అంబేద్కర్‌కు కాంగ్రెస్ ద్రోహం
భారత రాజ్యాంగ నిర్మాత, సామాజిక న్యాయం కోసం పోరాడిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తన జీవితాంతం, మరణానంతరం కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక పద్ధతి ప్రకారం అవమానాలకు, విస్మరణకు గురయ్యారు. అంబేద్కర్ ఎప్పుడూ కాంగ్రెస్ రాజకీయాలను, సామాజిక న్యాయం విషయంలో దాని నామమాత్రపు నిబద్ధతను వ్యతిరేకించారు. 1945లో ప్రచురితమైన ‘అస్పృశ్యులకు గాంధీ ఏమి చేశారు’ అనే ఆయన పుస్తకం దళితుల అభ్యున్నతి విషయంలో కాంగ్రెస్ పాత్రను తీవ్రంగా విమర్శించింది.
అంబేద్కర్‌ను ఓడించేందుకు కుట్ర
రాజ్యాంగ సభకు ఎన్నిక: రాజ్యాంగ సభలో 296 మంది సభ్యులు ఉన్నారు, ఇందులో 31 సీట్లు షెడ్యూల్డ్ కులాలకు రిజర్వు చేయబడ్డాయి. వీరిని రాష్ట్ర అసెంబ్లీలు ఎన్నుకుంటాయి. విద్వేషం, ప్రతీకారాలతో కాంగ్రెస్ కు చెందిన బొంబాయి ప్రధాని బి.జి. ఖరే రాజ్యాంగ పరిషత్తు ఎన్నికల్లో డాక్టర్ అంబేద్కర్‌ను ఓడించారు. అంబేద్కర్ బెంగాల్ నుంచి రాజ్యాంగ సభకు ఎన్నికయ్యేలా నామశూద్ర నాయకుడు జోగేంద్రనాథ్ మండల్ కృషి చేశారు.
1952 లోక్‌సభ ఎన్నికలు: ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ప్రత్యక్ష పర్యవేక్షణలో కాంగ్రెస్ కమ్యూనిస్టులతో చేతులు కలిపి అంబేద్కర్‌ను ఓడించింది. కాంగ్రెస్ కు చెందిన ఎస్ కే పాటిల్, కమ్యూనిస్టు నేత శ్రీపాద్ డాంగే ఈ కుట్రకు నేతృత్వం వహించారు. వీరంతా కలిసి అంబేద్కర్‌కు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించారు, డాక్టర్ అంబేద్కర్‌పై అనామకుడైన నారాయణరావు కజ్రోల్కర్ అనే అభ్యర్థిని రంగంలోకి దింపి ఆయనను ఓడించారు. ఫలితాన్ని రద్దు చేయాలని, అది చెల్లదని ప్రకటించాలని అంబేద్కర్ ఇతర అభ్యర్థులతో కలిసి ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు ఒక ఉమ్మడి ఎన్నికల పిటిషన్ దాఖలు చేశారు. మొత్తం 74,333 బ్యాలెట్ పత్రాలను తిరస్కరించారని, లెక్కించలేదని వారు పేర్కొన్నారు.
1954 ఉప ఎన్నిక: భండారా నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో కజ్రోల్కర్‌ను మళ్లీ బరిలోకి దింపడం ద్వారా డాక్టర్ అంబేద్కర్‌ను పార్లమెంటుకు దూరంగా ఉంచడానికి కాంగ్రెస్ తన ప్రయత్నాలను పునరావృత్తం చేసింది. ప్రధాని నెహ్రూ కూడా అంబేద్కర్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. అంబేద్కర్ ఓటమి కేవలం ఎన్నికల ఓటమి మాత్రమే కాదు. తనను వ్యతిరేకించే మేధావులకు తన ఆధిపత్యాన్ని విమర్శించే అవకాశమే ఉండకూడదని నెహ్రూవాద రాజ్యం చేసిన ప్రకటన అది. ఎడ్వినా మౌంట్ బాటన్‌కు రాసిన లేఖలో నెహ్రూ 1952 ఎన్నికలలో డాక్టర్ అంబేద్కర్‌ను ఓడించాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు, ఇది అంబేద్కర్‌పై కాంగ్రెస్ కక్షను మరింత స్పష్టంగా వెల్లడించింది.
