Handloom

వికసిత్ భారత్ భవిష్యత్తును నేస్తున్న చేనేత

క దేశం అభివృద్ధి చెందిన దేశంగా ఆవిర్భావం చెందడం అనేది కేవలం సాంకేతికతతోనే ముడిపడి ఉండదు. తమ అంతర్గత బలాలను భవిష్యత్తు ప్రగతి యంత్రాలుగా మలుచుకోగల సామర్థ్యంపైనే అది ఆధారపడి ఉంటుంది. భారత్ 2047 నాటికి ‘వికసిత్ భారత్’ దిశగా వేగంగా ముందుకు సాగుతున్న వేళ.. మనం సరికొత్త వ్యూహాత్మక సాంకేతికతలపై పెట్టుబడులు పెడుతున్నాం, తయారీ రంగాన్ని బలోపేతం చేస్తున్నాం, ప్రపంచస్థాయి పోటీతత్వం ఉన్న పరిశ్రమలను నిర్మిస్తున్నాం. అయితే మన అత్యంత గొప్ప బలాల్లో ఒకటి కాలపరీక్షకు నిలిచి, ఇప్పటికీ మనతోనే ఉంది — అదే మన చేనేత సంప్రదాయం. ఆగస్టు 7న భారత్ 12వ జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకొన్న సందర్భంగా సుస్థిరత, ప్రామాణికత, సమర్థమైన సరఫరా వ్యవస్థలకు ప్రాధాన్యమిచ్చే ప్రపంచంలో చేనేత రంగాన్ని ఒక వ్యూహాత్మక రంగాలుగా గుర్తించాల్సిన సమయం ఆసన్నమైంది.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించిన ‘వికసిత్ భారత్ 2047’ స్వప్నం సమృద్ధి, స్వాలంబన, సమగ్రత, సాంస్కృతిక ఆత్మవిశ్వాసం అనే పునాదులపై నిర్మితమైంది. వారసత్వాన్ని, నూతన ఆవిష్కరణలను మేళవిస్తూనే మహిళా నాయకత్వంలో అభివృద్ధి, గ్రామీణ వ్యవస్థాపకత, జీవనోపాధులు, అంతర్జాతీయ పోటీతత్వాన్ని ముందుకు తీసుకువెళ్ళడం ద్వారా చేనేత రంగం ఈ దృక్పథాన్ని స్పష్టంగా ప్రతిబింబిస్తోంది. విజయరథ సంభాషణలో శ్రీరాముడు శాశ్వత విజయం అనేది కేవలం అధికారం ద్వారా కాకుండా నైతిక విలువల ద్వారానే సాధ్యమవుతుందని బోధిస్తాడు. శతాబ్దాలుగా భారత్ చేనేత సంప్రదాయాన్ని నిలబెట్టింది ఆ విలువలే. ప్రతి హస్తకళా నేత వస్త్రం వెనుక సంప్రదాయాన్ని కాపాడుకునే ధైర్యం, ప్రతి దారాన్ని పరిపూర్ణంగా మలిచే ఓర్పు, నికార్సయిన హస్తకళా ప్రావీణ్యం, తరతరాలుగా లభించిన విజ్ఞానం దాగి ఉన్నాయి. అందుకే చేనేత కేవలం ఒక కళ మాత్రమే కాదు, భారత్ గొప్ప నాగరికతా బలాల్లో ఒకటి. పత్తిని మొదటిసారిగా సాగు చేసి నేసిన సింధు లోయ నాగరికత నుంచి అంతర్జాతీయ వస్త్ర వాణిజ్యంలో భారతీయ వస్త్రాలు ఆధిపత్యం చెలాయించిన 18వ శతాబ్దం వరకు.. వస్త్ర రంగంలో భారత్ ప్రపంచ స్థాయి ప్రమాణాలను నెలకొల్పింది. 

ఉంగరంలో నుంచి కూడా సులువుగా దూరిపోయేంత సన్నని బెంగాల్ ప్రసిద్ధ ‘మస్లిన్’ వస్త్రంతో పాటు, బెనారసి పట్టు, కాంచీపురం నేతలు, పోచంపల్లి ఇకత్, అనేక ప్రాంతీయ సంప్రదాయాలు భారత్‌కు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు తెచ్చిపెట్టాయి. నేడు ప్రపంచం ప్రామాణికమైన, సుస్థిరమైన, చేతితో తయారు చేసిన ఉత్పత్తుల వైపు మొగ్గు చూపుతున్న వేళ ఆ నాయకత్వాన్ని తిరిగి కైవసం చేసుకునేందుకు మనకు ఒక చారిత్రక అవకాశం లభించింది. మన తదుపరి చేనేత విప్లవం కేవలం వస్త్రాలను మాత్రమే కాకుండా హస్తకళా ప్రావీణ్యాన్ని, వారసత్వాన్ని, ఆవిష్కరణలను, నమ్మకాన్ని ఎగుమతి చేయాలి. ప్రతి చేనేత ఉత్పత్తిని ‘బ్రాండ్ ఇండియా’ రాయబారిగా తీర్చిదిద్దాలి.

చేనేత భారత్‌లో అతిపెద్ద కుటీర పరిశ్రమ. ఇది 35 లక్షలకు పైగా నేత కార్మికులు, అనుబంధ రంగాల కార్మికుల జీవనోపాధికి ఊతమిస్తోంది; వీరిలో దాదాపు 72 శాతం మంది మహిళలే కావడం విశేషం. గత దశాబ్దంలో ప్రభుత్వం ముడిసరుకు సరఫరా పథకం, 797 చేనేత క్లస్టర్లు, 1.24 లక్షలకు పైగా ఆధునికీకరించిన మగ్గాలు, దాదాపు 97,000 మంది కళాకారులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వడం ద్వారా ఈ రంగాన్ని బలపరిచింది. వీటితో పాటు ఉత్పత్తి కంపెనీలు, జీఐ ట్యాగ్ ఉత్పత్తులు, హ్యాండ్లూమ్ మార్క్, ‘ఇండియా హ్యాండ్ మేడ్’ సర్టిఫికేషన్, అర్బన్ హాట్లు, డిజైన్ రిసోర్స్ సెంటర్ల వంటి అనేక కార్యక్రమాలను ప్రారంభించింది. నేడు 29 నేత కార్మికుల సేవా కేంద్రాలు శిక్షణ, నైపుణ్యాభివృద్ధి, డిజైన్ ల్యాబ్‌లు, ముడిసరుకు సహాయం, మార్కెట్ అనుసంధానం ద్వారా సమగ్ర మద్దతును అందిస్తున్నాయి. మరోవైపు అధునాతన శిక్షణను విస్తరించడానికి, నాణ్యమైన, అత్యధిక విలువ కలిగిన చేనేత ఉత్పత్తులను అభివృద్ధి చేయడానికి 11 ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ సంస్థలను బలోపేతం చేస్తున్నారు. ఈ చర్యలు చేనేతను కేవలం ఒక సంక్షేమ కార్యక్రమంగా చూడటం కాకుండా, అంతర్జాతీయంగా పోటీ పడే సృజనాత్మక పరిశ్రమగా తీర్చిదిద్దే మార్పును సూచిస్తున్నాయి. 

త్వరలో రాబోతున్న ‘జాతీయ చేనేత, హస్తకళల కార్యక్రమం’ 500కు పైగా జిల్లాల్లోని 1,800 క్లస్టర్లను మరింత బలోపేతం చేస్తుంది. ఇది 65 లక్షల మంది నేత కార్మికులు, కళాకారులకు లబ్ధి చేకూర్చడమే కాకుండా, ‘హ్యాండ్‌మేడ్ ఇన్ ఇండియా’ను అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన బ్రాండ్‌గా నిలబెడుతుంది. ఆవిష్కరణ ఎల్లప్పుడూ భారత చేనేత ప్రయాణంలో భాగమే. మహాత్మా గాంధీ ప్రవేశపెట్టిన ‘అంబర్ చరఖా’ నూలు వడకడాన్ని మరింత తేలికగా, వేగవంతంగా, సమర్థంగా మార్చి స్వాలంబన భావనను ముందుకు తీసుకెళ్లింది. ఇటీవల అస్సాంకు చెందిన ‘మైనా లూమ్’, శివసాగర్‌లో అభివృద్ధి చేసిన ‘చిత్రంజన్ హ్యాండ్‌లూమ్’ వంటివి మగ్గం డిజైన్‌లో మెరుగుదలలు తీసుకురావడం ద్వారా నేతను ఎంత సులభంగా, ఉత్పాదకతతో మార్చవచ్చో నిరూపించాయి. ఈ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ, ఐఐటీలతో కలిసి ఏర్పాటు చేసిన ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ’ శారీరక శ్రమను తగ్గించి ఉత్పాదకతను పెంచేలా తేలికైన, బలమైన, సులభంగా ఉపయోగించగల మగ్గాలను తయారు చేస్తోంది. 

