ఎస్ఐఆర్ సాకుతో అశాంతికి కుట్ర
ఎస్ఐఆర్ను రాజకీయ అస్త్రంగా ఉపయోగించుకుని దేశంలో అశాంతి, గందరగోళ పరిస్థితులు సృష్టించేందుకు ప్రతిపక్షాలు చేస్తున్న ప్రయత్నాలు ప్రజాస్వామ్యానికి తీవ్ర విఘాతమని కేంద్ర న్యాయశాఖ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా) అర్జున్ రామ్ మేఘ్వాల్ విమర్శించారు. పార్లమెంటుతో పాటు ఇతర చట్టసభల్లోనూ మహిళలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలన్నది తమ ప్రభుత్వ నిబద్ధత అని పేర్కొన్నారు. అయితే, ఈ చట్టాలకు పార్లమెంటులో అవసరమైన మద్దతును ప్రతిపక్షాలు అందించలేదని అన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్, ఆ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ ఈ విషయంలో మద్దతు ఇచ్చేందుకు విముఖత చూపుతున్నట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. పార్లమెంటు సమర్థంగా పనిచేసేలా చూడటం కంటే, తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదంటూ తప్పుడు ప్రచారం చేయడంపైనే కాంగ్రెస్ ఎక్కువ ఆసక్తి చూపుతోందని విమర్శించారు. పెండింగ్ కేసుల సంఖ్యను తగ్గించేందుకు ప్రయోగాత్మకంగా సాయంత్రం కోర్టులను ప్రారంభించే ప్రణాళికను ప్రభుత్వం రూపొందిస్తోందని వెల్లడించారు. ఈ ప్రక్రియలో పదవీ విరమణ చేసిన న్యాయమూర్తుల సేవలను కూడా వినియోగించుకోవాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఒక జాతీయ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అర్జున్ రామ్ మేఘ్వాల్ న్యాయపరమైన వివాదాలను తగ్గించడం, కేసుల పరిష్కారాన్ని వేగవంతం చేయడం కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యల గురించి వివరించారు. ఈ ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు:
ప్ర: ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)కు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతృత్వంలో ప్రతిపక్షాలు చేస్తున్న ఆందోళనలను మీరు ఎలా చూస్తున్నారు?
జ: దేశంలో ఎస్ఐఆర్ కొత్త కార్యక్రమమేమీ కాదు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 12 సార్లు ఈ ప్రక్రియ నిర్వహించారు. కాంగ్రెస్ నేతృత్వంలో ప్రతిపక్షాలు దీనిపై చేస్తున్న ఆందోళనలకు ఎలాంటి ప్రాతిపదికగా లేదు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రజల్లో గందరగోళం సృష్టించడం, తప్పుడు ప్రచారాలను వ్యాప్తి చేయడమే ఈ ఆందోళనల ఉద్దేశంగా కనిపిస్తోంది. వాస్తవానికి ఎస్ఐఆర్ ఓటరు జాబితాలను ఎప్పటికప్పుడు నవీకరించి, అర్హులైన ప్రతి పౌరుడికి ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పించేందుకు చేపట్టే సాధారణ ప్రక్రియ మాత్రమే. దీనికి మరే ఇతర ఉద్దేశమూ లేదు.
ప్ర: ‘ప్రభుత్వ మార్పు’నకు సంబంధించి ప్రతిపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలపై మీ స్పందన?
జ: ఎన్నికల ద్వారానే ప్రభుత్వాలు మారాలని, ప్రజలు ఇచ్చే తీర్పు ఆధారంగానే ఎవరు పాలించాలనేది నిర్ణయించాలని మన రాజ్యాంగ నిర్మాతలు స్పష్టంగా ఆకాంక్షించారు. ఎస్ఐఆర్ను రాజకీయ సాకుగా ఉపయోగించుకుని దేశంలో అశాంతి, గందరగోళ పరిస్థితులు సృష్టించేందుకు ప్రతిపక్షాలు చేస్తున్న ప్రయత్నాలు ఈ ప్రజాస్వామ్య సూత్రానికి విరుద్ధం. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల తీర్పే అంతిమం. ఎన్నికల ద్వారా ప్రభుత్వాలను ఎన్నుకోవడం, మార్చడం ప్రజలకున్న హక్కు. ఈ ప్రాథమిక సూత్రాన్ని బలహీనపరిచే విధంగా ప్రతిపక్షాల వ్యవహారశైలి ఉంది.
