India Post

ఆర్థిక సమ్మిళితత్వాన్ని బట్వాడా చేస్తున్న భారత తపాలా వ్యవస్థ

నిరంతర పరిణామం ద్వారానే వృద్ధి సాధ్యమని భారత తపాలా వ్యవస్థ నిరూపిస్తోంది. లక్షా 60 వేలకు పైగా పోస్టాఫీసుల నెట్‌వర్క్‌తో పోస్టల్ శాఖ తన వృద్ధి గాథను తిరగరాస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద లాజిస్టిక్స్ వ్యవస్థగా మారే దిశలో సాగుతున్న ప్రయాణానికి ఇది నాంది పలుకుతుంది. ఆర్థిక స్వాతంత్ర్యం, సాధికారత, అవకాశాలను దేశవ్యాప్తంగా అందించడమే ఈ ప్రయాణానికి గమ్యం. నిన్నటి పోస్ట్‌మ్యాన్ ఇప్పుడు ప్రతి ఇంటి గడపకూ ఆర్థిక సౌలభ్యం, గౌరవం అనే వాగ్దానాన్ని తీసుకువస్తున్నాడు.

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో గ్రామీణ భారతదేశానికి సాధికారత కల్పించాలనే లక్ష్యంతో, ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబి) గ్రామీణ ఖాతాలన్నింటినీ డిజిటలైజ్ చేసి, నిశ్శబ్దంగా ఈ విషయంలో జాతీయస్థాయిలో అగ్రగామిగా నిలిచింది. సాంకేతికతను అనుసంధానించడం, పెద్ద సంఖ్యలో ప్రజలను ఆర్థిక కార్యకలాపాలలో భాగస్వాములను చేయడం, సేవలను వైవిధ్యపరచడం ద్వారా ఐపీపీబీ పోస్టాఫీసులను సమగ్ర ఆర్థిక కేంద్రాలుగా మారుస్తోంది. వేగంగా మారుతున్న ప్రపంచంలో పాతకాలపు సంస్థలు కూడా ఎలా ఆధునికం కాగలవో ఇది నిరూపిస్తోంది.

ఎనిమిదేళ్ల క్రితం ఐపీపీబీని స్థాపించడం వెనుక ఒక లక్ష్యం ఉంది. భౌగోళిక ప్రాంతం, స్త్రీ పురుష భేదం లేదా పరిస్థితులతో సంబంధం లేకుండా ఏ భారతీయుడూ అధికారిక ఆర్థిక వ్యవస్థ నుండి దూరంగా ఉండకూడదు. ఖాతాలు తెరవడమే కాకుండా, ఖాతాదారులకు అవకాశాలు, సాధికారతను అందించడమే ఈ బ్యాంకు లక్ష్యం. ఈ రోజు ఐపీపీబీ 12 కోట్ల మంది ఖాతాదారులకు సేవలు అందిస్తోంది. వీరిలో దాదాపు 80 శాతం మంది గ్రామీణ ప్రాంతాలకు చెందినవారు. ఈ ఖాతాల్లో 59 శాతం మహిళలవి కావడం ఆర్థిక సమ్మిళితత్వం ద్వారా స్త్రీపురుష సమానత్వంలో నిశ్శబ్ద విప్లవానికి నిదర్శనం. ఈ మార్పు వేగం చాలా అద్భుతంగా ఉంది. ప్రతి రెండు సెకన్లకు ఒక కొత్త వ్యక్తి ఈ ప్రయాణంలో చేరతారు. ఇది ఒక కొలవడానికి వీలైన అభివృద్ధి. ఇక్కడ బ్యాంకింగ్ ఒక క్రమపద్ధతిలో ప్రజాస్వామ్యం చేయబడుతూ దేశ సామాజిక ఆర్థిక జీవనంలో అంతర్భాగం అవుతోంది.

ఐపీపీబీ పనితీరు అసాధారణం. డిపాజిట్లు ఇప్పుడు రూ.20,000 కోట్లకు చేరువలో ఉన్నాయి. ఆదాయమే రూ.2,200 కోట్లకు పెరిగింది. లాభాలు రూ.134 కోట్లు. రూ.13 లక్షల కోట్ల విలువైన డిజిటల్ లావాదేవీలు జరిగాయి. తక్షణ (రియల్ టైం) డిజిటల్ చెల్లింపులలో భారతదేశం ప్రపంచంలోనే మొదటి స్థానం సంపాదించేందుకు ఇది దోహదం చేస్తోంది. దేశంలోనే అతిపెద్ద ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) వ్యవస్థను కూడా ఐపీపీబీ సులభతరం చేస్తోంది. తద్వారా సబ్సిడీలు, వేతనాలు, పెన్షన్లు పౌరులకు తక్షణమే, పారదర్శకంగా అందేలా చూస్తోంది. గ్రామీణ భారతదేశాన్ని డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో అనుసంధానించడం ద్వారా ఇది జాతీయ ఆర్థిక సాధికారతకు ఒక చోదక శక్తిగా మారింది. ముఖ్యంగా, ఆర్థిక సమ్మిళితత్వం ద్వారా ఈశాన్య ప్రాంతంలో ప్రధాని మోదీ ‘తూర్పు ప్రాంతంపై ప్రత్యేక దృష్టి’ (యాక్ట్ ఈస్ట్) దార్శనికత సాకారం అవుతోంది. ఐపీపీబీ ప్రారంభించినప్పటి నుంచి ఈశాన్య రాష్ట్రాల్లో 51 లక్షలకు పైగా ఖాతాలు తెరిచారు. 8,500 మంది పోస్ట్‌మెన్‌లు, గ్రామీణ్ డాక్ సేవక్‌లు (జీడీఎస్) అడవుల గుండా, నదుల గుండా మైళ్ల దూరం నడిచి, ఒకప్పుడు బ్యాంకు శాఖకు వెళ్లడానికి ఒక రోజంతా పట్టే గ్రామాలకు చేరుకొని సేవలు అందిస్తున్నారు.

 అస్సాం, మేఘాలయల్లో మహిళల నేతృత్వంలోని స్వయం సహాయక బృందాలు క్యూఆర్ కోడ్ చెల్లింపులను స్వీకరిస్తున్నాయి. తద్వారా వారి చిన్న వ్యాపారాలను పెరుగుతున్న సంస్థలుగా మారుస్తున్నాయి. అరుణాచల్ ప్రదేశ్‌లో సబ్సిడీలు, పెన్షన్లు పారదర్శకంగా, గౌరవంగా నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు చేరుతున్నాయి. ఇలా ప్రతి పనిలో ఐపీపీబీ ఈశాన్య ప్రాంతాన్ని భారతదేశ విస్తృత ఆర్థిక ప్రధాన స్రవంతితో బలంగా అనుసంధానిస్తోంది.

ఐపీపీబీ సేవలు మనుషుల ప్రమేయం లేకుండా జరగడం లేదు. ప్రతి సేవ ఆధార్ ఆధారితమైనది, కాగితాలతో పని లేనిది. అయితే ఈ సేవలను ప్రజలకు అత్యంత నమ్మకమైన పోస్ట్‌మ్యాన్, మహిళలు అందిస్తున్నారు. ఆర్థిక గౌరవంతో పాటు, ప్రతి రూపాయి, ప్రతి సబ్సిడీ, ప్రతి పెన్షన్ సురక్షితంగా, జవాబుదారీగా, వినియోగదారులకు అందేందుకు వారు భరోసా ఇస్తున్నారు. ఇప్పటికే 100 కోట్ల సేవలు ప్రజలకు వారి ఇళ్ళ వద్దే అందాయి. ఇవన్నీ సాధికారతకు సంబంధించిన చిన్న చిన్న గాధలు. అయితే ఇవన్నీ ఐపీపీబీని ప్రపంచంలోనే అతిపెద్ద డోర్‌స్టెప్ బ్యాంకింగ్ (ఇంటి వద్ద బ్యాంకింగ్ సేవలు అందించే) నెట్‌వర్క్‌గా మార్చడానికి దోహదం చేస్తున్నాయి. ఒక విధంగా ఐపీపీబీ గ్రామీణ్ డాక్ సేవక్‌లను ఆర్థిక సమ్మిళితత్వానికి సంరక్షకులుగా మార్చింది. ఈ బ్యాంకు డిజిటల్ వాగ్దానాన్ని వాస్తవమైనదిగా, మానవీయంగా చేసింది. ఐపీపీబీ ఎనిమిదవ సంవత్సరంలోకి అడుగుపెట్టిన ఈ నేపథ్యంలో మనం సంబరాలు చేసుకోవాల్సింది ఒక సంస్థ ఆవిర్భావం గురించి మాత్రమే కాదు, పూర్వపు తపాలా నెట్‌వర్క్ అందించిన నమ్మకం, సేవ, పట్టుదలను కూడా మనం గుర్తుంచుకోవాలి. ఈ కథనం ఇంకా భారతదేశంలోని గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో రచించబడుతూనే ఉంది. ఇది భారతదేశ విప్లవం. ప్రతి పోస్ట్‌మ్యాన్, పోస్ట్‌వుమన్‌ల తమ స్వహస్తాలతో దీనిని కొనసాగిస్తున్నారు.

జ్యోతిరాదిత్య సింధియా,
కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి