‘సహకారం’తో సమగ్రాభివృద్ధి
సహకార రంగం ఆర్థికంగా వృద్ధిలోకి రావాలనుకుంటున్న వ్యక్తుల ఆశయాన్ని తీర్చడమే కాదు, వారిని ప్రధాన ఆర్థిక స్రవంతిలో భాగస్వాముల్నీ చేస్తుంది. అరకొర పెట్టుబడులు ఉన్నవారు, అసలు పెట్టుబడులే లేనివారు ఆర్థికంగా ఎదగడానికి సహకార ఉద్యమం ఒక సోపానం. దేశ ఆర్థికాభివృద్ధిలో సహకార సంస్థలు చాలాకాలం నుంచీ కీలక భూమిక పోషిస్తున్నాయి. ప్రధాని మోదీ హయాంలో అవి బలోపేతమై, దేశాభివృద్ధిలో ఉత్సాహంగా పాలుపంచుకుంటున్నాయి. ప్రధాని మోదీ ప్రభుత్వం 2021లో కేంద్రంలో ప్రత్యేకంగా సహకార శాఖను ఏర్పాటు చేసింది. ఆపై మూడేళ్లలోనే సహకార రంగంలో భారత్ విశ్వమిత్రగా ఆవిర్భవించే శక్తిసామర్థ్యాలను సంతరించుకుంది. నవంబర్ 25 నుంచి 30వ తేదీ వరకు దిల్లీలో అంతర్జాతీయ సహకార కూటమి(ఐసీఏ) సర్వసభ్య సమావేశం, అంతర్జాతీయ సహకార మహాసభ జరిగాయి. 130 ఏళ్ల ఐసీఏ చరిత్రలో సర్వసభ్య సమావేశాన్ని భారత్ నిర్వహించడం ఇదే ప్రథమం. ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ సహకార సంస్థల సంవత్సరంగా 2025ని ప్రకటించిన సందర్భంలో- ఐసీఏ దిల్లీలో సమావేశం కావడం విశేష పరిణామం. ప్రధాని మోదీ నాయకత్వంలో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి సమాజంలో వెనకబడిన, అత్యంత వెనకబడిన, బడుగు, బలహీన వర్గాల ఉద్ధరణకు నిరంతర కృషి సాగుతోంది. ఈ కృషి ఫలించాలంటే సహకారోద్యమాన్ని పటిష్టం చేయాలని ప్రభుత్వం గ్రహించి కార్యోన్ముఖమైంది.
ప్రాచీనకాలం నుంచే..
బలహీనపడిన సహకార సంస్థలను పునరుత్తేజితం చేయడానికి… వాటి కార్యకలాపాల్లో చురుకుదనం, పారదర్శకతను తీసుకురావడానికి… సహకార సంస్థల మధ్య పోటీ వాతావరణాన్ని పెంచడానికి మోదీ ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంది. ప్రధాని నినాదమైన ‘సహకార్ సే సమృద్ధి’ ఆంతర్యం- దేశంలోని సహకార సంస్థలను స్వావలంబన దిశగా, బలీయంగా తీర్చిదిద్దడమే. దేశార్థికాన్ని అయిదు లక్షల కోట్ల డాలర్ల స్థాయికి తీసుకెళ్లాలన్న ప్రధాని మోదీ లక్ష్య సాధనకు సహకారోద్యమం కీలకమవుతుంది. సహకార సంస్థలకు ముఖ్య పాత్రను కట్టబెట్టే ఆర్థిక నమూనా ఇతర దేశాలకూ ఆదర్శనీయమవుతుంది. సహకారోద్యమం భారతదేశానికి కొత్తదేమీ కాదు. ప్రాచీనకాలం నుంచీ సహకార స్ఫూర్తి మన సాంస్కృతిక, ఆర్థిక సంప్రదాయాల్లో అంతర్భాగమే. ఆలయ నిర్మాణం, గ్రామాల్లో చెరువుల తవ్వకం, ఆనకట్టల నిర్మాణం వంటి ప్రజోపయోగ కార్యక్రమాలు సహకార పద్ధతిలోనే సాగేవని కౌటిల్యుని అర్థశాస్త్రం చాటిచెబుతోంది. దక్షిణ భారతంలో సహకార పద్ధతిలో రుణ సౌకర్యం కల్పించేవారు. వాస్తవమిలా ఉంటే, పాశ్చాత్య ఆర్థిక సిద్ధాంతాలను తలకెక్కించుకున్న కొందరు మేధావులు ఆధునిక కాలంలో సహకార సంఘాలకు కాలం చెల్లిందని వ్యాఖ్యానించసాగారు. వారి సిద్ధాంతాలు మూడు కోట్లు, అయిదు కోట్లు, పది కోట్ల జనాభా ఉన్న దేశాలకు వర్తిస్తాయేమో కానీ, 140 కోట్ల జనాభా కలిగిన సువిశాల భారతావనికి అన్వయించవు. ప్రజలందరికీ ఉపాధి కల్పించడం, వారు హుందాగా జీవించే అవకాశం అందించడం ద్వారానే ఈ దేశాన్ని ఆర్థికంగా ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లగలుగుతాం. ఈ బృహత్ యజ్ఞంలో సహకార ఉద్యమం ప్రధాన పాత్రధారి అవుతోంది. అహ్మదాబాద్ జిల్లా సహకార బ్యాంకు గడచిన శతాబ్దకాలంలో రూ.100 కోట్ల లాభం ఆర్జించడం ఒక విశిష్ట ఉదాహరణ. రూ.6,500 కోట్లకు పైగా డిపాజిట్లు ఉన్న ఈ బ్యాంకుకు నిరర్ధక ఆస్తులే(ఎన్‌పీఏ) లేవు. ఇక అమూల్ 34 లక్షల కుటుంబాలకు, ముఖ్యంగా ఆ కుటుంబాల్లో స్త్రీలకు జీవనాధారం కల్పిస్తూ సహకార ఉద్యమానికి గొప్ప ప్రతీకగా నిలుస్తోంది. ఈ మహిళలెవరూ ఆరంభంలో 100 రూపాయలకు మించి పెట్టుబడి పెట్టలేదు. ఇవాళ అమూల్ టర్నోవర్ రూ.80 వేల కోట్లకు చేరింది.
కొత్త ప్రాంతాలకు సహకారోద్యమం
ఏళ్ల తరబడి సాగిన అలక్ష్యం వల్ల భారత్‌లో అత్యధిక ప్రాథమిక వ్యవసాయ రుణ సంఘాలు(పీఏసీలు) ఆర్థికంగా బలహీన పడిపోయాయి. దీన్ని సరిదిద్దడానికి మోదీ ప్రభుత్వం పీఏసీల పరిధిని విస్తరించింది. పీఏసీలు పాడి పరిశ్రమ, చేపల పెంపకం, ఆహార ధాన్యాల నిల్వ, జన ఔషధి కేంద్రాల నిర్వహణ వంటి 30 రకాల కార్యకలాపాలను చేపట్టడానికి వీలుగా చట్టంలో మార్పుచేర్పులు చేసింది. మూడు బహుళ రాష్ట్ర సహకార సంస్థలను ఏర్పాటు చేసింది. జాతీయ సహకార ఎగుమతుల సంస్థ ద్వారా రైతులకు అంతర్జాతీయ మార్కెట్‌ను అందు బాటులోకి తెచ్చింది. జాతీయ సహకార ఆర్గానిక్స్ సంస్థ ద్వారా ఆర్గానిక్ పంటలకు ధ్రువీకరణ పత్రాలిచ్చి విస్తృత మార్కెట్ అవకాశాలు కల్పిస్తోంది. భారతీయ బీజ్ సహకారీ సమితి లిమిటెడ్ రైతులకు నాణ్యమైన విత్తనాలను అందిస్తోంది. ఇథనాల్ మిశ్రమాన్ని ప్రోత్సహించడం, పన్ను రాయితీలు, ఆర్థిక సాయం కల్పించడం ద్వారా సహకార చక్కెర మిల్లులకు మోదీ సర్కారు ఊతమిస్తోంది. సహకార సంస్థల నిధులను సహకార బ్యాంకుల్లో డిపాజిట్ చేయడానికి అనుమతించింది. జాతీయ సహకార సంస్థల డేటాబేస్‌ను ఏర్పాటు చేయడం వల్ల సహకారోద్యమం కొత్త ప్రాంతాలకు విస్తరిస్తోంది..
సహకార రంగానికి బలీయ పునాది వేయడం కోసం మోదీ ప్రభుత్వం సమగ్ర జాతీయ సహకార విధానాన్ని రూపొందిస్తోంది. పేదరిక నిర్మూలన, సమ్మిళిత ఆర్థికాభివృద్ధి, లింగపరమైన సమానత్వం సాధించాలని ఐరాస సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు నిర్దేశిస్తున్నాయి. వాటి సాధనకు భారత్ సహకారోద్యమాన్ని శక్తిమంతంగా ఉపయోగించుకుంటోంది. అందరికీ మెరుగైన, సుస్థిర భవిష్యత్తును అందించడం ప్రపంచవ్యాప్త సహకార సంఘాల ధ్యేయం. ‘సహకార్ సే సమృద్ధి’ అనేది కేవలం నినాదమే కాదు- సుస్థిరాభివృద్ధినీ, ప్రగతిలో అందరికీ సమాన వాటాను అందించాలనే నిబద్ధతా ప్రకటన కూడా.
అమిత్ షా,
కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి

