it act

ఆర్థిక వృద్ధికి దోహదం చేసే కొత్త ఐటీ చట్టం

ఏడాది కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త ఆదాయం పన్ను (ఐటీ) బిల్లు ఇప్పుడు అత్యంత ఆవశ్యకం. 2025 ఫిబ్రవరి 13న లోక్‌సభలో ప్రభుత్వం కొత్త ఆదాయం పన్ను బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టింది. మిగతా అంశాలతో పాటు గందరగోళంగా ఉన్న ఆదాయం పన్ను చట్టం 1961ని సవరించడం ఈ బిల్లు ఉద్దేశం. 1961లో ఆదాయం పన్ను చట్టాన్ని తెచ్చినప్పటి నుంచి ఆ చట్టాన్ని అనేకసార్లు మార్చారు. ప్రతి వార్షిక బడ్జెట్లోనూ 1961 నుంచి ఐటీ చట్టంలో ఏదో ఒక మార్పు చేస్తూనే వచ్చారు. దీనివల్ల ఈ చట్టం సంక్లిష్టంగా, గందరగోళంగా తయారయింది. దీన్ని అర్థం చేసుకోవడానికి, అమలు చేయడానికి ఈ చట్టాన్ని సరళీకరించవలసిన అవసరం చాలా ఉంది. సామాన్య పన్ను చెల్లింపుదారుల జీవితాన్ని సులభతరం చేయడానికి ఐటీ చట్టాన్ని పునర్వ్యవస్థీకరించవలసిన సమయం ఆసన్నమైంది. అంతేగాక ప్రభుత్వ పన్ను వసూళ్లు ప్రక్రియ సక్రమంగా జరగడానికి, ఆదాయం పెరగడానికి కూడా ఈ చట్టాన్ని సరళీకరించటం అవసరం.

ఆదాయం పన్ను చట్టాన్ని సరళీకరించటం వెనక ఒక ముఖ్యమైన ఆర్థిక కోణం కూడా ఉంది. ఈ చట్టం తెచ్చిన తర్వాత జాతీయ ఆర్థిక వ్యవస్థకు ఒనగూడే ప్రయోజనాలను కూడా ఇక్కడ పరిశీలించాలి. భారత ఆర్థిక వ్యవస్థను 2027-28 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చే లక్ష్యంతో పాటు 2014 నాటికి అభివృద్ధి చెందిన (వికసిత్) భారత్ ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు కూడా ఆదాయం పన్ను చట్టాన్ని సరళీకరించాల్సి ఉంది. కొత్త ఐటీ బిల్లు ఒక మాటలో చెప్పాలంటే 1961 ఐటీ చట్టానికి కొనసాగింపే. పన్ను వివాదాలను, కేసులను తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది కచ్చితంగా ఎంత పన్ను చెల్లించాల్సి వస్తుందో పన్ను చెల్లింపుదారుల్లో అవగాహన కల్పించడమే కాకుండా ప్రభుత్వానికి పన్ను ఆదాయాన్ని పెంచుతుంది. పన్ను ఆదాయం పెరిగితే ప్రభుత్వం ఖర్చు చేసే మొత్తం పెరిగి దాని ప్రభావం ఆర్థికవ్యస్థపై సానుకూలంగా ఉంటుంది. 

భారతీయ న్యాయ భావన కొత్త ఐటీ బిల్లుకు పునాది, ఇదే న్యాయ భావన దేశంలో న్యాయవ్యవస్థకు మూలం. 2024లో వలస పాలకులు ప్రవేశపెట్టిన1860 నాటి భారతీయ శిక్షాస్మృతిని తొలగించి నరేంద్ర మోదీ ప్రభుత్వం భారతీయ న్యాయ భావనకు ప్రాధాన్యమిస్తూ కొత్త న్యాయస్మృతులను ప్రవేశపెట్టింది. అదే స్ఫూర్తితో తీసుకువచ్చిన ఈ కొత్త ఐటీ చట్టం వ్యాపారుల్లో విశ్వాసాన్ని పెంచి ఆర్థిక కార్యకలాపాలకు ఊపునిస్తుందనడంలో సందేహం లేదు. క్రిప్టో కరెన్సీలు, నాన్ ఫంజిబుల్ టోకెన్స్, ఇతర డిజిటల్ ఆస్తుల వంటి రూపంలేని (వర్చువల్) డిజిటల్ ఆస్తులకు ఈ బిల్లులో విస్తృతమైన నిర్వచనం ఇచ్చారు. సమీప భవిష్యత్తులో డిజిటల్ ఆస్తుల వాడకం పెరగనున్నందున దీనివల్ల డిజిటల్ ఆస్తులు, కరెన్సీల నుంచి వచ్చే పన్ను ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. పన్నుల వసూళ్లు అప్పీలు ప్రక్రియలను సంస్కరించే కొత్త నిబంధనలను ఈ బిల్లులో ప్రవేశపెట్టారు. ఇది పన్ను చెల్లింపును పెంచడమే కాకుండా ఆదాయాన్ని కూడా పెంచుతుంది. దీనివల్ల ప్రభుత్వం మరింత ఎక్కువగా ఖర్చు చేయగలుగుతుంది.

కొత్త బిల్లు పన్నులను సరళం చేయడం ద్వారా పన్ను చెల్లింపుదారులకు డబ్బు ఆదా చేస్తుంది. ఫలితంగా ప్రజలు ఎక్కువ మొత్తాలను ఖర్చు చేస్తారు, దీని వల్ల ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయి. కొత్త చట్టం సెక్షన్ 80 సీసీబీ, సెక్షన్ 80 సీసీఎఫ్ వంటి 300కు పైగా కాలం చెల్లిన చట్ట నిబంధనలను తొలగించింది. దీంతో పౌరులు, మదుపుదారుల చేతుల్లో ఎక్కువ డబ్బు మిగిలి వినిమయ వ్యయం పెరుగుతుంది. ఏకీకృత పన్ను సంవత్సరం విధానం కొత్త వ్యాపారాలకు లేదా వృత్తిదారులకు లాభం చేకూరుస్తుంది. ఎందుకంటే వ్యాపారం మొదలైనప్పటి నుంచి వారి పన్ను చెల్లింపు కాలాన్ని లెక్కలోకి తీసుకుంటారు. దీని వల్ల వ్యాపారులు, డాక్టర్లు, లాయర్లు వంటి వృత్తి నిపుణులు డబ్బు ఆదా చేసుకుని తమ వ్యాపారాలను పెంచుకోవడానికి దాన్ని వినియోగిస్తారు. ఐటీ చట్టంలో నిబంధనలు, వివరణలు గణనీయంగా తగ్గడం వల్ల పన్ను రిటర్నుల దాఖలు సరళం అవుతుంది. దీంతో ఎక్కువ మంది పన్ను చెల్లిస్తారు. తద్వారా ప్రభుత్వానికి పన్ను ఆదాయం పెరుగుతుంది. అందువల్ల కొత్త ఐటీ చట్టం 2025 దేశంలో పన్ను వ్యవస్థల్లో సమూలమైన మార్పులు తీసుకువస్తుంది. ఆర్థిక కార్యకలాపాలు పెంచడానికి దోహదం చేసి దేశ ఆర్థిక అభివృద్ధికి ప్రేరణ నిస్తుంది. రాజకీయ వ్యవస్థపై, ప్రభుత్వంపై సామాన్య ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుతుంది. జాతీయ ఆర్థిక వృద్ధిని త్వరితం చేసి ప్రాచీన నాగరికత కలిగిన ఈ దేశాన్ని అభివృద్ధి పథంలో నిలిపి దాని గత వైభవాన్ని పునరుద్ధరించాలన్న నరేంద్ర మోదీ ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనం ఈ కొత్త ఐటీ చట్టం.

అతుల్ సెహగల్