రాహుల్ జపమే గాని పెట్టుబడుల ప్రస్తావన లేని ‘భారత్ సమ్మిట్’
“ప్రపంచవ్యాప్తంగా ప్రగతిశీల రాజకీయ శక్తుల మధ్య అంతర్జాతీయ సంబంధాలను బలోపేతం చేయడం, తెలంగాణ అభివృద్ధి, పెట్టుబడుల అవకాశాలు, ప్రభుత్వ విధానాలను అంతర్జాతీయ ప్రతినిధులకు పరిచయం చేయడం” లక్ష్యంగా ఏఐసీసీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్భాటంగా హైదరాబాద్ లో నిర్వహించిన ‘భారత్ సమ్మిట్’లో ఎక్కడా పెట్టుబడుల ప్రసక్తి కనిపించని లేదు. కేవలం రాజకీయ ప్రసంగాలకు పరిమితమైంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ను అంతర్జాతీయంగా ప్రొజెక్ట్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ సదస్సు జరిపినట్లు కనిపించింది కానీ, ఎక్కడా నిర్దుష్టమైన అంశాలపై చర్చలు జరిగిన దాఖలాలు లేవు. తెలంగాణకు అంతర్జాతీయ పెట్టుబడుల కోసం రోడ్‌మ్యాప్ తయారు చేస్తామంటూ రూ.50 కోట్ల ప్రజాధనం ఖర్చు పెడుతూ నిర్వహించిన సదస్సు ద్వారా తెలంగాణకు ఒరిగిందేమిటో ప్రభుత్వం వెల్లడించాలనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
కేవలం రాహుల్ గాంధీని వచ్చే లోక్‌సభ ఎన్నికల సమయానికి ప్రధాని అభ్యర్థిగా, ఒక బలమైన నాయకుడిగా నిలబెట్టే ప్రయత్నంలో భాగంగానే ఈ సదస్సు నిర్వహించారనే విమర్శలున్నాయి. సదస్సు ప్రధాన ఉద్దేశాల్లో రాహుల్ ప్రపంచ దృక్పథాన్ని అంతర్జాతీయ సమాజానికి పరిచయం చేయడం కూడా ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ ముందుగానే వెల్లడించారు. 2029 తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రావడం, పార్టీ నేతలు కీలక రాజ్యాంగ పదవుల్లోకి రావాలనే ఆకాంక్షను సైతం ఆయన వ్యక్తం చేశారు. సాధారణంగా అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సుల్లో వివిధ దేశాల పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరుగడం, ఒప్పందాలు కుదరడం, కొత్త పరిశ్రమల ఏర్పాటుకు మార్గం సుగమం కావడం సహజం. కానీ భారత్ సమ్మిట్‌లో ఆ దిశగా ఒక్క ఒప్పందం చేసుకున్న దాఖలాలు లేవు. పైగా, చెప్పుకోదగిన పారిశ్రామిక వేత్తలు ఎవ్వరూ పాల్గొననే లేదు. ఐటీ, పారిశ్రామికాభివృద్ధి, ఆర్థిక అసమానతలు, వాతావరణ మార్పులు, ప్రజాస్వామ్యం వంటి అంశాలపై చర్చలు జరిగినా, వాటిని రాష్ట్రానికి పెట్టుబడులుగా మలిచే కార్యాచరణ గురించి ఎవ్వరూ ప్రస్తావించనే లేదు. పైగా, సదస్సు ఆద్యంతం రాహుల్ గాంధీ నాయకత్వంపై పొగడ్తలు కురిపించడంతో పాటు కేంద్ర ప్రభుత్వంపై, ప్రధాని మోదీ, పారిశ్రామికవేత్త ఆదానీలపై విమర్శలు గుప్పించేందుకే రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేతలు ప్రాధాన్యమిచ్చారు. రాహుల్ స్పష్టంగా కేంద్ర ప్రభుత్వంపై ఏ విధంగా పోరాటం చేయాలో చెప్పడం గమనార్హం.
భారత్ సమ్మిట్‌కు 70కి పైగా దేశాల నుంచి వివిధ రంగాల నిపుణులు, విధానకర్తలు, రాజకీయ ప్రముఖులు, మేధావులు కలిపి వెయ్యి మంది దాకా ప్రతినిధులు హాజరవుతారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, నిర్వాహకులు చెప్పుకొంటూ వచ్చారు. అయితే, వాస్తవానికి సదస్సు అంతా కాంగ్రెస్ ప్రచారవేదికగా మారిపోయింది. అంతర్జాతీయ నిపుణులు, మేధావుల సంగతేమో గానీ సదస్సు మొత్తం జాతీయ, రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో నిండిపోయింది.
ఇటలీ నేత ‘వోట్ చోర్’ నినాదంతో ‘దేశద్రోహం’
కాగా, పార్టీ ఆఫ్ యూరోపియన్ సోషలిస్ట్స్ (పీఈఎస్) ప్రధాన కార్యదర్శి, ఇటాలియన్ నాయకుడు గియాకోమో ఫిలిబెక్, ప్రతిపక్ష నినాదమైన “వోట్ చోర్, గడ్డి చోడ్”ను లేవనెత్తి, దానిని “ఓటు దొంగ, నీ సీటు వదిలిపెట్టు” అని అనువదించారు. అలా చేస్తున్నప్పుడు రాహుల్ గాంధీ నవ్వుతూ కనిపించారు. కాంగ్రెస్ సోదర పార్టీలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రగతిశీల మేధావుల సమ్మేళనంగా తెలంగాణ ప్రభుత్వం ఈ సమ్మిట్‌కు ఆతిథ్యం ఇచ్చింది. పీఈఎస్ యూరోపియన్ యూనియన్‌లోని మధ్య-వామపక్ష సామాజిక ప్రజాస్వామ్య పార్టీల గొడుగు పార్టీ. దీనికి యూరోపియన్ పార్లమెంట్లో 100కు పైగా సీట్లు ఉన్నాయి. దీనిపై స్పందిస్తూ, కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఎక్స్ లో ఇలా పోస్ట్ చేశారు: “ఒక విదేశీయుడు భారతదేశాన్ని అవమానించినప్పుడు ఎవరైనా నవ్వడం మీరు ఎప్పుడైనా చూశారా? భారతదేశాన్ని అవమానించడానికి ఏ భారతీయుడు విదేశాలకు వెళ్తాడని నేను అడగడం లేదు.” మహారాష్ట్రలో జరిగిన ఒక ర్యాలీలో హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ, వరుసగా మూడు లోక్‌సభ ఎన్నికలలో ఓడిపోయిన “నిరాశను కాంగ్రెస్ పార్టీ వెళ్లగక్కుతోందని” ధ్వజమెత్తారు. “కాంగ్రెస్ దేశవ్యాప్తంగా, విదేశాల నుండి వామపక్ష భావజాల ప్రచారకులను ఆహ్వానించింది, కాంగ్రెస్ ‘రాకుమారుడు’ కూడా అక్కడికి వెళ్లారు. దానికి వారు ‘భారత్ సదస్సు’ అని పేరు పెట్టారు, అయినప్పటికీ రాహుల్ గాంధీజీ ఒక అంతర్జాతీయ సదస్సులో భారత్ వ్యతిరేక అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ప్రపంచవ్యాప్తంగా భారతదేశాన్ని అప్రతిష్టపాలు చేయడానికి పనిచేశారు.” రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలు చేస్తూ “అంతర్జాతీయ వేదికలపై భారతదేశాన్ని అప్రతిష్టపాలు చేస్తున్నారని” కూడా ఆయన ఆరోపించారు.
ఏ గ్రూప్ ఫోటో చూసినా సంగం మందికి పైగా కాంగ్రెస్ వారే!
ఏ ప్యానెల్ చర్చలో పరిశీలించినా వారే ఉన్నారు. ఒక సందర్భంలో వేదికపై గ్రూప్ ఫొటో దిగే సమయంలో 25 మంది ఉంటే.. అందులో 13 మంది కాంగ్రెస్ నేతలు ఉండటం గమనార్హం. వీరిలో స్పీకర్, మండలి చైర్మన్, సీఎం, ఆరుగురు మంత్రులు ఉన్నారు. 12 మంది మాత్రమే విదేశీ ప్రతినిధులు ఉండగా, వారు కూడా చిన్న చిన్న దేశాలకు సంబంధించిన వారే. పైగా, వారిలో ఎక్కువగా భారతదేశంలో విధినిర్వహణలో ఉన్నవారుగా కనిపించారు. సదస్సులో పాల్గొనబోయే వెయ్యి మందిలో 315 మంది వరకు విదేశీ ప్రతినిధులు ఉంటారని నిర్వాహకులు ప్రచారం చేశారు. కానీ 115 మంది మించి రాలేదని తెలుస్తున్నది. కేంద్ర ప్రభుత్వం విదేశీ ప్రతినిధుల వీసాలు రద్దు చేయడమే ఇందుకు కారణమని కాంగ్రెస్ ఆరోపిస్తున్నది. కానీ విదేశీ ప్రతినిధులు ఆసక్తి లేకపోవడం వల్లే సదస్సుకు హాజరుకాలేదని తెలుస్తున్నది.
సదస్సు జరిగిన తీరుతెన్నులు, అంతర్జాతీయ ప్రతినిధులను రప్పించడంలో రాష్ట్ర నాయకత్వం, నిర్వాహకుల వైఫల్యంపై రాహుల్ గాంధీ స్వయంగా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. సదస్సు పూర్తయిన తర్వాత అంతర్జాతీయ స్థాయి సదస్సు అని చెప్పి కనీస సమన్వయం లేకుండా వ్యవహరించడంపై ఆయన వారిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తున్నది. విదేశాల నుంచి అంతర్జాతీయ స్థాయి వ్యక్తులను రప్పించడంలో ఎందుకు విఫలమయ్యారని ప్రశ్నించినట్లు తెలిసింది. స్థాయికి తగిన విదేశీ ప్రతినిధులు లేకుండా ఇంత పెద్ద సదస్సు నిర్వహించి ప్రయోజనం ఏమిటని నిలదీసినట్టు సమాచారం. సదస్సులో విదేశీ ప్రతినిధుల కన్నా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలే ఎక్కువ కనిపించారని, ఈ మాత్రం దానికి అంతర్జాతీయ సదస్సు అని పేరు పెట్టాలా? అంటూ ఆయనే అసంతృప్తి వ్యక్తం చేశారని చెబుతున్నారు. చెప్పుకోదగిన సంఖ్యలో విదేశీ ప్రతినిధులు లేకపోతే పరువు పోతుందనే ఉద్దేశంతోనే హడావుడిగా ఒక్కరోజు ముందు మీడియా సమావేశంలో కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ వీసాల రద్దు అంటూ చెప్పుకొచ్చారు. వంద మందికి వీసా నిరాకరించారని అంటుండగా మిగిలిన వారెందుకు హాజరుకాలేదు? ఒకవేళ అదే నిజమైతే ఎవ్వరి వీసాలు రద్దు చేశారో వారి పేర్లను ఎందుకు బయట పెట్టలేదనే ప్రశ్న తలెత్తుతుంది.
దళిత, బీసీ మంత్రులకు అవమానం
కాంగ్రెస్ ప్రభుత్వంలో దళిత, బహుజన మంత్రుల పట్ల వ్యక్తం అవుతున్న వివక్ష ఈ సదస్సులో స్పష్టంగా కనిపించింది. అంతర్జాతీయ వేదికపై దళిత నేత, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండానే సభను ముగించారు. రాష్ట్ర మంత్రివర్గంలో దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్ రెడ్డికి మాత్రమే ప్రసంగించే అవకాశం కల్పించి, సమయం మించిపోతుండటంతో సీఎం రేవంత్‌రెడ్డి కంటే ముందే రాహుల్ గాంధీ ప్రసంగించి వెళ్లిపోయారు. ఆయన తర్వాత ఇద్దరు విదేశీ ప్రతినిధులు ప్రసంగించగా, చివరగా ముఖ్యమంత్రి ప్రసంగించారు. సీఎం కంటే ముందుగా భట్టి విక్రమార్కకు మాట్లాడే అవకాశం ఇచ్చి ఉంటే అంతర్జాతీయ వేదికపై దళిత ఉప ముఖ్యమంత్రికి సముచిత గౌరవం దక్కేదని దళిత సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు. అంతేగాక భారత్ సమ్మిట్ ప్యానెల్ డిస్కషన్ కోసం ప్రత్యేకంగా ముద్రించిన ఆహ్వాన పత్రికలోనూ మంత్రులు వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ పేర్ల పక్కన మంత్రి హోదాను విస్మరించి, కేవలం ఎమ్మెల్యేలుగానే పేర్కొనడం మొదట్లోనే విమర్శలకు దారి తీసింది.
చలసాని నరేంద్ర