ప్రభుత్వంలో చిన్నచూపు
నెహ్రూ క్యాబినెట్‌లో మంత్రిగా ఉన్న డాక్టర్ అంబేద్కర్‌ను ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టారు. ఆర్థికశాస్త్రం, శాసన వ్యవహారాల్లో ప్రావీణ్యం ఉన్నప్పటికీ రక్షణ, విదేశీ వ్యవహారాలకు సంబంధించిన కీలక కేబినెట్ కమిటీల నుంచి ఆయనను మినహాయించారు. సాధారణ బాధ్యతలు, శాఖల బదిలీలు కూడా ఆయన పరిధిలో లేకుండా చేశారు. ఆయన్ను ప్రభుత్వంలో చేర్చుకోవడంపై కాంగ్రెస్ విముఖతకు ఇది సూచిస్తుంది.
నెహ్రూ మంత్రివర్గానికి రాజీనామా
1951లో నెహ్రూ మంత్రివర్గం నుంచి అంబేద్కర్ వైదొలిగారు. కాంగ్రెస్ పట్ల ఆయన అసంతృప్తిని ఇది మరింత పెంచింది. తన నిర్ణయానికి ఆయన ప్రధానంగా ఐదు కారణాలను చెప్పారు:
- ఆర్థికశాస్త్రంలో డాక్టరేట్ పొందిన మొదటి భారతీయుడు అయినప్పటికీ ఆయనను ఆర్థిక విధానాలు, సంస్థలకు దూరంగా పెట్టడానికి కాంగ్రెస్ చేసిన ప్రయత్నాలు.
- కాంగ్రెస్ ప్రభుత్వం దళితుల సమస్యలను విస్మరించి కేవలం ముస్లింలపై మాత్రమే దృష్టి సారించింది.
- కాశ్మీర్ సమస్యపై నెహ్రూ వ్యవహరించిన తీరును ఆయన వ్యతిరేకించారు.
- నెహ్రూ విదేశాంగ విధానాన్ని విమర్శించి, అది భారతదేశాన్ని ఏకాకిని చేస్తుందని ఆయన జోస్యం చెప్పారు.
- అంబేద్కర్ సమర్థించిన కీలకమైన హిందూ స్మృతి బిల్లును ఆమోదించడంలో నెహ్రూకు నిబద్ధత లేకపోవడం.
భారతరత్న నిరాకరణ
భారత రాజ్యాంగానికి, సామాజిక న్యాయ సంస్కరణలకు డాక్టర్ అంబేద్కర్ అసమానమైన కృషి చేసినప్పటికీ, కాంగ్రెస్ ఆయనకు దక్కాల్సిన గుర్తింపును ఇవ్వలేదు.
నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీల హయాంలో అంబేద్కర్‌కు భారతరత్న ఇవ్వలేదు.
1952 ఎన్నికల్లో అంబేద్కర్‌ను ఓడించిన అభ్యర్థి ఎన్ ఎస్ కజ్రోల్కర్‌కు 1970లో కాంగ్రెస్ పద్మభూషణ్ అవార్డును ప్రదానం చేసింది.
1990లో బిజెపి మద్దతుతో వీపీ సింగ్ నేతృత్వంలోని కాంగ్రెసేతర ప్రభుత్వ హయాంలో మాత్రమే డాక్టర్ అంబేద్కర్‌కు మరణానంతరం భారతరత్న లభించింది. ఈ కాలంలోనే అటల్ బిహారీ వాజ్‌పేయి కృషి ఫలితంగా పార్లమెంటులో అంబేడ్కర్ చిత్రపటాన్ని ప్రతిష్టించారు.
స్మారక చిహ్నాల నిర్లక్ష్యం
నెహ్రూ వంశానికి ఒక్కొక్కరికి 50 ఎకరాల్లో చెందిన వారికి స్మారక చిహ్నాలు నిర్మించిన కాంగ్రెస్ తగిన స్మారక చిహ్నాలతో గౌరవించడానికి నిరాకరించడం ద్వారా అంబేద్కర్ వారసత్వాన్ని విస్మరించింది. 1956లో ఆయన మరణానంతరం ఢిల్లీలోని 26 అలీపూర్ రోడ్డులోని అంబేద్కర్ నివాసాన్ని జాతీయ స్మారక చిహ్నంగా మార్చాలని ప్రతిపాదించారు. అయితే నెహ్రూ ఈ ప్రతిపాదనను తిరస్కరించారు. 2016లో మోదీ ప్రభుత్వ హయాంలోనే ఈ స్మారక చిహ్నానికి శంకుస్థాపన జరగ్గా, 2018లో ప్రారంభించారు.
పాఠ్యపుస్తకాల్లో అపహాస్యం
2012లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ-2 ప్రభుత్వ హయాంలో 11వ తరగతి ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకంలో అంబేద్కర్‌ను నెహ్రూ కొట్టినట్లు చిత్రీకరించిన అభ్యంతరకర కార్టూన్ ఉంది.
అంబేద్కర్, అధికరణం 370
జమ్ము కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే రాజ్యాంగ అధికరణం 370ని ప్రవేశపెట్టడాన్ని అంబేద్కర్ వ్యతిరేకించారు. అయితే ఆయన హెచ్చరికలను కాంగ్రెస్ బేఖాతరు చేసి అమలు చేసింది. అధికరణం 370 రద్దు, జమ్మూకాశ్మీర్ పూర్తి రాజ్యాంగ విలీనం డాక్టర్ అంబేద్కర్ దార్శనికతకు అనుగుణంగా ఉందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
డాక్టర్ అంబేద్కర్, మహిళా హక్కులు
ఒక సమాజం పురోగతికి మహిళల పురోగతి గీటురాయని, దేశానికి, సమాజానికి మహిళలు మౌలికమైనవారని డాక్టర్ అంబేద్కర్ విశ్వసించారు. అయితే నెహ్రూ నేతృత్వంలోని కాంగ్రెస్ మహిళలకు సాధికారత కల్పించే హిందూ స్మృతి బిల్లును ఆమోదించడంలో విఫలమైంది. ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాలు పార్లమెంటు, రాష్ట్ర చట్టసభల్లో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించడానికి నిరాకరించాయి. ప్రధాని మోదీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం 2023 లో నారీ శక్తి వందన్ అధినియం (మహిళలకు చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లు) ను ఆమోదించింది.
విభజన తర్వాత దళిత శరణార్థులపై నిర్లక్ష్యం
దేశ విభజన తర్వాత పాకిస్థాన్ నుంచి వచ్చిన దళిత శరణార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అంబేద్కర్ విజ్ఞప్తి చేసినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వాలు వారికి భారత పౌరసత్వం ఇవ్వడంలో లేదా వారి పునరావాసానికి తగినంతగా సౌకర్యాలు కల్పించడంలో విఫలమయ్యాయి. ముఖ్యంగా తూర్పు పాకిస్తాన్‌కు చెందిన నమోశూద్రులు, మతువా వర్గం వంటి దళిత వర్గాలు నిర్లక్ష్యానికి గురయ్యాయి.
డాక్టర్ అంబేద్కర్, ఓబీసీల సంక్షేమం
వెనుకబడిన తరగతులకు రాజ్యాంగంలో ఎలాంటి రక్షణలు లేవు. రాష్ట్రపతి నియమించే కమిషన్ సిఫారసుల ఆధారంగా కార్యనిర్వాహక వ్యవస్థ (ప్రభుత్వం)కు ఈ విషయంలో పూర్తిస్వేచ్ఛను ఇచ్చారు. ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించడంతో సహా ఈ దిశగా ప్రభుత్వం అడుగులు వేయాలని అంబేద్కర్ కోరగా కాంగ్రెస్ ఆ ప్రయత్నాలన్నింటినీ అడ్డుకుంది.
కాకా కలేల్కర్ నివేదిక తిరస్కరణ (1956): వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లను ప్రతిపాదించిన కాకా కలేల్కర్ కమిషన్ సిఫార్సులను నెహ్రూ ప్రభుత్వం తోసిపుచ్చింది.
