మేడిగడ్డ పిల్లర్ల కుంగుబాటుపై రాద్ధాంతమేనా!
గత ఏడాది కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ పిల్లర్ల కుంగుబాటుతో ఈ ప్రాజెక్ట్ మొత్తం నిర్వీర్యమయ్యే పరిస్థితులు దాపురిస్తుంటే అప్పటి కేసీఆర్ ప్రభుత్వం గాని, తర్వాత అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం గాని అవసరమైన మరమ్మతులు చేయించడం పట్ల శ్రద్ధ చూపకపోవడంతో రైతులు తీవ్ర నష్టాలకు గురయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. రైతులలో ఆగ్రహావేశాలు వ్యక్తమవడంతో 6 నెలల తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం మేల్కొని మరమ్మతులపై కార్యాచరణ మొదలుపెట్టినట్టు కనిపిస్తోంది. ఎన్డీఎస్ఏ నివేదిక ఆధారంగా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన బరాజ్‌ల మరమ్మతులకు సంసిద్ధత తెలిపింది.
పిల్లర్లు కుంగిపోగానే కేంద్ర ప్రభుత్వం నిపుణుల బృందాన్ని పంపించి సమగ్ర పరిశీలన జరిపించింది. అందుకు దారితీసిన పరిస్థితులను కనుగొనే ప్రయత్నం చేయడంతో పాటు తక్షణం చేపట్టాల్సిన పనులను కూడా సూచిస్తూ వచ్చింది. అయితే, అధికారంలోకి వచ్చిన్నప్పటి నుండి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంట్రాక్టర్లతో సమావేశాలు జరుపుతూ, వారితో అవగాహనకు వచ్చే ప్రయత్నాలు చేస్తుండటమే గాని రైతులకు నష్టం కలగకుండా తక్షణం చేపట్టాల్సిన చర్యలపై దృష్టి సారించలేదు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్ 7వ బ్లాక్‌లోని 20వ పిల్లర్ కుంగుబాటునకు గురవడాన్ని ఎన్నికల ప్రచార అస్త్రంగా చేసుకున్నారు. అన్నారం, సుందిళ్ల బరాజ్‌లు కూడా కూలిపోతాయనే భయాందోళనలు వ్యక్తం అయ్యాయి. అయితే, అధికారంలోకి వచ్చాక బరాజ్‌ల మరమ్మతులు మాని, రైతుల సంక్షేమాన్ని గాలికి వదిలి, కేవలం రాజకీయ విమర్శలకు ప్రభుత్వం పరిమితం అవుతూ వచ్చింది. మంత్రులు, ముఖ్యమంత్రి స్వయంగా బరాజ్‌లను సందర్శించి మరీ చేసింది ఏమీ కనిపించడం లేదు. నీటి ఎత్తిపోతలు ఆపేసి, అప్పటికే బరాజ్‌లలో నిల్వ ఉన్న నీటిని సైతం దిగువకు వృథాగా వదిలేశారు. యాసంగిలో ప్రాజెక్టు పరిధిలోని లక్షలాది ఎకరాలు సాగు నీరందక ఎండిపోయాయి. పదేళ్లలో ఎన్నడూ లేనంతగా భూగర్భజలాలు పడిపోయాయి. ఫలితంగా రైతుల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వచ్చింది.
రైతుల్లో అసహనం, ఆగ్రహం పెరిగాక ఇప్పుడు ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ నివేదికను ముందుపెడుతూ బరాజ్‌లను మరమ్మత్తులు చేయించాలని మంత్రివర్గం నిర్ణయించినట్టు వెల్లడించారు. వచ్చే వానాకాలంలో నీటిని లిఫ్ట్ చేసే అంశాలపైనా దృష్టి పెట్టినట్టు స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వ నిపుణులు అందించిన ఇదే నివేదికను కొంచెం ముందుగా యాసంగిలోనే పట్టించుకొని ఉంటే లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయేవి కావన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికీ మరమ్మతులు ఏవిధంగా చేపట్టాలనే విషయమై ప్రభుత్వంలో స్పష్టత కనిపించడం లేదు. ఆ దిశలో ఇప్పటి వరకు చేసిన కసరత్తు ఏమీ లేదు.
సుందిళ్ళ, మేడిగడ్డ బ్యారేజ్‌లలో నీటి నిల్వ చేయకూడదని ఎన్డీఎస్ఎ మధ్యంతర నివేదిక ఇచ్చిందని చెబుతున్నారు. అందులో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్‌ల్లో గేట్లు ఎప్పుడు తెరిచే ఉంచాలని, నీటిని నిల్వ చేయవద్దని, బ్యారేజ్ డ్యామేజ్లను సరి చేయాలని ఎన్డీఎస్ఎ ఈ నివేదికలో తెలిపిందని తెలిపారు. మరోవైపు, మూడు కంపెనీలతో ఈ డ్యామేజ్ల పరిశీలన చేయాలని, సాధ్యపడితే నీటిని నిల్వ చేయకుండా లిఫ్ట్ చేసే అవకాశాన్ని కూడా పరిశీలించాలని నిర్ణయించామని అంటున్నారు.
బ్యారేజ్‌ల భద్రతపై నిపుణులతో పరిశీలన చేయించి నివేదిక తీసుకుంటామని అనడం గమనిస్తే ఇప్పటి వరకు అందుకు ప్రయత్నం ప్రారంభించలేదని స్పష్టం అవుతుంది. ఆ నివేదిక ఆధారంగానే మరమ్మతులు చేపడతామని, తక్కువ ఖర్చుతో నీటిని లిఫ్ట్ చేయడానికి అవకాశం ఉంటే పరిశీలించాలని కేబినేట్ నిర్ణయించిందని ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో కాంట్రాక్టర్లు, అప్పటి ప్రభుత్వ నేతలు అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు చేస్తూనే ఆ కాంట్రాక్టర్లతోనే మంత్రులు మంతనాలు జరపడం వారితో లోపాయికారి అవగాహనకు ప్రయత్నిస్తున్నట్లు స్పష్టం అవుతోంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ రూ.1 లక్ష కోట్ల కుంభకోణం అని, తమ ప్రభుత్వం రాగానే ఆ మొత్తాన్ని ప్రజలకు పంచిపెడతామని ఎన్నికల ప్రచారంలో చెబుతూ వచ్చిన రేవంత్ రెడ్డి ఇప్పుడా మాటలు ప్రస్తావిస్తున్న దాఖలాలు లేవు.
కృష్ణ చైతన్య