OneNationOneElection

ఒక దేశం-ఒక ఎన్నిక: రాజకీయ సంస్కరణల పథంలో తొలి అడుగు

కకాల ఎన్నికల బిల్లు ఆమోదం పొందిన తర్వాత భారతదేశంలో రాజకీయాలు సమూలంగా మారిపోతాయి. దేశంలో అన్ని ప్రజాస్వామిక రాజకీయ సంస్కరణలకు ‘ఒక దేశం-ఒక ఎన్నిక’ బిల్లు తల్లి వంటిది అని అభివర్ణించడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ విషయంలో దృఢసంకల్పంతో ముందుకు సాగుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అభినందించి తీరాలి. దీన్ని జీర్ణించుకోలేని విమర్శకులు ఆయనపై దాడి చేస్తున్నారే కానీ బిల్లుకు వ్యతిరేకంగా తర్కబద్ధమైన వాదనలు వినిపించడం లేదు. ప్రస్తుత విధానం వల్ల తనకేమీ నష్టం లేకపోయినా మోదీ ఈ బిల్లును ఆమోదింప చేయడానికి కృతనిశ్చయంతో ముందుకు వెళ్ళడం గొప్ప విషయం.

2014కి ముందు దేశంలో చాలామంది ప్రజలు, పార్టీలతో నిమిత్తం లేకుండా ఏ రాజకీయ నాయకుడూ వ్యవస్థాగత రాజకీయ సంస్కరణలను చేపట్టే సాహసం చేయరని భావించేవారు. బహుశా ఈ కారణం వల్లనేమో ఎన్.ఆర్. నారాయణమూర్తి వంటి వారు రాజకీయ నాయకులంతా యథాతథ స్థితి కొనసాగించడానికి ఇష్టపడతారని విమర్శించారు. కానీ మోదీ నాయకత్వం ఈ అభిప్రాయాన్ని తొలగించింది. నరేంద్ర మోదీ పట్టుదల కారణంగా ఇప్పుడు ఏకకాల ఎన్నికల బిల్లు పార్లమెంటు ముందుకు వచ్చింది. ఈ చట్టంలోని నిబంధనలు అనేక అభిలషణీయమైన, ఆవశ్యకమైన మార్పులకు శ్రీకారం చుడతాయి. మొదటిది, ఎన్నికల రాజకీయాలకు వెచ్చించే సమయం తగ్గి రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు పాలనపై దృష్టి కేంద్రీకరించడానికి వీలవుతుంది. రెండవది, త్వరలోనే ఎన్నికలు వస్తాయన్న దృష్టితో రాజకీయ పార్టీలు నిరంతరం జనాకర్షక విధానాలను అనుసరించే పోకడలకు ఈ బిల్లు స్వస్తి పలుకుతుంది. మూడవది, ఏకకాల ఎన్నికల్లో అంతర్భాగంగా ఉన్న అనేక సంస్కరణలు మానవ, ఆర్థిక, వస్తు వనరులను ఆదాచేస్తాయి. అయితే ఈ కీలకమైన సంస్కరణ సుపరిపాలన కోసం మన దేశానికి అత్యంత అవసరమైన ఇతర రాజకీయ సంస్కరణలపై చర్చకు కూడా తెరతీస్తుంది.

