State Office Iday

దేశాన్ని విడగొట్టేందుకు కాంగ్రెస్ కుట్రలు

State Office I Dayఖిలాఫత్ ఉద్యమం నాటి నుంచే కాంగ్రెస్ బుజ్జగింపు, మతతత్వ రాజకీయాలు చేస్తూ దక్షిణాది, ఉత్తరాది పేరుతో దేశాన్ని విడగొట్టే కుట్రలు చేస్తోందని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు మండిపడ్డారు. బాధ్యతాయుతమైన హోదా కలిగిన లోక్‌సభ ప్రతిపక్ష నేత పార్లమెంటులో ప్రజా సమస్యలపై మాట్లాడకుండా వీధి నాటకాలు చేస్తూ దేశం తలదించుకునేలా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. ఆగస్ట్ 15న బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాత్యాగం చేసిన అమరవీరులు, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. ఈ వేడుకల్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె. లక్ష్మణ్, బిజెపి కర్ణాటక-తమిళనాడు కో-ఇంచార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, బిజెపి రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు డాక్టర్ ఎన్. గౌతమ్ రావు, వేముల అశోక్, ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎన్. రాంచందర్ రావు ప్రసంగిస్తూ, గత 12 ఏళ్లుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమర్థ నాయకత్వంలో భారతదేశం అన్ని రంగాల్లో అద్భుత ప్రగతి సాధించి, ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని కొనియాడారు. విశ్వవిద్యాలయాల్లో కాశ్మీర్ ఆజాదీ అంటూ దేశ వ్యతిరేక నినాదాలు ఇచ్చే విచ్ఛిన్నకర శక్తులకు, పార్లమెంట్‌పై దాడి చేసిన అఫ్జల్ గురుకు అనుకూలంగా మాట్లాడే శక్తులకు కాంగ్రెస్ మద్దతు పలకడం సిగ్గుచేటని మండిపడ్డారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై, చేస్తున్న మోసాలు, అన్యాయం పట్ల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయకపోగా, విద్యార్థులకు అందాల్సిన దాదాపు రూ.12,000 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయకుండా వారి భవిష్యత్తుతో చెలగాటమాడుతోందని మండిపడ్డారు. హిల్ట్ పాలసీ పేరిట రియల్ ఎస్టేట్ బడా బాబులకు వేలాది ఎకరాల విలువైన భూములను ధారాదత్తం చేసే కుట్రలు చేస్తున్నారని, జీహెచ్‌ఎంసీ పరిధిలో 3 కార్పొరేషన్ల విభజన పేరుతో ప్రజలపై పన్నుల భారం మోపాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పంపిణీ చేస్తున్న ఉచిత బియ్యం పథకానికి 90 శాతానికి పైగా నిధులు కేంద్రానివేనని, అయితే స్మార్ట్ రేషన్ కార్డులపై ప్రధాని నరేంద్ర మోదీ ఫోటో పెట్టకుండా ప్రజలను వంచించడం తగదన్నారు.

దేశ రక్షణ, దేశభక్తిపై యువతకు పిలుపునిస్తూ… గతంలో ఎన్నో ఉగ్రవాద దాడులు జరిగినా పట్టించుకోని పరిస్థితులు ఉండేవని, కానీ నరేంద్ర మోదీ ప్రభుత్వంలో సరిహద్దులు దాటి పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసి గట్టి ప్రతీకారం తీర్చుకున్నామని గుర్తుచేశారు. ఈ దేశానికి రక్షణ కల్పించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని, “అగర్ భారత్ మే రెహనా హోగా తో వందేమాతరం కహనా హోగా” అనే జాతీయ భావనతో ప్రతి పౌరుడూ నిలబడాలని ఉద్ఘాటించారు. దేశ స్వాతంత్ర్య సంగ్రామానికి స్ఫూర్తినిచ్చిన 150 ఏళ్ల చరిత్ర గల పవిత్రమైన ‘వందేమాతరం’ గేయం ఆలపిస్తుంటే కూర్చుని అవమానించే మజ్లిస్ నాయకుల తీరును సమాజం అసహ్యించుకుంటోందని అన్నారు. దేశ స్వాభిమానాన్ని దెబ్బతీసే చర్యలను, భారతావనిపై చేసే అనుచిత వ్యాఖ్యలను బిజెపి ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోదని తీవ్రంగా హెచ్చరిస్తూ, దేశ వ్యతిరేక శక్తులకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.