బీసీ రిజర్వేషన్లలో ముస్లింలు కాంగ్రెస్ నిర్వాకమే
కాంగ్రెస్ హయాంలో ముస్లింలకు 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ, వారిని బీసీ రిజర్వేషన్ల పరిధిలోకి తీసుకురావడం వల్ల నిజమైన బీసీ వర్గాలకు న్యాయంగా దక్కాల్సిన రిజర్వేషన్ వాటాను కోల్పోయిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో బీసీలకు రిజర్వ్ చేసిన అనేక స్థానాల్లో ఆ ప్రయోజనాలను ముస్లింలు అనుభవిస్తున్నారని అన్నారు. అనేక చోట్ల ముస్లింలను బీసీ కేటగిరీలోకి తీసుకొచ్చి రిజర్వేషన్ల ప్రయోజనాలు కల్పిస్తున్నారని విమర్శించారు. వాస్తవానికి ఈ స్థానాలు నిజమైన బీసీ వర్గాలకు దక్కాల్సినవని, న్యాయంగా దక్కాల్సిన రిజర్వేషన్ వాటాపై ఎంతటి ప్రభావం పడుతోందో బీసీ సమాజం తీవ్రంగా ఆలోచించాలని సూచించారు. ఆగస్ట్ 17న బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్ గౌడ్ అధ్యక్షతన మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్. రాంచందర్ రావుతో పాటు రాజ్యసభ సభ్యుడు డా. కె. లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో రాంచందర్ రావు ప్రసంగిస్తూ.. ”నేను రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే బీసీ సమాజ హక్కులు, ప్రయోజనాలకు సంబంధించిన అనేక అంశాలపై ఉద్యమాలు చేపట్టాం. బీఆర్ఎస్ బీసీ సమాజానికి ఎన్నో హామీలు ఇచ్చి మోసం చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే విధానాన్ని కొనసాగిస్తోంది. చారిత్రకంగా కాంగ్రెస్ బీసీ సమాజానికి తీవ్రమైన అన్యాయం చేసింది. కేవలం ముస్లిం ఓట్ల కోసం కొందరు రాజకీయ నాయకులు మైనారిటీ బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతున్నారు. ఈ విషయాన్ని బీసీలు గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఎంబీసీ కార్పొరేషన్ పనిచేస్తోందా? దానికి తగినన్ని నిధులు ఉన్నాయా? ఇప్పటివరకు ఎంతమందికి సహాయం చేసింది? ప్రభుత్వం దీనిపై ఒక నివేదిక విడుదల చేసి ప్రజలకు సమాధానం చెప్పాలి. ఎంబీసీ కార్పొరేషన్‌ను ఇప్పటికీ సరైన రీతిలో బలోపేతం చేయలేదు. బీసీ కార్పొరేషన్‌కే తగినన్ని నిధులు లేవు. ఇక ఎంబీసీ కార్పొరేషన్‌కు అయితే దాదాపుగా నిధులే లేని పరిస్థితి. మరి ఎవరిని మోసం చేయాలని చూస్తున్నారు? కాంగ్రెస్ ఎవరిని వంచించాలని ప్రయత్నిస్తోంది?
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీసీ సమాజానికి చెందినవారే. ఈరోజు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఒక్క బీసీ ముఖ్యమంత్రి కూడా లేరు. అయినా బిజెపి ప్రభుత్వంలో బీసీలకు ఎంత ప్రాతినిధ్యం ఉందని ప్రశ్నించే ధైర్యం రాహుల్ గాంధీ చేస్తున్నారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం తన పూర్తి పదవీకాలంలో ఒక్క ఓబీసీ అధికారిని కూడా సెక్రటరీ స్థాయిలో నియమించలేదు. నియమితులైన 102 మంది అధికారుల్లో కేవలం ఇద్దరు ఎస్టీ వర్గానికి చెందినవారు ఉండగా, ఒక్క ఓబీసీ అధికారి కూడా లేరు. బీఆర్ఎస్ ఒక కుటుంబం కోసమే పనిచేసే పార్టీ.. కాంగ్రెస్ సోదరుల కోసం పనిచేసే పార్టీ. ప్రజలకు నిజమైన న్యాయం చేసే పార్టీ ఏదైనా ఉందంటే, అది ఒక్క బిజెపి మాత్రమే. బిజెపి ప్రజల కోసం పనిచేస్తుంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఆ పథకాల ద్వారా బీసీ సమాజానికి ఏ విధంగా ప్రయోజనం చేకూరిందో ప్రతి ఒక్కరికీ వివరించాలి. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాతే బీసీ సమాజానికి న్యాయం జరుగుతోంది. ఈ విషయాన్ని ప్రజలకు గుర్తుచేస్తూ, బీసీ సమాజంలోని ప్రతి వర్గంలోకి బిజెపి సందేశాన్ని బలంగా తీసుకెళ్లాలి.

