బెడిసికొట్టిన కాంగ్రెస్ వ్యూహం
ఈ మధ్యకాలంలో నాటకీయ రాజకీయాలకు కర్ణాటక కేంద్రంగా మారుతోంది. ఇక్కడ అమలు చేసే విధానాలు ఫలితాలను ఇవ్వడం కంటే దృష్టి మళ్లించడానికే ఎక్కువ ఉపయోగపడుతున్నాయి. రాష్ట్రంలో తాజా రాజకీయ హంగామాకు తెరలేపిన వ్యక్తి ప్రియాంక్ ఖర్గే. ఈయన ఇటీవల ప్రభుత్వ పాఠశాలల సమీపంలో ఆర్‌ఎస్‌ఎస్ కార్యకలాపాలపై ఆంక్షలు విధించాలని, విజయదశమి సందర్భంగా పథ సంచాలన్‌లలో పాల్గొనే రాష్ట్ర ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇది కేవలం సైద్ధాంతిక దృక్పథంగా కనిపించినా నిజానికి కాంగ్రెస్ పార్టీకి బాగా అలవాటైన సంఘ్ వ్యతిరేక నినాదమే. తమ పాలనలోని లోపాలను కప్పిపుచ్చుకుంటూ, వివాదాలను సజీవంగా ఉంచడానికి ఇదొక సులువైన వ్యూహం. పాత సైద్ధాంతిక వివాదాలకు మళ్లీ ఆజ్యం పొసే ఈ ప్రయత్నం వెనుక , సిద్ధాంతాల కంటే రాజకీయ ఉద్దేశాలే ఎక్కువగా కనిపిస్తాయి.
గాంధీ కుటుంబానికి కొత్త విధేయుడు
మల్లికార్జున ఖర్గే కుమారుడైన ప్రియాంక్ ఖర్గే కర్ణాటకలోని చీలికలు పీలికలుగా ఉన్న కాంగ్రెస్ లో తనను తాను గాంధీ శిబిరానికి విధేయుడిగా పేరు సంపాదించేందుకు పక్కా వ్యూహంతో ఈ అతి చేస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రభుత్వం సగం పాలనాకాలాన్ని పూర్తి చేసుకుంటున్న వేళ కూడా కర్ణాటక రాజకీయాలపై అనిశ్చితి మేఘాలు కమ్ముకున్నాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ కు మధ్య కొనసాగుతున్న ఆధిపత్య పోరాటం పరిపాలనను స్తంభింపజేసింది. అధికార సమీకరణాలు వారానికోసారి మారుతున్నాయి. నాయకత్వ మార్పు గుసగుసలు ఇంకా సద్దుమణగలేదు. కాంగ్రెస్ అంతర్గత కలహాలు సృష్టించిన ఈ నాయకత్వ శూన్యతను పెద్దపెద్ద పదవులపై కన్నేసిన యువ నాయకులు భర్తీ చేయాలని చూస్తున్నారు. ఈ అనిశ్చితిని తనకు అనుకూలంగా మార్చుకుని, రాష్ట్రంలో పార్టీకి సైద్ధాంతిక ముఖంగా నిలవాలని ప్రియాంక్ ఖర్గే భావిస్తున్నారు. కానీ ఆయన అనుసరిస్తున్న ఈ దూకుడు సిద్ధరామయ్యపై అవినీతి మరకలు, శివకుమార్ అనుసరిస్తున్న మృదు హిందుత్వ వైఖరికి భిన్నంగా ఆయనను చూపుతున్నా పార్టీ లోపల, వెలుపల కూడా విమర్శలకు గురిచేస్తోంది.
ఆర్ఎస్ఎస్ సమావేశాలకు వ్యతిరేకంగా ప్రియాంక్ ఖర్గే ఇటీవల ఇచ్చిన ఆదేశం పూర్తిగా బెడిసికొట్టింది. ప్రజల ఆగ్రహం వెంటనే వ్యక్తమైంది. కాంగ్రెస్‌లోనే అసమ్మతి స్వరాలు వినిపించాయి. పది మందికిపైగా ప్రజలు గుమిగూడేందుకు ముందస్తు అనుమతి తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుపై కర్ణాటక హైకోర్టు స్టే ఇవ్వడం, ఇది న్యాయ, రాజకీయ నియమాల ఉల్లంఘన అని స్పష్టం చేసింది. ఖర్గేను ‘నిర్భయ సైద్ధాంతిక యోధుడి’గా చూపించేందుకు చేసిన ప్రయత్నం విఫలమై అందుకు బదులుగా ఆయన రాజకీయ అపరిపక్వత బయటపడింది. గాంధీ కుటుంబాన్ని ప్రసన్నం చేసుకోవడానికి ఉపయోగపడే సంఘ్ వ్యతిరేక ముద్రను దక్కించుకోవాలన్న ఆయన ప్రయత్నం, రాష్ట్రంలో దాని పరిమితులను బహిర్గతం చేసింది. ఇక్కడ సైద్ధాంతిక విభజన రేఖలు ఇకపై ఓట్లను తెచ్చిపెట్టవు. కర్ణాటక ఓటర్లు ఉద్యోగాలు, మౌలిక సదుపాయాల గురించి ఎక్కువగా ఆందోళన చెందుతున్నారు తప్ప ఉపన్యాసాల రూపంలోని ధర్మయుద్ధాల గురించి కాదు.
జూనియర్ ఖర్గే సైద్ధాంతిక నాటకాలు
ప్రియాంక్ ఖర్గే కష్టాలు కేవలం సైద్ధాంతిక నాటకాలకు మాత్రమే పరిమితం కాలేదు. ఆయన ఐటీ, బీటీ శాఖా మంత్రిగా ఉన్నందున, ఆయన పనితీరును నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు భారతదేశపు తిరుగులేని టెక్ హబ్‌గా కర్ణాటక, ముఖ్యంగా బెంగళూరు ఉండేది. ఇప్పుడు భారీ ప్రాజెక్టులు, పెట్టుబడులు ఇతర రాష్ట్రాలకు పోతున్నాయి. గూగుల్ 15 లక్షల కోట్ల ఏఐ డేటా సెంటర్ ను ఆంధ్రప్రదేశ్ లో పెట్టాలని నిర్ణయించడం, సెమీకండక్టర్ కంపెనీలు గుజరాత్, అస్సాంలను ఎంచుకోవడంతో బెంగళూరు ఆకర్షణ తగ్గుతోందా? అనే ప్రశ్నలు తలెత్తాయి. పెట్టుబడుల గురించి వార్తలలో నిలిచే బదులు ప్రియాంక్ ఇప్పుడు అనవసరపు వివాదాలతో వార్తల్లో నిలుస్తున్నారు. అస్సాం యువత నైపుణ్యాన్ని చులకన చేస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా విమర్శలకు దారితీశాయి. ఆయన పెద్దపెద్ద సైద్ధాంతిక ప్రకటనలు బలహీనమైన పరిపాలనా ఫలితాలను కప్పిపుచ్చుకోవడానికి ఉపయోగపడుతున్నట్లు కనిపిస్తున్నాయి.
ప్రియాంక్ ఖర్గే ఆర్‌ఎస్‌ఎస్‌పై వ్యతిరేక వాదన సైద్ధాంతిక స్పష్టతను గానీ, రాజకీయ ప్రయోజనాన్ని గానీ సాధించదు. ఇది కర్ణాటక కాంగ్రెస్‌లో లోతుగా వ్యాపించిన వ్యాధిని బహిర్గతం చేస్తుంది – అదేంటంటే నిజమైన పనితీరు కంటే పైపై చిహ్నాలకు ప్రాధాన్యమివ్వడం. రాహుల్ గాంధీ సైద్ధాంతిక పంథాను అనుసరించడానికి ప్రియాంక్ చేస్తున్న ప్రయత్నం కారణంగా దిల్లీలో తాత్కాలికంగా ఆయన మెప్పు పొందవచ్చు, కానీ రాజకీయ జిమ్మిక్కులు, విధాన స్తబ్దతతో విసిగిపోయిన రాష్ట్రానికి ఇది ఎలాంటి ఊరటనివ్వదు. ప్రభుత్వం సగం పాలనాకాలాన్ని పూర్తి చేసుకునే సమయానికే ఓటర్ల సహనం నశించింది. కాంగ్రెస్ నిజమైన పురోగతిని పక్కనపెట్టి ప్రదర్శనా రాజకీయాలకు మొగ్గు చూపితే పెద్దపెద్ద ఆశలు ఉన్న వారసులు కూడా ప్రజలకు దూరమవుతారు.
హామీల భారం
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ 2023 ఎన్నికల విజయం, విస్తృతంగా ప్రచారం చేసిన దాని ‘ఐదు హామీల’పై ఆధారపడింది . కానీ వాటివల్ల ఖజానా ఖాళీ అయింది. ఓట్ల కోసం ఆ పార్టీ దేశవ్యాప్తంగా దానిని కాపీ చేస్తోంది. అయితే ప్రజలు ఆ పార్టీ మాటలు నమ్మడం లేదు. కర్ణాటకలో ఈ హామీలు పెనుభారంగా మారాయి. అభివృద్ధి పనులకు నిధులు లేవు. అభివృద్ధికి దోహదం చేయని ఈ ప్రజాకర్షక విధానాల పర్యవసానాలతో మంత్రులు, ఎమ్మెల్యేలు ఇప్పుడు సతమతమవుతున్నారు. పరిస్థితిని సరిదిద్దుకోవడానికి బదులుగా కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల దృష్టి మళ్లించే చర్యలకు పాల్పడుతోంది. జవాబుదారీతనం పేరుతో మత సంస్థలను, హిందూ నాయకులను లక్ష్యంగా చేసుకుని వేధిస్తోంది. ధర్మస్థల కేసులో రాజకీయ ప్రేరేపితమైన సిట్ దర్యాప్తు నుంచి డాక్టర్ ప్రభాకర్ భట్ వంటి వ్యక్తులపై దాడుల వరకు, రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనను పక్కనపెట్టి వేధింపులపై దృష్టి కేంద్రీకరిస్తోంది.
ఆర్‌ఎస్‌ఎస్‌తో చారిత్రక వైరం
స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఆర్‌ఎస్‌ఎస్‌ను కాంగ్రెస్ తన ప్రధాన సైద్ధాంతిక, సంస్థాగత ప్రత్యర్థిగా పరిగణించింది. గాంధీ హత్య తర్వాత కమిషన్లు ఆర్‌ఎస్‌ఎస్‌ను నిర్దోషిగా ప్రకటించినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం 1948లో సంఘ్‌ను నిషేధించింది. స్వతంత్ర భారతంపై తన నియంత్రణకు సంఘ్ ఒక ముప్పుగా భావించింది. 1949లో సంఘ్ పై నిషేధం తొలగిపోయినా వైరభావం మాత్రం కొనసాగుతూనే ఉంది. సంఘ్ పటిష్టమైన క్షేత్రస్థాయి ఉనికి, స్వతంత్ర సామాజిక వ్యవస్థ కాంగ్రెస్ ఆధిపత్యానికి నిరంతరం సవాలుగా నిలిచాయి.
ఎమర్జెన్సీ సమయంలో సంఘ్‌తో కాంగ్రెస్ ఘర్షణ మరింత తీవ్రమైంది. ఆ సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ ప్రత్యర్థులను మాత్రమే కాకుండా దాని కేంద్రీకృత, నియంతృత్వ ధోరణులను వ్యతిరేకించే పౌర సమాజ సంస్థలను కూడా అణచివేయాలని చూసింది. మరోవైపు సంఘ్ ప్రజాస్వామ్య ప్రమాణాలను, జాతీయ అస్తిత్వాన్ని పరిరక్షించే సంస్థగా తన పాత్రను బలోపేతం చేసుకుంది. అప్పటి నుంచి దశాబ్దాలుగా సంఘ్ సమాజ ప్రధాన స్రవంతిలో క్రియాశీలమై పట్టణ ప్రముఖులు, గ్రామీణ ప్రజలు, మారుమూల ప్రాంతాల ప్రజల్లో కూడా గణనీయమైన సామాజిక ఆమోదాన్ని పొందింది. ఈ నేపథ్యంలో ప్రియాంక్ ఖర్గే లాంటివాళ్ళు చేస్తున్న ఈ ప్రయత్నాలను పరిశీలకులు నానాటికీ పెరుగుతున్న సంఘ్ ప్రభావం, అది తీసుకు వస్తున్న సామాజిక పరివర్తనను అడ్డుకునేందుకు చేస్తున్న ప్రయత్నంగా చూస్తున్నారు. కాంగ్రెస్ ‘కుటుంబాన్ని’ మళ్ళీ రాజకీయ సమీకరణలకు కేంద్రబిందువు చేయాలని వారి ఉద్దేశం. అలాగే కాంగ్రెస్ లో సీనియర్ నాయకత్వం బలహీనపడుతున్న నేపథ్యంలో ప్రియాంక్ ఖర్గే తనను తాను కొత్త విధేయ వర్గంలో భాగంగా చిత్రీకరించుకునేందుకు చేసే ప్రయత్నంగా కూడా దీన్ని చూడవచ్చు.
సాత్విక్ శెట్టి

