Future India

భారత్‌ను భవిష్యత్తుకు సిద్ధం చేసిన మోదీ పాలన

భారత్‌లో గత 11 సంవత్సరాలుగా రాజకీయ, ఆర్థిక, సామాజిక పరివర్తన చోటుచేసుకుంటోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం స్వయం సమృద్ధ, సమ్మిళిత, ప్రపంచవ్యాప్తంగా గౌరవించదగిన దేశంగా ఆవిర్భవించింది. ఈ పరివర్తనకు పునాది మౌలిక సదుపాయాలు. 2014లో ప్రధాని మోదీ అధికారం చేపట్టినప్పుడు అనుసంధానత ప్రధాన సమస్యగా ఉండేది. 2014లో 91,000 కిలోమీటర్లుగా ఉన్న జాతీయ రహదారులు నేడు 1,46,000 కిలోమీటర్లకు పైగా ఉన్నాయి. ముఖ్యంగా జమ్ము కాశ్మీర్‌లో రైలు అనుసంధానత ఈ రహదారుల విప్లవానికి మరింత తోడ్పడింది. ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్వే లింక్, చీనాబ్ వంతెన, అంజి ఖడ్ వంతెన వంటి ఇంజనీరింగ్ అద్భుతాలు మానవ సంకల్ప విజయానికి చిహ్నంగా నిలుస్తాయి. దేశ రాజధానితో సహా విద్యుత్ బస్సుల ప్రవేశంతో పట్టణ రవాణా కూడా పర్యావరణహితంగా మారింది.

గృహనిర్మాణం జాతీయ లక్ష్యంగా మారింది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన నిరుపేదలకు గౌరవాన్ని కల్పించింది. ఒక గ్రామీణ కుటుంబానికి విద్యుత్తు, మరుగుదొడ్లతో కూడిన పక్కా ఇంటిని కేటాయించడం తరతరాల పేదరికాన్ని అంతం చేస్తుంది. విద్యుదీకరణకు నోచుకోని దాదాపు 3 కోట్ల గృహాలకు విద్యుత్ అందించే సౌభాగ్య పథకాన్ని ఒక పెద్ద ప్రజా సంక్షేమ విజయగాథగా భావించాలి. విద్యుత్ అంటే గ్రామీణ భారతదేశంలోని గృహాలకు భద్రత, విద్య, ఆర్థిక కార్యకలాపాలకు విస్తృతావకాశాలు కల్పించడమే. ఆరోగ్య రంగ సంస్కరణలు, ముఖ్యంగా ఆయుష్మాన్ భారత్ పథకం సమ్మిళిత మార్గాన్ని అనుసరించాయి. గతంలో మాదిరిగా ఇప్పుడు వ్యాధులు వస్తే ఆర్థికంగా దివాళా తీయనక్కర్లేదు. జన్ ధన్ పథకం ఆర్థిక సమ్మిళితత్వానికి దారితీసింది. సబ్సిడీలు, ఉపకార వేతనాలు, పింఛన్లు, రిలీఫ్ ఫండ్లను ఇలాంటి ఖాతాల ద్వారా మళ్లించడంతో దళారుల అవసరం లేకుండా పోతోంది.

డిజిటల్ ఇండియా కార్యక్రమం మరో విజయం. యూపీఐని నేడు అన్ని ఆర్థిక వర్గాల ప్రజలు ఉపయోగిస్తున్నారు. డిజిటల్ ఇండియా అందుబాటు, పారదర్శకతకు సంబంధించినది. ఈ రెండూ సుపరిపాలనకు రెండు స్తంభాలు. ఈ ఎజెండాలో భారతీయ మహిళలు ముందంజలో ఉండాలనే లక్ష్యం లేకుంటే ఈ విప్లవం సంపూర్ణం కాదు. సుభద్ర యోజన స్త్రీలకు సమాన న్యాయం, అవకాశాలు కల్పించాలన్న ప్రభుత్వ సంకల్పానికి ప్రతీక. నరేంద్ర మోదీ పాలనలో పర్యావరణ అంశాలకు ప్రాముఖ్యత లభించింది. అభివృద్ధిని పర్యావరణంతో అనుసంధానం చేయడం మోదీ ప్రభుత్వ లక్ష్యాలలో భాగం. జాతీయ విద్యావిధానం-2020 భారతదేశ వారసత్వంలో పునాదులు కలిగి ఉన్నప్పటికీ భవిష్యత్తు- కృత్రిమ మేధ, ఆవిష్కరణలు, భిన్న రంగాలలో పరిశోధనలకు ఇందులో విస్తృత ప్రాధాన్యమిచ్చారు. పీఎంఎస్ఆర్ఐ పథకం కింద ప్రభుత్వ పాఠశాలల స్థాయిని, సదుపాయాలను పెంచుతున్నారు. వ్యవసాయం వ్యవస్థాగత మార్పులకు లోనైంది. పీఎం-కిసాన్ ప్రతి సంవత్సరం 11 కోట్ల మంది రైతులకు ఆర్థిక మద్దతు అందిస్తోంది. పోలవరం ప్రాజెక్టు వంటి ప్రాజెక్టులు నీటి లభ్యత సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేశాయి. 

రక్షణకు సంబంధించి ప్రభుత్వ సందేశం స్పష్టంగా ఉంది- భారతదేశం తన సరిహద్దుల వద్ద వ్యూహాత్మక అవసరాలను ఎన్నటికీ విస్మరించదు. ప్రపంచ వేదికలపై భారత్ మరింత ఆత్మవిశ్వాసంతో గళమెత్తింది. జీ20 శిఖరాగ్ర సదస్సుల నుంచి దౌత్యపరమైన చర్చల వరకు భారత్ కేవలం భాగస్వామ్య దేశంగానే కాకుండా అంతర్జాతీయ విధానాల రూపకర్తగా అవతరించింది. మన విదేశాంగ విధానం 21వ శతాబ్దపు వాస్తవాలకు అనుగుణంగా మన నాగరిక ఔన్నత్యం పట్ల గర్వాన్ని ప్రతిబింబిస్తుంది. ప్రపంచంలో నేడు నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలోకూడా మన ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉంది. జీఎస్టీ నుంచి కార్పొరేట్ పన్ను తగ్గింపు వరకు సంస్కరణలు భారత్‌ను పెట్టుబడుల కేంద్రంగా మార్చాయి. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటిగా ఉంది. మౌలిక సదుపాయాల కల్పనతో ఉద్యోగ కల్పన సాధ్యమైంది.

మోదీ ప్రభుత్వ సంక్షేమ నమూనా ప్రజలకు సాధికారత కల్పించింది. అనవసరమైన చట్టాలను రద్దు చేయడం నుంచి సరళీకృత పన్ను వ్యవస్థలను సృష్టించడం వరకు, ప్రభుత్వాన్ని సమర్థంగా, పౌరులకు స్నేహపూర్వకంగా మార్చే ప్రయత్నం జరిగింది. ప్రభుత్వ కార్యక్రమాల్లో యువత ప్రధాన పాత్ర పోషిస్తోంది. స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా, అటల్ ఇన్నోవేషన్ మిషన్ ఒక తరాన్ని ఉద్యోగాల సృష్టికర్తలుగా తీర్చిదిద్దుతున్నాయి. భారీ మౌలిక సదుపాయాల రంగంలో భారత్ భారీ మార్పులను చూసింది. ఇందుకు రెండు ఉదాహరణలు చండీగఢ్-మనాలి హైవే సొరంగాలు, జమ్మూ కాశ్మీర్‌లోని చీనాబ్ రైల్ వంతెన. గతంలో మనాలీకి వెళ్ళేవారు ట్రాఫిక్ జామ్ లు, కొండచరియలు విరిగిపడటం, సుదీర్ఘ ప్రయాణ సమయం వంటి సమస్యలను ఎదుర్కొనేవారు. ఇప్పుడు 14కు పైగా సొరంగాలు, బహుళ బైపాస్ ల నిర్మాణంతో ప్రయాణ సమయం దాదాపు నాలుగు గంటలు తగ్గింది. చీనాబ్ వంతెన కూడా అటువంటి అద్భుతమే. ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైలు లింక్ ద్వారా కత్రాను శ్రీనగర్‌తో కలిపే ఈ వంతెన జమ్మూ కాశ్మీర్ ప్రజలకు జీవనాడి. ఈ మార్గంలో వందేభారత్ రైళ్లను ప్రారంభించడంతో ఈ ప్రాంతానికి గతంలో కంటే ఇప్పుడు మరింత అనుసంధానత ఏర్పడింది. మోదీ ప్రభుత్వ 11 ఏళ్ల పాలన కేవలం అంకెలు, పథకాలకు సంబంధించింది కాదు. అది ఒక దార్శనికత సాకారమవడాన్ని తెలియజేస్తుంది. భారత్ నేడు మరింత సురక్షితమైనది, సమైక్యమైనది, భవిష్యత్తుకు సిద్ధంగా ఉంది.

కంగనా రనౌత్,
లోక్ సభ సభ్యురాలు