం. నియంత్రణలు, స్వేచ్ఛాయుత వాతావరణాల ఈ సమతుల్యత జాతీయ ప్రయోజనాలతో రాజీపడకుండా సృజనాత్మకతను ప్రోత్సహిస్తుంది.

ప్ర: 2033 నాటికి ప్రపంచ అంతరిక్ష మార్కెట్లో 8 శాతం వాటాను సొంతం చేసుకోవాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. ఉపగ్రహ ప్రయోగాలకు మించి (ఎలాన్ మస్క్ కు చెందిన) స్పేస్ఎక్స్, చైనాలతో పోటీపడటానికి భారతదేశానికి ఏ సాంకేతికతలు సహాయపడతాయి?

జ: రాకెట్లు, ప్రయోగాలపై ఎక్కువ దృష్టి పెట్టినా దాదాపు సగం అంతరిక్ష ఉపయోగాలు భూమిపైనే ఉన్నాయి. అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానం వ్యవసాయం, మౌలిక సదుపాయాలు, రక్షణ రంగంలో కూడా భాగమై పోయాయి. పీఎం గతి శక్తి పథకాన్నే తీసుకోండి. ఇది సమయం, డబ్బు, కాగితాల పనిని తగ్గించేందుకు ఉపగ్రహ చిత్రాలను ఉపయోగిస్తుంది. ఇది ఆర్థిక వృద్ధికి నేరుగా దోహదం చేస్తుంది. అదేవిధంగా విత్తనం, పంట సమయాన్ని నిర్ణయించడానికి ఉపగ్రహ సమాచారం రైతులకు సాయపడుతుంది. సంపద సృష్టి ఎంత విలువైనదో ఈ పొదుపు కూడా అంతే విలువైనది. అందుకే ప్రస్తుతం 8 బిలియన్ డాలర్లుగా ఉన్న భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ వచ్చే దశాబ్దంలో ఐదు రెట్లు పెరిగి 40-45 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ఆశిస్తున్నాం. 

ప్ర: భారత వ్యోమగాముల శిక్షణలో చేరడానికి వైమానిక దళ పైలట్లు మాత్రమే కాకుండా పౌరులను కూడా ప్రోత్సహిస్తారా?

జ: కచ్చితంగా. ప్రస్తుతం, అధిక ఎత్తులో తిరిగే జెట్లలో శిక్షణ కారణంగా వైమానిక దళ పైలట్లు బాగా సన్నద్ధమయ్యారు. కానీ ఇది ఆరంభం మాత్రమే. భవిష్యత్తులో వ్యోమగాములుగా శిక్షణ పొందేవారిలో పౌరులు, మహిళలు, బయోటెక్నాలజిస్టులు, అంతరిక్ష వైద్యులు, మీడియా నిపుణులు కూడా ఉంటారు. అంతరిక్ష రంగం విస్తరిస్తున్న కొద్దీ భారతదేశం తన భారీ లక్ష్యాలను సాధించేందుకు విస్తృతమైన, వైవిధ్యమైన వ్యోమగాముల సమూహాన్ని తయారు చేసుకోవాల్సి వస్తుంది.