ఈ అత్యంత అవసరమైన రాజకీయ సంస్కరణల్లో మొదటిది పార్టీలు తమ అంతర్గత వ్యవహారాలను నడిపే విధానం. అనేకమంది రాజకీయ నిపుణులు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న రాజకీయ పార్టీలు, వాటి అసంఘటిత స్వభావం, పారదర్శకతా లోపం, సైద్ధాంతిక పునాదులు లేకపోవడం, అన్నిటికంటే ముఖ్యంగా పార్టీలలో కుటుంబాల ప్రాబల్యం గురించి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితి కొనసాగితేనే తమకు ప్రయోజనకరమని అనేక ప్రతిపక్ష పార్టీలు భావిస్తున్నందున అవి రాజకీయ సంస్కరణలను వ్యతిరేకించడం సహజమే. అయితే వాటిలో లోపాలను ఎత్తి చూపడానికి, రాజకీయ సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పడానికి ఈ ‘ఒకే దేశం- ఒకే ఎన్నికల’ బిల్లు ఒక అవకాశం కల్పిస్తుంది. గత శతాబ్దం చివరి 10 ఏళ్లలో మాజీ ఉపరాష్ట్రపతి కృష్ణ కాంత్ లాంటి పలువురు మేధావులు పార్టీలు దళారీలకు ప్రాధాన్యం ఇవ్వడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. “1950లలో ఒక ఎంపీ లేదా ఎమ్మెల్యేను ప్రజాప్రతినిధిగా పరిగణించేవారు. 1960లలో వారిని తమ తరఫున వాదించేవారుగా చూసేవారు. కానీ ఇప్పుడు ప్రజలు వారిని దళారులుగా చూస్తున్నారు,” అని ఆయన కుండ బద్దలు కొట్టారు.

ఇంతకుముందు ముంబైలో 1985లో కాంగ్రెస్ శత శతాబ్ది ఉత్సవాలు జరిగినప్పుడు రాజీవ్ గాంధీ ఇదే పదం ఉపయోగించి రాజకీయ దళారీలుగా వ్యవహరిస్తున్న పార్టీ కార్యకర్తలను విమర్శించారు. మన రాజకీయాలను పట్టిపీడిస్తున్న రుగ్మతను కృష్ణ కాంత్ సరిగ్గానే గుర్తించారు. “ఎటువంటి సిద్ధాంతాలు, జాతీయ కార్యక్రమం లేకుండా కొన్ని పార్టీలు స్వలాభం కోసం తాత్కాలికంగా పొత్తులు పెట్టుకుంటున్నాయ”ని ఆయన నిర్మొహమాటంగా వ్యాఖ్యానించారు. బిజెపి, కమ్యూనిస్టులు తప్ప మిగతా పార్టీలకు దీర్ఘకాలిక సిద్ధాంతాలంటూ ఏమీ లేని దృష్ట్యా కృష్ణకాంత్ చేసిన వ్యాఖ్యలు చాలా వరకు వాస్తవమని చెప్పాలి.

ఏకకాల ఎన్నికల చట్టం సరైన సమయంలో తీసుకున్న సరైన చర్య. అయితే అదే సమయంలో మన దేశంలో ప్రజాస్వామ్యం నాణ్యతను మెరుగుపరచడానికి ఇతర కీలకమైన రాజకీయ సంస్కరణలు కూడా అవసరం.

