కీలక అంతర్జాతీయ శక్తిగా భారత్
2014లో ప్రధానమంత్రిగా పదవి చేపట్టినప్పటి నుంచి ఆర్థిక, పర్యావరణ, సామాజిక రంగాల్లో సంస్కరణలు ప్రవేశపెట్టి, అమలు చేయడమే కాకుండా ప్రపంచ వేదికపై ఒక కీలకమైన నాయకుడిగా నరేంద్ర మోదీ ఎదిగారు. శాంతిసాధనలోనూ, మానవతా సహాయం అందించడంలోనూ అంతర్జాతీయ దౌత్యరంగంలో భారత్ ప్రతిష్టను ఇనుమడింప చేయడంలోనూ ఆయన నిర్వహించిన పాత్రకు వివిధ ప్రతిష్టాత్మక పురస్కారాల రూపంలో అంతర్జాతీయంగా మోదీకి విశిష్ట గుర్తింపు లభించింది. గత పదేళ్ల కాలంలో ప్రధానమంత్రి 20కి పైగా అంతర్జాతీయ అవార్డులను అందుకున్నారు. వీటిలో వివిధ దేశాల అత్యున్నత పౌర పురస్కారాలు ఉన్నాయి. ఆయన వ్యక్తిగత పలుకుబడి, అంతర్జాతీయ రాజకీయాలు, మానవతా కార్యకలాపాలలో పెరుగుతున్న భారత్ పాత్రకు ఈ అవార్డులు ఒక నిదర్శనం.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అందుకున్న పురస్కారాల్లో కొన్ని:
- 2024లో డొమినికా అధ్యక్షుడు సిల్వనీ బర్టన్ ప్రధానమంత్రి మోదీకి డొమినికా నేషనల్ అవార్డు ఆఫ్ ఆనర్‌ను ప్రదానం చేశారు. ఆయన రాజనీతిజ్ఞత, కోవిడ్-19 మహమ్మారి సమయంలో డొమినికా దేశానికి భారత్ అందించిన మద్దతు, భారత-డొమినికా సంబంధాలను బలోపేతం చేయడానికి మోదీ కనబరిచిన నిబద్ధతలకు గాను ఈ పురస్కారం ఇచ్చారు.
- ఈజిప్టు, భారత్ ల మధ్య శాంతి సహకారాలను పెంపొందిస్తూ దౌత్య సంబంధాలను బలోపేతం చేయడానికి చేసిన కృషికి ఈజిప్టు అత్యున్నత ప్రభుత్వ పురస్కారమైన ఆర్డర్ ఆఫ్ నైల్‌ను 2023లో ఆ దేశం మోదీకి ప్రదానం చేసింది.
- 2024లో రష్యా ఆర్డర్ ఆఫ్ సెంట్ ఆండ్రూస్ ది అపోస్టల్‌ను మోదీకి అందజేసింది. భారత, రష్యా సంబంధాలను పటిష్టం చేయడంలో మోదీ పాత్రకు గాను ఆయనకు లభించిన గుర్తింపు ఇది. ప్రపంచ శాంతికి, రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఆయన చేసిన కృషిని ఈ సందర్భంగా రష్యా కొనియాడింది.
- 2024లో భూటాన్ ఆర్డర్ ఆఫ్ ద డ్రాగన్ కింగ్ పురస్కారాన్ని మోదీ ప్రదానం చేసింది. ఒక విదేశీయుడికి భూటాన్ ఈ పురస్కారాన్ని ప్రకటించడం ఇదే మొదటిసారి. భారత, భూటాన్ సంబంధాలను మెరుగుపరచడానికి, దక్షిణాసియాలో శాంతిని పెంపొందించడానికి ఆయన చేసిన కృషికి గాను ఈ అవార్డును ప్రకటించారు.
- 2023లో ఫ్రాన్స్ ప్రపంచ పర్యావరణం రంగంలో మోదీ నిర్వహించిన నాయకత్వ పాత్రకు అంతర్జాతీయ శాంతి సహకారాలకు ఆయన చేసిన కృషికి గుర్తింపుగా గ్రాండ్ క్రాస్ అఫ్ ది లిజియన్ ఆఫ్ ఆనర్ అవార్డును ఆయనకు ప్రదానం చేసింది.
- 2023లో గ్రీసు అధ్యక్షుడు ఆర్డర్ ఆఫ్ ఆనర్ పురస్కారాన్ని మోదీకి ప్రకటించారు. అంతర్జాతీయ ఆర్థికాభివృద్ధి, దౌత్య సంబంధాలను మెరుగుపరచడంలో నరేంద్ర మోదీ నిర్వహించిన పాత్రకు గుర్తింపుగా ఈ పురస్కారాన్ని ప్రకటించారు.
- 2023లో అంతర్జాతీయ నాయకత్వ పాత్రకు గాను ఫిజి కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజి బహుమతిని మోదీకి ప్రకటించింది.
- 2023లో పలావు దేశం తన అత్యున్నత సాంస్కృతిక పురస్కారమైన ఇక్బాల్ అవార్డును నరేంద్ర మోదీకి ఇచ్చింది. ఆయన నాయకత్వానికి అంతర్జాతీయ సంబంధాలలో ఆయన అనుసరించిన మానవతా దృక్పథానికి గుర్తింపుగా ఈ సాంస్కృతిక పురస్కారాన్ని మోదీకి ప్రకటించారు.
- 2019లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అత్యున్నత పౌర పురస్కారం ఆర్డర్ ఆఫ్ జాయెద్‌ను మోదీకి ప్రదానం చేశారు. ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరచడంలో ఆయన మానవతా కృషికి, ముఖ్యంగా కోవిడ్ 19 సమయంలో భారత్ అందించిన సహాయ సహకారాలకు గాను ఈ అవార్డును ఇచ్చారు.
- 2019లో బహ్రెయిన్ దేశం కింగ్ హమాద్ ఆర్డర్ ఆఫ్ రినైజాన్స్ను నరేంద్ర మోదీకి ప్రకటించింది. మధ్యప్రాచ్యంలో శాంతి, అభివృద్ధికి గాను నరేంద్ర మోదీ చేసిన కృషికి, మానవతా సహాయాన్ని అందించడంలో ఆయన పాత్రకు లభించిన గౌరవం ఇది.
- ప్రాంతీయ శాంతి, సహకారాలలో మోదీ నిబద్ధతకు గుర్తింపుగా మాల్దీవులు ఆర్డర్ ఆఫ్ ది డిస్టింగ్విష్ డ్ రూల్ ఆఫ్ నిషాన్ ఇజుద్దీన్ పురస్కారాన్ని ప్రకటించింది.
- 2018లో దక్షిణ కొరియా ఇచ్చే సియోల్ శాంతి బహుమతిని అందుకున్న మొట్టమొదటి భారతీయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. అంతర్జాతీయ సహకారం, ప్రపంచ ఆర్థిక వృద్ధిలో నిర్వహించిన పాత్రకు గాను ఆయనకు ఈ అవార్డు లభించింది.
- బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ కూడా 2019లో స్వచ్ఛభారత్ అభియాన్ కార్యక్రమానికి గాను నరేంద్ర మోదీని గ్లోబల్ గోల్ కీపర్ అవార్డుతో సత్కరించింది.
- పర్యావరణ పరిరక్షణకు దోహదపడే స్వచ్ఛమైన ఇంధనాన్ని ప్రోత్సహించడానికి అంతర్జాతీయ సౌరకూటమిని ఏర్పాటు చేయడంలో నిర్వహించిన పాత్రకు గాను 2018లో ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం నరేంద్ర మోదీకి ఛాంపియన్ ఆఫ్ ది ఎర్త్ అవార్డును ప్రకటించింది.
ఈ అవార్డులకు నరేంద్ర మోదీ చేపట్టిన మానవతావాద కార్యక్రమాలు, ఒక ప్రపంచ నాయకుడిగా ఆయన ప్రతిష్టను పెంచడంలో ప్రధాన పాత్ర వహించాయి. కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని గడగడ వణికిస్తున్న సమయంలో ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలో భారత్ కోట్లలో కోవిడ్-19 వ్యాక్సిన్లను వివిధ దేశాలకు పంపించి అంతర్జాతీయంగా ప్రజల ఆరోగ్యానికి భారత నిబద్ధతను వెల్లడించింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అప్పటి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాన్స్వా హోలా కలిసి ఏర్పాటు చేసిన అంతర్జాతీయ సౌరకూటమి సుస్థిర అభివృద్ధికి దోహదం చేయడమే కాకుండా అందరికీ ఇంధనాన్ని చౌకగా అందుబాటులోకి తీసుకురావడం ద్వారా పర్యావరణ భద్రతతో కూడిన శాంతికి భరోసా కల్పిస్తుంది. భూకంపాల నుంచి పెనుతుఫానుల వరకు అంతర్జాతీయ విపత్తులు సంభవించినప్పుడు బాధితులకు సహాయం అందించడంలో మోదీ ముందు నిలిచి ఒక బాధ్యతాయుతమైన అంతర్జాతీయ శక్తిగా భారత్ పాత్రను నొక్కి చెప్పారు.
నరేంద్ర మోదీ నేతృత్వంలో భారత్ అనుసరించిన ఆర్థిక విధానాలు దేశ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయడమే కాకుండా భారత్‌ను అంతర్జాతీయ వాణిజ్యంలో ఒక కీలకమైన శక్తిగా నిలిపాయి. భారత్ అంతర్జాతీయ ఆర్థిక విధానాలను ప్రభావితం చేసే స్థాయికి ఎదిగింది. మోదీ విదేశాంగ విధానం పాశ్చాత్య , ప్రాచ్య దేశాల మధ్య సమతూకం పాటిస్తూ ప్రపంచ దౌత్యరంగంలో భారత్‌ను కీలక భాగస్వామిగా మార్చింది. నరేంద్ర మోదీ ప్రతిపాదించగా ఐక్యరాజ్యసమితి ఆమోదించిన అంతర్జాతీయ యోగా దినోత్సవం వంటి కార్యక్రమాలు భారత్ సున్నిత శక్తిని ప్రతిబింబిస్తూ ప్రపంచ శాంతిని, శ్రేయస్సును పెంపొందిస్తున్నాయి.
శాంతి, సహకారం, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలుగా కొత్త ప్రపంచ వ్యవస్థను రూపొందించడంలో మోదీ మానవతా కృషి నిర్వహిస్తున్న పాత్రకు ఈ అవార్డులు పురస్కారాలు నిదర్శనం. ఈ అంతర్జాతీయ గుర్తింపు మోదీ వ్యక్తిగత విజయాలనే కాక మరింత సమానత్వంతో కూడిన శాంతియుత ప్రపంచాన్ని నిర్మించాలన్న భారత్ ఆకాంక్షలను కూడా ప్రతిబింబిస్తుంది. ఈ అవార్డుల ద్వారా మోదీ వారసత్వం భారతీయ రాజకీయ చరిత్రలోనే కాక అంతర్జాతీయ నాయకత్వ చరిత్ర పుటల్లోనూ నిలిచిపోతుంది.
అనిల్ బలూని,
బిజెపి జాతీయ అధికార ప్రతినిధి

