ఆదానీపై కాంగ్రెస్ రాజకీయ అవకాశవాదం
కాంగ్రెస్, ఆదానీ గ్రూపుల మధ్య ఉన్న అనుబంధం రాజకీయాల్లో కపటత్వానికి ఒక ప్రబలమైన నిదర్శనం. ఆదానీ, బిజెపిల మధ్య రహస్య సంబంధాలు ఉన్నాయని కాంగ్రెస్ గగ్గోలు చేస్తోంది. కానీ గతంలోనూ, ఇప్పుడూ కాంగ్రెస్ చేసే పనులు ఈ కథనానికి భిన్నంగా ఉంటాయి. ఈ ఇద్దరి మధ్య చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. రాహుల్ గాంధీ, ఆయన పార్టీ ఆశ్రిత పెట్టుబడిదారీ విధానానికి వ్యతిరేకమని పైకి చెప్పుకుంటారు, కానీ వాస్తవానికి ఆదానీ సామ్రాజ్యం విస్తరించడంలో కాంగ్రెస్ కీలకమైన పాత్ర వహించింది. ఆదానీపై కాంగ్రెస్ చేస్తున్న దాడి కేవలం ఆ పార్టీ కపటత్వాన్ని మరోసారి వెల్లడిస్తోంది.
ఆదానీ గ్రూపు 1990లలో వృద్ధి చెందినప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది. 1993లో చిమన్ భాయ్ పటేల్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గుజరాత్‌లో అధికారంలో ఉన్నప్పుడు ఆయన ముద్రా పోర్టు ప్రాజెక్టుకు కేవలం చదరపు మీటరు పది పైసలు ధరకు భూమిని కేటాయించారు. కాంగ్రెస్ మద్దతు గల శంకర్ సింగ్ వాఘేలా ఆ తర్వాత మరిన్ని భూములను ఆదానీ గ్రూపునకు కేటాయించారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే గుజరాత్‌లో ఆదానీ గ్రూపు భూసేకరణలో మూడో వంతు మాత్రమే నరేంద్ర మోదీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగింది. ఆదానీపై రాహుల్ గాంధీ రాత్రింబవళ్లు దాడి చేస్తుండగానే కాంగ్రెస్ రాష్ట్రాలు ఆ సంస్థలకు ఎర్ర తివాచీ పరుస్తున్నాయి. రాజస్థాన్‌లో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం 10వేల మెగావాట్ల భారీ సౌర విద్యుత్తు ప్రాజెక్టు కోసం ఆదానీతో ఒప్పందం కుదుర్చుకుంది. జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్వహణ కాంట్రాక్టును ఆదానీకి అప్పగించింది. ఛత్తీస్‌గఢ్‌లో భూపేష్ బఘేల్ ప్రభుత్వం బొగ్గు గనుల నిర్వహణ అభివృద్ధి బాధ్యతను ఆదానీకి అప్పగించింది. హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి సుఖ్ వీందర్ సింగ్ సుక్కు ఆదానీ యాజమాన్యంలోని సిమెంట్ కర్మాగారాలను తిరిగి ప్రారంభించడానికి మధ్యవర్తిత్వం నిర్వహించారు. ఇవి చెదురుమదురు సంఘటనలు కావు. ఒకపక్క కాంగ్రెస్ నాయకత్వం జాతీయస్థాయిలో ఆదానీ గ్రూపుపై దాడులు కొనసాగిస్తుండగానే మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆదానీని ప్రసన్నం చేసుకోవడానికి ఒక పద్ధతి ప్రకారం ప్రయత్నాలు కొనసాగించాయి.
ఈ ద్వంద్వ వైఖరి కేవలం రాజకీయ నాటకమే కాదు అది బాధ్యతారాహిత్యం కూడా. భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను నిర్మించగల, పెద్దయెత్తున పెట్టుబడులను ఆకర్షించి ఉద్యోగాలు సృష్టించగల శక్తి సామర్థ్యాలు ఆదానీ గ్రూపునకు ఉన్న దృష్ట్యా కాంగ్రెస్ నేతృత్వంలోని రాష్ట్రాలతో సహా రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ గ్రూపును మంచి చేసుకోవడం తప్పనిసరి. అయినా ఈ వాస్తవాన్ని గ్రహించకుండా కాంగ్రెస్ జాతీయస్థాయిలో ఆదానీని ఒక దుష్టశక్తిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తోంది. బిజెపిని రాజకీయంగా దెబ్బతీయడానికి, రాజకీయ స్వప్రయోజనాల కోసం ఆదానీపై వ్యతిరేకతను ఒక సాధనంగా ఉపయోగించుకుంటోంది. ఆదానీ గ్రూపు ఎదుగుదలలో తన పాత్రను, కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఆదానీ కార్యకలాపాలను ఓటర్లు గమనించరని ఆ పార్టీ భావిస్తోంది. ముఖ్యంగా రాహుల్ గాంధీ నరేంద్ర మోదీపై తన దాడులకు ఆదానీని ఒక పావుగా వాడుకుంటున్నారు. ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం వల్ల ఎక్కువగా ప్రయోజనం పొందిందని చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ నిశితంగా పరిశీలిస్తే ఆయన ఆరోపణల్లో పస లేదని స్పష్టమవుతుంది. కాంగ్రెస్ గత చర్యలను, ఆదానీతో ప్రస్తుత సంబంధాలను పరిశీలిస్తే ఆయన ఆరోపణల్లోని డొల్లతనం వెల్లడవుతుంది. భారత ఆర్థిక వ్యవస్థలో లోపాలన్నిటికీ ఆదానీనే కారణమని కాంగ్రెస్ నిజంగా భావిస్తే రాజస్థాన్, ఛత్తీస్గడ్, హిమాచల్ ప్రదేశ్‌లో ఆ గ్రూపు ప్రాజెక్టులను ఇంకా ఎందుకు ఆహ్వానిస్తోంది? 1990లలో భూముల కేటాయింపు మొదలుకుని యూపీఏ ప్రభుత్వంలో ఆ గ్రూపునకు అందిన లాభాల పంట వరకు ఆదానీ గ్రూపు ఎదుగుదలలో తన పాత్రను కాంగ్రెస్ ఎందుకు నిరాకరిస్తోంది? దీనికి సమాధానం కాంగ్రెస్ రాజకీయ అవసరాల్లో ఇమిడి ఉంది. ఆదానీ గ్రూపు వృద్ధి, విస్తరణ ఏ ఒక్క రాజకీయ పార్టీ లేదా ప్రభుత్వానికి పరిమితం కాలేదు. ఈ గ్రూపు కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీలు, ఇతర ప్రతిపక్ష పార్టీలు ఏవి అధికారంలో ఉన్నా ఆయన ప్రభుత్వాల నుంచి ప్రాజెక్టులు, పెట్టుబడులు ఆమోదాలు పొందాయి. కానీ రాష్ట్రస్థాయిలో రాజకీయ నినాదాల కంటే పరిపాలన ప్రాముఖ్యం వహిస్తుంది. అందువల్ల కాంగ్రెస్ చెప్పే దానికి, చేసే దానికి చాలా తేడా కనిపిస్తుంది. ఈ వైరుధ్యం ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం గురించి కాంగ్రెస్ చేసే ఆరోపణల విశ్వసనీయతను పూర్తిగా నీరుగారుస్తుంది.
ఈ ద్వంద్వ వైఖరి రాజకీయాలకే కాదు, భారతదేశానికి కూడా హానికరం. కాంగ్రెస్ ఆదానీపై పక్షపాతంతో చేసే విమర్శల వల్ల ఆర్థిక గుత్తాధిపత్యానికి సంబంధించిన అసలు విషయాలు మరుగున పడిపోతాయి. రాజకీయాలపై కార్పొరేట్ కంపెనీల ప్రభావం గురించిన ఆందోళనలో వాస్తవం లేకపోలేదు. ఈ విషయం గురించి తప్పకుండా ఆలోచించాలి. అయితే ఈ అంశంపై సమతూకంతో కూడిన, వాస్తవాల ఆధారిత దృక్కోణం ఆవశ్యకం. ఇలా పక్షపాతంతో చర్చను పక్కదారి పట్టించడం వల్ల కాంగ్రెస్ ఏ వ్యవస్థను అయితే వ్యతిరేకించాలనుకుంటుందో అదే వ్యవస్థను అది కొనసాగించడానికి దోహదం చేస్తోంది. ఆదానీ గ్రూపును వ్యతిరేకిస్తున్నట్టు నటిస్తూనే దాని విస్తరణకు కాంగ్రెస్ సాయం చేస్తోంది. ఈ కపటత్వం కారణంగా కాంగ్రెస్ ప్రజల్లో విశ్వాసాన్ని కూడా కోల్పోతుంది. కాంగ్రెస్ చెప్పే దానికి చేసే దానికి మధ్య వైరుధ్యాన్ని గుర్తించలేనంత తెలివి తక్కువ వారేమీ కాదు ఓటర్లు. ఆదానీపై రాహుల్ గాంధీ చేసే దాడులు పత్రికల్లో పతాక శీర్షికలకు ఎక్కవచ్చేమో గానీ అదే సమయంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఆ గ్రూపుతో కొనసాగిస్తున్న భాగస్వామ్యం అతని ఆరోపణల్లోని డొల్లతనాన్ని కూడా ప్రపంచానికి తెలియజేస్తుంది. మాటలకు వాస్తవానికి మధ్య ఈ అంతరం కాంగ్రెస్‌ను ఒక అవకాశవాద పార్టీగా ప్రజల ముందు నిలబడుతుందే తప్ప సైద్ధాంతిక నిబద్ధత గల ప్రతిపక్షంగా ప్రజలు గుర్తించేలా చేయదు.
ప్రతిపక్ష పార్టీ ద్వంద్వ ప్రమాణాలను, రాజకీయ అవకాశవాదాన్ని గుర్తించగల వివేకం భారతదేశ ప్రజలకు ఉంది. బిజెపి ప్రభుత్వం ఎల్లప్పుడూ దేశ ప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తుందని, సమ్మిళిత వృద్ధి అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తుందని వారు బాగా అర్థం చేసుకున్నారు. ప్రతిపక్షం చేసే నిరాధార దాడులు, ఆరోపణలతో నిమిత్తం లేకుండా మేం సుపరిపాలన, ఆర్థిక సంస్కరణలు, సామాజిక సంక్షేమాలతో కూడిన మా ఎజెండాపైనే దృష్టి పెట్టి ముందుకు సాగుతాం.