కాంగ్రెస్ అణచివేతకు నిదర్శనం వెలుగుమట్ల!
పేదల పేరుతో అధికారం పొందటమే కానీ, పరిపాలనలో వారి పట్ల ఏవగింపు, అసహనం ప్రదర్శించడం కాంగ్రెస్ పాలకులకు పరిపాటిగా మారింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం సైతం పేదల బతుకులలో వెలుగులు నింపుతామని ఎన్నో ఆశలు కల్పించి అధికారంలోకి వచ్చింది. కానీ రాగానే హైడ్రా పేరుతో ఒక వంక, మూసీ సుందరీకరణ పేరుతో మరోవంక పేదలను నిరాశ్రయులను చేస్తూ, వారి ఇళ్లను కూల్చివేస్తూ అరాచకానికి పాల్పడుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పెద్దలు పేదల భూములను ఆక్రమించుకుంటూ, కీలక నాయకుల రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు పేదలను నిరాశ్రయులను కావిస్తూ వారి బతుకులలో అగ్గి రాజేస్తున్నారు. పేదల పట్ల ఈ ప్రభుత్వం ఎంత నిర్ధాక్షిణ్యంగా వ్యవహరిస్తుందో నిరాశ్రయులై, ఖమ్మం పట్టణంలో ఆశ్రయం పొందుతున్న వెలుగుమట్ల గ్రామస్థుల పట్ల సాగిస్తున్న దమనకాండ స్పష్టం చేస్తుంది.
నిర్వాసితులైనవారిని ప్రభుత్వం ఖమ్మంలోని అంబేద్కర్ భవన్, టీటీడీసీ భవనాల్లోని పునరావాస కేంద్రాలకు తరలించింది. అయితే, అక్కడ వారికి కనీస సౌకర్యాలూ కల్పించలేదు. కనీసం భోజనం కూడా ఏర్పాటు చేయలేదు. దీంతో ప్రతిపక్షాలు సొంత ఖర్చులతో కొద్ది రోజులుగా రెండు పూటలా భోజనం ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ పునరావాస కేంద్రాల్లో ఉంటున్న బాధితుల వద్దకు పలు పార్టీల నేతలు, ఆయా సంఘాల నాయకులు ప్రతిరోజూ వచ్చి పరామర్శించి వెళ్తున్నారు. దాదాపు 700 కుటుంబాలు 10 సంవత్సరాలుగా భూదాన భూముల్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని నివసిస్తుంటే రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం వేలాది పోలీసులతో, బుల్డోజర్‌లతో బలవంతంగా కుటుంబాలను బయటకు పంపించి ఇండ్లను కూల్చేశారు. ఇప్పటికీ రోడ్ల మీదకు వచ్చి నిరసనలు తెలియజేస్తూ తెలంగాణ కాంగ్రెస్ బుల్డోజర్ రాజ్యానికి నిదర్శనంగా నిలువనీడలేక అవస్థలు పడుతున్నారు.
వెలుగుమట్లలో ఎంత విధ్వంసం జరిగిందో, కుటుంబాలు ఎన్ని ఇబ్బందుల పాలవుతున్నరో చూసి రాష్ట్ర ప్రజానీకం నివ్వెరపోయింది. శిబిరాల్లో వున్నవారికి కనీస సౌకర్యాలు కూడా లేవనే విషయం మీడియాలో, పత్రికల్లో వస్తున్నది. అక్కడ వెళ్ళిన మీడియా ప్రతినిధులను కూడా అరెస్టు చేసి, నిర్భంధిస్తున్నారు. అక్కడున్న పేదలకు అక్కడే ఇండ్లు నిర్మించి, స్థిర నివాసం ఏర్పాటు చేయాలని అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు కోరుతున్నాయి. వెలుగుమట్ల బాధితులపై పోలీసులు ఖమ్మంలో లాఠీలతో విరుచుకుపడటం కాంగ్రెస్ దుర్మార్గాలకు పరాకాష్ట అని చెప్పవచ్చు. మహిళలు, పిల్లలు, వృద్ధులు అని కూడా చూడకుండా దొరికినవారిని దొరికినట్టు కొట్టారు. ఇటీవల వెలుగుమట్ల భూదాన్ భూముల్లోని పేదల ఇండ్లను ప్రభుత్వం బుల్డోజర్లతో నేలమట్టం చేసిన నేపథ్యంలో హైదరాబాద్‌లోని వివిధ యూనివర్సిటీలకు చెందిన నాయకులు వచ్చి పరామర్శించారు. ఈ సమయంలో బాధితుల గోడు విన్న ఓ విద్యార్థి నాయకుడు స్పందిస్తూ బాధితులకు మద్దతుగా దీక్ష చేసేందుకు పూనుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అతడు దీక్ష చేయకుండా అడ్డుకున్నారు. అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. దీంతో బాధితులంతా కలిసి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మాకు మద్దతుగా ఎవరు వచ్చినా అరెస్టు చేస్తున్నారెందుకు?’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. అయినప్పటికీ, ఆ విద్యార్థి నాయకుడిని పోలీసులు అరెస్టు చేసేందుకు ప్రయత్నించడంతో బాధితులు పోలీసులను అడ్డుకున్నారు. దీంతో పోలీసులంతా కలిసి బాధితులు, మహిళలను ఈడ్చిపడేశారు. ఒకానొకదశలో లాఠీలకు పనిచెప్పారు. దీంతో బాధితులకు, మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆ గాయాల నొప్పులు భరించలేని మహిళలు.. మిన్నంటే రోదనలతో అంబేద్కర్ భవన్ బయటకు వచ్చారు.
బాధితులందరూ కలిసి అక్కడే ఉన్న ప్రధాన రహదారిపై పడుకొని నిరసన తెలియజేశారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు వారిని రోడ్డుపై నుంచి తొలగించేందుకు ప్రయత్నించారు. దీంతో బాధితులు అక్కడ కూడా పోలీసులను నిలదీశారు. అయినప్పటికీ బాధితులను పోలీసులు ఈడ్చిపడేశారు. ఆడ, మగ, పిల్లలు, వృద్ధులు అనే విచక్షణ కోల్పోయి లాఠీలకు పనిచెప్పారు. బూటు కాళ్లతో తొక్కుతూ, దుర్భాషలాడారు. ఆడ, మగ అనే తేడా లేకుండా కంటికి కనిపించిన వారందరిపైనా లాఠీలతో విరుచుకుపడ్డారు. మహిళలను మహిళా పోలీసులతోనే నిరోధించాలన్న కనీస నియమాన్ని విస్మరించి కాఠిన్యాన్ని ప్రదర్శించారు. రోడ్డుపై కూర్చున్న వారినీ వదల్లేదు. కాగా, టీటీడీసీ, అంబేద్కర్ భనాలను తక్షణమే ఖాళీ చేసి వెళ్లి పోవాలంటూ అధికారులు హుకుం జారీ చేయడం గమనార్హం. లేదంటే మంచినీళ్లు కూడా ఇవ్వబోమంటూ అధికారులు మొండికేస్తున్నారు. వెలుగుమట్ల భూదాన్ భూముల బాధితులకు రోజురోజుకూ మద్దతు పెరుగుతున్నది. కాకతీయ, ఉస్మానియా విశ్వవిద్యాలయాలకు చెందిన పలువురు నాయకులు, ఎస్టీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంఘాల నాయకులు వచ్చి బాధితులకు మద్దతు పలికారు. అయినా ప్రభుత్వంలో కదలిక రావడం లేదు. ఖమ్మం జిల్లా నుండే ఉపముఖ్యమంత్రి, మరో ఇద్దరు కీలక మంత్రులు ఉన్నారు. వారు ఎంతసేపు సింగరేణి టెండర్లు, ఇతర ప్రభుత్వ వ్యవహారాలలో వాటాల కోసం కొట్లాడుకోవడమే గాని పేద ప్రజల రోదనలు పట్టించుకునే తీరిక వారికి ఉండడం లేదు.
కృష్ణ చైతన్య
