Narendra Modi

మోదీపై అపోహలు పటాపంచలు

టీవలి విద్యార్థుల ఉద్యమానికి సంబంధించి ప్రాధాన్యం సంతరించుకున్న ప్రధాన అంశం ఆ నిరసన మాత్రమే కాదు. ప్రజాస్వామ్య వ్యవస్థలలో నిరసనలు సహజమే. అయితే, దీనిపై భారత ప్రభుత్వం స్పందించిన తీరే అత్యంత ముఖ్యమైన విషయం. గత దశాబ్ద కాలంగా ప్రధాని నరేంద్ర మోదీని విమర్శించే ప్రతిపక్షాలు, అంతర్జాతీయ మీడియాలోని కొన్ని వర్గాలు ఆయనను నిరంకుశుడని, భిన్నాభిప్రాయాలను సహించరని చిత్రీకరిస్తూ వస్తున్నాయి. ప్రతి రాజకీయ వివాదాన్ని ఈ ప్రచారానికి బలం చేకూర్చేందుకు ఆయుధంగా మలుచుకున్నాయి. కానీ ఈ ఇటీవలి విద్యార్థుల ఉద్యమం ఆ అపోహలను పటాపంచలు చేసింది. జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు చేపట్టిన నిరసనను ఎదుర్కొన్నప్పుడు మోదీ ప్రభుత్వం ముందు పలు మార్గాలు ఉన్నాయి. పట్టుదలకు పోయి, ఆందోళనను తోసిపుచ్చుతూ ఘర్షణ వాతావరణాన్ని దీర్ఘకాలం కొనసాగించి ఉండవచ్చు. కానీ దానికి భిన్నంగా ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ సంప్రదింపుల మార్గాన్ని ఎంచుకుంది. విద్యా సంస్కరణల్లో గణనీయమైన పాత్ర పోషించినప్పటికీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజకీయ బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు. అంతేకాకుండా, కాక్రోచ్ జనతా పార్టీతో సహా ఆందోళన బాట పట్టిన విద్యార్థి ప్రతినిధులతో నేరుగా చర్చలు జరిపే బాధ్యతను ప్రధాని మోదీ తమ సీనియర్ కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌లకు అప్పగించారు. ఆ చర్చలు చివరకు ప్రశాంతమైన వాతావరణంలో ఒప్పందానికి దారితీశాయి.

మరొకవైపు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీలు ఈ నిజమైన విద్యార్థి ఉద్యమాన్ని మోదీ వ్యతిరేక రాజకీయ ఉద్యమంగా మార్చడానికి ప్రయత్నించాయి. సమస్య పరిష్కారానికి తోడ్పడే సామరస్య వాతావరణాన్ని సృష్టించేందుకు యత్నించకుండా, ఎన్నికల ప్రయోజనాల కోసం విద్యార్థుల ఆందోళనను ఆయుధంగా మలచుకోవాలని చూశాయి. వారు ఘర్షణను కోరుకుంటే ప్రభుత్వం మాత్రం సంయమనాన్ని, సామరస్యాన్ని ఎంచుకుంది. ప్రభుత్వ నిర్ణయాలపై రాజకీయ కోణాలు ప్రభావం చూపాయని విమర్శకులు వాదించవచ్చు. నిజానికి రాజకీయాలు ప్రజాస్వామ్యంలో అంతర్భాగం. కానీ ఇక్కడ ముఖ్యం తుది ఫలితమే. ప్రభుత్వం ప్రజల మాట ఆలకించింది, బాధ్యతను స్వీకరించింది, ప్రజాభిప్రాయానికి అనుగుణంగా తన వైఖరిని మార్చుకుంది. ఇది ఆత్మవిశ్వాసం కలిగిన ప్రజాస్వామ్య లక్షణమే తప్ప నిరంకుశ అభద్రతాభావం కాదు. ఇది ఏదో ఒక సందర్భానికే పరిమితమైన ఘటన కాదు. పౌరులు, రాష్ట్ర ప్రభుత్వాలు, పార్లమెంటరీ కమిటీలు, పారిశ్రామిక భాగస్వాములతో జరిపిన సంప్రదింపుల తర్వాతే అనేక విధానాలు, శాసన ప్రతిపాదనలు రూపుదిద్దుకున్నాయి. ‘మైగవ్’, ‘మన్‌కీ బాత్’ వంటి కార్యక్రమాల ద్వారా మోదీ ప్రభుత్వం ప్రజాభిప్రాయానికి దూరంగా ఉండిపోకుండా, పౌరులతో నేరుగా అనుసంధానమయ్యేందుకు నిరంతరం ప్రయత్నిస్తోంది. అయితే దీనర్థం ప్రభుత్వం విమర్శలకు అతీతమని కాదు. ప్రజాస్వామ్యంలో సమీక్షలు, పరిశీలనలు అత్యవసరం. ప్రతిపక్షాలు, పౌరసమాజం, మీడియా అధికారంలో ఉన్నవారిని నిలదీస్తూనే ఉండాలి. అయితే ఆ విమర్శలు కరుడుగట్టిన భావజాలాలకు భిన్నంగా ఉండే వాస్తవాలను కూడా గుర్తించేలా ఉండాలి.

విద్యార్థులు ఎన్నడూ వ్యవస్థకు శత్రువులు కారు. వారే భారత భవిష్యత్ పాలకులు, పారిశ్రామికవేత్తలు, ఉపాధ్యాయులు, శాస్త్రవేత్తలు, రాజకీయ నాయకులు. చర్చల ద్వారా వారిని భాగస్వామ్యులను చేయడం ఒక ప్రజాస్వామ్య సత్యాన్ని పునరుద్ఘాటించింది. కేవలం ఎన్నికల ద్వారానే కాదు, ఎన్నికల మధ్య కాలంలో ప్రజల మాట వినే తత్త్వం ద్వారా కూడా ప్రభుత్వాలకు విశ్వసనీయత వస్తుంది. ఈ ఘటన అంతర్జాతీయంగా కూడా మరింత లోతైన పరిశీలనకు అర్హమైనది. భారత్‌పై వచ్చే విశ్లేషణలు తరచుగా ఒక పక్షపాత ధోరణితో ప్రారంభమై, ఆపై దానికి అనుకూలమైన ఆధారాల కోసం వెతుకుతాయి. కానీ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ ఇటువంటి సరళమైన నమ్మకాల కంటే చాలా సంక్లిష్టమైనది. దేశం నిరసన తెలిపినప్పుడు, ప్రధాని మోదీ సంప్రదింపులను ఎంచుకున్నారు. ఆయన బాధ్యతాయుతమైన వైఖరిని, ప్రజాస్వామ్య స్ఫూర్తిని ఎంచుకున్నారు. ఆయనను నిరంకుశుడిగా చిత్రీకరించేందుకు ఏళ్లుగా శ్రమించిన రాహుల్ గాంధీకి, కాంగ్రెస్‌కు, ప్రధాని మోదీ అంతర్జాతీయ విమర్శకులకు ఇది నిరాశ కలిగించవచ్చు. కానీ ఇది కాదనలేని నిజం, దీనిని గుర్తించాల్సిందే.

ప్రత్యూష్ కాంత్,
బిజెపి అధికార ప్రతినిధి