అక్కుసుతోనే కాంగ్రెస్ గూండాల దాడి
తెలంగాణ ప్రజలు బిజెపి వైపు మొగ్గుచూపుతుండటాన్ని జీర్ణించుకోలేని కాంగ్రెస్, తమ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు దిగజారుడు కుట్రలకు పాల్పడుతోంది. బిజెపి కార్యాలయాలపై దాడులు, బిజెపి నాయకుల నివాసాలను ముట్టడించడాలు, ఆర్ఎస్ఎస్ కార్యాలయంపై దాడులకు పథకరచన చేయడం వంటి దుశ్చర్యలకు కాంగ్రెస్, దాని అనుబంధ విభాగాలైన ఎన్ఎస్యూఐ (NSUI), యూత్ కాంగ్రెస్ పాల్పడుతోంది. ఈ కుట్రలో భాగంగా ఆగస్ట్ 31న బిజెపి రాష్ట్ర కార్యాలయంపై కాంగ్రెస్ గూండాలు దాడులకు తెగబడ్డారు. కార్యాలయం గేటుపై నల్ల రంగు పూశారు. అంతేకాదు, ప్రహరీ గోడపై అతికించి ఉన్న సంత్ రవిదాస్ పోస్టర్లపై నల్ల రంగు చల్లి తమ దళిత వ్యతిరేకతను బాహాటంగా చాటుకున్నారు.
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ”ఫీజుల బకాయి – బిజెపి లడాయి” కింద బిజెపి పెద్దఎత్తున ఉద్యమం చేపడుతోంది. బిజెపి ఆందోళనలకు వేలాది మంది విద్యార్థులు, యువకులు స్వచ్ఛందంగా తరలివచ్చి విశేష మద్దతు తెలుపుతున్నారు. కాంగ్రెస్ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడుతున్న బిజెపి పక్షాన యువత బలంగా నిలబడింది. దీనిని జీర్ణించుకోలేని కాంగ్రెస్ బీహార్‌లో జరిగిన ఓ ఘటనపై అబద్ధాలు ప్రచారం చేస్తూ, ఆగస్ట్ 31న బిజెపి కార్యాలయంపై దాడికి దిగింది. నల్గొండలో బిజెపి నల్గొండ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి నివాసంపైనా కాంగ్రెస్ గూండాలు దాడికి తెగబడ్డారు. ఇంట్లోని ఫర్నీచర్, వస్తువులను చిందర వందరగా పడేసి నానా హంగామా సృష్టించారు. ఆ సమయంలో ఇంట్లో ఉన్న నాగం వర్షిత్ రెడ్డి మాతృమూర్తిపైనా చేయి చేసుకున్నారు. ఒక మహిళ, సీనియర్ సిటిజన్ గాయపడేలా చేసారంటే వారి దుర్మార్గానికి పరాకాష్ట. మరునాడు సెప్టెంబర్ 1న సైతం రాష్ట్రంలో పలు బిజెపి కార్యాలయాలపై దాడులకు తెగబడ్డారు.
ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలపడానికి ఎవరికీ అభ్యంతరం ఉండదు, కానీ ప్రత్యర్థి పార్టీల కార్యాలయాలు, నాయకుల ఇళ్లపై దౌర్జన్యాలకు దిగడం అత్యంత హేయమైన చర్య. భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఎమర్జెన్సీ ఒక చీకటి అధ్యాయంగా నిలిచిపోయింది. ప్రజాస్వామ్యాన్ని అణచివేసి, ప్రజల గొంత నొక్కిన ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ కాలపు నియంతృత్వ ధోరణినే ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆదర్శంగా తీసుకుంటున్నట్టుంది. అందుకే, కాంగ్రెస్ కార్యకర్తలకు ప్రజాస్వామ్యంపై గౌరవం లేదు, రాజకీయ మర్యాదల పట్ల కనీస బాధ్యత కూడా కనిపించడం లేదు. బిజెపి కార్యాలయాలపై, బిజెపి నాయకుల నివాసాలపై బహిరంగంగా దాడులకు పాల్పడుతున్నా పోలీసులు చేష్టలుడిగి చూస్తుండిపోయారు.
కాంగ్రెస్ గూండాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు బిజెపి సంయమనం పాటిస్తోందని, ఒకవేళ తమ కార్యకర్తలు తిరగబడి ధీటుగా సమాధానం చెబితే కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు రాష్ట్రంలో రోడ్ల మీద కూడా తిరగలేరని స్పష్టం చేశారు. ఇకనైనా బిజెపి కార్యాలయాలు, నాయకులు, కార్యకర్తలపై దాడులకు యత్నించడం ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. హైదరాబాద్‌లోని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యాలయంపై, నల్గొండ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి నివాసంపై కాంగ్రెస్ శ్రేణులు దాడి చేయడం అత్యంత పిరికిపంద చర్య అని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. అధికారం అడ్డంపెట్టుకుని ప్రతిపక్ష పార్టీ కార్యాలయాలపై దాడులకు దిగడం, ఇళ్లలోకి చొరబడి ఫర్నిచర్ ధ్వసం చేయడమే కాకుండా వృద్ధురాలైన వర్షిత్ రెడ్డి తల్లిని గాయపరచడం కాంగ్రెస్ పాలకుల దివాళాకోరుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. రాష్ట్రంలో విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, 22ఏ భూముల కుంభకోణాలు, కమిషన్ల దందాలపై బిజెపి నిలదీస్తుండటంతో ఓర్వలేకనే, ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే కాంగ్రెస్ ఈ విధ్వంసక రాజకీయాలకు తెరలేపిందని ఆరోపించారు. బిజెపి ఎప్పుడూ ప్రజాస్వామ్య విలువలకే కట్టుబడి ఉంటుందని, అంతమాత్రాన తమ సంయమనాన్ని చేతగానితనంగా భావించవద్దని హెచ్చరించారు. భవిష్యత్తులో బిజెపి నాయకులు, కార్యకర్తల ఇళ్ల జోలికొస్తే తీవ్ర పరిణామాలుంటాయని స్పష్టం చేస్తూ, రాష్ట్ర కార్యాలయంపై, వర్షిత్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన రౌడీలపై పోలీసులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
బిజెపి కార్యాలయాలపై దాడులను నిలువరించలేని పోలీసులు మరునాడు సెప్టెంబర్ 1న నాగం వర్షిత్ రెడ్డిని పరామర్శించేందుకు నల్గొండ బయలుదేరుతున్న రాంచందర్ రావును గృహ నిర్బంధం చేశారు. నిర్బంధాలను లెక్క చేయకుండా నల్గొండ వెళ్లాలని నిర్ణయించుకోవడంతో పోలీసులు అరెస్టు చేసి గాంధీ నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఎన్.రాంచందర్ రావుతో పాటు బిజెపి శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు డా. ఎన్ గౌతం రావు, తూళ్ల వీరేందర్ గౌడ్, బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండ కార్తీక రెడ్డి, బిజెపి జిల్లా అధ్యక్షులు లంకల దీపక్ రెడ్డి, భరత్ గౌడ్, ఉమామహేందర్, నిరంజన్ యాదవ్, గిరివర్ధన్ రెడ్డి, రాంభూపాల్ గౌడ్ సహా దాదాపు 300 మంది బిజెపి నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేసి ముషీరాబాద్, అంబర్ పేట పోలీస్ స్టేషన్లకు తరలించారు. జిల్లాల్లోనూ అనేక మంది నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేయడంతో పోలీస్ స్టేషన్లన్నీ బిజెపి నాయకులు, కార్యకర్తలతోనే నిండిపోయాయి.
నితిన్ నబీన్ ఆరా
తెలంగాణలో బిజెపి కార్యాలయాలపై, నేతలపై కాంగ్రెస్ గూండాల దాడులపై బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావుకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. 1000 రోజుల పాలన వైఫల్యాలను ఎండగడుతున్నందుకే అక్కసుతో ఏదో ఒక వంక పెట్టుకొని బిజెపిపై కాంగ్రెస్ గూండాలకు దాడులకు తెగబడుతున్నారని నితిన్ నబీన్‌కు రాంచందర్ రావు తెలిపారు. బిజెపి రాష్ట్ర కార్యాలయంపై, బిజెపి నల్గొండ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి నివాసంపై జరిగిన దాడులను వివరించారు. వర్షిత్ రెడ్డిని పరామర్శించడానికి వెళ్తుంటే తనను గృహ నిర్బంధం చేశారని, తర్వాత అరెస్టు చేసి గాంధీనగర్ పీఎస్‌కు తరలించారని తెలిపారు. ప్రజావ్యతిరేక కాంగ్రెస్‌పై బిజెపి – తెలంగాణ పోరాటాలను నితిన్ నబీన్ ప్రశంసించారు. రాంచందర్ రావుకు భరోసానిస్తూ, రాష్ట్ర పార్టీకి జాతీయ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ‘సడక్ సే సదన్ తక్’ అంటూ కాంగ్రెస్‌పై పోరాటాలను కొనసాగించాలని సూచించారు.
సంత్ రవిదాస్ చిత్రపటానికి పాలాభిషేకం
కాంగ్రెస్ గూండాలు నల్ల రంగు చల్లడంతో మైల పడిన జగద్గురు శ్రీ సంత్ రవిదాస్ మహారాజ్ చిత్రపటాన్ని బిజెపి ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కాంతి కిరణ్ నేతృత్వంలోని బృందం శుద్ధమైన పాలతో కడిగి అభిషేకించి, పూలమాల సమర్పించి, వందన సమర్పించింది. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

