రైతులపై కాంగ్రెస్ బస్మాసుర హస్తం
నాడు వరి వేస్తే ఉరి అని కేసీఆర్ అంటే.. ఇప్పుడు దొడ్డు వడ్లు వేస్తే ఉరి అని రేవంత్ అంటున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖల మంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు. 45 రోజుల నుంచి ధాన్యం కొనుగోళ్లలో రైతులకు కనీస వసతులు లేకపోయినా ప్రభుత్వ పరంగా ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని విమర్శించారు. చెయ్యి గుర్తుకు ఓటు వేసినందుకు రైతులకు చెయ్యి ఇస్తున్నారని అన్నారు. రైతుల మీద కాంగ్రెస్ ప్రభుత్వం బస్మాసుర హస్తం పెడుతున్నదని మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల ఇబ్బందులను స్వయంగా తెలుసుకునేందుకు కిషన్ రెడ్డి మే 23న యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం రాఘవాపూర్, రుద్రవెల్లి గ్రామాల్లోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఆరా తీశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయక, వెయిటింగ్లో పెట్టి రైతులను ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం దొడ్డు బియ్యాన్ని కొనేందుకు సిద్దంగా ఉన్నా.. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదంటూ ప్రశ్నించారు. ‘‘ట్రాన్స్పోర్టు, బస్తాలు, బస్తా సుతిల్, హమాలి చార్జీలు ఇలా మొత్తం కేంద్రమే రాష్ట్రానికి చెల్లిస్తుంది. సివిల్ సప్లయ్స్ డిపార్ట్ మెంట్ సహా ఐకేపీ వారికి కూడా కేంద్రమే కమిషన్ ఇస్తున్నది. రాష్ట్ర సర్కారు కొనుగోళ్ల కోసం ఒకవేళ బ్యాంకు నుంచి అప్పు తీసుకుంటే దాని వడ్డీ కూడా కేంద్రమే చెల్లిస్తుంది… రైతుల ధాన్యం కొనడంలో రాష్ట్ర సర్కారుకు ఏం నొప్పి? 45 రోజులుగా రైతుల ధాన్యం తీసుకొచ్చి కేంద్రాల్లో ఎండకు ఎండుతూ.. వానకు నానుతూ ధాన్యం మొలకలొస్తుంటే ఈ ముఖ్యమంత్రికి ఏ మాత్రం సిగ్గనిపిస్తలేదా? రైతుల సమస్యల కంటే కూడా రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎన్నికలే ముఖ్యమయ్యాయి.
100 రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పారు. అందులో రైతులకు సంబంధించిన గ్యారంటీలు ఏమైపోయాయి? రైతులకు ఇచ్చిన గ్యారంటీ ఎటు పోయింది? రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి గ్యారంటీల పేరుతో ఊరూరా తిరిగారు కదా.. సోనియా సంతకం చేసిన గ్యారంటీలు ఊరూరా పంచారు కదా? ఏది మీ బోనస్? బోనస్ అంటే.. వడ్లు మొలకలు రావడమేనా? ఇదేనా ఇందిరమ్మ రాజ్యం? ధాన్యం కొనుగోళ్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. చేతగాని ప్రభుత్వంగా మారింది. డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. దేవుడి మీద ఒట్లు వేస్తూ.. ఆగస్టు అంటూ వాయిదాలు పెడ్తున్నారు. మీరు మాఫీ చేయలేదు.. రైతులు అప్పు చెల్లించలేదు. దీంతో కొత్తగా బ్యాంకులు లోన్లు ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు రైతులు పంటలు ఎలా సాగు చేయాలో రాహుల్ గాంధీ చెప్పాలి. ఇప్పటికైనా ప్రభుత్వం సోయి తెచ్చుకొని రైతు రుణమాఫీ చేయాలి. దొడ్డు రకం వడ్లు, సన్న రకం వడ్లు అని చూడకుండా అన్నింటికి రూ.500 బోనస్ ఇవ్వాలి. ఈ ప్రభుత్వం సన్నరకం వడ్ల సాగును ప్రోత్సహించాలనుకుంటే.. వాటికి రూ.1000 బోనస్ ఇవ్వండి, దొడ్డు వడ్లకు రూ.500 బోనస్ ఇవ్వాలి. 6 గ్యారంటీల అమలును పక్కన పడేసి.. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు దిల్లీ టూర్లు, ఎన్నికల ప్రచారానికి వెళ్తున్నారు. ఇక్కడి సంపదను కొళ్లగొడుతూ దిల్లీ పార్టీకి సూట్ కేసులు మోస్తున్నారు. ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన కొనుగోళ్లు పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ సీజన్ కు ముందే పంట పెట్టుబడి సాయం అందించాలని బిజెపి డిమాండ్ చేస్తుంది. లేదంటే ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై త్వరలోనే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తాం.’’ అని అన్నారు. బిజెపి కిసాన్ మోర్చా, పార్టీ కార్యకర్తలు అంతా కొనుగోలు కేంద్రాలకు వెళ్లి రైతులకు అండగా నిలబడాలని, రైతుల పక్షాన పోరాడాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.

