modi sitaraman

బడ్జెట్ 2025-26: సంక్షేమ సంకల్పం.. అభివృద్ధి విధానం

కేంద్ర బడ్జెట్ 2025-26 మధ్యతరగతి కుటుంబాలకు వరం ప్రకటించింది. మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన తొలి పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్ లో రూ.12 లక్షల వార్షిక ఆదాయంపై ఆదాయపు పన్ను మినహాయింపు ప్రకటించింది. దీంతో మధ్యతరగతి కుటుంబాల్లో పొదుపు, వినియోగానికి ప్రోత్సహిస్తోంది..

‘ప్రధానమంత్రి ధన-ధాన్య కృషి యోజన’ ద్వారా తక్కువ వ్యవసాయ ఉత్పాదకత ఉన్న 100 జిల్లాల్లో 1.7 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరేలా చర్యలు… కందులు, మినుములు, ఎర్రకందులపై దృష్టి సారిస్తూ ”పప్పు ధాన్యాల్లో ఆత్మనిర్భరత మిషన్”… కేసీసీ ద్వారా రూ. 5 లక్షల వరకు రుణాలు వంటి వాటితో వ్యవసాయాభివృద్ధికి దోహదపడే అనేక చర్యలు ప్రకటించింది..

ఎంఎస్ఎంఎఈలకు ప్రభుత్వ హామీతో ఇచ్చే రుణాల పరిమితి రూ. 5 కోట్ల నుంచి 10 కోట్లకు పెంచింది.. పీఎం స్వనిధి ద్వారా బ్యాంకులు అందించే రుణాల పరిమితి పెంచింది… గిగ్ వర్కర్లకు గుర్తింపు కార్డులు, ఈ-శ్రామ్ పోర్టల్లో నమోదు, పీఎం జన్ ఆరోగ్య యోజన ద్వారా ఆరోగ్య సేవలు అందిస్తోంది.

లక్ష ఇళ్ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసేందుకు రూ. 15,000 కోట్లతో స్వామిహ్ నిధి ఏర్పాటు… ‘అభివృద్ధి కేంద్రాలుగా నగరాల’ను తీర్చిదిద్దేందుకు రూ.లక్ష కోట్లతో అర్బన్ ఛాలెంజ్ నిధి.. 120 కొత్త ప్రదేశాలకు ప్రాంతీయ అనుసంధానతను పెంపొందించేలా ఉడాన్ పథకానికి మార్పులు.. వంటి చర్యలతో మౌలిక వసతులకు పెద్దపీట వేసింది.

ప్రభుత్వ పాఠశాలల్లో 50,000 అటల్ టింకరింగ్ ప్రయోగశాలలు.. రూ. 500 కోట్ల అంచనాలతో విద్యారంగంలో కృత్రిమ మేధ వినియోగానికి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్… బీమా రంగంలో ఎఫ్‌డీఐ పరిమితి 74 నుంచి 100 శాతానికి పెంపు.. క్యాన్సర్, అరుదైన దీర్ఘకాలిక వ్యాధుల చికిత్సకు ఉపయోగించే 36 రకాల ఔషధాలపై బేసిక్ కస్టమ్స్ డ్యూమీ (బీసీడీ) మినహాయింపు వంటి నిర్ణయాలెన్నింటికో బడ్జెట్ స్థానం కల్పించింది.

ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో వ్యవసాయం, ఎంఎస్ఎంఈ, పెట్టుబడులు, ఎగుమతులను అభివృద్ధికి నాలుగు చోదక శక్తులుగా గుర్తించి, ఆ దిశగా అనేక కార్యక్రమాలు, పథకాలను వివరించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా సీతారామన్ 50 లక్షల కోట్ల రూపాయల వార్షిక బడ్జెట్ ను దేశ ప్రజల ముందుంచింది.

 ‘దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయ్’ అన్న ప్రముఖ తెలుగు కవి గురజాడ అప్పారావు మాటలను ఉటంకిస్తూ 2025-26 కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామాన్ ‘సబ్ కా వికాస్’ ఇతివృత్తంతో దేశంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికి పెద్దపీట వేశారు. పేద, యువత, రైతు, మహిళలను దృష్టిలో ఉంచుకుని అనేక అభివృద్ధి కార్యక్రమాలను బడ్జెట్ ప్రతిపాదించింది. వృద్ధిని వేగవంతం చేయడం, సమ్మిళిత అభివృద్ధిని పరిగణనలోకి తీసుకోవడం, ప్రైవేటు రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించడం, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం, మధ్య తరగతి ప్రజల కొనుగోలు శక్తిని గణనీయంగా పెంపొందించడం వంటి అంశాల్లో ప్రభుత్వం ప్రయత్నాలను కేంద్ర బడ్జెట్ 2025-26 ప్రతిఫలిస్తోంది.

భారత అభివృద్ధి సామర్థ్యాన్ని, అంతర్జాతీయ పోటీతత్వాన్ని పెంపొందించేలా పన్ను విధానాలు, విద్యుత్ రంగం, నగరాభివృద్ధి, గనులు, ఆర్థిక రంగాల్లో గుణాత్మక మార్పులు, రెగ్యులేటరీ సంస్కరణలు అవలంబించడమే ఈ బడ్జెట్ లక్ష్యం. వ్యవసాయం, ఎంఎస్ఎంఈ, పెట్టుబడులు, ఎగుమతులే వికసిత్ భారత్‌ను నిర్మించే సాధనాలుగా కేంద్ర బడ్జెట్ వర్ణించింది. ఈ దిశగా సంస్కరణలే ఇంధనంగా, సమ్మిళిత స్పూర్తితో మార్గ నిర్దేశం చేస్తుంది.

మొదటి చోదక శక్తి: వ్యవసాయం

రాష్ట్రాల భాగస్వామ్యంతో వంద జిల్లాల్లో అమలు చేసేలా పంటల దిగుబడిని పెంచేలా ‘ప్రధానమంత్రి ధన-ధాన్య కృషి యోజన’ పథకాన్ని బడ్జెట్లో ప్రకటించారు. సాగులో వైవిధ్యాన్ని అవలంబించేందుకు, గోదాములు, నీటిపారుదల సౌకర్యాలను మెరుగుపరచడానికి, దీర్ఘకాలిక, స్వల్పకాలిక రుణాలను అందించేందుకు ఈ పథకం తోడ్పడుతుంది. నైపుణ్యం, పెట్టుబడులు, సాంకేతికత ద్వారా వ్యవసాయంలో నిరుద్యోగ సమస్యకు పరిష్కారం చూపిస్తూ, గ్రామీణ ఆర్థికవ్యవస్థకు ఊతమిచ్చేలా విభిన్న రంగాల్లో సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ‘గ్రామీణ సంక్షేమం, అభ్యున్నతి’ కార్యక్రమం ప్రారభించారు. మహిళలు, యువ రైతులు, అణగారిన వర్గాలకు చెందినవారు, సన్నకారు రైతులు, భూమిలేని కుటుంబాలకు గ్రామీణ ప్రాంతాల్లో పుష్కలమైన అవకాశాలను సృష్టించడమే ఈ కార్యక్రమ లక్ష్యం. కందులు, మినుములు, ఎర్ర కందులపై దృష్టి సారిస్తూ ఆరేళ్ల కాలానికి ”పప్పు ధాన్యాల కోసం ఆత్మనిర్భరత మిషన్” ను ప్రభుత్వం ప్రారంభిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించారు. రానున్న నాలుగేళ్లలో రైతుల నుంచి ఈ మూడు పప్పుధాన్యాలను కేంద్ర సంస్థలు (నాఫెడ్, ఎన్‌సీసీఎఫ్) ద్వారా సేకరిస్తారు. కూరగాయలు-పండ్లకు సమగ్ర విధానం, అధిక రాబడినిచ్చే విత్తనాలకు జాతీయ కార్యక్రమం, పత్తి దిగుబడిని పెంచడంతో సహా వ్యవసాయం, అనుబంధ రంగాల కార్యకలాపాలను మెరుగుపరిచేందుకు ఐదేళ్ల కాలవ్యవధికి చేపట్టే చర్యలను బడ్జెట్లో వివరించారు. సవరించిన వడ్డీ రాయితీ పథకం ప్రకారం కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా తీసుకున్న రుణాల పరిమితిని రూ. 3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచుతున్నట్టు సీతారామన్ ప్రకటించారు.

రెండో చోదక శక్తి: ఎంఎస్ఎంఈలు

మన ఎగుమతుల్లో ఎంఎస్ఎంఈల వాటా 45 శాతం వరకు ఉన్న నేపథ్యంలో వాటిని అభివృద్ధికి రెండో చోదక శక్తిగా ఆర్థికమంత్రి వర్ణించారు. ఎంఎస్ఎంఈలను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు, సాంకేతికంగా మరింత ముందుకు తీసుకెళ్లేందుకు, వర్గీకరణకు సంబంధించి పెట్టుబడి, టర్నోవర్లను వరుసగా 2.5, రెండు రెట్లకు పెంచినట్లు తెలిపారు. ప్రభుత్వ హామీతో కూడిన రుణలభ్యతను కూడా పెంచినట్లు చెప్పారు. షెడ్యూలు కులాలు, షెడ్యూలు తెగలకు చెందిన 5 లక్షల మంది తొలి ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలకు వచ్చే ఐదేళ్లలో రూ. రెండు కోట్ల చొప్పున టర్మ్ రుణాలను అందిస్తారు. ‘మేకిన్ ఇండియా’ బ్రాండ్ ప్రాముఖ్యాన్ని చాటే ఆటబొమ్మల తయారీ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక పథకాన్ని అమలు చేస్తామని సీతారామన్ ప్రకటించారు. ఈ దిశగా, చిన్న, మధ్య తరహా, పెద్ద పరిశ్రమలతో కూడిన జాతీయ ఉత్పాదన కేంద్రాన్ని స్థాపిస్తామని చెప్పారు.

మూడో చోదకశక్తి: పెట్టుబడులు

అభివృద్ధిలో పెట్టుబడులది మూడో చోదకశక్తి అని మంత్రి చెప్పారు. ఈ బడ్జెట్లో ప్రజలపై పెట్టుబడి, ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడులు, సృజనాత్మకత పెట్టుబడులకు ప్రాముఖ్యాన్నిచ్చారు. ప్రజలపై పెట్టుబడికి అనుగుణంగా రానున్న 5 ఏళ్ళలో ప్రభుత్వ పాఠశాలల్లో 50,000 అటల్ టింకరింగ్ ల్యాబ్ లను నెలకొల్పుతామని చెప్పారు. భారత్‌నెట్ ప్రాజెక్ట్ కింద గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీని అందించనున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. పాఠశాల విద్యార్థులు, ఉన్నత విద్యనభ్యసించే వారి ప్రయోజనార్థం భారతీయ భాషల పుస్తకాలను డిజిటల్ రూపంలో అందించడానికి ‘భారతీయ భాషా పుస్తక్’ పథకాన్ని అమలు చేయనున్నట్లు ఆమె తెలిపారు. “మేక్ ఫర్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్” తయారీకి అవసరమైన నైపుణ్యాలతో యువతను సన్నద్ధం చేసేందుకు ప్రపంచస్థాయి నైపుణ్యాలు, భాగస్వామ్యాలతో 5 ‘నేషనల్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్‌ ఫర్ స్కిల్లింగ్’ ఏర్పాటవుతాయి. రూ. 500 కోట్ల వ్యయంతో విద్యా రంగం కోసం కృత్రిమ మేధ ఆధారిత సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటవుతుంది. గిగ్ వర్కర్లకు (అసంఘటిత రంగ కార్మికులు) గుర్తింపు కార్డులు, ఇ-శ్రమ్ పోర్టల్‌లో వారి పేర్ల నమోదు, వారి ఆరోగ్య సంరక్షణ కోసం ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కింద ఏర్పాట్లు జరుగుతాయని బడ్జెట్ ప్రకటించింది. ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడి దిశగా మౌలిక సదుపాయాలకు సంబంధించిన మంత్రిత్వ శాఖలు పీపీపీ (ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం) విధానంలో వరుస ప్రాజెక్టులతో సిద్ధమవుతాయని సీతారామన్ చెప్పారు.

మూలధన వ్యయం, సంస్కరణలకు ప్రోత్సాహకాల కోసం రాష్ట్రాలకు 50 సంవత్సరాల వడ్డీ లేని రుణాలను అందించేందుకు రూ.1.5 లక్షల కోట్లను ప్రతిపాదించినట్లు తెలిపారు. కొత్త ప్రాజెక్టులలో రూ. 10 లక్షల కోట్ల మూలధనాన్ని తిరిగి పెట్టుబడిగా వినియోగించేందుకు రెండో అసెట్ మానిటైజేషన్ ప్లాన్ (వ్యర్థ ఆస్తుల నుంచీ సంపద సృష్టి) 2025-30ని కూడా మంత్రి ప్రకటించారు. “జన్ భగీదారి” (ప్రజా భాగస్వామ్యం) ద్వారా గ్రామీణ ప్రాంతాలకు తాగునీరు సరఫరా చేసే మౌలిక వ్యవస్థల నాణ్యత, నిర్వహణలపై దృష్టి సారించాలని, జల్ జీవన్ మిషన్ ను 2028 సంవత్సరం వరకూ పొడిగించాలని నిర్ణయించారు.