  • దేశంలోని పార్టీల కార్యకలాపాలను నిర్దేశించడానికి, వాటిలో క్రమశిక్షణను ప్రవేశపెట్టడానికి, వాటి కార్యకలాపాలను మరింత పారదర్శకంగా, జవాబుదారీగా, ప్రజాస్వామ్యయుతంగా చేయడానికి ఒక సమగ్ర చట్టాన్ని తీసుకురావడానికి ఇది సమయం కాదా? ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థల (ఎన్జీవోల) కార్యకలాపాలను నియంత్రించడానికి తెచ్చిన శాసనాలలో వాటిల్లో కుటుంబ సభ్యులు లేదా రక్తసంబంధీకులు నిర్వహణ బృందంలో సభ్యులుగా ఉండరాదని నిబంధన పెట్టింది. రాజకీయ పార్టీలకు కూడా ఇటువంటి నిబంధన విధించవచ్చు కదా?
  • దేశంలో ఇప్పుడు 2,700 రాజకీయ పార్టీలు ఉన్నాయి. వీటిలో చాలావరకు అసలు అస్తిత్వంలోనే లేవు లేదా కేవలం నామమాత్రంగా కొనసాగుతున్నాయి. ఇలా చిత్తశుద్ధి లేని రాజకీయ పార్టీలు పుట్టగొడుగుల్లా పుట్టుకు రాకుండా రాజకీయ పార్టీలను ఏర్పాటు చేసే ప్రక్రియను కట్టుదిట్టం చేయాల్సిన అవసరం లేదా?
  • ప్రతి రాజకీయ పార్టీ తమ కార్యకలాపాలపై వార్షిక నివేదికను ప్రచురించాలని నిర్దేశించలేమా?
  • జర్మనీలో పార్టీలు విధాన పరిశోధన, పార్టీ నాయకుల సామర్థ్యం పెంపునకు ఫౌండేషన్లు లేదా ట్రస్టులు నిర్వహిస్తాయి. మనం కూడా అటువంటి విధానాన్ని తప్పనిసరి చేయవచ్చు కదా? అదేవిధంగా మొదటిసారిగా ఎన్నికైన వారికి లేదా పార్టీ పదాధికారులకు సమగ్ర శిక్షణను తప్పనిసరి చేసే విషయాన్నీ కూడా పరిశీలించాలి.
  • ఏడాది కాలంలో తాము చేసిన పనులను, సాధించిన విజయాలను ప్రజలకు వివరిస్తూ ప్రజాప్రతినిధులు ఒక నివేదికను తప్పనిసరిగా సమర్పించాలన్న నిబంధన అమలు చేయవచ్చు కదా?
  • రాజకీయ పార్టీలు తమ ఎన్నికల ప్రణాళికలను ఎంత మేరకు అమలు చేశాయో వివరించే నివేదికను తప్పనిసరిగా విడుదల చేసే విషయం ప్రభుత్వం పరిశీలించాలి. ఓడిపోయిన పార్టీలు కూడా తాము చేసిన ఎన్నికల వాగ్దానాల అమలుకు ఏమేమి ప్రణాళికలు రూపొందించిందీ తెలియజేసేటట్లు చూడాలి.
  • ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థి తన నియోజకవర్గానికి సంబంధించి ఒక ఎన్నికల ప్రణాళికను, అలాగే దాని అమలుకు తీసుకున్న చర్యలపై ఒక వార్షిక నివేదికను తప్పనిసరిగా విడుదల చేసేటట్లు చేయలేమా?

రాజకీయ సంస్కరణల విస్తృతిని చర్చించేటప్పుడు మనం ప్రజాప్రతినిధుల సభలు, ముఖ్యంగా పార్లమెంటు పని చేసే తీరును గురించి కూడా చర్చించాలి. 1996లో అటల్ బిహారీ వాజ్‌పేయి చేసిన ఒక వ్యాఖ్యను ఇక్కడ ప్రస్తావించడం అవసరం. “పార్లమెంటు గాని, రాష్ట్ర విధాన సభలు గానీ తాము ప్రధానంగా నిర్వర్తించవలసిన బాధ్యత విషయంలో సమర్థంగా, నిబద్ధతతో వ్యవహరించడం లేదు. వారు నిర్వర్తించవలసిన ముఖ్య బాధ్యత చట్టాలను చేయడం. ఎక్కడో కొందరి విషయంలో తప్ప ఈ అత్యున్నత ప్రజాస్వామ్య వ్యవస్థలకు ఎన్నికైన వారు అధికారికంగా గాని అనధికారికంగా గాని చట్టాల విషయంలో శిక్షణ పొందడం లేదు. అదేవిధంగా తమ వృత్తికి సంబంధించిన పరిజ్ఞానాన్ని, సామర్థ్యాన్ని పెంచుకునేందుకు వారిలో ఆసక్తి ఉండడం లేదు,” అని ఆయన అన్నారు. రాజకీయ సంస్కరణలను తీసుకురావడం ఇక్కడ మనం చెప్పుకున్నంత సులభం కాదనే మాట నిజం. అయితే దేశంలో ప్రజాస్వామ్యం నాణ్యత మెరుగుపడాలని కోరుకుంటున్న భారతీయులు ఇక్కడ అధికారంలో ఉన్నది నరేంద్ర మోదీ కనుక ఇవి సాకారం కాగలవని ఆశిస్తున్నారు.

వినయ్ సహస్రబుద్దే,
బిజెపి సీనియర్ నాయకులు