kashmir

అధికరణం 370పై మొసలి కన్నీళ్లు

రాజ్యాంగ అధికరణం 370 చరిత్ర గత 70 ఏళ్లుగా కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ లు అనుసరిస్తున్న వంచనాత్మక రాజకీయాలకు అద్దం పడతాయి. ఉదాహరణకు అధికరణం 370 జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిందని వారు పదే పదే అబద్ధం ఆడుతున్నారు. ఎక్కడ నుంచి ఈ పదం వచ్చింది? నిజానికి జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించమని షేక్ అబ్దుల్లా డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ను అడిగినప్పుడు ఆయన ఆ అభ్యర్థనను గట్టిగా తిరస్కరించారు. “పార్లమెంటు చేసిన చట్టాలను జమ్మూ కాశ్మీర్లో పరిమితంగా అమలు చేస్తే దానివల్ల సమస్యలు పరిష్కారం కావడం అటుంచి అనేక కొత్త సమస్యలు పుట్టుకు వస్తాయి,” అని డాక్టర్ అంబేద్కర్ స్పష్టం చేశారు. “జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి సంబంధించి తాత్కాలిక నిబంధనలు”గా మాత్రమే ఆ తర్వాత ఈ అధికరణాన్ని భారత రాజ్యాంగంలో చేర్చారు. రాజ్యాంగంలో ఎక్కడ దాన్ని ప్రత్యేక ప్రతిపత్తిగా పేర్కొనలేదు. ఇక ఈ అధికరణం కల్పించినట్లు చెబుతున్న రాజ్యాంగ హామీల విషయానికి వస్తే ఈ అధికరణాన్ని కనీసం నాలుగు సార్లు — 1954, 1966, 1975, 1986 — లలో సవరించారు. 1952లో జరిగిన వివాదాస్పద ‘దిల్లీ ఒప్పందం’ కింద ఏవైనా తాత్కాలిక అధికారాలను రాష్ట్రానికి ఇచ్చి ఉంటే ఈ సవరణలు వాటిని తొలంగించేశాయి. ఈ సవరణలు జరిగిన నాలుగు సందర్భాల్లోనూ అధికారంలో ఉన్నది కాంగ్రెసేనన్న విషయం ఇక్కడ గుర్తుంచుకోవాలి.

జవహర్లాల్ నెహ్రూ హయాంలో అధికరణం 370 ని రద్దు చేయాలన్న డిమాండ్ అనేక సార్లు పార్లమెంట్లో వినిపించింది. “జమ్మూ కాశ్మీర్ ను పూర్తిగా భారత్ లో విలీనం చేయాలన్న జన సంఘ్ అభిప్రాయాలతో భారత్ ఏకీభవిస్తుందని, ఆ దిశగా చర్యలు తీసుకుంటుందని ఆంతరంగిక సంభాషణలో నెహ్రూ అంగీకరించినట్లు” భారత గూడచారి విభాగం తొలి అధిపతి బిఎం మల్లిక్ వెల్లడించారు. అధికరణం 370 నీరుగారిపోయిందని, కాశ్మీరు పూర్తిగా భారత్ లో అంతర్భాగం అయిపోయిందని పార్లమెంటులో ఇచ్చిన ఒక మౌఖిక సమాధానంలో నెహ్రూ కూడా పేర్కొన్నారు. 1964 లో ప్రకాష్ వీర్ శాస్త్రి అనే ఒక జన సంఘ్ సభ్యుడు అధికరణం 370 పై ఒక ప్రైవేటు సభ్యుడి బిల్లును ప్రవేశపెట్టినప్పుడు దానికి విస్తృతమైన మద్దతు లభించింది. షేక్ అబ్దుల్లా సన్నిహితుల్లో ఒకరైన అబ్దుల్ ఘనీ గోని ఆ సందర్భంగా మాట్లాడుతూ అప్పటి జమ్ము కాశ్మీర్ ప్రధాని బక్షి గులాం మొహమ్మద్ అధికరణం 370 రద్దుకు ఒక దశలో ప్రతిపాదించగా కేంద్ర ప్రభుత్వం ఆ సమయంలో అంగీకరించలేదని పేర్కొన్నారు.

“కేంద్ర ప్రభుత్వం పాశ్చాత్య దేశాల ప్రభావం కారణంగానో, లేక పాకిస్తాన్ ను సంతోష పెట్టడానికో ఏమో అందుకు అంగీకరించలేదు… పొరుగు దేశాన్ని బుజ్జగించడానికి వారు మమ్మల్ని బాధ పెడుతున్నారు. అధికరణం 370 ఉన్నా లేకపోయినా కాశ్మీర్ భారత్ లో అంతర్భాగమని కాశ్మీర్ ప్రజలు మరొకసారి నిర్ణయించారు. అది కేవలం తాత్కాలిక నిబంధన మాత్రమే, దాన్ని ఎప్పుడైనా తొలగించవచ్చు,” అని గోని పేర్కొంటూ జన సంఘ్ బిల్లుకు మద్దతు ఇవ్వవలసిందిగా కాంగ్రెస్ సభ్యులకు విజ్ఞప్తి చేశారు. “ఈ బిల్లును సభ ఆమోదిస్తే మేం కూడా దేశంలోని ఇతర ప్రాంతాల్లోని ప్రజలతో సమానమైన ప్రతిపత్తిని పొందుతాం.  మిగతా పౌరులకు మాదిరిగానే మేం కూడా మంచి భారతీయ పౌరులం అవుతాం. మమ్మల్ని ద్వితీయ శ్రేణి పౌరులుగా, భారత్ వలస ప్రాంతంగా పరిగణించకండి. మేం మిగతా రాష్ట్రాల మాదిరిగానే భారతదేశంలో అంతర్భాగం,” అని అబ్దుల్ ఘని గోని అన్నారు. జమ్మూ కాశ్మీర్ కి చెందిన మరో సభ్యుడు సయ్యద్ నజీర్ హుస్సేన్ సమ్నాని కూడా భావోద్వేగంతో చేసిన ప్రసంగంలో “కాశ్మీరీ ప్రజలమైన మేం ఎప్పుడూ మమ్మల్ని విభిన్నంగా చూడమని డిమాండ్ చేయలేదు. మాకు అధికరణం 370 అక్కర్లేదు. ఈ శాపం మా జీవితకాలంలోనే తొలగిపోవాలని నేను కోరుకుంటున్నాను. నా రక్షణ కోసం, నా పిల్లల రక్షణ కోసం, మా భవిష్యత్ తరాల రక్షణ కోసం ఇది జరగాలి. మహారాష్ట్ర, మద్రాసు, కేరళ, బెంగాల్ లకు ఏ చట్టాలు అయితే వర్తిస్తాయో అవే మాకూ కావాలి,” అని ఆయన అన్నారు.

వాస్తవం ఏమిటంటే 2019లో దాన్ని రద్దు చేసేనాటికే అధికరణం 370 ని కాంగ్రెస్ ప్రజల నుంచి వచ్చిన ఒత్తిడి ఫలితంగా దాదాపు డొల్లగా మార్చేసింది. దీనికి నేషనల్ కాన్ఫరెన్స్ కూడా తన మౌనం ద్వారా పరోక్ష మద్దతు అందించింది. అయితే అధికరణాన్ని బహిరంగంగా, అధికారికంగా రద్దు చేసే ధైర్యం కాంగ్రెస్ కు లేకపోయింది. ఆ ధైర్యాన్ని ప్రదర్శిస్తూ బిజెపి అవశేషంగా మిగిలిన ఈ అధికరణాన్ని రద్దు చేసింది. దీనికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి: మొదటిది, గుప్కార్ నాయకులు ఈ అధికరణం ‘ప్రత్యేక ప్రతిపత్తి’ కల్పిస్తుందన్న తప్పుడు అభిప్రాయాన్ని ప్రజల్లో కల్పిస్తున్నారు. దీని ద్వారా కాశ్మీర్ ప్రజలకు, దేశంలోని మిగతా ప్రాంతాల వారికి మధ్య భావోద్వేగపరమైన అగాధాన్ని సృష్టిస్తున్నారు. రెండవది, నామమాత్రపు ప్రత్యేక రాష్ట్ర రాజ్యాంగం పాలనా యంత్రాంగాన్ని నడిపించడంలో ఒక పెద్ద అవరోధంగా మారింది. ఉదాహరణకు జమ్మూ కాశ్మీర్ జీఎస్టీ చట్టాన్ని అమలు చేయగా దీనికి తోడు రాష్ట్ర పన్నులను కూడా కొనసాగించింది. ఫలితంగా ప్రజలపై రెట్టింపు భారం పడింది. ఎందుకంటే రాష్ట్ర రాజ్యాంగాన్ని సవరించే వెసులుబాటు అధికరణం 270 కింద లేదు.

అధికరణం 370 రద్దు కేంద్ర పాలిత ప్రాంత ప్రజలకు చాలా పెద్ద ఊరట కల్పించిందన్నది సుస్పష్టం. కానీ నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ రెండు నాలుకల ధోరణిని కొనసాగిస్తూనే ఉన్నాయి. దిల్లీలో ఒక మాట మాట్లాడుతూ కాశ్మీర్లో మరొక మాట మాట్లాడుతున్నాయి. తమ వంచనాత్మక రాజకీయాలను యథావిధిగా కొనసాగిస్తున్నాయి. అధికరణం 370 చనిపోయిందని వారికి బాగా తెలుసు. అయినా “అధికరణ 370 చిరకాలం వర్థిల్లు గాక” అని నినాదాలు చేస్తున్నాయి.

రామ్ మాధవ్,
బిజెపి నాయకుడు