ఆర్థిక వ్యవస్థలో ఉత్సాహాన్ని తక్కువ అంచనా వేయలేం
2047 నాటికి భారతదేశాన్ని “వికసిత్ భారత్”గా మార్చాలనే లక్ష్యాన్ని చేరుకోవడానికి, బలమైన ఆర్థిక వ్యవస్థలతో వీలైనంత త్వరగా ఒప్పందాలు చేసుకోవడం చాలా అవసరమని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ స్పష్టం చేశారు. భారత్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం, వృద్ధిరేటు తదితర అంశాలతో సహా ఒక వాణిజ్య దినపత్రికకు ఇచ్చిన ఈ ఇంటర్వ్యూలో ఆమె పలు అంశాల గురించి మాట్లాడారు. ఆ ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు:
ప్రశ్న: ఒకపక్క వాణిజ్య చర్చలు జరుగుతుండగానే, అమెరికా “భారత్ ఆర్థిక వ్యవస్థను తెరుస్తుంది” అని అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఏకపక్షంగా ప్రకటన చేయడం భారతదేశం వంటి సార్వభౌమ దేశానికి ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి?
జ: నిజానికి నేను దీన్ని భారత కోణం నుంచి కూడా చూడాలనుకుంటున్నాను. అమెరికా మన ప్రముఖ వాణిజ్య భాగస్వాములలో ఒకటి, నిజానికి చాలా అగ్రస్థానంలో ఉంది. మనం ఇప్పుడున్న స్థితిలో మన వృద్ధి లక్ష్యాలు, 2047 నాటికి వికసిత్ భారత్‌ను చేరుకోవాలనే ఆశయం దృష్ట్యా, బలమైన ఆర్థిక వ్యవస్థలతో అలాంటి ఒప్పందాలు ఎంత త్వరగా చేసుకుంటే అవి మనకు అంత బాగా ఉపయోగపడతాయి. కాబట్టి, ట్రంప్ ప్రకటనపై నా అభిప్రాయం చెప్పాలనుకుంటున్నాను: “అవును, నేను ఒక పెద్ద, మంచి, అందమైన ఒప్పందాన్ని చేసుకోవడానికి ఇష్టపడతాను; ఎందుకు వద్దు?”
ప్రశ్న: అయితే, భారతదేశం ఏ “లక్ష్మణ రేఖలు” గీసింది?
జ: చర్చలకు కూర్చునే ముందు చర్చల్లో పాల్గొనే మన ప్రతినిధులు పరిశ్రమల ఆందోళనలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్నారు. వ్యవసాయం, పాడి పరిశ్రమ చాలా పెద్ద “లక్ష్మణ రేఖలు”. వీటి విషయంలో అత్యంత జాగ్రత్త పాటిస్తాం. కొన్ని రంగాలు ఉన్నాయి, అక్కడ మనం ఎల్లప్పుడూ మనకు ఎక్కువ మార్కెట్ ప్రవేశాన్ని కోరవచ్చు, అలాగే వాటిలో బయటి వారి ప్రవేశానికి ద్వారాలు తెరవవచ్చు.
ప్రశ్న: వ్యవసాయంలో కూడా దేశీయంగా తక్కువ లేదా అసలు బలహీనతలు లేని రంగాలు ఉన్నాయి…
జ: కావచ్చు. కానీ వాటిని తెరవడం వ్యవసాయ శాఖ అనుమతితో మాత్రమే జరుగుతుంది. మన వ్యవసాయాన్ని, మన రైతుల పరిస్థితిని బలహీనపరిచే ఏ పనినీ మనం చేయలేం.
ప్రశ్న: “టారిఫ్ కింగ్” అనే పదం మనకు సరికాదని మీరు ఇటీవల పునరుద్ఘాటించారు. మన వాస్తవ సుంకాలు చాలా వరకు తక్కువగా ఉన్నాయా?
జ: మనకు జీరో టారిఫ్‌తో కలిపి ఎనిమిది సుంకాలు మాత్రమే ఉన్నాయి. జూలైలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ లోను, ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన ప్రధాన బడ్జెట్‌లలోను సుంకాలను బాగా తగ్గించాం. పార్లమెంటు ఆమోదంతో గెజిట్‌లో ప్రకటించిన పరిమితుల కంటే వాస్తవంగా వసూలు చేసే సుంకాల రేట్లు తక్కువగా ఉన్నాయి. ఇది ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) నిర్దేశించిన పరిమితి కంటే చాలా తక్కువ. కాబట్టి, భారతదేశాన్ని టారిఫ్ కింగ్ అని పిలవడం పూర్తిగా అన్యాయం.
ప్రశ్న: అయినప్పటికీ, దేశీయ పరిశ్రమకు ఎటువంటి హాని కలిగించకుండా సుంకాలను మరింత తగ్గించడానికి అవకాశం ఉందా?
జ: వాటిపై మన వాణిజ్య చర్చల ప్రతినిధులు ఒక్కో దేశంతో మన లావాదేవీల ఆధారంగా పరిష్కారాలు సాధించాలి. వ్యవసాయం, పాడి పరిశ్రమ మొదలైన రంగాలవారీగా టారిఫ్లను నిర్ణయిస్తారు. పరిశ్రమకు సంబంధించిన ఇతర భయాలను– ఆటోమొబైల్ యూనిట్లు మొదలైనవి – లోతైన సంప్రదింపులతో పరిష్కరిస్తున్నాం. చర్చలు ప్రారంభించడానికి ముందు, జరుగుతున్నప్పుడు, పూర్తయిన తర్వాత సంబంధిత పరిశ్రమలు వర్గాలతో సంప్రదింపులు నిర్వహించిన వాణిజ్య మంత్రి (పీయూష్ గోయల్)ని అభినందిస్తున్నాను.
ప్రశ్న: అమెరికా సుంకాలు ఇప్పటికే చాలా తక్కువగా ఉన్నాయి. మనకు మరింత తగ్గింపు ఉంటుందని మీరు భావిస్తున్నారా?
జ: సుంకాలు తగ్గించడానికి, అమెరికా అధ్యక్షుడు కాంగ్రెస్ వద్దకు వెళ్లాలి. ఇది సమయం తీసుకునే ప్రక్రియ. కాబట్టి వారు దాని కోసం (సుంకాల తగ్గింపు) ప్రయత్నించవచ్చు, కానీ అది ఒప్పందం తర్వాత జరగాల్సి ఉంటుంది.
ప్రశ్న: ఇది తాత్కాలిక ఒప్పందంలో కాకుండా విస్తృత ఒప్పందంలో భాగంగా ఉండవచ్చా?
జ: అవును, ఉండవచ్చు.
ప్రశ్న: ఐపీఆర్ (మేధో సంపత్తి హక్కులు), డేటా లోకలైజేషన్ (సమాచారాన్ని భారతదేశంలోనే భద్రపరచడం), ప్రభుత్వ కొనుగోళ్లు వంటి నాన్-టారిఫ్ అంశాలపై అమెరికాకు భారతదేశం ఏమైనా ప్రధాన సడలింపులు ఇవ్వగలదా?
జ: నాన్-టారిఫ్ అంశాలపై వాణిజ్య చర్చలు ప్రారంభం కాకూడదనేది మా విధానం. పర్యావరణం, లింగ సమానత్వం, సుస్థిరత, కార్బన్ పన్ను, ప్రభుత్వ సేకరణ, పారిశ్రామిక సంబంధాలు వంటి అంశాలు వాణిజ్య చర్చలలో భాగంగా లేవు. కానీ ఇప్పుడు ఇవి సమగ్ర ఒప్పందాల్లో ఒక భాగంగా మారాయి. కనుక మనం బాగా ఆలోచించి, వివేకవంతమైన వైఖరి తీసుకుంటాం. భారతదేశం అభివృద్ధి చెందుతున్న మార్కెట్. మనకూ సొంత మార్కెట్ అవసరాలు ఉన్నాయి. కనుక తొందరపడి ఒప్పందాలు చేసుకోలేం. ప్రభుత్వ కొనుగోళ్లపై, ఎంఎస్ఎంఈలు, స్టార్టప్‌లు మొదలైన వాటి నుండి ప్రభుత్వం వస్తువులను, సేవలను సేకరించాలంటే చాలా మినహాయింపులు కావాలి. ప్రభుత్వ కొనుగోళ్ల విషయంలో మద్దతు అవసరమైన రంగాల పట్ల ప్రభుత్వం చాలా శ్రద్ధ వహిస్తుంది. ఈ సమస్యలను పరిష్కరించకుండా మనం బయటి వారికి ప్రవేశం కల్పించలేం.
ప్రశ్న: జీడీపీలో తయారీ రంగం వాటా కొంతవరకు తగ్గిపోయింది?
జ: ఎక్కువమంది కార్మికులను ఉపయోగించే (లేబర్-ఇంటెన్సివ్) పరిశ్రమలకు మద్దతు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన విధానంలో స్పష్టంగా ఉంది. హస్తకళలు, చేతితో తయారు చేసిన వస్తువులకు మద్దతు లభిస్తుందని మనం స్పష్టంగా చెప్పాం. కాబట్టి మనం ఒకదానిని (శ్రమ) లేదా మరొకదాని (మూలధనం/టెక్నాలజీ) మధ్య ఎదో ఒకటి ఎంచుకునే అవసరం లేదు. తయారీ పరిశ్రమ, అది ఎక్కువమంది కార్మికులను ఉపయోగించేది అయినా లేక ఆటోమేషన్ అవసరమైనది అయినా, దానికి విధానపరమైన మద్దతు ఇస్తాం. అయితే ఈ విభజన రేఖలు క్రమంగా చెరిగిపోతున్నాయి.
ఉదాహరణకు, టెక్స్‌టైల్స్, అప్పారెల్స్ సాంప్రదాయకంగా ఎక్కువమంది కార్మికులను ఉపయోగించే రంగం. కానీ వేగంగా అందులో ఆటోమేషన్ పెరుగుతోంది. తిరుపూర్‌లో ఒక పెద్ద నిట్‌వేర్ యూనిట్ గతంలో 30,000 మందికి పైగా ఉద్యోగులను కలిగి ఉండేది. ఇప్పుడు ఉత్పత్తి ప్రక్రియకు సహాయపడటానికి ఏఐ తీసుకువచ్చింది. ఇది ఉత్పాదకతను పెంచింది. దాని కార్మికులలో మూడింట ఒక వంతు మంది ఇప్పుడు ఇంతకు ముందు చేస్తున్న పనులను చేయనవసరం లేదు. మనం దాన్ని వ్యతిరేకించలేం. అలాంటి యూనిట్లు సిబ్బందిని తొలగించడం లేదు; దానికి బదులుగా వారు లాభదాయక ఉపాధి కోసం తమ సిబ్బంది నైపుణ్యాలను పెంచడానికి ప్రయత్నిస్తున్నారు.
లేబర్-ఇంటెన్సివ్ పరిశ్రమలలో కూడా పూర్తి మార్పు జరుగుతోంది, అది ఏ స్థాయిలో అంటే సాంప్రదాయ ముద్రలకు అతీతంగా. ఇంత జరుగుతున్నా ఆటోమేషన్ అంత త్వరగా రాని కొన్ని రంగాలు ఉన్నాయి. తయారీ యూనిట్లు, కొన్ని రంగాల్లోని ఎంఎస్ఎంఈలు ఇప్పుడే ఆటోమేషన్ ను కోరుకోకపోవచ్చు. వారికి రుణ సదుపాయాలను పెంచడానికి ఒక విధానాన్ని రూపొందించాలి. కనుక దీని సారాంశం ఏమిటంటే గతంలో మాదిరిగా ఏ పరిశ్రమ మార్పులకు అతీతంగా లేదు. అన్ని రంగాల్లోనూ మార్పులు వస్తున్నాయి. విభజన రేఖలు చెరిగిపోతున్నాయి. అన్ని రంగాల్లోనూ ప్రతి ఒక్కరూ తమ నైపుణ్యాలను నవీకరించుకోవాలి. కార్మిక మార్కెట్‌లో పరిస్థితి ఎప్పటికప్పుడు వేగంగా మారిపోతూ ఉంది; కొందరు ఒక రంగం నుంచి ఇంకో రంగంలోకి మారుతుండగా ఇతరులు ఉన్నత స్థానాలకు వెళ్తున్నారు.
ప్రశ్న: రిజర్వు బ్యాంకు ఈసారి కేవలం రెపో రేటును భారీగా తగ్గించడంతోపాటు, సీఆర్‌ఆర్ (నగదు నిల్వ నిష్పత్తి)ని కూడా తగ్గించింది. ఇది చాలా వర్గాలను ఆశ్చర్యపరిచింది, ఎందుకంటే ద్రవ్య లభ్యత (ఆర్థిక వ్యవస్థలో నగదు లభ్యత) ఇప్పటికే ఉంది. ఆర్‌బీఐకి ముందుగానే ఏదో తెలిసిందని, మాంద్యాన్ని నివారించడానికి ఈ చర్యల ద్వారా తీవ్ర ప్రయత్నం చేస్తోందన్న అభిప్రాయం దీనివల్ల ఏర్పడింది.
జ: ఇప్పుడు ఆర్థిక వృద్ధి కోసం ఆర్‌బీఐ ముందస్తు చర్యలు తీసుకోవడాన్ని తొందరపాటు చర్యగా పరిగణించలేం. ఆర్‌బీఐ ఇది చేసింది కనుక మనం చూడలేనిది ఏదో అది బహుశా చూస్తోందని చెప్పడం కూడా సరికాదు. ఆర్‌బీఐ వంటి మంచి రికార్డు ఉన్న సంస్థలు అలా చేయవు. ఆర్‌బీఐ కేవలం వడ్డీ రేటును తగ్గించడం లేదా పెంచడం చేయదు. అందుకు గల కారణాలను ద్రవ్య విధాన సమావేశంలో వివరిస్తుంది. ఆ వివరాలన్నీ కూడా బహిరంగం చేస్తారు.
ప్రశ్న: పెట్టుబడి ఆధారిత వృద్ధి చాలా ఆలస్యం అవుతోంది. స్థూల స్థిర మూలధన నిర్మాణం ఆర్థిక సంవత్సరం 2025లో జీడీపీలో 30 శాతానికి మూడేళ్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. అయితే ఆశించిన రేటు 35 శాతానికి పైగా ఉంది. పెద్ద కార్పొరేట్‌లకు మాత్రమే కాకుండా, ఎంఎస్ఎంఈలు, ఇతర రంగాలలో కూడా కలిపి విస్తృతమైన పెట్టుబడి ఎంతవరకు సాధ్యం?
జ: ఆర్థిక వ్యవస్థలో ఒక ఉత్సాహం కనిపిస్తోంది, దానిని తక్కువ అంచనా వేయలేం. అది లేకపోతే మనం ఇప్పుడున్న స్థితిలో (వృద్ధి పరంగా) ఉండేవాళ్లు కాదు. సంస్థలు కాలానుగుణంగా తమ అంచనాలను నవీకరిస్తున్నాయి (ఎస్ అండ్ పి ఇటీవల భారతదేశం 2026 ఆర్థిక సంవత్సరం వృద్ధి అంచనాను 6.5 శాతానికి పెంచింది). లేదా మనం (స్థిరంగా అధిక) జీఎస్టీ ఆదాయాలను ఉత్పత్తి చేసి ఉండేవాళ్ళం కాదు. నిజానికి, ఈ రోజు ప్రజలు ఆర్థిక వ్యవస్థ ఎంత బలంగా ముందుకు వెళుతుందో సూచించడానికి జీఎస్టీని ఉపయోగిస్తున్నారు. (జీడీపీలో 7 శాతానికి పైగా ఉన్న జీఎస్టీ వసూళ్లు వ్యాట్/ఎక్సైజ్ కాలం నాటి స్థాయిలను దాటాయి). జీఎస్టీలో సమాచారం చాలా స్పష్టంగా, బహిరంగంగా ఉంటుంది. ఏ రాష్ట్రాలు, రంగాల నుంచి ఎంత వసూలు అవుతుందో మనం చూడవచ్చు. అందువల్ల అనేక సూచీలు ఆర్థిక వ్యవస్థలో జోరును వెల్లడిస్తున్నాయి. కచ్చితంగా మనం అధిక వృద్ధిని కోరుకుంటున్నాం, 10 శాతం వృద్ధిని ఆకాంక్షిస్తున్నాం. ఇప్పుడు మనం 6.4 శాతం వద్ద మాత్రమే ఉన్నాం (2025 ఆర్థిక సంవత్సరం స్థూల విలువను కలిపితే). కానీ ఇది 6.4 శాతమే గాని యూరప్, ఆగ్నేయాసియా దేశాలలో మాదిరిగా 2-2.5 శాతం కాదు. అంతమాత్రాన నేను ఈ రేటు చాలా గొప్ప అని చెప్పడం లేదు, అయితే ప్రస్తుత ప్రపంచ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఇది తక్కువ అని బాధపడటం కూడా అనుచితమే. భారతీయులు కష్టాల్లో ఉన్నప్పటికీ పని చేసి పురోగమిస్తుంటే మనం దానిని గుర్తించాలి. ఎగుమతులకు ప్రసిద్ధి చెందిన దేశాలు అలాంటి వ్యూహంతో ఇక వృద్ధి చెందలేకపోతున్నాయి. ఈ సమయంలో భారతీయ ఎగుమతులు బాగా జరుగుతున్నాయి.