ఇందులో దివ్యాంగులకు ఉపయోగపడే మగ్గాలు కూడా ఉన్నాయి. ఈ సెంటర్ ఆధ్వర్యంలో నడిచే ‘హ్యాండ్లూమ్ 4.0’ కార్యక్రమం డిజిటల్ సాధనాలు, కృత్రిమ మేధను ఉపయోగించి ఉత్పాదకత, నాణ్యత, నిర్వహణను పర్యవేక్షిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా విస్తరించడానికి ముందు దీనిని 100 మగ్గాలపై పైలట్ ప్రాజెక్ట్‌గా పరిశీలిస్తున్నారు. సాంకేతికత కళాకారుడికి సాధికారత కల్పించాలి తప్ప అతని స్థానాన్ని భర్తీ చేయకూడదు. ‘విజనెక్స్ట్’ (VisioNXT) వంటి వేదికలు డిమాండ్‌ను అంచనా వేయడానికి, డిజైన్ ధోరణులను గుర్తించడానికి, నిజమైన చేనేత ఉత్పత్తులను ప్రామాణీకరించడానికి, నేత కార్మికులను నేరుగా ప్రపంచ మార్కెట్‌లతో అనుసంధానించడానికి సహాయపడతాయి. అదే సమయంలో ప్రీమియం పట్టు, సహజ నూలులు, పర్యావరణహిత దారాలు, సరికొత్త మిశ్రమ నూలుల వైపు ఉత్పత్తులను వైవిధ్యపరచడం ద్వారా అత్యధిక విలువ కలిగిన ఉత్పత్తులను తయారు చేయవచ్చు, కొత్త మార్కెట్లను స్వాధీనం చేసుకోవచ్చు. మెరుగైన బ్రాండింగ్, విలువ జోడింపు, ప్రత్యక్ష మార్కెట్ సదుపాయాలతో ఈ ఆవిష్కరణలు నేత కార్మికుల ఆదాయాన్ని గణనీయంగా పెంచుతాయి. ప్రతి నేత కార్మికుడు గౌరవప్రదమైన, ఉన్నతమైన ఆదాయాన్ని పొందేలా చేయడం, రాబోయే ఏళ్లలో నెలకు రూ.50,000 సంపాదించే స్థాయికి వారిని తీసుకెళ్లడమే మా లక్ష్యం.

చేనేత భవిష్యత్తు అనేది మార్కెట్లపై ఎంత ఆధారపడి ఉందో, ఆలోచనా ధోరణిపై కూడా అంతే ఆధారపడి ఉంటుంది. మన నేత కార్మికులు కేవలం శ్రామిక శక్తి మాత్రమే కాదు. వారు వ్యవస్థాపకులు, నూతన ఆవిష్కర్తలు, విలువను సృష్టించే సృష్టికర్తలు. వారు సొంత బ్రాండ్లను నిర్మించుకునేలా, విలువైన విపణి వ్యవస్థలో పైకి ఎదిగేలా, అంతర్జాతీయ మార్కెట్లను చేరుకునేలా చేయడం ద్వారా మనం చేనేతను భారత్‌లోని అత్యంత క్రియాశీలక సృజనాత్మక పరిశ్రమల్లో ఒకటిగా మార్చవచ్చు. చేనేత రంగానికి కొత్త అధ్యాయాన్ని లిఖించడానికి వారసత్వం-సాంకేతికతను, సృజనాత్మకత-పరిశ్రమను ఒకే వేదికపైకి తీసుకురావాలని దేశంలోని యువతకు ఇది ఒక పిలుపు. ఈ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మన నేత కార్మికులను కేవలం మన వారసత్వ రక్షకులుగానే కాకుండా, భారత ప్రగతి శిల్పులుగా కొనియాడదాం. చేనేతను మన దైనందిన జీవితంలో ఒక భాగంగా చేసుకుందాం. మనం కొనుగోలు చేసే, ధరించే ప్రతి చేనేత ఉత్పత్తి ఒక నేత కార్మికుడి జీవనోపాధిని బలోపేతం చేస్తుంది, కాలపరీక్షకు నిలిచిన సంప్రదాయాన్ని కాపాడుతుంది, భారత్ గొప్పగాథను ప్రపంచానికి చాటిచెబుతుంది. చేనేతను ఎంచుకోవడం ద్వారా మనం కేవలం మన వారసత్వాన్ని ధరించడమే కాదు, ‘వికసిత్ భారత్’ భవిష్యత్తును నేయడానికి సహాయపడుతున్నాం.

గిరిరాజ్ సింగ్,
కేంద్ర జౌళి శాఖ మంత్రి