ప్ర: ఈ అంశాల చుట్టూ ప్రతిపక్ష పార్టీలు ఒక ప్రత్యేక రాజకీయ కథనాన్ని నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నాయా?
జ: అవును. అయితే అది పూర్తిగా తప్పుడు ప్రచారం. 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో బిజెపి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తుందని, రిజర్వేషన్లను రద్దు చేస్తుందని ప్రతిపక్షాలు ప్రజల్లో భయాందోళనలు సృష్టించాయి. కానీ ఆ రెండు ఆరోపణల్లోనూ ఏమాత్రం వాస్తవం లేదు. బిజెపి ఎప్పుడూ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ, దాని విలువలను పరిరక్షిస్తూ వస్తోంది. రాజ్యాంగాన్ని గౌరవించడం, దాని స్ఫూర్తికి అనుగుణంగా వ్యవహరించడం పట్ల మాకు సంపూర్ణ నిబద్ధత ఉంది. రాజ్యాంగ పరిరక్షణ విషయంలో మా పార్టీ వైఖరి ఎప్పుడూ స్పష్టంగానే ఉంది.
ప్ర: పార్లమెంటులో చర్చలకు ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీనిపై మీ సమాధానం ఏమిటి?
జ: ఈ ఆరోపణలో ఏమాత్రం నిజం లేదు. పార్లమెంటరీ సలహా సంప్రదింపుల కమిటీ సమావేశాల్లోనూ, అఖిలపక్ష సంప్రదింపుల్లోనూ కాంగ్రెస్‌తో సహా అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొంటారు. ఏయే అంశాలపై చర్చించాలి, పార్లమెంటు సజావుగా సాగేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే విషయాలపై అందరూ కలిసి నిర్ణయాలు తీసుకుంటారు. అయితే ఆ నిర్ణయాలను ప్రతిపక్షాలు గౌరవించడం లేదు. సభాపతి ఇచ్చే ఆదేశాలను కూడా పట్టించుకోవడం లేదు. రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్లమెంటు సమర్థంగా పనిచేసేలా చూడటంకంటే, తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదంటూ తప్పుడు ప్రచారం చేయడంపైనే ఎక్కువ ఆసక్తి చూపుతున్నట్లు కనిపిస్తోంది. పదేపదే సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగించడం వెనుక నిజమైన పార్లమెంటరీ చర్చలపై ఆసక్తి కంటే రాజకీయ ప్రయోజనాలే ప్రధానంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో చర్చలు, వాదోపవాదాలకు పార్లమెంటు వేదిక కావాలి. కానీ ప్రతిపక్షాల తీరు సభా కార్యకలాపాలను సజావుగా సాగనివ్వడం లేదు.
ప్ర: ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) అమలు బిజెపి పాలిత రాష్ట్రాలకే పరిమితం కానుందా?
