Dr. K.Laxman

విద్యుత్ కొనుగోలుపై బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్

PressMeet BJPవిద్యుత్ కొనుగోలు విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం అక్రమాలకు పాల్పడితే.. ఇప్పుడు కాంగ్రెస్ అవినీతిపై విచారణ జరిపించకుండా మీనమేషాలు లెక్కపెడుతోందని బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్ మండిపడ్డారు. చవకగా వచ్చే విద్యుత్ కాదని కమీషన్ల కోసం ఇతర సంస్థల నుండి ఎక్కువ ధరతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకున్నారని గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. పాలన విషయంలో బీఆర్ఎస్ అడుగుజాడల్లోనే కాంగ్రెస్ సర్కారు నడుస్తోందని దుయ్యబట్టారు. పాలన పక్కనబెట్టి సీఎం రేవంత్ రెడ్డి చేరికలపై దృష్టి పెట్టారని విమర్శించారు. స్వార్థ రాజకీయాల కోసం తెలంగాణను అంధకారంగా మార్చొద్దని హెచ్చరించారు. మార్చ్ 22న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో ఏనాడూ ప్రజలను పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘భవిష్యత్తు తెలంగాణ విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఎన్టీపీసీ థర్మల్ ప్రాజెక్టు ద్వారా 4వేల మెగావాట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. థర్మల్ ప్రాజెక్టులో 85శాతం విద్యుత్ ను రాష్ట్రానికే కేటాయించారు. అందుకనుగుణంగా మొదటి దశలో 1600 మెగావాట్లతో కూడిన సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ప్రాజెక్టు రెండవ దశను 2016-17లో రూ.17,739 కోట్ల అంచనాలతో రూపొందిస్తే 2022-23 ధరలతో తిరిగి మదింపు చేయాల్సి ఉందని పీపీఏకి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు రాలేదు. ఆర్టీఐ ద్యారా ఎన్టీపీసీ తాజాగా అందించిన సమాచారం ప్రకారం… అక్టోబర్ 23 నుండి జనవరి 29వరకు తెలంగాణ ప్రభుత్వానికి మూడు లేఖలు రాశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు విషయంలో అక్రమాలకు పాల్పడిందన్న మా ఆరోపణలు ఇప్పుడు నిజమని తెలుస్తోంది. చవకగా వచ్చే విద్యుత్ ని కాదని గత బీఆర్ఎస్ ప్రభుత్వం కమీషన్ల కోసం ఇతర సంస్థల నుండి ఎక్కువ ధరతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకున్నారు. గతంలో భారతీయ జనతా పార్టీ తరుఫున మేం కూడా చెప్పినం. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతి, అక్రమాలను గతంలో కాంగ్రెస్ నాయకులు కూడా ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం పీపీఏలను కుదుర్చుకోవడానికి ఎందుకు మీనమేషాలు లెక్కపెడుతోంది? పీపీఏలు కుదుర్చుకోవాలని గత ఏడాది అక్టోబర్ 5న గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి సూచిస్తే లెక్కచేయలేదు. కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వానికి జనవరి 9న ఒక లేఖ, జనవరి 29న 2వ లేఖ రాస్తే స్పందించలేదు. ఫిభ్రవరి 10 లోగా స్పందించకపోతే వేరే రాష్ట్రాలతో ఒప్పందం చేసుకుంటామని చెప్పినప్పటికి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి స్పందించలేదు. హెచ్చరించినా గత బీఆర్ఎస్ ప్రభుత్వ మాదిరిగానే ఎందుకు పట్టించుకోవట్లేదు? కమీషన్ల కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వ అడుగుజాడల్లోనే ప్రస్తుత కాంగ్రెస్ నాయకులు నడవాలనుకుంటున్నారా..?

వేసవి మొదలవకముందే రాష్ట్రంలో కరెంటు కోతలు మొదలయ్యాయి. కరెంటు కోతలతో రాత్రి సమయంలో పొలం దగ్గరికి వెళ్లిన రైతు పాముకాటుకు గురై చనిపోయిన ఘటనలు ఉన్నాయి. కరెంటు కోతల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఎన్టీపీసీతో పీపీఏ కుదుర్చుకొని కరెంటు కోరతలు అధిగమించవచ్చు కానీ, రాష్ట్ర ప్రభుత్వానికి తీరిక లేదు. తక్కువ రేటుకే ఎన్టీపీసీ ద్వారా కరెంటిస్తామని ముందుకు వచ్చినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ముందుకు రావడం లేదు..? ఎన్నికలు సమీపించడంతో గేట్లు తెరుస్తున్నామని చెప్తున్న రేవంత్ రెడ్డి.. మరి, విద్యుత్ ఒప్పందాల సంగతి ఎవరు చూడాలి..? పాలనను గాలికి వదిలేసి వాటాల పంపకాల కోసం ఒప్పందాలను ఖాతరు చేయడం లేదా..? చత్తీస్ ఘడ్ రాష్ట్రంతో 12ఏండ్ల విద్యుత్ ఒప్పందాన్ని కుదుర్చుకుని తెలంగాణ డిస్కంలను అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగానే కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తోందా..? భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లను సబ్ క్రిటికల్ టెక్నాలజీతో కట్టారని అసెంబ్లీలో రేవంత్ రెడ్డి శ్వేతపత్రం విడుదల చేశారు. అందులో జరిగిన అవినీతిని బయట పెడతామని స్వయంగా ఆయనే అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. అవినీతి విషయంలో విచారణ జరిపి బాధ్యుల మీద, అక్రమార్కుల మీద చర్య ఎందుకు తీసుకోవడం లేదో సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. మేడిగడ్డ ప్రాజెక్టులో, ధరణిలో, భూ మాఫియాలో జరిగిన అవినీతి మీద విచారణ చేసి బాధ్యుల మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? అవినీతిపరులతో కలిసి వాటాలు పంచుకోవడానికేనా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా కళ్లు తెరిచి విద్యుత్ మీద దృష్టి సారించి, తెలంగాణను అంధకారంలోకి నెట్టకూడదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నా.’’ అని అన్నారు. ఈ సమావేశంలో బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధులు ఎన్వీ సుభాష్, పోరెడ్డి కిషోర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.