‘అభివృద్ధి కేంద్రాలుగా నగరాలు’, ‘నగరాల సృజనాత్మక పునరాభివృద్ధి’, ‘నీరు, పారిశుద్ధ్యం’ పేరిట గల ప్రతిపాదనల అమలు కోసం ప్రభుత్వం రూ.1 లక్ష కోట్లతో ‘అర్బన్ ఛాలెంజ్ ఫండ్‌’ను ఏర్పాటు చేస్తుంది. ఇన్నోవేషన్‌లో పెట్టుబడి కింద ప్రైవేట్ రంగ ఆధారిత పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణల పథకాల కోసం రూ. 20,000 కోట్ల కేటాయింపును ప్రకటించారు. నగరాల అభివృద్ధి ప్రణాళికలకు ఉపయుక్తంగా ఉండే మౌలిక జియోస్పేషియల్ వ్యవస్థలను అభివృద్ధి పరిచేందుకు ‘నేషనల్ జియోస్పేషియల్ మిషన్‌’ను ప్రారంభించాలని ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు. విద్యా సంస్థలు, మ్యూజియంలు, గ్రంథాలయాలు, ప్రైవేట్ వ్యక్తుల వద్ద గల 1 కోటికి పైగా ప్రాచీన పత్రాల సర్వే, నమోదు, పరిరక్షణల కోసం ‘జ్ఞాన్ భారతం మిషన్‌’ను ప్రారంభించాలని బడ్జెట్ ప్రతిపాదించింది. విజ్ఞానాన్ని పంచుకునేందుకు ‘నేషనల్ డిజిటల్ రిపాజిటరీ ఆఫ్ ఇండియన్ నాలెడ్జ్’ పేరిట భారతీయ విజ్ఞాన భాండాగారాన్ని ప్రారంభించాలని కూడా బడ్జెట్లో ప్రతిపాదించారు.

నాలుగో చోదకశక్తి: ఎగుమతులు

వాణిజ్యం, ఎంఎస్ఏంఈ, ఆర్థిక మంత్రిత్వ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో నడుస్తున్న ఎగుమతుల రంగం, వృద్ధి సాధనలో నాలుగో శక్తిగా ఉండగలదని, ఎంఎస్ఏంఈలు ఎగుమతి మార్కెట్‌ల లబ్ధి పొందేందుకు ‘ఎగుమతుల ప్రోత్సాహక పథకం’ సహాయపడుతుందని సీతారామన్ అన్నారు. అంతర్జాతీయ వాణిజ్యం కోసం ‘భారత్‌ ట్రేడ్‌నెట్’ (బీటీఎన్) పేరిట డిజిటల్ ప్రజా వ్యవస్థను స్థాపించాలన్న ఆలోచన ప్రభుత్వానికి ఉందని మంత్రి వెల్లడించారు. ఇది వ్యాపార కార్యకలాపాల నమోదు సహా ఆర్థిక వ్యవహారాలకు ఏకీకృత వేదికగా పని చేస్తుందని తెలిపారు. ప్రపంచ సరఫరా వ్యవస్థలతో మన ఆర్థిక వ్యవస్థ అనుసంధానం కోసం దేశీయ తయారీ సామర్థ్యాల అభివృద్ధికి తోడ్పాటును అందించనున్నట్లు ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. ‘ఇండస్ట్రీ 4.0’కి సంబంధించిన అవకాశాలను వినియోగించుకునేందుకు దేశీయ ఎలక్ట్రానిక్ పరికరాల పరిశ్రమకు ప్రభుత్వం మద్దతునిస్తుందని ప్రకటించారు. అభివృద్ధి చెందుతున్న రెండో శ్రేణి (టైర్ 2) నగరాల్లో గ్లోబల్ కేపబులిటీ సెంటర్‌లను (బహుళ జాతి కంపెనీలకు సేవలందించే స్థానిక సంస్థలు) ప్రోత్సహించడానికి జాతీయ విధానాన్ని రూపొందించాలన్న ప్రతిపాదనలు జరిగాయి.

విలువైన, నిల్వ సామర్థ్యం తక్కువగా గల ఉద్యానవన ఉత్పత్తులు సహా రవాణా విమానాల సేవలను వినియోగించుకునే వివిధ ఉత్పత్తుల కోసం మౌలిక సదుపాయాలు, గిడ్డంగులను ఆధునీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

అభివృద్ధి ఇంజన్లకు సంస్కరణలే ఇంధనం

అభివృద్ధి ఇంజిన్లకు సంస్కరణలే ఇంధనమని సీతారామన్ అన్నారు. గత 10 ఏళ్లుగా ప్రభుత్వం పన్ను చెల్లింపుదారుల సౌకర్యార్థం ఫేస్‌లెస్ అసెస్‌మెంట్, ట్యాక్స్ పేయర్స్ చార్టర్ (పన్ను చెల్లింపు దారుల హక్కులు, బాధ్యతల పట్ల అవగాహన కలిగించే కార్యక్రమం) వేగవంతమైన రిటర్న్స్, దాదాపు 99 శాతం సెల్ఫ్ అసెస్‌మెంట్‌ ద్వారా రిటర్న్‌లు, ‘వివాద్ సే విశ్వాస్’ పథకం వంటి అనేక సంస్కరణలను అమలు చేసిందని సీతారామన్ చెప్పారు. ఈ ప్రయత్నాలను కొనసాగిస్తూ, “తొలుత విశ్వాసం, తదనంతరం పరిశీలన” అన్న సూత్రానికి పన్నుల శాఖ కట్టుబడి ఉందని ఆమె పునరుద్ఘాటించారు.

ఆర్థిక రంగ అభివృద్ధి, సంస్కరణలు

‘సులభతర వాణిజ్యం’ పట్ల ప్రభుత్వం చూపుతున్న నిబద్ధతకు నిదర్శనంగా దేశ ఆర్థిక రంగం మొత్తంలో అనేక మార్పులను ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు. ఈ మార్పులు సులభతర అనుమతులు, సేవల విస్తరణ, బలమైన నియంత్రణ వ్యవస్థల రూపకల్పన, అంతర్జాతీయ, దేశీయ పెట్టుబడులకు ప్రోత్సాహాన్ని ఇవ్వడమే కాక, కాలం చెల్లిన చట్టపరమైన నిబంధనలను నేరరహితం చేసేందుకు దారితీయగలవు. భారతదేశంలో మొత్తం ప్రీమియం పెట్టుబడి పెట్టే బీమా కంపెనీలకు అందుబాటులో ఉండేలా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డిఐ) పరిమితిని 74 నుండి 100 శాతానికి పెంచాలని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు. ఉత్పాదకత పెంపు, ఉపాధి కల్పనకు ఊతం లక్ష్యాలుగా, ఆదర్శాలు, విశ్వాసం ఆధారంగా సరళమైన నియంత్రణ వ్యవస్థను సీతారామన్ ప్రతిపాదించారు. 21వ శతాబ్దానికి అనువైన ఆధునిక, సులభమైన విశ్వాస-ఆధారిత నియంత్రణ ఫ్రేమ్‌వర్క్‌ను అభివృద్ధిపరిచేందుకు మంత్రి నాలుగు సూత్రాలను ప్రతిపాదించారు:

  1. i) నియంత్రణపరమైన సంస్కరణల కోసం ఉన్నత స్థాయి కమిటీ

– అన్ని ఆర్థికేతర రంగ నిబంధనలు, ధ్రువపత్రాలు, లైసెన్సులు, అనుమతులను సమీక్షించడం.

– విశ్వాస – ఆధారిత ఆర్థిక పాలన బలోపేతం, ‘సులభతర వాణిజ్యం’ మెరుగుపరిచేందుకు, ముఖ్యంగా తనిఖీలు, సమ్మతుల విషయాల్లో అవసరమైన పరివర్తన చర్యలు.

– ఏడాదిలోపు సిఫార్సులు

– రాష్ట్రాలు ఆన్‌బోర్డింగ్ ప్రక్రియలో భాగ్యమయ్యేలా ప్రోత్సాహం

  1. ii) రాష్ట్రాల పెట్టుబడుల అనుకూల వాతావరణ సూచీ

– పోటీ సహకార సమాఖ్య స్ఫూర్తిని మరింతగా పెంచేందుకు 2025లో రాష్ట్రాల పెట్టుబడుల అనుకూల వాతావరణ సూచీ ప్రారంభం.

 iii) ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ (ఎఫ్ఎస్డీసీ) కింద చర్యలు

– ప్రస్తుత ఆర్థిక నిబంధనలు, అనుబంధ సూచనల ప్రభావాన్ని అంచనా వేయడానికి తగిన చర్యలు.

– ఆర్థిక రంగ ప్రతిస్పందన, అభివృద్ధిలను మెరుగుపరిచేందుకు తగిన వ్యూహ రూపకల్పన.

  1. iv) జన్ విశ్వాస్ బిల్లు 2.0

– వివిధ చట్టాలలోని 100కు పైగా నిబంధనలను నేర పరిధి నుంచి తప్పించడం

ఆర్థిక ఏకీకరణ

ఆర్థిక ఏకీకరణకు కట్టుబడి ఉన్నట్లు పునరుద్ఘాటించిన మంత్రి, ఏటా స్థూల దేశీయోత్పత్తిలో కేంద్ర ప్రభుత్వ రుణ నిష్పత్తి తగ్గుదల చూపే విధంగా ద్రవ్య లోటును నియంత్రించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని చెప్పారు. రాబోయే 6 సంవత్సరాలకు సంబంధించిన వ్యూహాన్ని ఎఫ్ఆర్ఎంబీ (ద్రవ్య విధాన పత్రం)లో పేర్కొన్నారు. 2024-25కి సంబంధించి సవరించిన అంచనా ప్రకారం స్థూల దేశీయోత్పత్తిలో ద్రవ్యలోటు 4.8 శాతంగా, 2025-26 లో స్థూల దేశీయోత్పత్తిలో ద్రవ్య లోటు 4.4 శాతంగా ఉండగలదని అంచనా వేసినట్లు సీతారామన్ పేర్కొన్నారు.

దేశాభివృద్ధిలో మధ్యతరగతిపై విశ్వాసాన్ని పునరుద్ఘాటిస్తూ, కేంద్ర బడ్జెట్ 2025-26 కొత్త ఆదాయ పన్ను విధానం కింద కొత్త ప్రత్యక్ష పన్ను స్లాబ్‌లు, రేట్లను ప్రతిపాదించింది. దీని ద్వారా రూ. 12 లక్షల వరకు వార్షిక ఆదాయం గల వారు అంటే మూలధన లాభాల వంటి ప్రత్యేక రేటు ఆదాయం కాకుండా నెలకు సగటున రూ. 1 లక్ష వరకు ఆదాయం పొందే వారికి ఎటువంటి పన్ను లేదు. దీని ప్రకారం రూ. 75 వేల స్టాండర్డ్ డిడక్షన్ కలిపి, రూ. 12.75 లక్షల వరకు వార్షిక ఆదాయం గల పన్ను చెల్లించే వేతనదారులు ఎలాంటి ఆదాయపన్ను చెల్లించే అవసరం ఉండదు. ఈ కొత్త పన్ను విధానం, ఇతర ప్రత్యక్ష పన్నుల ప్రతిపాదనల వల్ల ప్రభుత్వం దాదాపు రూ. 1 లక్ష కోట్ల ఆదాయాన్ని కోల్పోనుంది.

కొత్త పన్ను విధానంలో సవరించిన పన్ను రేట్లు

మొత్తం వార్షిక ఆదాయం

పన్ను రేటు

రూ 0 – 4 లక్షలు

ఎలాంటి పన్ను లేదు

రూ 4 – 8 లక్షలు

5 శాతం

రూ 8 – 12 లక్షలు

10 శాతం

రూ 12 – 16 లక్షలు

15 శాతం

రూ 16 – 20 లక్షలు

20 శాతం

రూ 20 – 24 లక్షలు

25 శాతం

రూ 24 లక్షల కంటే ఎక్కువ

30 శాతం

 టీడీఎస్/టీసీఎస్ హేతుబద్దీకరణ కోసం, వయోవృద్ధులకు వడ్డీపై వచ్చే ఆదాయంపై పన్ను మినహాయింపు పరిధిని రూ.50 వేల నుంచి రూ,1 లక్షకు అంటే రెట్టింపు మొత్తానికి పెంచారు. అలాగే అద్దెలపై విధించే టీడీఎస్ వార్షిక పరిమితిని రూ.2.4 లక్షల నుంచి రూ.6 లక్షలకు పెంచారు. టీసీఎస్‌ పరిమితిని రూ.10లక్షల వరకు పెంచడం, నాన్-పాన్ సందర్భాల్లో మాత్రమే అధిక టీడీఎస్ మినహాయించుటను కొనసాగించడం వంటివి ఇతర చర్యల్లో భాగంగా ఉన్నాయి. టీడీఎస్ చెల్లింపులో జాప్యాన్ని క్రమబద్దీకరించిన తరువాత, ఇప్పుడు టీసీఎస్ చెల్లింపుల్లో జాప్యాన్ని క్రమబద్దీకరిస్తున్నారు.

స్వచ్ఛంద అనుమతులను ప్రోత్సహిస్తూ, ఏదైనా అసెస్‌మెంట్ సంవత్సరం కోసం అప్‌డేట్ చేసిన రిటర్న్‌లను దాఖలు చేయుటకు ప్రస్తుతం రెండేళ్లుగా ఉన్న కాలపరిమితిని నాలుగేళ్లకు పొడిగించారు. 90 లక్షల మంది పన్ను చెల్లింపుదారులు తమ ఆదాయాన్ని అప్‌డేట్ చేయడానికి అదనపు పన్ను చెల్లించారు. చిన్న ఛారిటబుల్ ట్రస్ట్‌లు/సంస్థలకు వారి రిజిస్ట్రేషన్ వ్యవధిని 5 నుంచి 10 సంవత్సరాలకు పెంచడం ద్వారా ప్రయోజనం కలిగించడంతో వాటి కోసం అనుమతుల భారం తగ్గించారు. ఇంకా, పన్ను చెల్లింపుదారులు ఇప్పుడు ఎటువంటి షరతులు లేకుండా రెండు స్వీయ-ఆక్రమిత ఆస్తుల వార్షిక విలువను సున్నాగా క్లెయిమ్ చేయవచ్చు. గత బడ్జెట్‌లో అందించిన వివాద్ సే విశ్వాస్ పథకానికి గొప్ప స్పందన లభించింది. దాదాపు 33వేల మంది పన్ను చెల్లింపుదారులు తమ వివాదాలను పరిష్కరించుకోవడానికి ఈ పథకాన్ని ఉపయోగించుకున్నారు. వయోవృద్ధులకు అలాగే అత్యంత వయోవృద్ధుల కోసం 2024, ఆగస్టు 29న లేదా ఆ తర్వాత జాతీయ పొదుపు పథకం ఖాతాల నుంచి చేసిన ఉపసంహరణలకు మినహాయింపు ప్రయోజనాలు ఇచ్చారు. ఎన్‌పీఎస్ వాత్సల్య ఖాతాలకు కూడా ఇవే ప్రయోజనాలు వర్తించనున్నాయి.

వ్యాపార నిర్వహణ సౌలభ్యం కోసం అంతర్జాతీయ లావాదేవీలో మూడేళ్ల కాలానికి ఆర్మ్స్ లెంగ్త్ ప్రైసింగ్ ను నిర్ణయించేందుకు ఒక పథకాన్ని పరిచయం చేస్తోంది. అంతర్జాతీయ పన్నుల విధానాన్ని ఏకరీతిన నిర్వహించే దిశగా సేఫ్ హార్బర్ నియమాలను మరింత సానుకూలంగా రూపొందిస్తున్నారు. ఉపాధి, పెట్టుబడులను ప్రోత్సహించడానికి, ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థలను స్థాపించే లేదా నిర్వహిస్తున్న స్థానిక కంపెనీకి సేవలను అందించే ప్రవాసుల కోసం ఒక అంచనాత్మక పన్ను విధానాన్ని రూపొందించారు. ఇంకా, ప్రస్తుత టన్నేజ్ పన్ను పథకం ప్రయోజనాలను అంతర్గత నౌకలకు విస్తరించాలని ప్రతిపాదించారు. అంకుర సంస్థల రంగాన్ని ప్రోత్సహించడానికి, వ్యాపార సంస్థ నమోదు కోసం వ్యవధిని 5 సంవత్సరాల కాలానికి పొడిగించారు. మౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించడానికి, సావరిన్ వెల్త్ ఫండ్స్, పెన్షన్ ఫండ్లలో పెట్టుబడి పెట్టేందుకు గడువును బడ్జెట్ మరో ఐదు సంవత్సరాలకు అంటే 2030, మార్చి 31 వరకు పొడిగించింది.

పారిశ్రామిక వస్తువుల కస్టమ్స్ సుంకాలను హేతుబద్ధీకరించడంలో భాగంగా, బడ్జెట్ కింది ప్రతిపాదనలు చేసింది; (i) ఏడు సుంకాలను తొలగించడం, (ii) ప్రభావవంతమైన సుంకాల అమలును కొనసాగించడానికి తగిన సెస్‌ను వర్తింపజేయడం (iii) ఒకటి కంటే ఎక్కువ సెస్ లేదా సర్‌ఛార్జ్ విధించకుండా ఉండడం. మందులు/ఔషధాల దిగుమతిపై ఉపశమనం కలిగిస్తూ, క్యాన్సర్ అలాగే అరుదైన వ్యాధులు, దీర్ఘకాలిక వ్యాధుల చికిత్సలో ఉపయోగించే 36 ప్రాణ రక్షక మందులు, ఔషధాలను సాధారణ కస్టమ్స్ సుంకం (బీసీడీ-బేసిక్ కస్టమ్స్ డ్యూటీ) నుంచి పూర్తిగా మినహాయించారు. ఇంకా, రోగి సహాయ కార్యక్రమాల కింద 37 మందులు, 13 కొత్త మందులు, ఔషధాలను రోగులకు ఉచితంగా సరఫరా చేసే సందర్భాల్లో, వాటిపై సాధారణ కస్టమ్స్ సుంకం (బీసీడీ) పూర్తిగా మినహాయించనున్నారు.

దేశీయ తయారీ, విలువ జోడింపుకు మద్దతుగా, దేశీయంగా లభించని 25 ముఖ్య ఖనిజాలపై 2024, జూలై నెలలో బీసీడీని మినహాయించారు. తాజాగా 2025-26 బడ్జెట్‌లో కోబాల్ట్ పౌడర్, వ్యర్థాలు, లిథియం-అయాన్ బ్యాటరీ స్క్రాప్, సీసం, జింక్, సహా 12 కీలక ఖనిజాలపై బీసీడీని పూర్తిగా మినహాయించారు. దేశీయ వస్త్ర ఉత్పత్తిని ప్రోత్సహించడానికి, పూర్తి మినహాయింపు గల వస్త్ర సంబంధిత యంత్రాల జాబితాకు మరో రెండు రకాల షటిల్-లెస్ లూమ్స్ జోడించారు. 10 శాతం నుంచి 20 శాతం వరకు తొమ్మిది టారిఫ్‌ల కిందకు వచ్చే అల్లిక వస్త్రాలపై బీసీడీని 20 శాతం లేదా కిలోగ్రాముకు రూ.115లలో ఏది ఎక్కువ ఉంటే దానిని వర్తింపజేయనున్నారు. ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్‌ను సరిదిద్దడానికి, “మేక్ ఇన్ ఇండియా”ను ప్రోత్సహించడానికి, ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ డిస్‌ప్లే (ఐఎఫ్‌పీడీ)లపై బీసీడీని 20 శాతానికి పెంచారు. అలాగే ఓపెన్ సెల్స్‌పై 5 శాతానికి తగ్గించారు. ఓపెన్ సెల్‌ల తయారీని ప్రోత్సహించడానికి, ఓపెన్ సెల్‌ల భాగాలపై బీసీడీ మినహాయింపు ఇచ్చారు.

దేశంలో లిథియాన్-అయాన్ బ్యాటరీ తయారీని ప్రోత్సహించడానికి, ఈవీ బ్యాటరీ తయారీకి 35 అదనపు మూలధన వస్తువులను, మొబైల్ ఫోన్ బ్యాటరీ తయారీకి 28 అదనపు మూలధన వస్తువులను మినహాయింపు గల మూలధన వస్తువుల జాబితాలో చేర్చారు. 2025-26 కేంద్ర బడ్జెట్… నౌకా నిర్మాణానికి సంబంధించిన ముడి పదార్థాలు, విడి భాగాలు, వినియోగ వస్తువులు లేదా భాగాలపై బీసీడీ మినహాయింపును మరో పదేళ్ల పాటు కొనసాగిస్తుంది. నాన్-క్యారియర్ గ్రేడ్ ఈథర్నెట్ స్విచ్‌లతో సమానంగా ఉండేలా క్యారియర్ గ్రేడ్ ఈథర్నెట్ స్విచ్‌లపై బీసీడీని బడ్జెట్‌లో 20 శాతం నుంచి 10 శాతానికి తగ్గించారు. బడ్జెట్ 2025-26 హస్తకళల ఎగుమతులను సులభతరం చేస్తుంది. విలువ జోడింపు, ఉపాధి కోసం వెట్ బ్లూ లెదర్‌పై బీసీడీని పూర్తిగా మినహాయించారు. ఫ్రోజెన్ ఫిష్ పేస్ట్‌పై బీసీడీని 30 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు. అలాగే చేపలు, రొయ్యల దాణా తయారీ కోసం చేపల హైడ్రోలైజేట్‌పై బీసీడీని 15 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు.

కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ… ప్రజాస్వామ్యం, జనాభా, డిమాండ్‌లను వికసిత్ భారత్ ప్రయాణంలో కీలకమైన స్తంభాలుగా అభివర్ణించారు. మధ్యతరగతి వర్గాలు దేశ వృద్ధికి బలాన్ని ఇస్తారని అలాగే వారి సహకారానికి గుర్తింపుగా ప్రభుత్వం ఎప్పటికప్పుడు ‘పన్ను రహిత’ శ్లాబ్‌ను పెంచుతోందని ఆమె తెలిపారు. ప్రతిపాదిత కొత్త పన్ను నిర్మాణం వల్ల మధ్యతరగతి ప్రజల చేతుల్లో మరింత ఎక్కువ డబ్బు అందుబాటులోకి వచ్చి వినియోగం, పొదుపు, పెట్టుబడులు గణనీయంగా పెరుగుతాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

అభివృద్ధి పట్టాలపై రైల్వే

రైల్వేలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఈసారి బడ్జెట్‌లో రూ.2.65 లక్షల కోట్లు కేటాయించారు. ఇందులో రూ.2.52 లక్షల కోట్ల సాధారణ ఆదాయాలు, రూ.200 కోట్ల నిర్భయ ఫండ్, అంతర్గత వనరుల నుంచి రూ.3వేల కోట్లు, బడ్జెటేతర వనరుల నుంచి రూ.10వేల కోట్లు ఉంటాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ప్రయాణికులు, సరకు రవాణా తదితర మార్గాల్లో రూ.3.02 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. ఈసారి ప్రధానంగా 17,500 జనరల్‌ బోగీలు, 200 వందేభారత్‌ రైళ్లు, 100 అమృత్‌భారత్‌ రైళ్లు, 50 నమోభారత్‌ రైళ్ల ఉత్పత్తికి పచ్చజెండా ఊపారు. 2024-25 సవరించిన అంచనాల్లో రైల్వే భద్రతకు రూ.1,14,062 కోట్లు కేటాయించగా, 2025-26 బడ్జెట్‌ అంచనాల్లో రూ.1,16,514 కోట్లు ఇచ్చారు. ఏడాదికి 4వేల కిలోమీటర్ల కొత్త లైన్లు వేస్తున్నారు. గడిచిన పదేళ్లలో 31,180 కి.మీ. కొత్త ట్రాక్‌లు వేశారు. రాబోయే నాలుగైదేళ్లలో రూ.4.6 లక్షల కోట్ల విలువైన కొత్త ప్రాజెక్టులు అమలుచేస్తామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. వీటిలో కొత్త లైన్లు వేయడం, డబ్లింగ్, నాలుగు లైన్లు చేయడం, కొత్త నిర్మాణాలు, స్టేషన్ల అభివృద్ధి, పైవంతెనలు, అండర్‌పాస్‌లు.. ఇలా చాలా ఉన్నాయని రైల్‌భవన్‌లో విలేకర్లతో మాట్లాడుతూ ఆయన చెప్పారు. ‘‘మార్చి నెలాఖరులోపు 1,400 జనరల్‌ బోగీలు తయారవుతాయి. వెయ్యి పైవంతెనల నిర్మాణానికి అనుమతులు వచ్చాయి. సరకు రవాణా సామర్థ్యం గణనీయంగా పెరిగింది మార్చి 31 నాటికి 1600 కోట్ల టన్నుల సామర్థ్యాన్ని చేరుకుని, ప్రపంచంలో చైనా తర్వాత రెండోస్థానంలో ఉంటాం. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేసరికల్లా నూరుశాతం విద్యుదీకరణ సాధిస్తాం. రైల్వేల భద్రతకు వెచ్చించే మొత్తాన్ని రూ.1.08 లక్షల కోట్ల నుంచి రూ. 1.16 లక్షల కోట్లకు పెంచాం. పీపీపీ పెట్టుబడులను కూడా కలిపితే రైల్వేలకు మొత్తం కేటాయింపు రూ.2.64 లక్షల కోట్లు అవుతుంది’’ అని వివరించారు. ఈ బడ్జెట్‌లో తెలంగాణ రైల్వే ప్రాజెక్టులకు రూ.5,337 కోట్లు కేటాయించారు. 2009-14 మధ్యకాలంలో గత యూపీయే ప్రభుత్వం ఉమ్మడి ఏపీకి ఏటా సగటున కేటాయించిన రూ.886 కోట్లతో పోలిస్తే ఇది 6 రెట్లు అధికం.

స్వయంసమృద్ధ సాయుధ దళాలు

సాంకేతికంగాను, ఆధునికంగాను ఉండే ‘ఆత్మనిర్భర్’ (స్వయంసమృద్ధ) సాయుధ దళాలతో 2047 కల్లా అభివృద్ధి చెందిన భారత్ (‘Viksit Bharat @ 2047’)ను సాకారం చేయాలని చెబుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వ దార్శనికతకు అనుగుణంగా రక్షణ మంత్రిత్వ శాఖకుఆర్థిక సంవత్సరం 2025-26 లో కేంద్ర బడ్జెటులో నుంచి రూ. 6,81,210.27 కోట్లు ఇవ్వనున్నారు. ఈ కేటాయింపు 2024-25 బడ్జెట్ అంచనా కన్నా 9.53 శాతం ఎక్కువగా ఉంది. అంతేకాదు, ఇది కేంద్ర బడ్జెటులో 13.45 శాతం కూడా. ఇంత ఎక్కువ మొత్తంలో మరే మంత్రిత్వ శాఖకూ కేటాయింపులు ఇవ్వలేదు.

ఈ డబ్బులో నుంచి రూ. 1,80,000 కోట్లను, అంటే మొత్తం కేటాయింపుల్లో 26.43 శాతం భాగాన్ని డిఫెన్స్ సర్వీసెస్ మూలధన అవసరాల కోసమే ఖర్చుపెట్టబోతున్నారు. రాబడికి ప్రాధాన్యాన్నిస్తూ సాయుధ దళాల కోసం జరిపిన కేటాయింపులు రూ. 3,11,732.30 కోట్లుగా ఉన్నాయి. ఇది మొత్తం కేటాయింపులో 45.76 శాతం. డిఫెన్స్ పింఛన్లకు రూ. 1,60,795 కోట్లు ఇచ్చారు. ఇది కేటాయింపుల్లో 23.60 శాతం. మిగిలిన రూ. 28,682.97 కోట్లను (ఇది 4.21 శాతంగా లెక్కకు వస్తోంది) రక్షణ శాఖ ఆధీనంలోని సైన్యేతర సంస్థలకు ఉద్దేశించారు. 2025-26ను రక్షణ శాఖ ‘సంస్కరణల సంవత్సరం’గా నిర్వహించాలని నిర్ణయించినందువల్ల బడ్జెటులో పేర్కొన్న కేటాయింపు సాయుధ దళాలను ఆధునికీకరించాలన్న ప్రభుత్వ సంకల్పానికి బలాన్నివ్వడంతోపాటు శాఖకు కేటాయించిన డబ్బును అత్యంత అనుకూల పద్ధతుల్లో ఉపయోగిస్తూ రక్షణ సంబంధ కొనుగోలు ప్రక్రియను సరళతరం చేయడానికి కూడా తోడ్పడనుంది.

నౌక, విమానయాన రంగాలకు ఊతం

సముద్ర రంగానికి దీర్ఘకాలిక ఆర్థిక సహాయం కోసం ఆర్థిక మంత్రి రూ. 25వేల కోట్ల మూలధనంతో సముద్రరంగ అభివృద్ధి నిధిని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఈ మూలధనాన్ని సముద్రరంగానికి మద్దతును విస్తరించడానికి, పోటీని ప్రోత్సహించడానికి ఉపయోగిస్తామన్నారు. ఈ నిధిలో 49 శాతం వరకు నిధులు ప్రభుత్వం సమకూర్చనుండగా, మిగిలిన మొత్తాన్ని ఓడరేవులు, ప్రైవేట్ రంగం నుంచి సమీకరిస్తామని తెలిపారు.

సర్క్యులర్ ఎకానమీని ప్రోత్సహించడానికి భారతీయ యార్డుల్లో షిప్‌బ్రేకింగ్ కోసం క్రెడిట్ నోట్స్ సహా ఖర్చుపరమైన నష్టాలను పరిష్కరించడానికి ఓడల నిర్మాణం కోసం ఆర్థిక సహాయం అందించే విధానాన్ని పునరుద్ధరిస్తామని ఆర్థికమంత్రి ప్రకటించారు. అలాగే, నిర్ధిష్ట పరిమాణం కంటే పెద్ద నౌకలను మౌలిక సదుపాయాల సమతుల్యత గల మాస్టర్ జాబితా (హెచ్ఎమ్ఎల్)లో చేర్చాలని కూడా ప్రతిపాదించారు. ఓడల పరిధి, కేటగిరీలు, సామర్థ్యాన్ని పెంచడానికి ‘ఓడల నిర్మాణ క్లస్టర్‌ల’ ఏర్పాటును సులభతరం చేయాలని కూడా కేంద్ర బడ్జెట్‌లో ప్రతిపాదించారు. ఇందులో అదనపు మౌలిక సదుపాయాల సౌకర్యాలు, నైపుణ్యం, మొత్తం వ్యవస్థను అభివృద్ధి చేయు సాంకేతికత ఉంటాయి. నౌకానిర్మాణం పూర్తయేందుకు సుదీర్ఘ కాలం అవసరమని అంగీకరించిన ఆర్థికమంత్రి, ముడి పదార్థాలు, విడిభాగాలు, వినియోగ వస్తువులు లేదా ఓడల తయారీకి సంబంధించిన భాగాల కోసం సాధారణ కస్టమ్స్ సుంకం మినహాయింపును మరో పదేళ్ల పాటు కొనసాగించాలని ప్రతిపాదించారు. మరింత పోటీతత్వాన్ని పెంచడానికి షిప్ బ్రేకింగ్ కోసం కూడా ఇదే మినహాయింపును ఆమె ప్రతిపాదించారు.

ఉడాన్ 1.5 కోట్ల మధ్యతరగతి ప్రజల వేగవంతమైన ప్రయాణ ఆకాంక్షలను తీర్చడానికి వీలు కల్పించిందన్నారు. ఈ పథకం 88 విమానాశ్రయాలను అనుసంధానించింది అలాగే 619 మార్గాల్లో కార్యకలాపాలను సాగించింది. ఆ విజయంతో ప్రేరణ పొంది 120 కొత్త గమ్యస్థానాలకు ప్రాంతీయ అనుసంధానాన్ని విస్తరించడానికి, రాబోయే పదేళ్లలో 4 కోట్ల మంది ప్రయాణికులకు సేవలందించడానికి సవరించిన ఉడాన్ పథకం ప్రారంభం కానుందని తెలిపారు. అలాగే ఈ పథకం కొండ ప్రాంతాలు, ఆకాంక్షాత్మక, ఈశాన్య ప్రాంత జిల్లాల్లో హెలిప్యాడ్‌లు, చిన్న విమానాశ్రయాల ఏర్పాటుకు కూడా మద్దతు ఇస్తుందని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. అధిక విలువ కలిగి, పాడయ్యే అవకాశం గల ఉద్యానవన ఉత్పత్తులు సహా ఎయిర్ కార్గో కోసం మౌలిక సదుపాయాల అప్‌గ్రేడ్, గిడ్డంగుల ఏర్పాటును ప్రభుత్వం సులభతరం చేస్తుందని తెలిసారు. కార్గో స్క్రీనింగ్, కస్టమ్స్ ప్రోటోకాల్‌లను కూడా క్రమబద్ధీకరించి వినియోగదారుల హితంగా మారుస్తామన్నారు.

ఇంటింటికీ నల్లా

జల్ జీవన్ మిషన్ కోసం మొత్తం బడ్జెట్ వ్యయం రూ.67వేల కోట్లకు పెంచినట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ మిషన్‌ను 2028 వరకు పొడిగిస్తున్నట్లు ఆమె ప్రకటించారు. 2019 నుంచి భారత గ్రామీణ జనాభాలో 80 శాతం ప్రాతినిధ్యం గల 15 కోట్ల కుటుంబాలు జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రయోజనం పొందాయని ఆమె పేర్కొన్నారు. ఈ మిషన్ కింద తాగునీటి కోసం నల్లా నీటి కనెక్షన్లు అందిస్తున్నామనీ, రాబోయే మూడేళ్లలో 100 శాతం కవరేజీని సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఆమె వివరించారు. పైపుల ద్వారా గ్రామీణ ప్రాంతాలకు నీటిని సరఫరా చేయు పథకాల మౌలిక సదుపాయాల నాణ్యత, నిర్వహణపై “జన్ భాగీధారి” ద్వారా జల్ జీవన్ మిషన్ దృష్టి సారిస్తుందన్నారు. సుస్థిర, పౌర కేంద్రీకృత నీటి సేవల పంపిణీని నిర్ధారించుటకు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలతో ప్రత్యేక అవగాహన ఒప్పందాలు చేసుకోనున్నట్లు సీతారామన్ తెలియజేశారు.

140 కోట్ల భారతీయుల ఆకాంక్షల బడ్జెట్

‘‘ఇది 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షల బడ్జెట్, ఇది మన దేశంలో ప్రతి ఒక్కరి కలలను నెరవేర్చే బడ్జెట్. అనేక రంగాల్లో యువత ప్రవేశించడానికి వీలుగా వాటి తలుపులను మేం తెరిచాం. అభివృద్ధి చెందిన భారత్ ఉద్యమాన్ని ముందుకు నడిపేది సామాన్య పౌరులే. పొదుపు మొత్తాలను, పెట్టుబడిని, వినియోగాన్ని, వృద్ధిని శరవేగంగా పెంచేయనుంది. ఈ ప్రజల బడ్జెట్ ను తీసుకువచ్చినందుకు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, ఆమెకు సహకారాన్ని అందించిన బృందం సభ్యులందరినీ అభినందిస్తున్నాను.

బడ్జెట్ అనేసరికి ప్రభుత్వ ఖజానాను ఏయే పద్ధతుల్లో నింపాలన్న అంశంపైనే దృష్టంతా కేంద్రీకృతం అవుతుంది, అయితే ఈ బడ్జెట్ సరిగ్గా దీనికి భిన్నంగా ఉంది. మాణు ఇంధన ఉత్పత్తిలో ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించాలని తీసుకున్న నిర్ణయం చాలా చరిత్రాత్మక నిర్ణయం. ఉద్యోగకల్పనకు అవకాశాలున్న అన్ని రంగాలకు అన్ని విధాలుగా బడ్జెట్లో ప్రాధాన్యాన్నిచ్చారు. రైతుల కోసం బడ్జెటులో ఉన్న ప్రకటనలు వ్యవసాయ రంగంలోను, పూర్తి గ్రామీణ ఆర్థిక వ్యవస్థలోనూ ఒక కొత్త విప్లవానికి ఆధారాన్ని ఏర్పరుస్తాయి. రూ. 12 లక్షల వరకు ఉండే ఆదాయంపై పన్ను చెల్లించాల్సిన అవసరం లేకుండా చేశారు. అన్ని ఆదాయ వర్గాల వారికీ పన్నును తగ్గించారు కూడా. తయారీపై సమగ్రంగా దృష్టి సారించారు. దీనివల్ల ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, ఎంఎస్ఎంఈలు, చిన్న స్థాయి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు బలం పుంజుకొంటారు, కొత్త ఉద్యోగాలు అందివస్తాయి.

ఈ బడ్జెట్ దేశ ప్రస్తుత తక్షణావసరాలను లెక్కలోకి తీసుకోవడమే కాకుండా, మనం భవిష్యత్తు కాలానికి సన్నద్ధం కావడంలో కూడా సాయపడనుంది. అంకుర సంస్థలను దృష్టిలో పెట్టుకొని ఏర్పాటు చేసే డీప్ టెక్ ఫండ్, జియో స్పేషియల్ మిషన్, న్యూక్లియర్ ఎనర్జీ మిషన్.. ఇవన్నీ ఆ తరహా ముఖ్య నిర్ణయాలే.’’

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

డ్రీమ్ బడ్జెట్

‘‘పేదలు, మధ్యతరగతి ప్రజలు, రైతుల సంక్షేమానికి బాటలు వేస్తూనే.. అన్ని వర్గాలకు సమన్యాయం చేసే ‘డ్రీమ్ బడ్జెట్’ ఇది. వికసిత్ భారత్ లక్ష్యాలను చేరుకునేలా రూపొందించిన బడ్జెట్. వ్యక్తిగత ఆదాయ పన్ను పరిధిని రూ.12 లక్షలకు పెంచడం చాలా పెద్ద నిర్ణయం. MSMEలు, చిన్న పరిశ్రమలు ఆపన్నహస్తం అందించింది. రాష్ట్రాల ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ సహకార సమాఖ్య స్ఫూర్తిని గౌరవించిన బడ్జెట్ ఇది. అన్ని సంక్షేమ పథకాలకు నిధులను పెంచడం అభినందనీయం.’’

జి. కిషన్ రెడ్డి, బిజెపి తెలంగాణ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి