సినిమా.. జాతీయ సమైక్యతా సాధనం
సమాజంపై బలమైన ముద్ర వేయగల సాధనం సినిమా. సమాజంలో విలువలకు ప్రోది చేయడంతో పాటు దాన్ని ఐక్యంగా ఉంచడంలోనూ సినిమా కీలకంగా నిలుస్తుంది. అలాంటి చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధికి కేంద్రం పలు చర్యలు తీసుకుంటోంది. మానవాళిని ఐక్యం చేసే సాధనంగా చలనచిత్రానికి ఉన్న శక్తిని అభివర్ణిస్తూ ‘సినిమా మాట్లాడే భాష విశ్వజనీనం’ అన్నారు సత్యజిత్ రే. భాష, సాంస్కృతిక వైవిధ్యానికి ప్రతీక అయిన భారతీయ సినిమా దేశం నలుమూలలా ప్రజానీకాన్ని ఏకం చేస్తోంది. పైపై భేదాలెన్ని ఉన్నా మనమంతా ఒకటేనని చాటుతుంది. ప్రాంతీయ, భాషా పరిమితుల్ని అధిగమిస్తూ భారతీయ సినిమా ఒక బలమైన జాతీయ సమైక్యతా సాధనంగా ఎదిగింది. రాజ్‌కపూర్ రూపొందించిన అపురూప చిత్రం ‘శ్రీ 420’ నుంచి మణిరత్నం దర్శక సారథ్యంలో నిర్మితమైన ‘రోజా’ వరకూ భారతీయ సినిమాలన్నీ మానవాళి మొత్తానికి వర్తించే భావోద్వేగాలను దర్శించాయి. అందుకే భారతదేశంలో సినిమా ఒక బలమైన సమైక్యతా శక్తి అని చెప్పడం ఏమాత్రం అతిశయోక్తి కాదు.
విలువలకు తార్కాణం
మన సినిమాల విశ్వజనీనతను శ్లాఘించేందుకే ఉత్తమ చిత్రాలు, దర్శకులు, నటీనటులకు భారత రాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయ ఫిలిమ్ అవార్డులు అందజేయడాన్ని ఆనవాయితీగా పాటిస్తున్నాం. మన జాతీయ ఫిలిమ్ అవార్డుల ఉత్సవాలు ఇతర సంస్థల కార్యక్రమాల్లా కళ్లు జిగేల్‌మనిపించే ఆర్భాటాలు కావు. ప్రతిభను గుర్తించి తద్వారా అద్భుతాలు సృష్టించిన వారికి, ఉత్తమ కథకులకు, నటీనటులకు గుర్తింపు, గౌరవం అందించే వేడుకలవి. అనేక భాషలు, యాసలు, సంస్కృతుల సమ్మేళనమై బహువర్ణ శోభితమైన భారతీయ వైవిధ్యానికి, భిన్నత్వంలో ఏకత్వానికి జోహార్లు అర్పిస్తాయవి.
తివా భాషలో రూపొందిన ‘సికైసాల్’ను ఉత్తమ చిత్రంగా ఎంపిక చేయడం మన నేషనల్ ఫిలిమ్ అవార్డుల ప్రత్యేకత. ఈశాన్య భారతంతో పాటు బంగ్లాదేశ్, మయన్మార్ దేశాల్లోని టిబెటో బర్మీస్ జాతి ప్రజలు ‘తివా’ మాట్లాడతారు. 70వ నేషనల్ ఫిలిమ్ అవార్డుల కోసం 32 భాషల్లో ఫీచర్ ఫిలిం కేటగిరీ కింద 309 చలన చిత్రాలను, నాన్ ఫీచర్ ఫిలిమ్ కేటగిరీ కింద 128 చలన చిత్రాలను పరిశీలించి వాటిలోంచి అత్యుత్తమమైన వాటిని ఎంపిక చేశారు. ఫీచర్ ఫిలిమ్ కేటగిరీ కింద నాలుగు చలనచిత్రాలకు స్వర్ణకమలం దక్కింది. వీటిలో ఒకటి హర్యానవీ భాషలో రూపొందింది. ఇదే కేటగిరీ కింద అయిదేసి చొప్పున హిందీ, తమిళ చిత్రాలకు వెండి కమలం దక్కింది. మలయాళం, గుజరాతీ, కన్నడ, హర్యానవీ, బెంగాలీ భాషా చిత్రాలూ ఈ అవార్డుకు ఎంపికయ్యాయి. భారత రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూలులో ప్రస్తావించిన భాషల్లో రూపొందిన 10 చిత్రాలకు వెండి కమలం లభించింది. హిందీ, ఉర్దూ భాషల్లో విడుదలైన ఒక చిత్రానికి నాన్ ఫీచర్ ఫిలిమ్ కేటగిరీ కింద స్వర్ణ కమలం దక్కింది.
‘నాటు నాటు’ ప్రత్యేకత
రాజకీయ, సాంస్కృతిక, సామాజిక రంగాల్లోని విభేదాలను విడనాడి ఐక్యతకు బాటలు వేసే చిత్రాలను రూపొందించడం మన సినీ రూపకర్తల ప్రత్యేకత. మన దేశ కథా కథన విధాన మౌలిక లక్షణమే సమైక్యత. కళాత్మక చిత్రాలు కానీ, మాస్ చిత్రాలు కానీ, వాణిజ్య సినిమాలు కానీ, ఓటీటీ చిత్రాలు కానీ.. మనందరం వాటిని చూసి సమష్టిగా స్పందిస్తాం. మెచ్చుకుంటాం. సంబరపడతాం. తెలుగులో రూపొందిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రంలోని ‘నాటు నాటు’ పాట ఆస్కార్, గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్ని పొందింది. ఈ పాట భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్ అనిపించుకుంది. అన్ని భాషా జాతులకు చెందిన ప్రజలనూ ఆ పాట అలరించింది.
భాషాప్రయుక్త రాష్ట్రాలతో కూడుకున్న మన గణతంత్రదేశం ఆవిర్భవించి 75 సంవత్సరాలైంది. సంకుచిత రాజకీయవాదుల వాదనలెలా ఉన్నా ఈ ఏడున్నర దశాబ్దాల్లో భాషల అడ్డుగోడలు తొలగిపోయాయన్నది వాస్తవం. బాలీవుడ్ సినిమాలు హిందీని అన్ని ప్రాంతాలకూ తీసుకెళ్లాయి. అయితే అది భిన్నత్వంతో కూడుకున్న భారతీయ సామాజిక పటంపై సినిమా చూపిన ప్రభావానికి ఒక పార్శ్వం మాత్రమే. ఇతర భాషా సమూహాల అస్తిత్వాన్ని గుర్తించడంతోపాటు ‘ఒకే భారత్ శ్రేష్ఠ భారత్’ అనే సమైక్యతా భావనను పెంపొందించడం ప్రజల మనసులపై సినిమా చూపిన మరో ప్రభావం.
సినిమాకు సంబంధించినంత వరకూ ‘ఒకే భారత్, శ్రేష్ఠ భారత్’ అనేది కేవలం నినాదం కాదు. రాజకీయ, సామాజిక, సాంస్కృతిక వైవిధ్యానికి అతీతంగా మనల్ని విలువలు, నైతికత కలిగిన ఒకే ప్రజానీకంగా సమైక్యపరిచే గొప్ప సాధనం మన సినిమా. దాని రూపకర్తలు, ప్రేక్షకులు అంతరంగ సమైక్యతతో పరస్పరం అర్థం చేసుకొనే విశ్వజనీనమైన విలువలు, నైతికత లేని కథ ఏదీ మనదేశంలో సినిమాగా రూపొందదు. ప్రపంచ చరిత్రలో మహా గాథలైన రామాయణ, మహాభారతాలు మన కథా విలువలకు తార్కాణాలు.
ఇదే నిదర్శనం
భారతీయ సినిమాను ప్రపంచ వేదికపై మెరిసేలా చేసేందుకు ప్రతిభను ప్రోత్సహించడం, చిత్ర రూపకర్తల కోసం మౌలిక సదుపాయాలు కల్పించడం, విధానాల సరళీకరణ అనే మూడు రకాల చర్యలను ప్రభుత్వం తీసుకుంటోంది. అందులో భాగంగానే ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీ (ఐఐసీటీ) ఏర్పాటు చేస్తున్నట్టు ఇటీవలే ప్రకటించింది. సినీ రంగంలో సృజనాత్మకతను ప్రోత్సహించేందుకు, దాని అభివృద్ధి కోసం కావాల్సిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు ప్రభుత్వం కంకణబద్ధమై ఉందనడానికి ఇదే నిదర్శనం. వేగంగా పరివర్తన చెందుతున్న ప్రస్తుత ప్రపంచంలో భారతీయ సినిమా నిత్యనూతనంగా పరిణమిస్తూ తన సరిహద్దుల్ని నిరంతరం విస్తరిస్తోంది. జాతీయ సమైక్యతకు బలమైన ఉత్ప్రేరకంగా సినిమాను తీర్చిదిద్దేందుకు కొత్త కథా కథన రీతుల్ని అందిపుచ్చుకుంటున్న మన సినీ రూపకర్తల కృషి సర్వదా శ్లాఘనీయం.
అశ్విని వైష్ణవ్,
కేంద్ర ప్రసారాలు, సమాచార, రైల్వే, ఇన్షర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి

