Dharmendra Pradhan

ప్రజలకు సేవ చేయడమే బిజెపి విజయ రహస్యం

Dharmendra Pradhanప్రజలకు సేవ చేయడం, వారి విషయంలో బాధ్యత తీసుకోవడమే బిజెపి విజయ రహస్యమని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు. 12 ఏళ్లుగా దేశాన్ని నడిపిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పట్ల రాహుల్ గాంధీ చూపిస్తున్న అసహనం, ద్వేషమే అసలు సమస్య అని, ఆయన ఓటమి చేదు జ్ఞాపకాలతో కల్పిత కథలు చెబుతూ గందరగోళం సృష్టిస్తున్నారని ఆరోపించారు. మారుతన్న సమాజ పరిణామాలకు అనుగుణంగా పాఠ్యప్రణాళికను నవీకరించే బాధ్యత ఎన్సీఈఆర్టీపై ఉంటుందని, ప్రతి సంవత్సరం కొత్త అంశాలతో దీనిని సవరించాలన్నారు. మనం బాబ్రీ మసీదు గురించి గర్వపడాలా లేక దేవాలయాలను కూల్చి సంస్కృతిని దెబ్బతీసిన ఔరంగజేబు, బాబర్ గురించి గర్వపడాలా? అని ప్రశ్నించారు. 2047 నాటికి మనం అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా ఎదగాలంటే, జ్ఞానం, పరిశోధనలపై దృష్టి సారించాలన్నారు. అటల్ ఇన్నోవేషన్ మిషన్ నుంచి జాతీయ పరిశోధనా సంస్థ (నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్) వరకు సమగ్ర వ్యవస్థను నిర్మిస్తున్నామన్నారు. ఇంగ్లీష్ వాడకంపై ఎలాంటి అభ్యంతరం లేదని, ఎవరైనా దానిని ఎంచుకోవచ్చని, కానీ అది ఎప్పుడూ భారత్ భాష కాలేదన్నారు. నేడు సమాచారం సెకన్లలో అందుతోంది కాబట్టి విద్యార్థి ఉద్యమాల తీరు కూడా మారిందన్నారు. ఒక జాతీయ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ధర్మేంద్ర ప్రధాన్ విద్యార్థి రాజకీయాల్లో వస్తున్న మార్పులు, ఏఐ సాంకేతికతకు అనుగుణంగా రూపొందించిన జాతీయ విద్యావిధానం 2020 (ఎన్ఈపి), బిజెపి ఎన్నికల వ్యూహాలు వంటి పలు కీలక అంశాలపై మాట్లాడారు. ఆ ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు:

ప్ర: మీరు ఏబీవీపీ ద్వారా విద్యార్థి రాజకీయాల్లో ప్రవేశించి కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగారు. కానీ నేటి ఏబీవీపీ మీ కాలం నాటి పరిస్థితులకు భిన్నంగా ఉంది. ఒకప్పుడు క్యాంపస్‌లలో వామపక్షాలకు ఉన్నట్లే, ఇప్పుడు ఏబీవీపీకి ‘వీటో’ అధికారం ఉన్నట్లు కనిపిస్తోంది. సెమినార్లకు ఎవరిని ఆహ్వానించాలి, వేటి గురించి చర్చించాలి, చివరికి వైస్-ఛాన్సలర్ల నియామకాల్లోనూ వారిదే పైచేయిగా ఉంటోంది. విద్యార్థి రాజకీయాలను ఇప్పుడు అనుమానంతో చూస్తున్నారు. ఏబీవీపీ లేని వారు తమ నిరపరాధిత్వాన్ని నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఉందా?

