paddy procurement 00

బోగస్ గా మారిన రూ.500 బోనస్ హామీ!

న్నికల ముందు ఇచ్చిన హామీలలో మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం మినహా మారేదీ అమలు చేయకుండా రేవంత్ సర్కార్ ప్రజలను దగా చేస్తూ వస్తున్నది. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో అమలు చేస్తామంటూ ప్రకటించిన 6 గ్యారంటీలను 6 నెలలు అవుతున్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా అమలు పరచలేకపోతున్నది. ముఖ్యంగా రైతులకు ఇచ్చినా హామీలు అన్నిటినీ అటకెక్కిస్తున్నది. ప్రతి ఏటా అన్నదాతలు, కౌలు రైతులకు రూ.15,000లు రైతు భరోసా అని హామీ ఇచ్చారు. వ్యవసాయ కూలీలకు రూ.12,000 ఇస్తామని ప్రకటించారు. ప్రతి రైతుకు డిసెంబర్ 9న రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ఆర్భాటంగా చెప్పారు. కానీ ఇప్పటివరకు అతీగతీ లేదు.

తాజాగా రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో సన్నబియ్యంపై మాత్రమే బోనస్ చెల్లించాలని నిర్ణయించడం ద్వారా వరి క్వింటాల్ కు రూ.500 చొప్పున బోనస్ ఇస్తామని ఇచ్చిన హామీ సైతం బోగస్ అని తేటతెల్లమైంది. బోనస్‌ అందరికీ కాదని, సన్నవడ్లకు మాత్రమేనంటూ తాజాగా ప్రకటించి దొడ్డు రకం వడ్లు పండించే రైతులకు ప్రభుత్వం దోకా ఇచ్చింది. అది కూడా రానున్న వానకాలం సీజన్‌ నుంచి మాత్రమేనని తాజాగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. ఎన్నికల ప్రచారంలోను, పార్టీ మ్యానిఫెస్టోలోనూ ధాన్యానికి బోనస్‌ ఇస్తామని చెప్పారు తప్పితే సన్న వడ్లు అని పొరపాటున కూడా ఎక్కడా చెప్పలేదు. ఇప్పడేమో తీరిగ్గా సన్నవడ్లకే ఇస్తామని ప్రకటించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో సన్న వరి పండించే రైతులు అతికొద్దిమంది ఉన్నారు. వానకాలంలో 30-35శాతం మంది పండిస్తే, యాసంగిలో అది 10-15 శాతానికి పరిమితమవుతుంది. అదే సమయంలో దొడ్డు రకం వరి వానకాలంలో 70 శాతం, యాసంగిలో 90 శాతం సాగవుతున్నది. అలాంటిది మెజార్టీ రైతులు పండించే వడ్లకు కాదని, అతి తక్కువమంది పండించే సన్నవడ్లకు బోనస్‌ ఇస్తామనడంపై రైతుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. పైగా, దొడ్డురకం ధాన్యంతో పోలిస్తే బహిరంగ మార్కెట్‌లో సన్నవరికే డిమాండ్‌ అధికం. ప్రైవేటు వ్యాపారులు, మిల్లర్లు పోటీపడి కల్లాల వద్దకు వచ్చి మరీ కొంటారు. ఫలితంగా మద్దతు ధరకు మించి రూ.500-700 వరకు అదనంగా లభిస్తుంది. కాబట్టి వాస్తవంగా చెప్పుకోవాలంటే సన్నాలకు బోనస్‌ ఇవ్వాల్సిన అవసరం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. వానకాలం సాగయ్యే పంటలో 20-25 శాతాన్ని ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేస్తే పది శాతం ధాన్యాన్ని రైతులు తమ అవసరాల కోసం దాచుకుంటారు. మిగిలిన 5-10 శాతం ధాన్యాన్ని మార్కెట్లో విక్రయిస్తారు. కాబట్టి కొనుగోలు కేంద్రాలకు వచ్చేది సెకండ్‌ గ్రేడ్‌ సన్నాలే. అలాంటప్పుడు కొనుగోలు కేంద్రాలకు రాని వడ్లకు బోనస్‌ ఎలా ఇస్తారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. బోనస్‌ ఇస్తే గిస్తే డిమాండ్‌ లేని దొడ్డు వరికి ఇవ్వాలనీ, కానీ ఇదెక్కడి అన్యాయమంటూ రైతులు మండిపడుతున్నారు.

సన్న ధాన్యానికి మాత్రమే బోనస్‌ ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఇందులోనూ మరో మెలిక పెట్టింది. అన్ని రకాల సన్నాలకు బోనస్‌ ఇవ్వబోమని, వ్యవసాయశాఖ సూచించిన సన్న ధాన్యానికి మాత్రమే బోనస్‌ ఇస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు. ఆ సన్న రకాల జాబితాను వ్యవసాయశాఖ త్వరలోనే వెల్లడిస్తుందని పేర్కొన్నారు. రైతుల్లో ఇది మరింత గందరగోళానికి కారణమైంది. వ్యవసాయశాఖ పేర్కొన్న జాబితాలో లేని సన్నాలను సాగు చేసే రైతుల పరిస్థితి ఏంటన్నది అంతుపట్టడం లేదు. సన్నాలకు బోనస్‌ అన్న ప్రభుత్వ ప్రకటనతో రైతులు భారీగా నష్టపోనున్నారు. ప్రతి ఏడాది ప్రభుత్వం వానకాలం, యాసంగి సీజన్లకు సంబంధించి 1.20 కోట్ల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఉత్పత్తి ఎక్కువైతే అది 1.50 కోట్ల టన్నులు కూడా ఉండే అవకాశం ఉన్నది. ఇందులో 97 శాతం దొడ్డు రకం ధాన్యమే ఉంటుంది. ఈ లెక్కన చూసుకుంటే టన్నుకు రూ.500 బోనస్‌ చొప్పున 1.20 కోట్ల టన్నులకు రూ.6 వేల కోట్ల వరకు రైతులు నష్టపోయే అవకాశమున్నది. అదే సమయంలో ప్రభుత్వానికి ఆ మేరకు భారం కూడా తగ్గుతుంది. అందులో భాగంగానే ప్రభుత్వం ఇప్పుడు సన్నబియ్యం పల్లవి అందుకుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 

ఆదాయం సమకూర్చుకోలేక నానా తంటాలు పడుతున్న ప్రభుత్వం ఆర్థిక కష్టాలను ఏదోవిధంగా తగ్గించుకునే వ్యూహంలో భాగంగానే సన్నవడ్ల జపం చేస్తున్నట్లు చెబుతున్నారు. సన్నవడ్లకు బోనస్‌ ప్రకటనపై రైతుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. బోనస్‌ పేరుతో ప్రభుత్వం తమను దారుణంగా మోసం చేసిందని మండిపడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గాలి మాటలతో గారడీ చేసిన హస్తం పార్టీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు డబ్బాలో పడగానే నాలుగు కోట్ల ప్రజల సాక్షిగా తన నిజస్వరూపాన్ని బయటపెట్టింది. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం నిలబడదని, నమ్మి ఓటేసినందుకు రైతుల గొంతు కోసిన కాంగ్రెస్ సర్కార్‌ను రైతులు క్షమించరని గ్రహించాలి.

ప్రవీణ్