జ: ఉమ్మడి పౌరస్మృతి అమలు చేయాలన్న ఆలోచన రాజ్యాంగ నిర్మాతలదే. రాజ్యాంగంలోని 44వ అధికరణలో దీనికి సంబంధించిన మార్గదర్శకాలను పొందుపరిచారు. దేశంలో ఉమ్మడి పౌరస్మృతి అవసరంపై సుప్రీంకోర్టు కూడా పలు సందర్భాల్లో తన అభిప్రాయాలను వెల్లడించింది. కొన్ని రాష్ట్రాలు ముందుకొచ్చి యూసీసీ అమలుకు సిద్ధపడటం మంచి పరిణామం. గోవాలో చాలా కాలంగా ఉమ్మడి పౌరస్మృతి అమల్లో ఉంది. అక్కడ బిజెపి అధికారంలో లేని సమయంలో కూడా ఈ విధానం కొనసాగింది. దేశవ్యాప్తంగా ఉమ్మడి పౌరస్మృతి అమలు జరగాలని మేం విశ్వసిస్తున్నాం. ఈ లక్ష్య సాధనకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. దీనికి రాజ్యాంగపరమైన ప్రాతిపదిక కూడా ఉంది. అలాంటప్పుడు కొన్ని రాష్ట్రాలకే దీని అమలును ఎందుకు పరిమితం చేయాలి? దేశమంతటా అమలు చేయకపోవడానికి ఎలాంటి కారణమూ లేదు. ఈ అంశం రాజకీయ పార్టీల ఎన్నికల మేనిఫెస్టోల్లో కూడా చోటు చేసుకుంటోంది. ఉమ్మడి పౌరస్మృతి దేశవ్యాప్తంగా అమల్లోకి రావాలన్నది మా ప్రభుత్వ అభిమతం.
ప్ర: పెండింగ్ కేసుల సంఖ్యను తగ్గించేందుకు ప్రభుత్వం ఎలాంటి నిర్దిష్ట చర్యలు చేపడుతోంది?
జ: ఈ దిశగా మేం చేపడుతున్న ముఖ్యమైన కార్యక్రమాల్లో సాయంత్రం కోర్టుల ఏర్పాటు ఒకటి. కొన్ని హైకోర్టుల సహకారంతో ప్రయోగాత్మక ప్రాతిపదికన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నాం. ఈ కార్యక్రమంలో పదవీ విరమణ చేసిన న్యాయమూర్తుల సేవలను కూడా వినియోగించుకోవాలని భావిస్తున్నాం. ప్రతిపాదిత విధానం ప్రకారం, సాధారణంగా పగటిపూట పనిచేసే కోర్టులు సాయంత్రం మరికొన్ని గంటలపాటు అదనంగా సమావేశమై కేసుల విచారణ చేపడతాయి. తద్వారా కేసుల పరిష్కారాన్ని వేగవంతం చేయడంతోపాటు పెండింగ్ కేసుల భారాన్ని తగ్గించవచ్చు. తొలుత మూడు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ ప్రయోగాత్మక కార్యక్రమాన్ని ప్రారంభించాలని యోచిస్తున్నాం. బీహార్, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్‌లలో ఈ పథకాన్ని అమల్లోకి తీసుకురావాలని ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. త్వరలోనే ఈ కార్యక్రమం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ ప్రయోగం పనితీరును, ఫలితాలను సమీక్షించిన అనంతరం ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించే అంశాన్ని పరిశీలిస్తాం. అదేవిధంగా లోక్ అదాలత్‌ల ద్వారా కేసులను పరిష్కరించడం, వాటి సంఖ్యను తగ్గించడం పైనా ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. ప్రత్యామ్నాయ వివాద పరిష్కార విధానం కూడా మరో ముఖ్యమైన అంశం. ఈ విధానంలో వివాదంలో ఉన్న రెండు పక్షాల మధ్య ఒక నిష్పాక్షికమైన మూడో వ్యక్తి మధ్యవర్తిత్వం వహిస్తారు. ఇరు పక్షాలు పరస్పరం మాట్లాడుకునేందుకు, చర్చలు జరిపేందుకు, అంగీకారయోగ్యమైన పరిష్కారానికి రావడానికి ఆయన సహకరిస్తారు. ఈ విధానం ద్వారా న్యాయస్థానాలపై కేసుల భారం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. దీనితోపాటు ముందస్తు మధ్యవర్తిత్వం (ప్రీ-మీడియేషన్)పైనా మేం దృష్టి సారిస్తున్నాం. వివాదాలు దీర్ఘకాలిక న్యాయపోరాటాలుగా మారకముందే వాటిని పరిష్కరించేందుకు ఈ విధానం ఉపయోగపడుతుంది. కోర్టుల వరకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఇరు పక్షాల మధ్య చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకునే అవకాశం కల్పించడం దీని ప్రధాన ఉద్దేశం. ఈ చర్యలన్నీ న్యాయవ్యవస్థపై భారాన్ని తగ్గించి, ప్రజలకు సత్వర న్యాయం అందించేందుకు దోహదపడతాయి.
