‘క్రిమినల్ వేస్ట్’.. ముఖ్యమంత్రి బాధ్యతారాహిత్యానికి నిదర్శనం
తెలంగాణ ముఖ్యమంత్రి, స్వయంగా పాఠశాల విద్య, ఉన్నతవిద్య, సాంకేతిక విద్య శాఖ బాధ్యతలు చూస్తున్న రేవంత్ రెడ్డి.. ఇంజనీరింగ్ విద్యార్థులను ‘క్రిమినల్ వేస్ట్’ అని ప్రస్తావించడం ఆయన బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. సీఎం వంటి బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న వ్యక్తి.. ఒక సమస్యపై ఆరోగ్యకరమైన, నిర్మాణాత్మకమైన చర్చను ప్రారంభించి వ్యవస్థలో మార్పుకోసం ప్రయత్నం చేస్తే బాగుంటుంది. హార్వర్డ్ యూనివర్సిటీలో వీకెండ్ క్లాసులో నేర్చుకున్న రెండు పదాలను ఇక్కడికొచ్చి వాడేద్దామనే ప్రయత్నంలో ‘జెన్-జీ’ని అవమానిస్తున్నాననే విషయం కూడా ముఖ్యమంత్రి మర్చిపోయినట్లున్నారు.
అసలు, రెండున్నరేళ్లుగా ముఖ్యమంత్రిగా, విద్యామంత్రిగా ఉన్న వ్యక్తి ఈ రంగంలో మార్పుల కోసం ఏం చేశాడో చెప్పాల్సింది పోయి.. తెలిసీ, తెలియని పదాలను వాడి తానేదో మేధావినని నిరూపించుకునే ప్రయత్నం చేయడం దురదృష్టకరం. అయినా రెండున్నరేళ్ల తర్వాత హఠాత్తుగా సీఎం నిద్ర నుంచి మేల్కొని ఇంజనీరింగ్ విద్యా ప్రమాణాల గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో చెప్పగలరా? విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించమని అడుగుతున్నారనే అక్కసుతో ఇంజినీరింగ్ విద్యార్థులను క్రిమినల్స్‌తో పోల్చడం సిగ్గుచేటు. ప్రభుత్వం రూ.10,000 కోట్ల ఫీజు బకాయిలు చెల్లించాల్సి ఉండగా, అందులో రూ.5,000 కోట్లకు పైగా కేవలం ఇంజినీరింగ్ విద్యార్థులకే చెల్లించాల్సి ఉంది. ఈ బకాయిలు చెల్లించాలనే విద్యార్థుల డిమాండ్‌ను తట్టుకోలేక, ఫ్రస్ట్రేషన్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారిని క్రిమినల్స్‌గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో కూడా ఇంజినీరింగ్ కాలేజీలు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేస్తే… ‘తమాషాలు చేస్తే తాట తీస్తాం’ అంటూ ముఖ్యమంత్రి స్థాయిని మరచి ఇష్టారీతిన మాట్లాడారు. కాలేజీలు ఫీజు బకాయిలు అడిగితే విజిలెన్స్ విచారణల పేరుతో విద్యాసంస్థల మీద దాడులు చేయించారు. ఎన్నికల సమయంలో తెలంగాణ విద్యా బడ్జెట్ 15 శాతంగా చేస్తామన్న హామీని అటకెక్కించిన ముఖ్యమంత్రి ‘గురివింద గింజ’ ఆలోచనతో రాష్ట్ర విద్యావ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారనేది సుస్పష్టంగా కనబడుతోంది.
ఓవైపు రాజకీయ అవసరాలకోసం ‘జెన్-జీ’ల ఆకాంక్షలకు తామే ఠేకేదార్ అని ప్రకటనలు ఇస్తూనే.. మరోవైపు, అదే ‘జెన్-జీ’లను క్రిమినల్స్ గా పోల్చిన రేవంత్ రెడ్డి విజ్ఞతను తెలంగాణ సమాజం ప్రశ్నిస్తోంది. ఇది రేవంత్ రెడ్డి వరకే పరిమితం కాలేదు. 2015లో నాటి సీఎం కేసీఆర్ కూడా.. మన ఇంజనీరింగ్ విద్యార్థుల స్టాండర్డ్స్ సరిగా లేవని.. తనతో ఎవరో చెప్పారని, ఈ మాటతో తనకు సిగ్గుపోయినంత పనైందని.. అసెంబ్లీ వేదికగా చెప్పారు. మన ఇంజనీరింగ్ విద్యార్థులవి వానాకాలం చదువులని విమర్శించారు. ఈ ప్రకటన చేసిన తర్వాత 9 ఏళ్లు అధికారంలో ఉన్నా తనను ఆవేదనకు గురి చేసిన అంశంలో మార్పుల కోసం మాత్రం కేసీఆర్ ఏమాత్రం ప్రయత్నించలేదు. కేసీఆర్ 10 ఏళ్లు, రేవంత్ రెడ్డి రెండున్నరేళ్లు.. అంటే దాదాపు 12 ఏళ్లయినా తెలంగాణలో విద్యావ్యవస్థ ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు’ తయారైందంటే ముఖ్యమంత్రులు ఎంత గొప్పగా పనిచేశారో తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి.
నిజానికి హైదరాబాద్ ఐటీ కేంద్రంగా ప్రపంచ ఖ్యాతిని పొందడంలో ఇక్కడి ఇంజనీరింగ్ విద్యార్థుల కృషి లేదా? ఇక్కడ ఇంజనీరింగ్ చేసిన విద్యార్థులు అంతర్జాతీయ ఐటీ, నిర్మాణ, మెకానికల్ కంపెనీల్లో ఉన్నత స్థానాల్లో ఉండటం వాస్తవం కాదా? తెలంగాణ యువ ఇంజనీర్లు ‘క్రిమినల్ వేస్ట్’ కాదు.. వాళ్లు ఇన్నొవేటర్స్ గా, ఆంట్రప్రెన్యూర్స్ గా, రీసర్చర్లుగా నేషనల్ బిల్డర్లుగా తమ సత్తా చాటుకుంటున్నారు. అలాంటి యువతను, ఇంజనీరింగ్ విద్యార్థులను తెలంగాణ రాష్ట్ర తొలి, రెండో ముఖ్యమంత్రులు తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేశారు. కచ్చితంగా, ఇంజనీరింగ్ విద్యను మరింత నాణ్యతతో తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం ప్రభుత్వం, ప్రయివేటు విద్యాసంస్థలు కలిసి విద్యావ్యవస్థను, పరిశ్రమలతో అనుసంధానం చేసి ప్రాక్టికల్ నాలెడ్జ్ పెంపొందించడంలో చొరవతీసుకోవాలి. కానీ, ఇలా ‘క్రిమినల్ వేస్ట్’, ‘వానాకాలం చదువులు’, ‘సిగ్గనిపించింది’ అనే పదాలను వాడేముందు కాస్త ఆలోచన చేయాలి.
జి.కిషన్ రెడ్డి,
కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి

