జిల్లాల్లో జోరుగా రాష్ట్రాధ్యక్షుడి పర్యటనలు
బిజెపి తెలంగాణ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు దూకుడు కొనసాగిస్తున్నారు. వరుసగా జిల్లాలను చుట్టేస్తున్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో శ్రేణులను సమాయత్తం చేయడంతో పాటు పార్టీ సంస్థాగత నిర్మాణమే లక్ష్యంగా ఈ పర్యటనలు చేపడుతున్నారు. జూలై 26, 27న ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మహబూబ్‌నగర్, నారాయణ్ పేట్, వనపర్తి, జోగులాంబ గద్వాల, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో పర్యటించారు. జూలై 29, 30న ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలు, ఆగస్టు 5, 6న పెద్దపల్లి, మంచిర్యాల, కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలు, ఆగస్ట్ 7న యాదాద్రి భువనగిరి, జనగామ జిల్లాల్లో పర్యటించారు. ఈ పర్యటనల్లో కార్యకర్తల సమ్మేళనాలతో పాటు పార్టీ సమావేశాల్లో పాల్గొన్నారు. మేధావులు, వృత్తి నిపుణులు, అడ్వకేట్ల తదితర వర్గాలతో సదస్సులు నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లోని ఆలయాలు, ప్రముఖ స్థలాలను సందర్శించారు. మహనీయుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
జూలై 26న ఉమ్మడి పాలమూరు జిల్లాల పర్యటనకు బయలుదేరిన రాంచందర్ రావుకు మార్గమధ్యలో షాద్‌నగర్, బాలానగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్‌లో స్థానిక బిజెపి నేతలు ఘనస్వాగతం పలికారు. తిమ్మాపూర్, పాలమాకుల లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు. మహబూబ్‌నగర్‌లో వివిధ సంఘాలతో సమావేశమయ్యారు. మరికల్ మీదుగా నారాయణపేట చేరుకున్న రాంచందర్ రావుకు ఘనస్వాగతం లభించింది. నారాయణపేటలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. స్థానిక దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి, వివిధ వర్గాలతో సమావేశమయ్యారు. కార్గిల్ విజయ్ దివాస్ సందర్భంగా వనపర్తి జిల్లా కార్యకర్తలు, యువమోర్చ నాయకులు అమరచింతలో నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొన్నారు. అటు నుంచి గద్వాల చేరుకొని అక్కడే రాత్రిబస చేశారు. మరునాడు జూలై 27న శ్రీ గద్వాల్ జోగులాంబ చెన్న కేశవ ఆలయం, శ్రీ లక్ష్మి నర్సింహా స్వామి వారి సన్నిధి, శ్రీ అహోబిల మఠం పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. డీకే అరుణ, బిజెపి గద్వాల్ జిల్లా ముఖ్య నాయకులతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’ కార్యక్రమాన్ని వీక్షించారు. ఏబీవీపీ కార్యాలయాన్ని సందర్శించారు. ఏబీవీపీలో ఉన్నప్పుడు గద్వాలతో ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. గద్వాలలో వివిధ వర్గాలు, మేధావులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. అటు నుంచి వనపర్తి వెళ్లిన రాష్ట్ర అధ్యక్షుడికి పెబ్బేరు వద్ద స్థానిక నేతలు స్వాగతం పలికారు. వనపర్తిలో కార్యకర్తల సమ్మేళనంలో పాల్గొన్నారు, మేధావులు, వివిధ వర్గాలతో సమావేశమయ్యారు. నాగర్‌కర్నూల్ జిల్లా చేరుకున్న రాంచందర్ రావుకు బిజినేపల్లి వద్ద బిజెపి నేతలు ఘనస్వాగతం పలికారు. నాగర్‌కర్నూల్ లో కార్యకర్తల సమ్మేళనంలో పాల్గొన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా ఉయ్యాలవాడలోని గురుకుల పాఠశాలలో ఆహారం వికటించి నాగర్‌కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 50 మంది విద్యార్థులను పరామర్శించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. విద్యార్థులకు నాణ్యమైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. ఈ పర్యటనలో మహబూబ్‌నగర్ ఎంపీ, బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీ.కె. అరుణ, రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్, ఆయా జిల్లాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
