కాంగ్రెస్ అధిష్టానంపై తిరుగుబాటుకు రేవంత్ ఎత్తుగడ

రాబోయే పదేండ్లు తానే ముఖ్యమంత్రి అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే చెప్పుకుంటూ వస్తుండటం పట్ల కాంగ్రెస్ వర్గాల్లో పలు అనుమానాలు కలుగుతున్నాయి. కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీలలో ఆ విధంగా ప్రకటించుకోవడం ఎవరికి సాధ్యం కాదు. అయినా, ఇలా ఏకపక్షంగా ప్రకటించుకోవడం వెనుక కారణం, ఎవరిని చూసుకొని ఆ ధైర్యం అని ఆ పార్టీ వర్గాలు ఆరా తీస్తున్నాయి. కాంగ్రెస్‌లో డీకే శివకుమార్ వంటి బలమైన నాయకులే పార్టీ అధిష్టానాన్ని ధిక్కరించలేక మౌనంగా ఉంటుంటే రేవంత్ రెడ్డి తరచూ ఈ విషయమై ప్రకటనలు చేస్తుండటం కాంగ్రెస్ వర్గాలకే ఆశ్చర్యం కలిగిస్తున్నది. ఇది ఖచ్చితంగా దిల్లీ పెద్దలపై ధిక్కార స్వరమేనని భావిస్తున్నారు.

 ఏడాదిన్నరగా పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ అపాయింట్‌మెంట్‌ దొరక్కపోవడం, ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో తన అభిప్రాయానికి అధిష్టానం ప్రాముఖ్యత ఇవ్వకపోవటంతో సీఎం రేవంత్‌ రెడ్డి దిల్లీ పెద్దలను ఎదిరించాలని నిర్ణయించుకున్నారా? అధినేత కలవకపోయినా తాను భయపడబోనని అధిష్టానానికి బలమైన సంకేతం పంపదలుచుకున్నారా? అని కాంగ్రెస్‌లో చర్చ నడుస్తున్నది. తనను కాదంటే తెలంగాణలో కాంగ్రెస్ మనుగడ కష్టం అనే బెదిరింపు సంకేతాలు ఇవ్వడం కోసమే ఈ విధంగా చేస్తున్నారా? అవసరమైతే పార్టీ అధిష్టానంపై తిరుగుబాటుకు సిద్ధంగా ఉన్నట్లు సంకేతం ఇవ్వదలిచారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మంత్రి పదవి రాకపోవడంతో అసంతృప్తితో రగిలి పోతున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి వారు ఆ విధంగా ప్రకటించుకోవడం పార్టీ క్రమశిక్షణను ధిక్కరించడమే అంటూ బహిరంగంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా, పలువురు మంత్రులు, పార్టీ నేతలు సైతం అటువంటి అభిప్రాయాలని వ్యక్తం చేస్తున్నారు. 

“కొంత మందికి నా కుర్చీ మీదనే కన్నుంది. నేనో కుర్చీ మీద కూర్చొని, ఎదురుగా మరో కుర్చీ చూపి కూర్చోమని చెబితే వినరు. నా పక్కనే కుర్చీ వేసుకొని కూర్చోవాలనో, లేదా నా కుర్చీ మీద ఇంకో కుర్చీ వేసుకొని కూర్చోవాలనో చూస్తున్నారు” అంటూ ఈ ఏడాది ఫిబ్రవరిలో దిల్లీ మీడియా ప్రతినిధులతో సీఎం రేవంత్‌రెడ్డి నర్మగర్భంగా చేసిన వ్యాఖ్యలివి! పార్టీ అగ్రనేతల ప్రోత్సాహంతో కొందరు ముఖ్యమంత్రి కుర్చీ మీద కన్నేశారని సీఎం సన్నిహిత వర్గాలు భావిస్తున్నాయి. అవకాశం దొరికితే కుర్చీ నుంచి దింపడానికి దిల్లీలో పావులు కదుపుతున్నారని అనుమానిస్తున్నాయి. రేవంత్‌ తప్పిదాలను అధిష్టానానికి నివేదిస్తున్నారని సమాచారం. అందుకే రాహుల్ గాంధీ, ఇతర నేతలు రేవంత్ రెడ్డిని పట్టించుకోవడం లేదనే అభిప్రాయం ప్రబలుతున్నది. ప్రజల్లో పెరిగిన వ్యతిరేకత, రాహుల్‌ తో గ్యాప్‌ రోజురోజుకూ పెరిగిపోతున్నదన్న ప్రచారం నేపథ్యంలో ఏ నాటికైనా సీనియర్‌ నేతలతో ప్రమాదం తప్పదని రేవంత్ రెడ్డి సన్నిహిత వర్గాలు అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణ సమయంలో తన వర్గానికి చెందిన ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇప్పించుకోవాలని సీఎం రేవంత్‌ రెడ్డి చేసిన ప్రయత్నాలను ఇద్దరు కీలక నేతలు అడ్డుకున్నారని సీఎం వర్గం భావిస్తున్నది. ఇటీవల హైదరాబాద్‌కు వచ్చిన కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సైతం రాష్ట్ర నేతల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. మంత్రులు, ఎమ్మెల్యేలు బహిరంగంగా విమర్శలు చేసుకోవడం, ఎమ్మెల్యేల గ్రూప్‌ రాజకీయాలు, నేరుగా మంత్రులను టార్గెట్‌ చూస్తూ విమర్శలు చేయటంపై ఖర్గే ఆందోళన వ్యక్తం చేశారని సమాచారం. పూర్తి వివరాలతో దిల్లీకి రావాలని ఆదేశించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

తన మంత్రులను తానే నమ్మలేక వారి టెలిఫోన్‌లపై ముఖ్యమంత్రి నిఘా ఉంచారన్న ప్రచారం ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతోంది. దానితో కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆఖరికి కార్పొరేషన్ల చైర్మన్లు సైతం అభద్రతాభావానికి గురవుతున్నారు. ఈ కథనం ప్రకారం ఒక సీనియర్ మంత్రి, తన బంగ్లాలోని బెడ్ రూంలో విశ్రాంతి తీసుకుంటూ, మరో మంత్రితో ఫోన్లో మాట్లాడారు. ఈ సంభాషణ దాదాపు ఒక గంటకు పైగా సాగింది. ఇద్దరూ ఒకే జిల్లాకు చెందిన మంత్రులు కావడంతో తమ ఆవేదనను ఒకరితో ఒకరు పంచుకున్నారు. అయితే, వారు ఊహించని విధంగా, ఈ సంభాషణ దాదాపు పూర్తిగా ముఖ్యనేత చెవులకు చేరింది. వారిద్దరూ మాట్లాడుకున్న సంభాషణలోని చాలా భాగాలను గుర్తు చేస్తూ ఆ మంత్రిని ముఖ్యమంత్రి ఆశ్చర్యపరిచారు. “నువ్వు ఆయనతో (మరో మంత్రి) ఎందుకు చేతులు కలిపావు? నీకు ఏమైనా సమస్యలుంటే నాతో చెప్పు, పరిష్కరిస్తాను” అని అన్నట్టు సమాచారం. ఈ సంభాషణ గురించి మీకెలా తెలిసిందని మంత్రి ప్రశ్నించగా, ఆయన చాలా స్పష్టంగా “మీరు ఎవరితో ఏమి మాట్లాడుతున్నారు, ఎవరిని కలుస్తున్నారు, ఎప్పుడు, ఎక్కడికి వెళ్తున్నారు అనే విషయాలపై నిఘా ఉంచడం సహజం” అని చెప్పారట. ఈ హఠాత్ పరిణామాలతో సంబంధిత మంత్రులిద్దరూ తమ ఫోన్లు మార్చేశారు. ఒకరు ఫోన్ వాడకాన్ని మానేయగా, మరొక మంత్రి ఎవరినైనా సంప్రదించాలంటే గన్ మెన్, లేదా వ్యక్తిగత కార్యదర్శిని సంప్రదించాల్సిన పరిస్థితి నెలకొన్నది. మరో మంత్రి, కీలక నేత ఈ ఫోన్ ట్యాపింగ్ సంభాషణలో పాల్గొనకపోయినా తనపై నిత్యం నిఘా ఉందని తెలుసుకున్నారట. ఒకవంక రేవంత్ పరిపాలన కుంటుపడటం, మరోవంక పార్టీలో ఎవరికి వారే యమునా తీరుగా ఉంటూ ఉండటంతో అసలేం జరుగుతుందో ఆ పార్టీ నేతలకే అంతుబట్టడం లేదు.