waqf

అమల్లోకి వచ్చిన ఉమ్మీద్ చట్టం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మరో చారిత్రాత్మక చట్టాన్ని తీసుకొచ్చింది. వ‌క్ఫ్ పేరుతో ఇన్నాళ్లు కొనసాగుతున్న అక్రమాలకు చెక్ పెడుతూ వక్ఫ్ చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ సరికొత్త చట్టం వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో పారదర్శకత, సమర్థతను తీసుకొస్తాయి. ముస్లిమేతరులకూ, ఇన్నాళ్లూ విస్మరణకు గురైనా కొన్ని వెనకబడిన ముస్లిం వర్గాలకు, మహిళలకూ వక్ఫ్ బోర్డులో స్థానం కల్పించి సామాజిక న్యాయానికి బాటలు వేసింది. ఏప్రిల్ 3న లోక్‌సభలో, ఏప్రిల్ 4న రాజ్యసభలో ఆమోదం పొందిన ఈ వక్ఫ్ (సవరణ) బిల్లుకు ఏప్రిల్ 5న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు. 2025 ఏప్రిల్ 8 నుంచి వక్ఫ్ (సవరణ) చట్టం, 2025 అమల్లోకి వచ్చింది.

వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో కొంతమంది ఆధిపత్యానికి, చోటుచేసుకుంటున్న అవినీతి అడ్డుకట్ట వేసి, పారదర్శకత తీసుకురావాలనే ఉద్దేశ్యంతో మోదీ ప్రభుత్వం 2024 ఆగస్టు 8న వక్ఫ్ (సవరణ) బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ప్రతిపక్షాలు, కొన్ని వర్గాల నుంచి ఈ బిల్లుపై వచ్చిన అభ్యంతరాల నేపథ్యంలో జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)ని నియమించింది. ఈ కమిటీ మొత్తం 34 సమావేశాలు నిర్వహించింది, ఇందులో 284 మంది భాగస్వామ్యపక్షాలను సంప్రదించింది, 108 గంటల పాటు చర్చలు జరిపింది. చివరకు, బిల్లులోని 14 సవరణలకు ఆమోదం తెలిపింది. ఈ నివేదికను 2025 జనవరి 29న ఆమోదించి, 2025 ఫిబ్రవరి 3న లోక్‌సభలో సమర్పించారు.

వక్ఫ్ (సవరణ) బిల్లు, 2025పై ఇటీవలి పార్లమెంటు సమావేశాల్లో ఏప్రిల్ 2న లోక్‌సభలో చర్చ ప్రారంభమైంది. కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు లోక్‌సభ, రాజ్యసభలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. దాదాపు 12 గంటల పాటు చర్చ జరిగిన అనంతరం నిర్వహించిన ఓటింగ్ లో 288-232 ఓట్లతో లోక్‌సభ ఆమోదం పొందింది. రాజ్యసభలోనూ 12 గంటల పాటు చర్చ అనంతరం ఏప్రిల్ 4న 128-95 ఓట్లతో ఆమోదం పొందింది. పార్లమెంటు ఆమోదం పొందిన బిల్లుకు ఏప్రిల్ 5న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేయడంతో ఈ బిల్లు చట్టంగా మారింది. 2025 ఏప్రిల్ 8 నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చింది. దీంతో దేశ చరిత్ర‌లో కీల‌క ఆధ్యాయం లిఖిత‌మైంది. వక్ఫ్ చట్టం అమలుతో దేశంలోని వేలాది మంది వ‌క్ఫ్ బాధితుల‌కు న్యాయం జ‌ర‌గ‌తుందన్న నమ్మకం ఏర్పడింది. దేశంలో వ‌క్ఫ్ పేరుతో వివాదాల్లో ఉన్న వేల ఎక‌రాల భూములు చెరవీడనున్నాయి.

