హైదరాబాద్‌లో కుప్పకూలిన రియల్‌ఎస్టేట్
తెలంగాణను దేశంలోని సంపన్న రాష్ట్రాలలో ఒకటిగా నిలబెట్టింది హైదరాబాద్ నగరం. పలు ప్రసిద్ధి చెందిన జాతీయ స్థాయి విద్య, పరిశోధన, రక్షణ సంస్థలకు కేంద్రంగా ఉండడంతో పాటు ఫార్మా, ఐటీ తదితర రంగాలలో అంతర్జాతీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. విద్య, వైద్య రంగాలలో సైతం ఖండాంతర కీర్తి సంపాదించుకుంది. ముఖ్యంగా హైదరాబాద్ అనగానే రియల్ ఎస్టేట్ రంగం గుర్తుకొస్తుంది. హైదరాబాద్ అభివృద్ధికి ప్రబలమైన నిదర్శనంగా ఈ రంగం నిత్యం వృద్ధి చెందుతూ ఉండటం వెల్లడిస్తుంది. కరోనా మహమ్మారి సమయంలో ముంబై, దిల్లీ, బెంగళూరు వంటి నగరాలతో పాటు దేశమంతా రియల్ ఎస్టేట్ రంగం డీలా పడిన సమయంలోనూ హైదరాబాద్‌లో వృద్ధి రేటు ఆశాజనకంగా ఉంటూ వచ్చింది. హైదరాబాద్ అనగానే ‘మినీ భారత్’గా పేరు పొందింది. దేశంలోని అన్ని ప్రాంతాలకు చెందిన ప్రజలకు విద్య, వైద్య, వాణిజ్య, ఉద్యోగ సదుపాయాలకు కేంద్రంగా హైదరాబాద్ నిలిచింది. అటువంటి హైదరాబాద్‌లో గత కొంతకాలంగా రియల్ ఎస్టేట్ రంగం స్తంభించడం, కొత్త నిర్మాణాలకు తగిన డిమాండ్ కొరవడుతూ ఉండడంతో మొత్తం హైదరాబాద్ ప్రజల ఆర్థిక ప్రమాణాలు సన్నగిల్లుతూ ఉండడాన్ని వెల్లడిస్తుంది.
ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రంగం పెను సవాళ్లు ఎదుర్కొంటున్నది. రియాల్టీలో సంక్షోభ పరిస్థితులు రావడానికి కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డి విధానాలే ప్రధాన కారణమని ఈ రంగంలోని ప్రముఖులు వాపోతున్నారు. ఇప్పటికీ మార్కెట్ పుంజుకునే అవకాశం ఉన్నా అడ్డగోలు కూల్చివేతలు, నిర్మాణ అనుమతులపై అజమాయిషీ, పెద్దల పేరిట సొమ్ము చేసుకుంటున్న అవినీతి అధికారుల పనితీరే సిటీ రియాల్టీకి ప్రధాన సమస్యగా మారుతున్నాయని వారు హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్ మహానగరంలో భూముల వేలం అంటే అంచనాలకు మించిన పోటీ ఉండటం, రికార్డు ధరలు పలకడం, లెక్కకు మించిన ఆదాయం లభించడం చూసాం. ఎకరం రూ.100 కోట్లు పలికిన ఇదే రాజధానిలో ఇప్పుడు చదరపు గజానికి రూ.2 వేలు పెరగడమే గగనంగా మారింది. వంద ప్లాట్లను వేలానికి పెడితే 3 ప్లాట్లు అమ్మేందుకే ముప్పుతిప్పలు పడే పరిస్థితి ఏర్పడిందని ఈ రంగంలోని ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌లో అట్టడుగుకు చేరిన రియల్ ఎస్టేట్ ట్రెండ్‌కు ఇది ప్రత్యక్ష ఉదాహరణ. ఈ రంగంలో విదేశీ పెట్టుబడులను సైతం ఆకర్షిస్తూ, నిర్మాణ రంగంలో దేశంలోని అన్ని మెట్రో నగరాలకు గట్టి పోటీనిచ్చి, భారీ స్థాయిలో అమ్మకాలతో పేరొందిన హైదరాబాద్‌లో ఇప్పుడు పరిస్థితులు తారుమారు అవుతున్నాయి.
పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా ప్రభుత్వం మౌలిక వసతులపై దృష్టి పెడుతున్న దాఖలాలు లేవు. పైగా, కాంగ్రెస్ అధికారంలోకి రావడంతోనే కూల్చివేతలకు దిగింది. ప్రభుత్వ భూముల ఆక్రమణల పేరిట పేదల ఇండ్లను నేలమట్టం చేస్తోంది. అనుమతులు ఉన్నా రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులను కూడా భయభ్రాంతులకు గురిచేసింది. మూసీ ప్రక్షాళన పేరిట బఫర్ జోన్‌ను నిర్ధారించి, దశాబ్దాల కిందటి ఇండ్లను అక్రమ నిర్మాణాలంటూ ఏకంగా నోటీసులనే జారీచేసింది. గడిచిన 20 నెలల్లో నగరంలోని రియల్ ఎస్టేట్ రంగాన్ని కాంగ్రెస్ సర్కార్ ముప్పుతిప్పులు పెట్టింది. రిజిస్ట్రేషన్ ఆదాయంతోపాటు, భవన నిర్మాణ అనుమతులూ నిలిచిపోయాయి. ఇటీవల హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో జరిగిన భూముల వేలంలో ఈ విషయం తేలిపోయింది. మూడు ప్లాట్లు అమ్మడానికి రూ.కోట్లు ఖర్చు చేస్తే కనీసం నిర్వహణ ఖర్చుల మేర కూడా పెరగలేదు. గతంలో కోకాపేట నియోపోలిస్‌లో ఒక్క ఎకరం రూ.100 కోట్లకు హెచ్‌ఎండీఏనే విక్రయించింది. ఇప్పుడు మూడు జిల్లాల పరిధిలో అభివృద్ధి చేసిన వెంచర్లలో 100 ప్లాట్లను వేలానికి పెడితే మూడింటినే విక్రయించింది. ఇందులో రెండు తుర్కంయాంజల్, ఒకటి పుప్పాలగూడ ల్యాండ్ పార్సిల్ ఉండగా, వీటి ద్వారా వచ్చిన ఆదాయం కూడా రూ.50 కోట్లు దాటలేదు. రంగారెడ్డి జిల్లా పరిధిలో గండిపేట, శేరిలింగంపల్లి మండలాల పరిధిలోని పుప్పాలగూడ, చందానగర్, బైరాగిగూడ, కోకాపేటలో సగటున అర ఎకరం ఉండే ప్లాట్లను విక్రయానికి పెట్టింది. ఇందులో ఏ ఒక్క ప్లాట్ అమ్ముడుపోలేదు. పుప్పాలగూడలోని 1,630 గజాల బిట్టుకు ఇద్దరు పోటీ పడితే నిర్ధారించిన ధర కంటే గజానికి రూ.2వేలు పెరిగింది. హైదరాబాద్ ముఖ్యంగా హెచ్‌ఎండీఏ పరిధిలో కొందరు ఉన్నతాధికారులు వసూళ్లే ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకుని అనుమతుల ప్రక్రియను శాసిస్తున్నారు. దీనికితోడు ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి, వేధింపు చర్యలు భూముల వేలానికి ఆదరణ లేకుండా చేసిందనే అభిప్రాయం కలుగుతుంది.
ప్రవీణ్