జ: ఏబీవీపీ విభిన్న భావజాలాలతో కూడిన, స్ఫూర్తి ఇచ్చే ఒక ‘ఓపెన్ యూనివర్సిటీ’ వంటిది. తరాలు, సామాజిక పరిస్థితులు మారినా, ‘దేశమే ప్రథమం’ అనే మౌలిక ఆశయమే నేటికీ మమ్మల్ని ఏబీవీపీలో మమేకం చేస్తోంది. ఇక పాలన విషయానికి వస్తే, ‘వీటో అధికారం’ అనేది కేవలం జర్నలిస్టుల అభిప్రాయం మాత్రమే; వాస్తవానికి ప్రతిదీ ఒక అధికారిక ప్రక్రియ ప్రకారమే జరుగుతుంది. దివంగత అరుణ్ జైట్లీ నుంచి నేటి దిల్లీ ముఖ్యమంత్రి, విద్యా మంత్రి వరకు ఎందరో నాయకులు ఏబీవీపీ నుంచే వచ్చారు. ఏబీవీపీ ఒక ఉద్యమం, కానీ పాలన అనేది అధికారంలో ఉన్నవారి బాధ్యత. అది ప్రజాస్వామ్య ప్రక్రియతో ముడిపడి ఉంటుంది. ప్రతి ఒక్కరికీ తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే హక్కు ఉన్నప్పటికీ, విద్యాసంస్థల ప్రాంగణాలు సంకుచిత రాజకీయ అజెండాలకు లేదా దేశాన్ని విచ్ఛిన్నం చేసే నినాదాలకు వేదికలు కాకూడదు. దేశ సార్వభౌమాధికారానికి ముప్పు కలిగించే ఏ చర్యలనైనా ఏ సంస్థ అయినా వ్యతిరేకించాలి. ముఖ కవళికలు మారినట్లుగానే సమాజం కూడా మారుతుంటుంది. 30 ఏళ్ల క్రితం ఇంటర్నెట్, ఏఐ లేవు, అప్పుడు సమాజం ఒక స్థిరమైన వేగంతో సాగేది. నేడు సమాచారం సెకన్లలో అందుతోంది కాబట్టి విద్యార్థి ఉద్యమాల తీరు కూడా మారింది.

ప్ర: మీ ప్రభుత్వం 34 ఏళ్ల విరామం తర్వాత 2020లో కొత్త జాతీయ విద్యా విధానాన్ని (NEP) తీసుకొచ్చింది. ప్రస్తుతం ఏఐ ఉద్యోగాలను మార్చేస్తున్న తరుణంలో, ఐటీ రంగం, ప్రపంచ మార్కెట్లలో వస్తున్న మార్పుల దృష్ట్యా, 2020 నాటి ఈ విధానం భవిష్యత్తు సవాళ్లకు విద్యార్థులను సిద్ధం చేయగలదని మీరు నమ్ముతున్నారా?

జ: ఈ విధానం 2020లో ఖరారైనప్పటికీ, దీనికి సంబంధించిన పునాది 2014లోనే పడింది. ఇది కేవలం ఒక విధానం మాత్రమే కాదు, ఒక తాత్విక, భవిష్యత్ ప్రణాళికా పత్రం. సాంకేతికతను ఇది విద్యార్జనలో ఉన్న అడ్డంకులను తొలగించే ఒక సాధనంగా చూస్తుంది. విద్య అనేది మన విలువలలో పాతుకుపోయి ఉండటంతో పాటు, ఏఐ, క్వాంటం కంప్యూటింగ్ వంటి పురోగతికి వారధిలా ఉండాలని ఎన్ఈపీ ఆకాంక్షించింది. విద్యా రంగంలో ఏఐ కోసం ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ను ఏర్పాటు చేసే బాధ్యతను ఆర్థిక మంత్రి ఐఐటీ మద్రాస్‌కు అప్పగించారు. ఏఐ ద్వారా విద్యను అందరికీ అందుబాటులోకి, చౌకగా ఎలా తీసుకురావాలనే అంశంపై నిపుణులు, స్టార్టప్‌లు, విధాన నిర్ణేతలతో చర్చిస్తున్నాం. భారత విద్యా రంగానికి ఏఐ ఒక గొప్ప ఉత్ప్రేరకం అవుతుందని నేను నమ్ముతున్నాను.

ప్ర: విద్యపై చర్చలు ఎక్కువగా ఐఐటీలు, ఐఐఎంల వంటి ఉన్నత స్థాయి విద్యాసంస్థల చుట్టూనే తిరుగుతాయి. విద్యాశాఖ మంత్రిగా మీరు ప్రాథమిక విద్య, ఉపాధ్యాయ శిక్షణ, వనరుల కేటాయింపునకు ఎంత సమయం కేటాయిస్తున్నారు?

జ: విద్య అనేది ఒకదానితో ఒకటి ముడిపడివున్న అనేక ప్రక్రియలతో కూడిన అంశం. ప్రాథమిక విద్యను పరిశోధన లేదా ఉన్నత విద్య నుంచి వేరు చేయలేం. మనకు 30 కోట్ల మంది విద్యార్థులు ఉన్నారు — ఇది దాదాపు యూరప్ జనాభాతో సమానం. ఇందులో 25 కోట్ల మంది పాఠశాల విద్యార్థులు, కోటి మంది ఉపాధ్యాయులు ఉన్నారు. ఎన్ఈపీ కింద ఇప్పుడు పిల్లలు మూడేళ్ల వయస్సులోనే ప్రీ-స్కూల్‌లో చేరుతున్నారు. దీనివల్ల అంగన్‌వాడీలు ఒక సరైన విద్యా వేదికలోకి వచ్చాయి. రాబోయే 20 ఏళ్లలో 40 కోట్ల మంది విద్యార్థులు ఈ దశల గుండా వెళ్తారు. బట్టీ పద్ధతికి స్వస్తి పలికి, విశ్లేషణాత్మక ఆలోచన, నిర్దిష్టమైన ఆలోచనా విధానాలను ప్రోత్సహించే పాఠ్యప్రణాళికను అందించడం ప్రభుత్వ బాధ్యత. 2047 నాటికి మనం అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా ఎదగాలంటే, జ్ఞానం, పరిశోధనలపై దృష్టి సారించాలి. అటల్ ఇన్నోవేషన్ మిషన్ నుంచి జాతీయ పరిశోధనా సంస్థ (నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్) వరకు మేం ఒక సమగ్ర వ్యవస్థను నిర్మిస్తున్నాం.

ప్ర: ఎన్ఈపీ మాతృభాషలో ప్రాథమిక విద్యను సిఫార్సు చేస్తూ, బహుభాషా తత్వాన్ని ప్రోత్సహిస్తోంది. అయితే ఈ ప్రభుత్వం కేవలం హిందీని మాత్రమే ప్రోత్సహిస్తోందని, ప్రాంతీయ భాషలను కాదని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. క్షేత్రస్థాయిలో చూస్తే తల్లిదండ్రులు తమ పిల్లలను ఆంగ్ల మాధ్యమ పాఠశాలలకే పంపిస్తున్నారు. ఈ సవాళ్లను మీరు ఎలా ఎదుర్కొంటారు?

జ: ప్రభుత్వం ఎప్పుడూ హిందీని రుద్దాలని అనుకోలేదు. ప్రారంభ దశలో విద్య మాతృభాషలోనే ఉండాలని ఎన్ఈపీ స్పష్టంగా పేర్కొంది. ఉదాహరణకు, తమిళనాడులో తమిళం, కేరళలో మలయాళం, అస్సాంలో అస్సామీ, ఒడిశాలో ఒడియా, బెంగాల్‌లో బెంగాలీ… హిందీ మాట్లాడే ప్రాంతాల్లో హిందీలో విద్య సాగాలని మా నమ్మకం. హిందీ తప్పనిసరి అని మేం ఎక్కడా చెప్పలేదు. అది ఎప్పుడూ విద్యార్థి ఇష్టమే. ఐదవ తరగతి వరకు బోధనా మాధ్యమం మాతృభాషలోనే ఉండాలి, అప్పుడే విశ్లేషణాత్మక ఆలోచన పెరుగుతుంది. మొదటి తరగతి నుంచే రెండో భాషను నేర్చుకుంటారు. అది ఇంగ్లీషా, హిందీనా లేక ఒడియా విద్యార్థికి ఒడియానా అనేది వారి ఇష్టం. ఆరు నుంచి పది తరగతుల వరకు మూడవ భాషను నేర్చుకుంటారు. ఇందులో ఒకటి మాతృభాష కాగా మిగిలిన రెండు ఇతర భాషలు. సాధారణంగా మన దేశంలో విద్యార్థులు ఇంగ్లీష్ నేర్చుకుంటారు, దానికి ఎవరికీ అభ్యంతరం లేదు. మూడవ భాష అనేది ఏదైనా భారతీయ భాష అయి ఉండాలని ఎన్ఈపీ చెబుతోంది. రాజకీయంగా ఎన్ఈపీని వ్యతిరేకించేవారు కూడా మాతృభాషలో ప్రాథమిక విద్యను అభ్యంతరం పెట్టడం లేదు. అంటే సాంకేతికంగా అందరూ ఎన్ఈపీతో ఏకీభవిస్తున్నారు.

ఇక ఇంగ్లీష్ విషయానికి వస్తే, మన దేశంలోని 40 కోట్ల మంది యువతలో కేవలం 15 శాతం మందికే ఇంగ్లీషుతో సంబంధం ఉంది. ప్రపంచంలోని పెద్ద ఆర్థిక వ్యవస్థలైన జర్మనీ, జపాన్ లేదా చైనాను చూడండి — వారు ఉత్పత్తికి, అవగాహనకు ఎక్కువగా తమ సొంత భాషలనే ఉపయోగిస్తారు. మనం వెనుకబడి ఉన్నామనే భ్రమ నుంచి బయటపడాలి. ఇంగ్లీష్ పుట్టకముందే వేల ఏళ్ల క్రితం నిర్మించిన వెయ్యి కట్టడాలను నేను చూపించగలను. మా రాష్ట్రం (ఒడిశా)లోని కోణార్క్ దేవాలయం 13వ శతాబ్దంలో నిర్మించారు. అప్పుడు ఇంగ్లీష్ లేదు, కానీ సైన్స్ ఉంది. మన నాగరికతకు పునాదులైన వేదాలు ఇంగ్లీష్‌లో లేవు. మన భారతీయ భాషల ద్వారానే ఈ నాగరికత ఇక్కడి వరకు వచ్చింది. కాబట్టి మనం అభివృద్ధిలో మరో భారీ అడుగు వేయాలంటే భారతీయ భాషలకు ప్రాముఖ్యత ఇవ్వాలి. భారతీయ భాషలన్నీ జాతీయ భాషలేనని ప్రధానమంత్రి స్పష్టంగా చెప్పారు.

ప్ర: ఇంగ్లీష్ కూడా ఇప్పుడు ఒక భారతీయ భాషగా మారిందని మీరు భావించడం లేదా?

జ: ఇంగ్లీష్ భారతీయ భాష కాదు. దాని వాడకంపై మాకేం అభ్యంతరం లేదు, ఎవరైనా దానిని ఎంచుకోవచ్చు. కానీ అది ఎప్పుడూ భారత్ భాష కాలేదు.

ప్ర: ఉన్నత విద్యలో ఇప్పుడు భారీ మార్పులు వస్తున్నాయి, చాలామంది విద్యార్థులు తమ కుటుంబం నుంచి మొదటి తరం విద్యావంతులుగా వస్తున్నారు. అయితే రాష్ట్ర విశ్వవిద్యాలయాల పరిస్థితి దిగజారుతోంది. కేంద్ర విశ్వవిద్యాలయాలు తాత్కాలిక నియామకాలపై ఆధారపడుతున్నాయి. అక్కడక్కడా గొప్ప విద్యాసంస్థలు ఉన్నప్పటికీ, ఈ విద్యార్థులందరినీ ఆదుకునే విస్తృత వ్యవస్థ మనకు ఉందా?

జ: ఇంకా చేయాల్సింది చాలా ఉందని మేం గుర్తిస్తున్నాం. 2035 నాటికి ఉన్నత విద్యలో స్థూల నమోదు నిష్పత్తిని (GER) 50 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. దీని కోసం కొత్త సంస్థలను తెరవడం, నిబంధనలను సరళతరం చేయడం అవసరం. ఈ ఏడాది విద్యా బడ్జెట్‌ను 8 శాతం పెంచాం. స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్) రంగాల్లో బాలిక సంఖ్యలో భారత్ ఇప్పుడు ప్రపంచంలోనే అగ్రగామిగా ఉంది. వారికి మద్దతుగా ప్రతి జిల్లాలో అత్యాధునిక హాస్టళ్లను నిర్మిస్తామని ఆర్థిక మంత్రి ప్రకటించారు.

ప్ర: విద్యపై జీడీపీలో 6 శాతం ఖర్చు చేయాలని ఎన్ఈపీ సూచించింది. కానీ ప్రస్తుతం అది 4.6 శాతంగా ఉంది. ఈ లోటును పూడ్చడంలో ఇబ్బంది ఏమిటి?

జ: మన ఆర్థిక వ్యవస్థ పెరుగుతోంది, విద్యకు ప్రధానమంత్రి అగ్ర ప్రాధాన్యం ఇచ్చారు. 2014 నుంచి విద్యపై మా వ్యయం సుమారు రూ.80,000 కోట్ల నుంచి రూ.1.4 లక్షల కోట్లకు పెరిగింది. ప్రైవేట్ పెట్టుబడులను, పూర్వ విద్యార్థుల నిధులను కూడా ప్రోత్సహిస్తున్నాం. విద్యా మంత్రిగా మనం ఇంకా ఎక్కువ ఖర్చు చేయాలని నేను నమ్ముతాను, బడ్జెట్ పెరిగేకొద్దీ ఈ పెట్టుబడిని పెంచుకుంటూ పోతాం.

ప్ర: ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్థుల సామాజిక నేపథ్యంలో మార్పు వచ్చింది. వెనుకబడిన, అణగారిన వర్గాల విద్యార్థులు ఇప్పుడు వ్యవస్థలోకి వస్తున్నారు. వారిపై వివక్ష లేకుండా చూసేందుకు 2012లో యూజీసీ నిబంధనలు రూపొందించారు, 2026లో వాటిని సవరించారు. ఇప్పుడు కోర్టు వాటిపై స్టే ఇచ్చింది. ఇలాంటి నిబంధనలు అవసరమని మీరు భావిస్తున్నారా?

జ: వివక్ష ఉండకూడదని మన రాజ్యాంగంలోని 14, 15 అధికరణలు స్పష్టంగా చెబుతున్నాయి. యూజీసీ నిబంధనల వ్యవహారం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది. దీనిపై సుప్రీంకోర్టు తన అభిప్రాయాన్ని చెప్పింది. వచ్చే నెలలో విచారణ ఉంది. కోర్టు ఉత్తర్వుల ప్రకారమే మనం నడుచుకోవాలి. ప్రభుత్వం ఎవరికీ అన్యాయం జరగనివ్వదు.

ప్ర: మీరు, మీ ప్రభుత్వం భారతీయీకరణ, వలసవాద భావజాలం నుంచి విముక్తి గురించి మాట్లాడుతున్నారు. పాఠ్యపుస్తకాలను అధికార పార్టీ రాజకీయ భావజాలానికి అనుగుణంగా తిరగరాస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. బాబ్రీ మసీదు విధ్వంసం అంశాన్ని తొలగించి, ‘మూడు గుమ్మటాల మసీదు’ అని మార్చారు. పాఠ్యపుస్తకాలు ఇలా ఎన్నిసార్లు మార్చాలి?

జ: సమాజం మారుతూ ఉంటుంది. సమాజ పరిణామాలకు అనుగుణంగా పాఠ్యప్రణాళికను నవీకరించే బాధ్యత ఎన్సీఈఆర్టీపై ఉంది. ప్రతి సంవత్సరం కొత్త అంశాలతో దీనిని సవరించాలి. భావజాల వివాదాల గురించి మీరు అడిగారు. నాకు చెప్పండి, మనం బాబ్రీ మసీదు గురించి గర్వపడాలా లేక దేవాలయాలను కూల్చి సంస్కృతిని దెబ్బతీసిన ఔరంగజేబు, బాబర్ గురించి గర్వపడాలా? బాబ్రీ మసీదు అంశంపై కోర్టు ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు అనుమతితో అక్కడ రామాలయం నిర్మితమైంది. ఇది దేశ భావజాలం. దేశం రాముడిని అనుసరిస్తుందా లేక బాబర్, ఔరంగజేబులనా?

కాశీ విశ్వనాథ ఆలయాన్ని కూల్చమని ఔరంగజేబు ఆదేశించలేదా? మనం వీటి గురించి చర్చల్లో చిక్కుకుపోవాలా లేక విద్యార్థులకు ఘనమైన భారత నాగరికతను బోధించాలా? భారత స్వాతంత్ర్య సంగ్రామంలో అతి పిన్న వయస్కుడైన అమరవీరుడు ఒక ఒడియా వ్యక్తి. ఇదివరకు మన పాఠ్యపుస్తకాల్లో ఇది ఉందా? స్వాతంత్ర్య ఫలాన్ని కేవలం ఒకే సమూహానికి కట్టబెట్టే ప్రయత్నం జరిగింది. మన ప్రభుత్వం నిజమైన చరిత్రను ముందుకు తీసుకురావాలని మాత్రమే చెబుతోంది. మేం ఏదీ సృష్టించడం లేదు; మన జానపద కళలు, సంస్కృతిలో ఉన్న వాస్తవాలను గౌరవిస్తున్నాం, అంతే.

