మారిపోతున్న పట్టణ భారతం రూపురేఖలు
మనం మన నగరాల నుండి ఎక్కువ ఆశిస్తున్నప్పటికీ, మనం ఇప్పటికే ప్రయాణించిన దూరాన్ని గుర్తించడానికి కూడా మనం విరామం ఇవ్వాలి. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అనేక దశాబ్దాల పాటు భారతదేశ పట్టణ ప్రాంతాలపై పెద్దగా శ్రద్ధ పెట్టలేదు. సోవియట్ తరహా కేంద్రీకరణపై జవహర్ లాల్ నెహ్రూకు ఉన్న ఆకర్షణ మనకు శాస్త్రి భవన్, ఉద్యోగ్ భవన్ వంటి వాటిని ఇచ్చింది. 1990ల నాటికే అవి శిథిలావస్థకు చేరుకున్నాయి. సేవ కంటే అధికార యంత్రాంగానికి ఇచ్చిన ప్రాధాన్యానికి అవి చిహ్నాలు. 2010ల నాటికి సెంట్రల్ దిల్లీ ఒక నిరాశాజనక దృశ్యాన్ని మన ముందు ఉంచింది: గుంతలతో నిండిన రోడ్లు, పాడుబడిన, చెమ్మతో నిండిపోయిన ప్రభుత్వ భవనాలు, నిత్యం రద్దీగా ఉండే జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్) వలయ రహదారులు. ఎక్స్‌ప్రెస్ వేలు చాలా తక్కువగా ఉండేవి, మెట్రోలు కొన్ని నగరాలకే పరిమితమయ్యాయి. పౌర మౌలిక సదుపాయాలు క్షీణించాయి. ప్రపంచ నాయకత్వాన్ని కోరుకునే దేశానికి రాజధాని అయిన నగరం అప్పటి పాలకుల నిర్లక్ష్యాన్ని ప్రతిబింబించింది.
ప్రధాని నరేంద్ర మోదీ ఆ పథాన్ని మార్చారు. ఆయన నగరాలను జాతీయ అభివృద్ధి ఎజెండాకు గుండెకాయగా చేశారు. వాటిని మోయాల్సిన భారంగా కాకుండా వృద్ధి ఇంజిన్లుగా, గర్వించదగిన చిహ్నాలుగా పరిగణించారు. పరివర్తన ప్రతిచోటా కనిపిస్తోంది. సెంట్రల్ విస్టా పునరాభివృద్ధి కర్తవ్య పథ్‌ను ప్రజల ప్రదేశంగా, కొత్త పార్లమెంటు భవనాన్ని భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న సంస్థగా, కర్తవ్య భవన్‌ను గాడిలో పెట్టిన పాలనకు కేంద్రంగా మార్చింది. ఒకప్పుడు నిరాశా నిస్పృహలకు నిలయమైన ప్రదేశాలు ఇప్పుడు ఆకాంక్షలకు, ఆత్మవిశ్వాసానికి కేంద్రాలుగా మారాయి. ఈ మార్పు స్థాయిని గణాంకాలు వెల్లడిస్తాయి. 2004, 2014 మధ్య, భారతదేశ పట్టణ రంగంలో సంచిత కేంద్ర పెట్టుబడి సుమారు 1.57 లక్షల కోట్ల రూపాయలు. 2014 నుంచి ఆ సంఖ్య దాదాపు రూ.28.5 లక్షల కోట్లకు అంటే ఇది 16 రెట్లు పెరిగింది. ఈ అపూర్వమైన ఆర్థిక నిబద్ధత భారతదేశం ఇంతకు ముందెన్నడూ చూడని వేగంతో పట్టణ ప్రాంతాలను పునర్నిర్మిస్తోంది.
భారత్ విస్తృత ఆర్థిక, డిజిటల్ వృద్ధి పట్టణాల అభివృద్ధికి చోదకశక్తిగా పనిచేస్తోంది. నేడు మనం సుమారు 4.2 లక్షల కోట్ల డాలర్లతో ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నాం. దైనందిన జీవితంలో డిజిటల్ లావాదేవీలు భాగంగా మారాయి. మెట్రో విప్లవం క్షేత్రస్థాయిలో వచ్చిన పరివర్తనను వివరిస్తుంది. 2014లో దేశంలోని ఐదు నగరాల్లో సుమారు 248 కిలోమీటర్ల మెట్రో రైలు వ్యవస్థ ఉండగా నేడు 1,000 కిలోమీటర్లకు పైగా 23 నగరాలకు పైగా విస్తరించి ఉంది. రోజుకు కోటి మందికి పైగా ప్రజలు మెట్రో రైళ్లలో ప్రయాణిస్తున్నారు. పుణె, నాగపూర్ నుంచి సూరత్, ఆగ్రా వరకు డజన్ల కొద్దీ కొత్త కారిడార్లు నిర్మాణంలో ఉన్నాయి. ఇవి పట్టణ ప్రయాణాలను వేగంగా, పరిశుభ్రంగా, సురక్షితంగా చేస్తాయి. ఇది కేవలం ఉక్కు, కాంక్రీట్ మాత్రమే కాదు; ఇది తగ్గిన ప్రయాణ సమయం, స్వచ్ఛమైన గాలి, లక్షల గంటల ఉత్పాదకత కూడా. పట్టణ ప్రాంతాల్లో అనుసంధానత విప్లవాత్మక మార్పులకు గురవుతోంది. ఎన్.హెచ్-44, ఎన్.హెచ్-9, ద్వారకా ఎక్స్‌ప్రెస్ వేలను కలుపుతూ కొత్తగా ప్రారంభించిన అర్బన్ ఎక్స్ టెన్షన్ రోడ్డు II ద్వారా విపరీతమైన రద్దీగా ఉండే ఎన్సీఆర్ (జాతీయ రాజధాని ప్రాంతం) వలయ రహదారుల్లో రద్దీని తగ్గిస్తున్నారు. భారతదేశపు మొట్టమొదటి ప్రాంతీయ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (దిల్లీ-మీరట్) ఇప్పటికే ప్రధాన విభాగాలలో నడుస్తోంది, ఇది త్వరలో పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. అప్పుడు మొదటి నుంచి చివరి వరకు ప్రయాణాన్ని ఒక గంటలోపే పూర్తి చేయవచ్చు. ఈ హై-స్పీడ్, సమీకృత వ్యవస్థలు నవభారతం మహానగరాల రూపురేఖలకు చిహ్నాలుగా నిలుస్తున్నాయి.
ఎక్స్‌ప్రెస్ వేలు నగరాల మధ్య రాకపోకల తీరుతెన్నులను మార్చివేశాయి. దిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్ వే, బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్ వే, దిల్లీ-మీరట్ యాక్సెస్-కంట్రోల్డ్ కారిడార్, ముంబై కోస్టల్ రోడ్ సుదూర ప్రయాణాలకు వెళ్ళే భారీ వాహనాలను జనసమ్మర్ధ ప్రాంతాలకు దూరంగా మళ్లించడం ద్వారా దూరాలను తగ్గించడమే కాకుండా గాలిని శుభ్రపరుస్తున్నాయి. దేశంలోనే అతి పొడవైన సముద్ర వంతెన ముంబైలోని అటల్ సేతు ఇప్పుడు ద్వీప నగరాన్ని ప్రధాన భూభాగానికి సజావుగా కలుపుతుంది. భారతదేశపు మొట్టమొదటి బుల్లెట్ రైలు కారిడార్ అయిన ముంబై-అహ్మదాబాద్ హై-స్పీడ్ రైలు పశ్చిమ ప్రాంతంలో వృద్ధికి వెన్నెముక అవుతుంది.
సమ్మిళితత్వం కేంద్రబిందువు
పీఎం స్వనిధి 68 లక్షల మందికి పైగా వీధి వ్యాపారులకు పూచీకత్తు లేని రుణాలను, డిజిటల్ సాధికారతను విస్తరించి చిన్న వ్యాపారుల జీవనోపాధిని పునర్నిర్మించడానికి, అధికారిక ఆర్థిక వ్యవస్థలోకి ప్రవేశించడానికి సహాయపడుతోంది. పీఎం ఆవాస్ యోజన (అర్బన్) కింద 120 లక్షలకు పైగా ఇళ్లను మంజూరు చేసి ఇప్పటికే 94 లక్షల ఇళ్లు పూర్తిచేశారు. ఒకప్పుడు మురికివాడలకే పరిమితమైన లక్షల కుటుంబాలు ఇప్పుడు సురక్షితమైన పక్కా ఇళ్లలో నివసిస్తున్నాయి. ఇవి కేవలం గణాంకాలు మాత్రమే కాదు; అవి మారిన జీవితాలు, రెక్కలు తొడిగిన ఆశలు.
ఇంధన రంగంలో సంస్కరణలు రోజువారీ పట్టణ జీవితాన్ని మెరుగుపరుస్తోంది. పైపుల ద్వారా సహజవాయువు (పీఎన్జీ) అనేది అత్యంత నాణ్యమైనది, సురక్షితమైనది, శుభ్రమైనది, సౌకర్యవంతమైనది. సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ 2014లో కేవలం 57 భౌగోళిక ప్రాంతాల నుంచి నేడు 300కి పైగా ప్రాంతాలకు విస్తరించింది. దేశీయ పీఎన్జీ కనెక్షన్లు సుమారు 25 లక్షల నుంచి 1.5 కోట్లకు పెరిగాయి. వేలాది సీఎన్జీ స్టేషన్లు పరిశుభ్రమైన ప్రజా రవాణాకు ఇంధనాన్ని ఇస్తున్నాయి. ఇంధనం కోసం ట్యాప్ తిప్పడం ఇప్పుడు లక్షలాది పట్టణ గృహాలలో జరుగుతోంది.
ప్రపంచానికి ఆతిథ్యం ఇచ్చే ఆత్మవిశ్వాసాన్ని భారతదేశం పెంపొందించుకుంది. భారత మండపం జీ-20 నాయకుల శిఖరాగ్ర సదస్సును విజయవంతంగా నిర్వహించింది. యశోభూమి ప్రపంచంలో అతి పెద్ద సమావేశ మందిరంగా అవతరించింది. భారత ఇంధన వారోత్సవాలు ప్రపంచ ఇంధన పర్యావరణ వ్యవస్థను బెంగళూరు, గోవా, న్యూదిల్లీలకు రప్పించింది. శిథిలావస్థలో ఉన్న హాళ్లు, కూలిపోతున్న స్టేడియంలు ఒకప్పుడు మన పౌర మౌలిక సదుపాయాలకు చిహ్నాలుగా ఉండేవి. ఇప్పుడు అవి గతం.
రవాణా ఆధునికీకరణ పెద్దయెత్తున, వేగంగా జరుగుతోంది. 2014లో ఉన్న 74 విమానాశ్రయాలు రెట్టింపై నేడు 160కి చేరుకున్నాయి. వందేభారత్ ప్రస్తుతం 140కి పైగా సర్వీసులతో నడుస్తోంది. దీంతో ప్రయాణ కాలం తగ్గిపోతుంది. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద 1,300కు పైగా రైల్వేస్టేషన్లను ఆధునికీకరిస్తున్నారు. వీటిలో ఇప్పటికే వందకు పైగా రైల్వే స్టేషన్లు ప్రారంభమయ్యాయి. దిల్లీలో విస్తరించిన టెర్మినల్-1 ఇందిరా గాంధీ విమానాశ్రయ సామర్థ్యాన్ని సంవత్సరానికి పదికోట్ల ప్రయాణీకులను దాటింది, ఇది మన జాతీయ రాజధానిని అంతర్జాతీయ స్థాయికి చేర్చింది.
సహేతుకమైన పన్ను విధానం అటు వినియోగదారులకు ఊరటనిస్తూ ఇటు వృద్ధికి ప్రేరణనిస్తోంది. ఇటీవలి జీఎస్టీ హేతుబద్ధీకరణ చాలా వస్తువులను, సేవలను 5%, 18% తరగతులకు మార్చింది. పొగాకు ఉత్పత్తులు, లగ్జరీ వస్తువులకు మాత్రమే అత్యున్నత స్లాబ్ పన్ను వర్తిస్తుంది. దీనివల్ల పట్టణ ప్రజలకు నెలవారీ బిల్లుల భారం తగ్గి వినియోగం, పెట్టుబడి పెరిగి ఉద్యోగాల కల్పన పెరుగుతుంది. దౌత్యవేత్తగా దశాబ్దాలుగా విదేశాలలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన నేను నగరాలు ఒక దేశానికి ముఖంగా ఎలా పనిచేస్తాయో ప్రత్యక్షంగా చూశాను. వియన్నా రింగ్ స్ట్రాస్స్, న్యూయార్క్ ఆకాశ హర్మ్యాలు లేదా పారిస్ కూడళ్లు అన్నీ జాతీయ ఆకాంక్షలకు దర్పణం పడతాయి. ప్రపంచం మనల్ని ఎలా చూస్తుందన్నది పట్టణ ప్రదేశాలను బట్టే ఉంటుందని నాకు స్పష్టమైంది. ఈ నమ్మకంతోనే నేను దిల్లీ, ముంబయి, బెంగళూరు, అహ్మదాబాద్, మన ఇతర నగరాలు అభివృద్ధి చెందుతున్న భారతదేశపు విశ్వాసం, ఆధునికత, కాంక్షలను ప్రతిబింబించేలా చూసేందుకు కృషి చేశాను. దౌత్యవేత్తగా నా ఉద్యోగం అంతర్జాతీయంగా భారతదేశ ప్రతిష్టను ప్రదర్శించడం నేర్పింది. అలాగే మన నగరాలను ఆ ప్రతిష్టకు ప్రతీకలుగా మార్చడం మంత్రిగా నా బాధ్యత.
భారతదేశంలోని పురాతన నగరాలు ఒకప్పుడు పట్టణ నాగరికతకు సమున్నత ప్రమాణాలుగా నిలిచాయి. నేడు ప్రధాని మోదీ హయాంలో భారతీయ నగరాలు ఆధునికతకు, మానవీయతకు, ప్రజల ఆకాంక్షలకు, సమ్మిళితత్వానికి చిహ్నాలుగా మారుతున్నాయి. ఇటుకపై ఇటుకతో, రైలు తర్వాత రైలుతో, ఇంటి తరువాత ఇంటితో కొత్త పట్టణ భారతం ప్రతిరోజూ నిర్మితమవుతోంది. ఇది ఇప్పటికే కోట్ల మంది మంది జీవితాలను మారుస్తోంది.
హర్దీప్ సింగ్ పూరి,
కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రి