ప్ర: కొత్తగా తీసుకొచ్చిన మూడు నేర న్యాయ చట్టాలు కేసుల సంఖ్యను తగ్గించడంలో, న్యాయ పంపిణీ వ్యవస్థను వేగవంతం చేయడంలో సహాయపడుతున్నాయా?
జ: అవును. ప్రాథమికంగా అందుతున్న సంకేతాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయి. కొత్త నేర న్యాయ చట్టాలు న్యాయ పంపిణీ ప్రక్రియను మెరుగుపరచడంతోపాటు, కోర్టులపై అనవసరమైన భారం మోపకుండా కేసులను నిర్ణీత సమయంలో పరిష్కరించేందుకు దోహదపడుతున్నాయి. ఈ చట్టాల ద్వారా విచారణలు, న్యాయ ప్రక్రియలను నిర్దిష్ట కాలపరిమితిలో పూర్తి చేసేందుకు అవసరమైన విధానాలను ప్రవేశపెట్టాం. ఈ కొత్త చట్టాల కింద ఐదు ఈ-ప్లాట్‌ఫామ్‌లను అభివృద్ధి చేశాం. తొలుత చండీగఢ్, గుజరాత్, దిల్లీలలో ప్రయోగాత్మక ప్రాతిపదికన వీటిని ప్రారంభించాం. ఈ డిజిటల్ వేదికల ద్వారా కోర్టుల ఉత్తర్వులు, తీర్పులను జైళ్ల అధికారులకు ఎలక్ట్రానిక్ రూపంలో పంపించవచ్చు. దీనివల్ల సంబంధిత అధికారులకు న్యాయస్థానాల ఆదేశాలు సత్వరమే అందుతాయి. వాటిపై వెంటనే అవసరమైన చర్యలు తీసుకునేందుకు వీలవుతుంది. తద్వారా న్యాయ ప్రక్రియలో జాప్యాన్ని తగ్గించి, న్యాయ పంపిణీ వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దవచ్చు.
ప్ర: నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ల అమలుపై ప్రభుత్వ వైఖరి ఏమిటి?
జ: ఈ రెండు అంశాలపైనా ప్రభుత్వం పనిచేస్తోంది. ఇందుకు సంబంధించిన బిల్లులను లోక్‌సభలో ప్రవేశపెట్టాం. పార్లమెంటుతోపాటు ఇతర చట్టసభల్లోనూ మహిళలకు వారికి దక్కాల్సిన ప్రాతినిధ్యం కల్పించాలన్నది మా ప్రభుత్వ నిబద్ధత. అయితే ఈ చట్టాలకు పార్లమెంటులో అవసరమైన మద్దతును ప్రతిపక్షాలు అందించలేదు. ముఖ్యంగా కాంగ్రెస్, ఆ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ ప్రతిపాదిత రిజర్వేషన్లను ఉద్దేశించిన రూపంలో అమలు చేసేందుకు మద్దతు ఇవ్వడానికి విముఖత చూపుతున్నట్లు కనిపిస్తోంది. ఈ అంశంపై పార్లమెంటు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించడాన్ని కూడా రాహుల్ గాంధీ కోరుకోవడం లేదు. బదులుగా, ప్రస్తుత లోక్‌సభలో ఉన్న 543 స్థానాల సంఖ్యను యథాతథంగా కొనసాగిస్తూ మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని ఆయన కోరుతున్నారు. అయితే అవసరమైన నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ చేపట్టకుండా ఇది ఎలా సాధ్యమవుతుంది? ఈ ప్రక్రియ కోసం పునర్విభజన కమిషన్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. నియోజకవర్గాల పునర్విభజన అనేది జనగణనతో ముడిపడి ఉన్న అంశం. కాబట్టి ఈ ప్రక్రియకు సంబంధించిన రాజ్యాంగపరమైన, పరిపాలనాపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.