ప్ర: పార్లమెంటులో ప్రతిష్టంభన చూస్తున్నాం. ప్రతిపక్ష నాయకుడిని మాట్లాడనీయకపోవడం, ఎంపీల సస్పెన్షన్ వంటివి జరుగుతున్నాయి. గతంలో మీరు నవీన్ పట్నాయక్ వంటి ప్రత్యర్థుల గురించి కూడా గౌరవంగా మాట్లాడేవారు. అధికార పార్టీగా మీరు అందరినీ కలుపుకొని వెళ్లాలి కదా?

జ: నరేంద్ర మోదీ ప్రజాస్వామ్యం ద్వారా అధికారంలోకి వచ్చారు. అది వారసత్వంగా వచ్చింది కాదు. 12 ఏళ్లుగా దేశాన్ని నడిపిస్తున్న వ్యక్తి పట్ల రాహుల్ గాంధీ చూపిస్తున్న అసహనం, ద్వేషమే అసలు సమస్య. గౌరవం అనేది పరస్పరం ఉండాలి. రాహుల్ గాంధీ ఓటమి చేదు జ్ఞాపకాలతో కల్పిత కథలు చెబుతూ గందరగోళం సృష్టిస్తున్నారు. 2004లో బిజెపి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మమతా బెనర్జీ పట్ల అధికార పార్టీ ఎలా ప్రవర్తించిందో రికార్డులు ఉన్నాయి. కాంగ్రెస్, ముఖ్యంగా రాహుల్ గాంధీ ఓటమిని అంగీకరించలేకపోతున్నారు. వారి నిరాశ ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం.

ప్ర: బిజెపి ఎన్నికల యంత్రాంగం గురించి చాలా చర్చ జరుగుతోంది. ప్రత్యర్థులు అర్థం చేసుకోలేని ఆ రహస్యం ఏమిటి?

జ: ప్రజలకు సేవ చేయడం, వారి విషయంలో బాధ్యత తీసుకోవడమే మా విజయ రహస్యం. ‘సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్’ అనేదే మా తత్వం. మాది వారసత్వ పార్టీ కాదు, భూస్వామ్య వ్యవస్థ కాదు. మాది ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ. ఇక్కడ జవాబుదారీతనం ఉంటుంది. గత 12 ఏళ్లలో ప్రధాని మోదీ పేదలు, అణగారిన వర్గాల నమ్మకానికి కేంద్ర బిందువు అయ్యారు. ఇదే మా పెట్టుబడి. ప్రతిపక్షాలు మమ్మల్ని విమర్శించవచ్చు, కానీ మా పద్ధతిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే వారికి అవకాశం ఉండవచ్చు.

ప్ర: ఎన్నికల ప్రచారాల్లో విద్య అనేది ఎప్పుడూ ప్రధానాంశం ఎందుకు కావడం లేదు? ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రిగా కంటే, ఏదైనా రాష్ట్ర ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా ఉన్నప్పుడే ఎక్కువ వార్తల్లో ఎందుకు ఉంటారు?

జ: విద్య ముఖ్యమైనది కాదని కాదు. మా ప్రభుత్వానికి విద్య ఎప్పుడూ ప్రాధాన్యం కలిగిన అంశమే. అందుకే 34 ఏళ్ల తర్వాత ఎన్ఈపీ 2020ని తీసుకొచ్చాం. ప్రధాని మోదీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే భారతీయ విలువల ఆధారంగా విద్యలో సంస్కరణలు తేవడంపై దృష్టి పెట్టారు. ప్రపంచ అవసరాలను తీర్చే ప్రపంచ పౌరులను తయారు చేయడమే మా లక్ష్యం. మా ప్రభుత్వానికి విద్య అనేది అత్యంత కీలకమైన ప్రాధాన్యత.