రిజర్వేషన్లపై నెహ్రూ లేఖ (1961): 1961లో నెహ్రూ రాష్ట్ర ముఖ్యమంత్రులకు రిజర్వేషన్ల పట్ల తన వ్యతిరేకతను వ్యక్తం చేస్తూ, అవి అసమర్థతకు, తక్కువ ప్రమాణాలకు దారితీస్తాయని లేఖ రాశారు. రిజర్వేషన్లను సామాజిక న్యాయానికి ఒక సాధనంగా పరిగణించేందుకు ఆ పార్టీ విముఖతను, సమాజంలోని అణగారిన వర్గాల పట్ల దాని ఏవగింపును నెహ్రూ వైఖరి ప్రతిబింబిస్తుంది.
ఓబీసీ రిజర్వేషన్లను అడ్డుకున్న ఇందిరా గాంధీ : ఇందిరాగాంధీ మండల్ కమిషన్ నివేదిక అమలులో జాప్యం చేయడంతో ఓబీసీ రిజర్వేషన్లు ఆలస్యమయ్యాయి.
ఎస్సీ రిజర్వేషన్ల పట్ల రాజీవ్ గాంధీ ఏవగింపు (1985): మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 1985 మార్చి 3న ఎస్సీ రిజర్వేషన్లను చులకన చేస్తూ చేసిన ప్రకటన దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతుల పోరాటాలు, వారి రాజ్యాంగ హక్కుల పట్ల కాంగ్రెస్ దురుసు వైఖరిని బహిర్గతం చేసింది. “రిజర్వేషన్ల ద్వారా మనం మూర్ఖులను ప్రోత్సహించకూడదు,” అని ఆయన వ్యాఖ్యానించారు.
మండల్ కమిషన్ నివేదిక (1990)పై వ్యతిరేకత: 1990 లోక్‌సభ సమావేశాల్లో ఓబీసీ రిజర్వేషన్ల కోసం మండల్ కమిషన్ చేసిన సిఫార్సులను రాజీవ్ గాంధీ తీవ్రంగా వ్యతిరేకించారు. రాజీవ్ గాంధీ హయాంలో దళితులకు, గిరిజనులకు రిజర్వేషన్ల రద్దు పేరుతో ఓట్లు అడుగుతూ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పత్రికల్లో, మీడియాలో ప్రకటనలు జారీ చేసింది.
షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్లకు ఎసరు
షెడ్యూల్డ్ కులాలకు ఉద్దేశించిన రిజర్వేషన్లలో ముస్లింలు, క్రిస్టియన్లను చేర్చాలని కాంగ్రెస్ పదేపదే ప్రయత్నిస్తోంది. ఇది రాజ్యాంగ విరుద్ధం. ఇది 1950లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నేతృత్వంలోని న్యాయ మంత్రిత్వ శాఖ జారీ చేసిన రాజ్యాంగ ఉత్తర్వులను ఉల్లంఘిస్తుంది.
ప్రభుత్వ సాయం అందుకుంటున్న జామియా మిలియా (2011), ఏఎంయూ (1981) వంటి విద్యాసంస్థలను కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీ సంస్థలుగా వర్గీకరించి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లు నిరాకరించింది.
ఏఎంయూ లేదా జామియా మిలియా ఇస్లామియాలో అణగారిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించే ప్రయత్నాన్ని కాంగ్రెస్ వ్యతిరేకిస్తూనే ఉంది. ఇనాందార్ కేసులో (2005) సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేయడానికి 93వ రాజ్యాంగ సవరణ (2005)ను తీసుకువచ్చినప్పటికీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించకుండా మైనారిటీ విద్యాసంస్థలకు మినహాయింపు ఇచ్చింది.
మత ఆధారిత రిజర్వేషన్ల కోసం ఒత్తిడి
కాంగ్రెస్ పార్టీ తన పాలనలోని రాష్ట్రాల్లో ముస్లింలకు మత ఆధారిత రిజర్వేషన్లు కల్పించడానికి నిరంతరం ప్రయత్నించింది. అయినప్పటికీ ఇటువంటి ప్రతిపాదనలు చట్టపరమైన ఆమోదం పొందలేకపోయాయి. అవి రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయి. మతం ఆధారంగా రిజర్వేషన్లు కల్పించాలని రాజ్యాంగంలో ఎక్కడా పేర్కొనలేదు.
ముస్లిం జనాభాలో ఎక్కువ మంది ఇప్పటికే ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ) కేటగిరీ కిందకు వస్తారు, రిజర్వేషన్ ప్రయోజనాలకు అర్హులు. ఇదికాక ముస్లింలతో సహా అన్ని వర్గాలలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు (ఈడబ్ల్యూఎస్) ఈడబ్ల్యూఎస్ కోటాకు అర్హులు. అందువల్ల, ముస్లింలకు ప్రత్యేకంగా మత ఆధారిత రిజర్వేషన్లను సమర్థించడం అనవసరం. రాజ్యాంగ నియమాలకు విరుద్ధం. ఇలాంటి విభజన విధానాలపై కాంగ్రెస్ మొండివైఖరి ఆచరణ సాధ్యం కానిదే కాక, ప్రమాదకరం కూడా. ఇది సామాజిక సామరస్యాన్ని దెబ్బతీస్తుంది, గతంలో భారతదేశ విభజనకు దారితీసిన గుర్తింపు రాజకీయాలను మళ్ళీ రెచ్చగొడుతుంది.
అధికరణం 356 దుర్వినియోగం
ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేయడానికి కాంగ్రెస్ అధికరణం 356ను 90 సార్లు దుర్వినియోగం చేయడం రాజ్యాంగ దుర్వినియోగానికి అతిపెద్ద ఉదాహరణ. ప్రతిపక్షాల నేతృత్వంలోని రాష్ట్రాలను అస్థిరపరచడం, కుటుంబ నియంతృత్వం కోసం కేంద్రంలో అధికారాన్ని సంఘటితం చేసుకునే ప్రధాన లక్ష్యంతోనే కాంగ్రెస్ పదేపదే అధికరణం 356ను ఉపయోగించి రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేసిందనడంలో సందేహం లేదు. ఈ దుర్వినియోగం రాజ్యాంగంలో పొందుపరిచిన సమాఖ్య వ్యవస్థను బలహీనపరిచింది, రాష్ట్రాలను కేవలం కేంద్ర ప్రభుత్వ దయాదాక్షిణ్యాలపై ఆధారపడే వాటిగా చేసింది. ప్రాంతీయ ప్రభుత్వాల స్వయంప్రతిపత్తిని హరించివేయడం, రాష్ట్ర వ్యవహారాల పరిధిలోకి చొచ్చుకు వెళ్లడం ప్రమాదకరమైన సంకేతాలను పంపిస్తుంది, ఇది దేశ ప్రజాస్వామిక వ్యవస్థను బలహీనపరుస్తుంది.
ఉమ్మడి పౌరస్మృతిపై వ్యతిరేకత
ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) అమలు రాజ్యాంగ లక్ష్యమని ఆదేశిక సూత్రాల్లో స్పష్టంగా పేర్కొన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ నిరంతరం దీన్ని వ్యతిరేకిస్తోంది.
జాతీయ సమైక్యత, సామాజిక న్యాయం కంటే ఓటు బ్యాంకు రాజకీయాలకు ప్రాధాన్యమిస్తూ, ఎన్నికల ప్రయోజనాల కోసం మైనారిటీలను బుజ్జగించే కాంగ్రెస్ వ్యూహంలో ఈ వ్యతిరేకత ఒక అంతర్భాగమై పోయింది.
డాక్టర్ అంబేద్కర్ యూసీసీ కోసం వాదించారు. రాజ్యాంగ సభలో ప్రసంగిస్తూ డాక్టర్ అంబేద్కర్ ఇలా అన్నారు: “యావత్తు జీవితానికి వర్తించేవిధంగా, చివరికి చట్టసభలు కూడా జోక్యం చేసుకోకుండా మతానికి ఇంత విస్తృతమైన అధికార పరిధిని ఎందుకు ఇవ్వాలో నాకు వ్యక్తిగతంగా అర్థం కావడం లేదు. ఇంతకీ, మనకు ఈ స్వేచ్ఛ దేనికి ఉంది? అసమానతలు, వివక్షలు, మన ప్రాథమిక హక్కులకు విరుద్ధమైన ఇతర అంశాలతో నిండిన మన సామాజిక వ్యవస్థను సంస్కరించడానికి మనకు ఈ స్వేచ్ఛ ఉంది.”