అటల్ జీలో రాముడి ఆదర్శం, లక్ష్మణుడి పరాక్రమం
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి సన్నిహితుడు శివ్ కుమార్ శర్మ ప్రత్యేక ఇంటర్వ్యూ
నాగార్జున

మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి జీవితం, ఆయన కాలం నాటి విశేషాల గురించి ఆయనకు అత్యంత సన్నిహితుడు, సుదీర్ఘకాల సహచరుడు అయిన శివ్ కుమార్ శర్మ, బిజెపి జాతీయ పత్రిక’కమల్ సందేశ్’తో మాట్లాడారు. భారతదేశపు అత్యంత గొప్ప నాయకులలో ఒకరైన అటల్‌జీ వ్యక్తిత్వం, ఆయన వాక్చాతుర్యం, జీవితంలో అత్యంత సంతోషకరమైన ఘట్టం, ఇతర అంశాల గురించి శర్మ చర్చించారు. ఈ ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు:
ప్ర: అటల్ జీతో మీకు పరిచయం ఎప్పుడు, ఎలా ఏర్పడింది?
జ: నేను సంఘ్ స్వయంసేవక్‌గా, జనసంఘ్ కార్యకర్తగా ఉన్న సమయంలో వివిధ కార్యక్రమాలలో అటల్‌జీని కలుస్తుండేవాడిని. పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ విషాదకర హత్య తర్వాత నేను తప్పకుండా అటల్‌జీతో ఉండాలని భావించాను. ఒకసారి నేను అటల్‌జీని కలిసి, ఆయనతో పాటుగా ఎవరైనా ఉండాలని అభ్యర్థించాను. అప్పుడు ఆయన నిరాకరిస్తూ, “నీకు కుటుంబం ఉంది; నువ్వు సుప్రీంకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నావు. నీ జీవనం కోసం ఏమీ ఇచ్చే స్థితిలో నా పార్టీ గానీ, నేను గానీ లేము” అన్నారు. నేను, “సాబ్! నా బాధ్యతలన్నీ పూర్తి చేసుకున్నాకే మీతో పని చేయడానికి వచ్చాను. నేను అప్పటికే నిర్ణయం తీసుకుని, నా బాధ్యతలను సర్దుబాటు చేసుకున్నాను. మీరు (అటల్‌జీ) క్షేమంగా ఉంటేనే భారతీయ జనసంఘ్ మరింతగా అభివృద్ధి చెందుతుంది, ఆ ప్రయాణంలో నా లాంటి కోట్ల మంది కార్యకర్తలకు ప్రోత్సాహం లభిస్తుంది,” అన్నాను. అప్పుడు ఆయన, “సరే, వచ్చి చేరిపో” అంటూ అంగీకరించారు. 1967 నుండి ఆయన జీవితపు చివరి క్షణం వరకు నేను ఆయనతోనే ఉన్నాను.
ప్ర: ఆయన దినచర్య ఎలా ఉండేది?
జ: ఆయన ఆరోగ్యంగా ఉన్నప్పుడు తరచుగా దేశవ్యాప్తంగా పర్యటనలలో ఉండేవారు. ఆయన దిల్లీలో ఉండే సమయం చాలా తక్కువ. పార్లమెంట్ సమావేశాల సమయంలో మాత్రమే దిల్లీలో ఉండేవారు. అయితే, 2005లో తాను ఇక రాజకీయాలలో చురుకుగా ఉండబోనని బహిరంగంగా ప్రకటించారు. కేవలం ఒకే ఒక్కసారి, 2007లో భైరాన్ సింగ్ షెకావత్ రాష్ట్రపతి ఎన్నికలలో పోటీ చేసినప్పుడు, అటల్‌జీ తన నివాసంలో ఎన్‌డీఏ మిత్రపక్షాల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. 2009లో అటల్‌జీకి పక్షవాతం వచ్చి, రెండు నెలలు ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై ఉండి, కోలుకున్నాక ఇంటికి తిరిగి వచ్చారు.

ప్ర: ఆయన జీవితంలో అత్యంత సంతోషకరమైన, బాధాకరమైన ఘట్టాలు ఏవి?
జ: 1998లో పోఖ్రాన్ అణు పరీక్షలు జరిగినప్పుడు, అలాగే హైజాక్ అయిన ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం 814 ఎటువంటి ప్రాణనష్టం లేకుండా సురక్షితంగా భారతదేశానికి తిరిగి వచ్చినప్పుడు ఆయనకు అత్యంత సంతోషం కలిగింది. విమానం కాందహార్‌కు హైజాక్ అయినప్పుడు, పార్లమెంట్‌పై దాడి జరిగినప్పుడు, గుజరాత్‌లోని అక్షరధామ్‌పై దాడి జరిగినప్పుడు ఆయనకు తీవ్ర దుఃఖం కలిగింది.
ప్ర: అటల్‌జీకి కోపం రావడం ఎప్పుడైనా చూశారా?
జ: లేదు, ఆయన కోపం తెచ్చుకోవడం నేనెప్పుడూ చూడలేదు.
ప్ర: రాజకీయాలు, సాహిత్యం కాకుండా ఆయనకు ఉన్న ఇతర హాబీలు ఏమిటి?
జ: ఆయనకు వంట చేయడం, సంగీతం వినడం అంటే ఇష్టం. ముఖ్యంగా శాస్త్రీయ సంగీతం, లతా మంగేష్కర్ పాటలను వినడానికి ఇష్టపడేవారు.
ప్ర: ఆయనకు ఖాళీ సమయం దొరికితే ఏం చేసేవారు?
జ: ఆయన ఎప్పుడూ పార్టీ కార్యకలాపాలతో తీరిక లేకుండా ఉండేవారు. ఆయనకు ఖాళీ సమయం అనేదే ఉండేది కాదు.
ప్ర: కవిత్వం రాయడానికి సమయం ఎప్పుడు దొరికేది?
జ: సాధారణంగా రైలులో లేదా కారులో ప్రయాణిస్తున్నప్పుడు ఆయన కవిత్వం రాయడానికి, కవితలు అల్లడానికి సమయం దొరుకుతుండేది. ఆయన మనసులో ఏ ఆలోచన వచ్చినా, ప్రయాణంలోనే ఒక కాగితంపై రాసేవారు.
ప్ర: మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన అటల్‌జీకి సంబంధించిన ఏదేని ఒక మరపురాని సంఘటనను చెప్పగలరా?
జ: ఆయన జీవితంలోని ప్రతి సంఘటన నన్ను ప్రభావితం చేసింది. నిజానికి ఆయన ఆనందమే నా ఆనందం, ఆయన దుఃఖమే నా దుఃఖం. ఒకసారి, నేను అటల్‌జీని విమానాశ్రయం నుంచి తీసుకురావడానికి వెళ్లాలి. విమానం రాత్రి 10 గంటలకు దిగాలి, కానీ ఆలస్యమైంది. ఆ సమయంలో బిజెపి కార్యదర్శిగా ఉన్న మాథుర్జీ (జె.పి. మాథుర్) వచ్చి, తనతో సినిమాకు రమ్మని అడిగారు. నేను 9 గంటలకు అటల్‌జీని రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లాలని చెప్పాను. విమానం గంటన్నర ఆలస్యమై 10 గంటలకు దిగుతుందని చెప్పాను. అప్పుడు ఆయన సినిమా కేవలం గంటన్నరే ఉంటుందని చెప్పి, నన్ను బలవంతం చేశారు. ఆయన పదే పదే అడగడంతో నేను ఆయనతో పాటు వెళ్లక తప్పలేదు. అయితే, సినిమా రెండు గంటలకంటే ఎక్కువ సేపు నడిచింది. నేను చాలా ఆందోళన చెందాను.
అసలు విమానం ఎటువంటి ఆలస్యం లేకుండా సరిగ్గా సమయానికి దిగింది. నేను ఎయిర్‌పోర్ట్‌కు చేరుకునేసరికి అటల్‌జీ ఇంటికి వెళ్లిపోయారు. ఇంటి తాళాలు నా దగ్గర ఉన్నాయి. ఇంటికి తిరిగి వెళ్లగా, అటల్‌జీ బయట లాన్‌లో నడుస్తూ కనిపించారు. మొదటగా, నేను ఆయనను ఎదుర్కోవడానికి ధైర్యం చేయలేకపోయాను. ఎలాగో ధైర్యం చేసి గేటు తెరిచి, ఆయన బ్రీఫ్‌కేస్ తీసుకున్నాను. అప్పుడు ఆయన, “ఎక్కడికి వెళ్లావు?” అని అడిగారు. నేను సినిమాకు వెళ్లినట్లు చెప్పాను. ఆయన, “నాకు ఎందుకు చెప్పలేదు? నాకు చెప్పి ఉంటే నేను కూడా నీతో పాటు సినిమాకు వచ్చేవాడిని కదా!” అన్నారు. నేను భయపడిన దానికి విరుద్ధంగా, ఆయన అలా మాట్లాడటంతో నాకు చాలా ఉపశమనం లభించింది.
ప్ర: అటల్‌జీలో గమనించదగిన ప్రత్యేక లక్షణాలు ఏమిటి?
జ: ఆయనకు అపారమైన ఓర్పు ఉండేది. ఆయన సాధారణంగా ప్రజలను కలిసేవారు కాదు. వారి సమస్యలను వినడానికి ఓపికగా సమయం కేటాయించి, వాటిని పరిష్కరించడానికి ప్రయత్నించేవారు. అటల్‌జీలో శ్రీరాముడి ఆదర్శం, లక్ష్మణుడి పరాక్రమం, వివేకానందుడి గాంభీర్యం, శ్రీకృష్ణుడి ఆకర్షణ, బుద్ధుడి ఏకాగ్రత – ఈ ఐదు లక్షణాలు మూర్తీభవించాయి. మాట్లాడటానికి నాలుక అవసరం, నిశ్శబ్దంగా ఉండటానికి తెలివి అవసరం అని ఆయన తరచుగా చెప్పేవారు.
ప్ర: ఆయనకు ఇష్టమైన ఆహారం ఏమిటి?
జ: ఆయనకు కిచిడీ అంటే చాలా ఇష్టం. కిచిడీ వండడానికి కూడా ఆయన ఇష్టపడేవారు. ఆయనకు స్వీట్లు ఇష్టమే, కానీ ప్రత్యేకంగా ఒక స్వీటే ఇష్టం అని చెప్పలేం. నాకు ఒక సంఘటన గుర్తుకొస్తోంది. ఆయన ముంబైకి వెళ్లారు. ఒకరి ఇంట్లో భోజనం చేస్తున్నారు. ఆ వ్యక్తి భోజనంతో పాటు రసగుల్లాలు వడ్డించారు. రసగుల్లాలు ఎలా ఉన్నాయని అడిగితే, అటల్‌జీ చాలా బాగున్నాయని చెప్పారు. ఆ వ్యక్తి మరో రెండు రసగుల్లాలు తీసుకొచ్చారు. ఆ తర్వాత మేము మహారాష్ట్రలో ఏడు రోజుల పర్యటనలో ఉన్నాం. ఆ తర్వాత అటల్‌జీ ఎక్కడికి వెళ్లినా, ఆయన భోజనంలో రసగుల్లాలు కనిపించేవి. “ఎందుకు ప్రతిచోటా రసగుల్లాలే వడ్డిస్తున్నారు?” అని అటల్‌జీ అడిగారు. “మీకు రసగుల్లాలు ఇష్టమని నోట్ బుక్‌లో రాసుకున్నారు” అని నేను చెప్పాను. అప్పుడు ఆయన, “నాకు అన్ని స్వీట్లు ఇష్టమే, కానీ ఈ రసగుల్లా పేరును జాబితా నుంచి తీసివేయండి” అన్నారు. “మీరు ఎవరి ఇంటికైనా వెళ్ళినప్పుడు, వారు ప్రేమగా భోజనం వడ్డిస్తే, బాగుందని చెప్పకుండా ఉంటామా?” అని ఆయన అన్నారు.
సాధారణంగా అటల్‌జీ భోజనంలో పప్పు, రోటీ తీసుకునేవారు. ఉదయం బ్రెడ్, ఒక కప్పు పాలు తీసుకునేవారు. అయితే, రాత్రి పూట పాలు తాగడానికి ఇష్టపడేవారు. చిన్నప్పటి నుంచి నిద్రించడానికి ముందు పాలు తాగే అలవాటు ఆయనకు ఉంది. ఒకసారి దీన్‌దయాళ్‌జీ, అటల్‌జీ పర్యటనలో ఉన్నప్పుడు, రాత్రి బస సమయంలో అటల్‌జీ దీన్‌దయాళ్‌జీని కూడా పాలు తాగమని పట్టుబట్టారు. కానీ దీన్‌దయాళ్‌జీకి పాలు అంతగా నచ్చేవి కావు.
ప్ర: అటల్‌జీ పూర్వీకులు ఎక్కడి వారు?
జ: ఆయన పూర్వీకులు బటేశ్వర్ వాస్తవ్యులు. ఆయన తాతగారు భాగవత కథా ప్రవచనంలో నిష్ణాతులు. ఆయన గ్రామాలు తిరుగుతూ భాగవత కథా ఉపన్యాసాలు ఇచ్చేవారు. ఆయన ఆశుకవి కూడా. అటల్‌జీ తండ్రి కూడా కవి. అటల్‌జీ తన తండ్రితో కలిసి కవి సమ్మేళనాలకు హాజరయ్యేవారు. అప్పుడే ఆయన కవిత్వం రాయడం ప్రారంభించారు. ఈ లక్షణం ఆయనకు వారసత్వంగా వచ్చింది. అటల్ బిహారీ వాజ్‌పేయి తన తండ్రితో కలిసి కాన్పూర్ కళాశాలలో న్యాయశాస్త్రం చదవడానికి చేరారు. ఇద్దరూ క్లాస్‌మేట్స్, హాస్టల్‌లో రూమ్‌మేట్స్ అయ్యారు. అటల్‌జీ న్యాయశాస్త్ర అధ్యయనాన్ని పూర్తి చేయలేదు, కానీ ఆయన తండ్రి పూర్తి చేశారు. అదే సమయంలో అటల్‌జీ రాజనీతి శాస్త్రంలో మొదటి శ్రేణిలో ఎంఏ పూర్తి చేశారు. అప్పట్లో లా, ఎంఏ ఏకకాలంలో చేసే అవకాశం ఉండేది. ఆయన బీఏ కూడా మొదటి శ్రేణిలో పూర్తి చేశారు. ఆ సమయంలో, మొదటి తరగతిలో ఉత్తీర్ణులైన వారికి గ్వాలియర్ మహారాజు స్కాలర్‌షిప్ ఇచ్చేవారు. అయితే స్కాలర్‌షిప్ పొందడానికి ఒక షరతు ఉండేది. అధ్యయనం పూర్తి చేసిన తర్వాత తప్పనిసరిగా గ్వాలియర్ మహారాజు దగ్గర ఉద్యోగంలో చేరాలి. అటల్‌జీ ఈ షరతుకు అంగీకరించకుండా ఎంఏ కోసం కాన్పూర్‌లోని డీఏవీ కాలేజీలో చేరారు.
ప్ర: ఆయన వాక్చాతుర్యం గురించి చెప్పగలరా?
జ: ఆయన నాలుక చివర్లో సరస్వతి దేవి కొలువై ఉండేది. ఆయన మాటల మాంత్రికుడు. ప్రసంగిస్తున్నప్పుడు, ఆయన హావభావాలు ఆయన మాటలకు అనుగుణంగా ఉండేవి. వినేవారి ముఖాలను చదివి, శ్రోతలు తన నుండి ఏమి ఆశిస్తున్నారో ఆయన తెలుసుకునేవారు. మీరు అటల్‌జీ గురించి తెలుసుకోవాలంటే, ఆయన కవితలను చదవండి. ఆయన హాస్యం, వ్యంగ్యం, ఆవేదనతో కూడిన కవితలను రచించారు. సమకాలీన సమస్యలపై కూడా కవితలు రాశారు.’హిందూ తన్మన్, హిందూ జీవన్, రగ్ రగ్ హిందూ మేరా పరిచయ…’,’హృదయ్ సే హృదయ్ మిలావ్…’ వంటివి సమకాలీన సమస్యలపై ఆయన రాసిన కవితలకు ఉదాహరణలు. పంజాబ్ అల్లర్ల సమయంలో ఆయన’దూధ్ మే దరార్ పడ్ గయీ, ఖూన్ క్యోం సఫేద్ హో గయా’ (పాలలో తేడా వచ్చింది, రక్తం ఎందుకు తెల్లబడింది) అని రాశారు. ఆయన అజాతశత్రువు. అన్ని రాజకీయ పార్టీలతో ఆయనకు సత్సంబంధాలు ఉండేవి.
ప్ర: అటల్‌జీ గురించి మరికొన్ని విషయాలు చెప్పగలరా?
జ: నెహ్రూజీ కూడా స్వాతంత్య్ర పోరాట సమయంలో జైలు పాలయ్యారు కాబట్టి ఆయన పట్ల అటల్‌జీకి గౌరవం ఉండేది. స్వాతంత్య్రం తర్వాత నెహ్రూ హీరోగా ఎదిగారు. ఆ రోజుల్లో పార్లమెంట్‌లో జనసంఘ్‌కు కొన్ని సీట్లు మాత్రమే ఉండేవి. అందుకే మా నాయకులకు పార్లమెంట్‌లో మాట్లాడటానికి చాలా తక్కువ సమయం దొరికేది. ఒకసారి అటల్‌జీకి విదేశాంగ విధానంపై మాట్లాడే అవకాశం లభించింది. ఆ రోజుల్లో సభ్యులు సాధారణంగా విదేశాంగ వ్యవహారాలపై ఆంగ్లంలో మాట్లాడేవారు. అటల్‌జీ హిందీలో మాట్లాడారు. నెహ్రూజీ కూడా హిందీలోనే సమాధానం ఇచ్చారు. విదేశాంగ వ్యవహారాలపై హిందీలో ఇంత అర్థవంతంగా ఎవరైనా మాట్లాడగలరని తాను అనుకోలేదని నెహ్రూజీ అన్నారు.
అదే రోజు, ఒక కమ్యూనిస్ట్ దేశానికి చెందిన విదేశీ ప్రముఖుల కోసం ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమానికి అటల్‌జీని ఆహ్వానించారు. ఆ కార్యక్రమానికి నెహ్రూజీ కూడా హాజరయ్యారు. విదేశాంగ విధానంపై తన విమర్శలు, వ్యాఖ్యల వల్ల నెహ్రూజీ తనపై కోపంగా ఉన్నారని అటల్‌జీ భావించారు. అందుకే, ఆయన నెహ్రూజీకి దూరంగా ఉన్నారు. అయితే, నెహ్రూజీ అటల్‌జీని పిలిచి, “ఈయన నా దేశ యువ ప్రతిపక్ష నాయకుడు” అని పరిచయం చేశారు. ఈయన (అటల్‌జీ) మన దేశానికి భవిష్యత్తు నాయకుడు అవుతారని కూడా నెహ్రూజీ చెప్పారు. నెహ్రూజీ శ్రద్ధాంజలి సభలో అటల్‌జీ చేసిన భావోద్వేగ ప్రసంగాన్ని ఇప్పటికీ ప్రజలు గుర్తు చేసుకుంటారు.

