Jan Aushadhi

జన ఔషధి కేంద్రాల ద్వారా సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ

మందులు ఆరోగ్యాన్ని కాపాడతాయి, ప్రాణాలను నిలబెడతాయి. కానీ మందులకు డబ్బు ఖర్చవుతుంది. ఆస్పత్రి పాలైనప్పుడు బీమా ద్వారా కాక సొంతంగా చేసే ఖర్చుల్లో ప్రధాన వాటా మందులదే. పౌరులపై ఈ భారాన్ని తగ్గించడానికి, ప్రభుత్వం ప్రభుత్వ ఆస్పత్రుల ద్వారా, 1.7 లక్షలకు పైగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల ద్వారా ఉచితంగా మందులను అందిస్తోంది. ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి ఆరోగ్య యోజన (ఏబీ పీఎంజేఏవై) ద్వారా 55 కోట్ల మందికి అవసరమైన అన్ని మందులతో సహా ఉచితంగా ఇన్‌పేషేంట్ సేవలు అందిస్తోంది. పలు నిత్యావసర మందుల ధరలను కూడా ప్రభుత్వం నియంత్రిస్తోంది. 

రోగులు సొంతంగా చేసే ఖర్చు గత పదేళ్ళలో తగ్గుతూ రావడానికి బిజెపి ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నాలే కారణం. 2013-14లో మొత్తం ఆరోగ్య వ్యయంలో సొంత ఖర్చుల శాతం 64 నుంచి 2021-22 నాటికి 39 శాతానికి తగ్గడానికి ఈ ప్రయత్నాలు దోహదం చేశాయి. కానీ ఆరోగ్య సంరక్షణపై ఆర్థిక భారాన్ని మరింత తగ్గించడానికి చేయాల్సింది చాలా ఉంది. ప్రధాన మంత్రి భారతీయ జన ఔషధి పరియోజన (పీఎంబిజెపి) ప్రధాన లక్ష్యం సరిగ్గా ఇదే. జన ఔషధి కేంద్రాల (జేఏకే) నెట్‌వర్క్ ద్వారా నాణ్యమైన జనరిక్ మందులను అందించాలని పీఎంబిజెపి లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం 776 జిల్లాల్లో 15,000కు పైగా కేందాలు పనిచేస్తూ ప్రతిరోజూ సుమారు 10 లక్షల మందికి ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తున్నాయి. జన ఔషధీ కేంద్రాల్లో (జేఏకే) 2,047 మందులు, 300 శస్త్రచికిత్స, ఆరోగ్య సంరక్షణ వస్తువులను విక్రయిస్తున్నారు. బహిరంగ మార్కెట్లో విక్రయించే బ్రాండెడ్ మందుల కంటే జేఏకేల్లో విక్రయించే మందులు సగటున 50 శాతం నుంచి 80 శాతం చౌకగా లభిస్తాయి. ఉదాహరణకు, అధిక రక్తపోటుకు సాధారణంగా వాడే మందు టెల్మిసార్టన్ (40 మిగ్రా) మార్కెట్లో సగటు ధర 10 టాబ్లెట్లకు రూ.72.జేఏకేలలో అదే జనరిక్ ఔషధం ధర 10 టాబ్లెట్లకు రూ.12 మాత్రమే.

ఒక పటిష్టమైన వ్యవస్థ అన్ని జేఏకేలలో విక్రయించే మందులు, శస్త్రచికిత్సా ఉత్పత్తుల నాణ్యతకు హామీ ఇస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన మంచి తయారీ పద్ధతుల (జీఎంపీ) మార్గదర్శకాలను అనుసరించే తయారీదారుల నుంచే అన్ని మందులనూ సేకరిస్తారు. వీటిని అటువంటి ఉత్పత్తిదారుల నుంచే సేకరించారో లేదో డ్రగ్ కంట్రోలర్ ధృవీకరిస్తారు. అంతేగాక ఈ ఉత్పత్తి యూనిట్ల నాణ్యతను పీఎంబిజెపి ఆడిట్ చేస్తుంది. ఈ మందులు గోదాములకు అందిన తర్వాత అన్ని బాచ్ లను ప్రఖ్యాత నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ లేబొరేటరీస్ (ఎన్ఏబీఎల్) గుర్తింపు పొందిన ప్రయోగశాలల్లో పరీక్షిస్తారు. వాటిలోని ధాతువులు, ద్రావణీయత వంటి వివిధ ప్రమాణాల పరంగా అత్యంత ప్రాచుర్యం పొందిన బ్రాండెడ్ మందులతో ఈ మందులను క్రమం తప్పకుండా ప్రభుత్వం పోల్చి, అవి ప్రభావవంతంగా ఉన్నాయో లేదో తనిఖీ చేస్తూ ఉంటుంది. 

2023 అక్టోబర్ 31న దేవగఢ్‌లోని ఎయిమ్స్‌లో 10,000వ జన ఔషధీ కేంద్రాన్ని ప్రారంభించిన ప్రధాన మంత్రి మోదీ వచ్చే రెండేళ్లలో జేఏకేల సంఖ్యను 10,000 నుంచి 25,000కు పెంచే పథకాన్ని ప్రకటించారు. గడచిన 11 నెలల్లో 4,500కు పైగా కేంద్రాలు ప్రారంభం కావడం ఈ విస్తరణ వేగానికి నిదర్శనం. పీఎంబిజెపి కింద ఫ్రాంచైజీ తరహా నమూనాలో జేఏకేలను స్థాపించడానికి పారిశ్రామికులు, స్వచ్ఛంద సంస్థలు (ఎన్జీవోలు) లేదా ఇతర సంస్థల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తారు. ఈ యూనిట్లను గిట్టుబాటుగా, స్వయం సమృద్ధంగా చేయడానికి, పారిశ్రామికులకు రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ఫార్మాస్యూటికల్స్, మెడికల్ డివైసెస్ బ్యూరో ఆఫ్ ఇండియా (పీఎంబీఐ) సహాయం అందిస్తుంది. అర్హులైన దరఖాస్తుదారులకు డ్రగ్ లైసెన్స్ జారీలో పీఎంబీఐ సహాయం చేస్తుంది, అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకోడానికి ఆర్థిక ప్రోత్సాహకాలను అందిస్తుంది. పీఎంబిజెపి వ్యవస్థాపకతను, స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించింది, ఫార్మాసిస్టులు, చిన్న వ్యాపారాల యజమానులు గిట్టుబాటైన దుకాణాలను నడపడానికి వీలు కల్పించింది. 

6,000 జేఏకేలను (మొత్తం 40 శాతం) మహిళలే నడుపుతున్నారు. ఈ కార్యక్రమం వేల సంఖ్యలో ఉద్యోగాలను సృష్టించడం ద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుంది – పారిశ్రామికులు వీటిద్వారా రూ.1,268 కోట్లు సంపాదించారని అంచనా. బాలికలు, మహిళల రుతుస్రావ ఆరోగ్యానికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోంది. జేఏకేలు భారీ సబ్సిడీతో ఆక్సో బయోడీగ్రేడబుల్ శానిటరీ ప్యాడ్లను కేవలం రూ.1కే అందిస్తున్నాయి. గత ఐదేళ్లలో ఈ మార్గంలో ద్వారా సుమారు 74.5 కోట్ల ప్యాడ్లు అమ్ముడయ్యాయి. మొత్తంగా గత పదేళ్లలో ఈ పథకం వల్ల ప్రజలకు రూ.30,000 కోట్లకు పైగా ఆదా అయినట్టు అంచనా. ప్రతి కొనుగోలుపై పొదుపు చేయడానికి కుటుంబాలకు ఈ పథకం సహాయపడుతుంది. దీర్ఘకాలిక వ్యాధులకు మందులు అవసరమైన వారికి ఇది చాలా ప్రయోజనకరం. అస్సాం, రాజస్థాన్‌లలో ఇటీవల జరిపిన ఒక అధ్యయనం ప్రకారం పీఎంబిజెపి వినియోగదారులైన కుటుంబాలు పీఎంబిజెపియేతర కుటుంబాలతో పోలిస్తే సగటున నెలకు రూ.550 ఆదా చేశాయి. వారిలో నాలుగో వంతు మంది నెలకు రూ 1,000కు పైగా అదా చేసుకుంటున్నారు. నాణ్యమైన ఆరోగ్య సేవలను పొందడంలో ఏ పౌరుడు కూడా వెనుకబడకుండా చూడటానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పీఎంబిజెపి వెల్లడిస్తోంది. అత్యంత సరసమైన ధరలకు నాణ్యమైన మందుల శ్రేణిని అందించడం ద్వారా ఈ పథకం, సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ లక్ష్య సాధనకు, ఆర్థిక ఇబ్బందులు లేని ఆరోగ్య సేవలను అందించడానికి దోహదం చేస్తోంది.

వినోద్ కె పాల్,
నీతి ఆయోగ్ (ఆరోగ్యం) సభ్యుడు