హైదరాబాద్‌ను వెంటాడుతున్న ఉగ్ర కుట్రలు!
దేశం ఎక్కడ ఉగ్రదాడులు జరిగినా, ఏదో ఒక విధంగా హైదరాబాద్‌తో సంబంధాలు బయట పడుతూ వస్తున్నాయి. ముఖ్యంగా విదేశీ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చే ప్రదేశంగా, ఇక్కడి నుండే పేలుడు పదార్థాలు సమకూర్చుకొనే ప్రయత్నం చేయడం సైతం బయటపడుతూ వస్తుంది. అందుకు అవసరమైన ఆర్థిక వనరులతో పాటు ఇతరత్రా లాజిస్టిక్ సదుపాయాలను కల్పించడంలో స్థానికంగా కొందరు రాజకీయ నాయకుల ప్రమేయం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. పైగా, పాస్ పోర్ట్ గడువు తీరిన పలువురు పాకిస్తాన్, బంగ్లాదేశ్ పౌరులు నగరంలో దీర్ఘకాలంగా నివసిస్తున్నారని అందరికి తెలిసిందే. రోహింగ్యాలు ఇక్కడ అక్రమంగా వసతి పొందుతున్నారు. స్థానిక రాజకీయ నాయకులు, దళారుల సహకారంతో వారికి ఆధార్, రేషన్ కార్డులు, పాస్ పోర్టులు సైతం సులభంగా లభిస్తున్నాయి.
తాజాగా జైళ్లలో ఉంటున్న కరడుగట్టిన ఉగ్రవాదులు జైల్లో నుండే దేశంలో భారీ ఉగ్రదాడులకు పన్నాగాలు పన్నుతున్నారని వస్తోన్న కథనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. మూడేళ్ల క్రితం దసరా పండుగ రోజు వరుస పేలుళ్లతో హైదరాబాద్‌లో విధ్వంసం సృష్టించేందుకు కుట్రపన్నిన లష్కరే తోయిబా ఉగ్రవాది జాహెద్, మరో కుట్రకు ప్రయత్నిస్తున్నట్లు కేంద్ర దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. ఆ విషయాన్ని నిర్ధారించుకునేందుకు నిఘా వర్గాల బృందం ఈ నెల 17న హైదరాబాద్ నగరానికి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్న జాహెద్, పాకిస్థాన్‌లోని సహచరులతో ఫోన్‌లో మాట్లాడుతున్నట్లు ఇంటెలిజెన్స్ అనుమానిస్తోంది. చంచల్‌గూడ జైలులో ఉన్న జాహెద్ ఈ మధ్య తరచుగా పాకిస్థాన్‌లోని తన సోదరుడైన మాజీద్‌తో మొబైల్ ఫోన్లో మాట్లాడుతున్నట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. తదుపరి దర్యాప్తు కోసం ముగ్గురు సభ్యుల బృందం హైదరాబాద్ వచ్చి చంచల్‌గూడ జైలుకు వెళ్లి విచారణ చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఆరా తీయగా, జైలు నుంచి మాజిద్ ఫోన్ మాట్లాడుతున్న విషయంలో ఎలాంటి అనుమానం లేదని నిఘా విభాగానికి చెందిన ఒక అధికారి స్పష్టం చేశారు.
మరోవంక, చంచల్ గూడ జైలు ములాకత్ నుంచి ఉగ్రకుట్రకు ప్లాన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఉగ్ర కుట్రపై జైలు నుంచే ప్రణాళికలు రచించినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయాన్ని డీజీపీ తోసిపుచ్చినా మూసారాంబాగ్, సైదాబాద్, మలక్‌పేట్ తదితర రద్దీ ప్రాంతాలపై ఈ మేరకు పోలీసులు నిఘా పెంచడం స్పష్టంగా కనిపిస్తుంది. నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్ మహానగరంలో ఉగ్ర కుట్రకు ప్లాన్ చేసినట్లు నిఘా వర్గాలు అనుమానం వ్యక్తం చేశాయి. 2013లో దిల్‌సుఖ్‌నగర్ జంట బాంబు పేలుళ్ల ఘటన నేపథ్యంలో తాజా ఉగ్ర కుట్ర వార్తలు షాక్ కు గురి చేస్తున్నాయి. లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన ఉగ్రవాది జైలు నుంచి కుట్ర చేశాడని కథనాలు వస్తున్నాయి. ములాకత్ కు వచ్చిన వ్యక్తులతో ఉగ్రదాడులపై సంభాషించినట్లు తెలుస్తోంది. మూలకత్ కు వచ్చిన ఉగ్రవాది భార్య ద్వారా సమాచారాన్ని చేరవేసినట్టు నిఘా వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. 2013 ఫిబ్రవరి 21న సాయంత్రం 7 గంటల సమయంలో దిల్‌సుఖ్‌నగర్ బస్టాప్, ఏ-1 మిర్చి సెంటర్ వద్ద జరిగిన పేలుళ్లలో 18 మంది మరణించగా, 131 మంది గాయపడ్డారు. ఆ కేసులో ఐదుగురు ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాదులకు ఉరిశిక్ష పడింది. ఎన్ఐఏ కోర్టు దోషులకు మరణశిక్ష విధించినప్పటికీ, న్యాయపరమైన కారణాలతో ఇప్పటికీ అమలు కాలేదు. తమకు ఇంకా పూర్తిస్థాయిలో న్యాయం జరగలేదని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఉగ్రవాదులు లేదా వారి మద్దతుదారులు స్వేచ్ఛగా తిరగగలుతున్నప్పటికీ హోంశాఖను నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయాన్నీ పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా రాష్ట్రంలో శాంతిభద్రతలపై పూర్తి స్థాయి సమీక్ష జరిపిన దాఖలాలు లేవు. అధికార పార్టీలో కుమ్ములాటలు గురించి, రాజకీయ ప్రత్యర్థుల కదలికల గురించి ముఖ్యమంత్రికి సమాచారం అందజేయడంలోనే నిఘా అధికారులకు ఎక్కువగా మునిగిపోతున్నారనే ప్రచారం జరుగుతుంది. ఈ విషయమై కేంద్ర నిఘా సంస్థలు తరచుగా రాష్ట్ర ప్రభుత్వ అధికారులను వారిస్తూనే ఉన్నాయి.
ప్రవీణ్