జూలై 29న ఉమ్మడి ఖమ్మం జిల్లా పర్యటన కోసం హైదరాబాద్ నుంచి బయలుదేరిన రాంచందర్ రావుకు ఖమ్మం జిల్లా ప్రవేశంలో స్థానిక నేతలు ఘనస్వాగతం పలికారు. కూసుమంచిలో పురాతన స్వయంబు శివాలయాన్ని దర్శించుకున్నారు. ఖమ్మంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడ నిర్వహించిన బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. కార్యకర్తల సమ్మేళనంలో పాల్గొని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. మేధావుల సమావేశంలో పాల్గొన్నారు. అటు నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు బయలుదేరిన రాంచందర్ రావుకు సుజాతనగర్లో ఘనస్వాగతం లభించింది. సుజాతనగర్ నుంచి కొత్తగూడెం వరకు ర్యాలీ తీశారు. కొత్తగూడెంలో నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల సమర శంఖారావ కార్యకర్తల సమ్మేళనంలో పాల్గొన్నారు. అనంతరం భద్రాచలం వెళ్లారు. అక్కడే రాత్రిబస చేశారు. మరునాడు జూలై 30న భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకున్నారు. పాల్వంచ లో శ్రీ శ్రీ శ్రీ కనకదుర్గ దేవస్థానము (పెద్దమ్మగుడి) అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. కొత్తగూడెం జిల్లా కోర్టులో న్యాయవాదులతో మీట్ & గ్రీట్ సమావేశంలో పాల్గొన్నారు. అటు నుంచి మహబూబాబాద్ జిల్లాకు వెళ్లిన రాష్ట్ర రథసారథికి బయ్యారంలో స్థానిక నేతలు ఘన స్వాగతం పలికారు. కురవి వీరభధ్ర స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడి పర్యటన నేపథ్యంలో మహబూబాబాద్‌లో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో ప్రసంగిస్తూ శ్రేణులకు మార్గనిర్దేశం చేశారు. ఈ పర్యటనలో స్థానికంగా ఉండే కుల సంఘాల నాయకులు, ఉద్యోగ సంఘాల నేతలు, న్యాయవాదులు, వైద్యులు, ఇతర ప్రముఖులతో భేటీ అయ్యారు.
ఆగస్ట్ 5, 6న పెద్దపల్లి, మంచిర్యాల, కొమరంభీం అసిఫాబాద్ జిల్లాల్లో పర్యటించారు. హైదరాబాద్ నుంచి పెద్దపల్లికి బయలుదేరిన రాంచందర్ రావుకు సుల్తానాబాద్ నాయకులు స్వాగతం పలికారు. పెద్దపల్లిలో స్థానిక నాయకులతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ యువ నాయకులు మనోహర్ రెడ్డి, ఆయన అనుచరులతో కలిసి బిజెపిలో చేరారు. రాంచందర్ రావు పార్టీ కండువా కప్పి వారిని బిజెపిలోకి ఆహ్వానించారు. అటు నుంచి మంచిర్యాలకు బయలుదేరిన ఆయనకు లక్సెటిపేటలో రైతులు, బిజెపి నాయకులు స్వాగతం పలికారు. లక్సెటిపేటలో రైతులతో ముఖాముఖి సమావేశంలో పాల్గొన్నారు. మందమర్రిలో నిర్వహించిన చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ప్రసంగించారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్‌నగర్‌లో రాత్రిబస చేశారు. ఆసిఫాబాద్ వెళ్లిన రాష్ట్ర అధ్యక్షుడికి స్థానిక నేతలు ఘనస్వాగతం పలికారు. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. రామగుండంలో రాంచందర్ రావుకు ఘనస్వాగతం లభించింది. స్థానిక నాయకులు, కార్యకర్తలు, వివిధ కుల సంఘాలతో నిర్వహించిన సమావేశంలో పాల్గొని ప్రసంగించారు.
ఆగస్ట్ 7న యాదాద్రి భువనగిరి, జనగామ జిల్లాల్లో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహా స్వామి వారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేశారు. యాదాద్రి టౌన్ బీసీ కాలనీలో నిర్వహించిన 11వ జాతీయ చేనేత దినోత్సవ వేడుకల్లో ఎన్. రాంచందర్ రావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం భువనగిరిలో నిర్వహించిన భారీ బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. భువనగిరిలో నిర్వహించిన జిల్లా కార్యకర్తల సమ్మేళనంలో కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం జనగామ జయలుదేరిన రాంచందర్ రావుకు పెంబర్తి వద్ద ఘన స్వాగతం లభించింది. అక్కడ చేతివృత్తుల వారితో మాట్లాడి వారి కష్టసుఖాలు తెలుసుకున్నారు. జనగామలో జరిగిన జిల్లా కార్యకర్తల సమ్మేళనంలో పాల్గొని శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారు.
ఈ పర్యటనల్లో ఆయా సందర్భాల్లో ప్రసంగిస్తూ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మోసాలను మరోసారి గుర్తు చేశారు. దేశాభివృద్ధి కోసం కేంద్రంలోని మోదీ ప్రభుత్వం చేస్తున్న కృషిని, తెలంగాణకు అందిస్తున్న సహకారాన్ని వివరించారు. స్థానిక సమస్యలను లేవనెత్తి వాటికి పరిష్కార మార్గాలను సూచించారు. బిజెపి డబుల్ ఇంజన్ సర్కార్‌తో సమస్యలు పరిష్కారమై, అభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. రాష్ట్ర అధ్యక్షుడి పర్యటనలతో స్థానిక నాయకులు, కార్యకర్తల్లో నూతనోత్సాహం వెల్లివిరిస్తోంది.