బిల్లుపై చర్చ సందర్భంగా కిరణ్‌ రిజిజు మాట్లాడుతూ.. ఈ బిల్లు మతానికి సంబంధించినది కాదని, కేవలం ఆస్తుల విషయాలకు సంబంధించినదేనని స్పష్టం చేశారు. వక్ఫ్‌ బిల్లులోని అత్యంత క్రూరమైన సెక్షన్‌ 40 రద్దు కానుందన్నారు. ఈ సెక్షన్‌ కారణంగా ఏ భూమినైనా తమదేనని ప్రకటించుకునే హక్కు వక్ఫ్‌ బోర్డు, ట్రైబ్యునల్‌కు ఉందని.. దీన్ని కొందరు తమ స్వార్థ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేశారని ఆరోపించారు. ఇంతటి దారుణమైన సెక్షన్‌ను తాము తొలగించామని చెప్పారు. కొందరు ప్రతిపక్ష నేతలు చెబుతున్నట్లుగా ముస్లిం వర్గాలకు చెందిన ఏ భూమినీ తాము లాగేసుకోబోమని స్పష్టం చేశారు. ‘‘పేద ముస్లింల కోసం వక్ఫ్‌ ఆస్తులను ఉపయోగించాలి. వారిని అలా వదిలేయకూడదు. వారి ఉన్నతి కోసం మోదీ ప్రభుత్వం ఏవైనా చర్యలు తీసుకుంటే ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ముస్లిం ప్రతినిధులు ఆ బిల్లును ఆహ్వానించారు. వీలైనంత త్వరగా దీనికి ఆమోదం లభించాలని ఆ వర్గంలోని పేదలు కోరుకుంటున్నారు. అలాగే రిజిస్టర్‌ చేసిన ఆస్తి విషయంలో ఎవరూ జోక్యం చేసుకోరు. ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలతో ముస్లిం మహిళలు, పిల్లలకు హక్కులు దక్కుతాయి. ప్రభుత్వ భూమి విషయంలో వివాదం తలెత్తితే కలెక్టర్‌ కంటే పైస్థాయి అధికారి తీర్పు ఇవ్వాలంటూ జేపీసీ చేసిన ప్రతిపాదనను మేం అంగీకరించాం’’ అని రిజిజు స్పష్టం చేశారు. ‘‘బిల్లు గురించి విపక్షాలు అసత్య ప్రచారం చేశాయి. 1954లో తొలిసారి వక్ఫ్‌ చట్టం అమల్లోకి వచ్చింది. అది అప్రజాస్వామికం అని ఆనాడు ఎవరూ చెప్పలేదు. తాజా బిల్లును పరిశీలించిన జేపీసీకి అభినందనలు. ఈ బిల్లు తీసుకురాకపోతే.. కొందరు పార్లమెంట్‌ భవనాన్ని కూడా వక్ఫ్‌ ఆస్తిగా పేర్కొంటారు’’ అని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు.

వక్స్ చట్టంలోని ముఖ్యాంశాలు:

  • వక్ఫ్ బోర్డుల్లో ముస్లింలు మాత్రమే సభ్యులు గా ఉంటారు. వక్ఫ్ కౌన్సిల్ తో పాటు రాష్ట్ర బోర్డుల్లో ఇద్దరు ముస్లిమేతరులకు స్థానం కల్పించాలి.
  • వక్ఫ్ బోర్డులో కనీసం ఇద్దరు మహిళలుండటం కూడా తప్పనిసరి.
  • వక్ఫ్ ట్రిబ్యునల్ తీర్పులను 90 రోజుల్లోగా హైకోర్టులో సవాలు చేయవచ్చు.
  • వక్ఫ్ ట్రిబ్యునల్ లో జిల్లా జడ్జితో పాటు రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి స్థాయి ఉన్నతాధికారి కూడా ఉండాలి.
  • ఏదైనా ఆస్తి వక్ఫ్ బోర్డుదా, కాదా అన్న వివాదం తలెత్తితే దానిపై ప్రభుత్వం నియమించే ఉన్నతాధికారి నిర్ణయమే అంతిమం.
  • నూతన వక్స్ చట్టం అమల్లోకి వచ్చిన ఆర్నెల్లలోపు ప్రతి వక్ఫ్ ఆస్తినీ సెంట్రల్ డేటాబేస్ లో విధిగా నమోదు చేయించాలి.
  • ఇప్పటిదాకా ముస్లిమేతరులు కూడా వక్ఫ్ బోర్డులకు విరాళాలు, దానాలు ఇవ్వవచ్చు. ఇకపై కనీసం ఐదేళ్లుగా ఇస్లాంను అనుసరిస్తున్న వాళ్లు మాత్రమే వక్ఫ్ బోర్డులకు దానాలివ్వడానికి అర్హులు.

 

దేశంలో వక్ఫ్ బోర్డు నిర్వహణలోని మొత్తం స్థిరాస్తులు: 8,72,324

వాటిలో ముఖ్యమైన ఆస్తుల వివరాలు

1) శ్మశానాలు : 1,50,569

2) దుకాణాలు : 1,13,193

3) వ్యవసాయ భూములు : 1,40,803

4) మసీదులు : 1,19,280

5) ఇళ్లు : 92,517

6) ప్లాట్లు : 64,975

7) దర్గాలు : 33,502