రాహుల్ గాంధీ ఓ ‘ఫేక్ ఇండియన్’
రాహుల్ గాంధీ “ఫేక్ ఓట్లు”, “ఓట్ల చోరీ” అంటూ కొత్త రాగం అందుకొని బిజెపిపై, మోదీ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు విమర్శించారు. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పుడు ఫేక్ ఓట్లు గుర్తుకురాలేదా అని ప్రశ్నించారు. మహారాష్ట్ర, హర్యానాలో కాంగ్రెస్ ఓడిపోయిన తర్వాత, అలాగే బీహార్‌లో కూడా ఓడిపోతామని తెలిసిన తర్వాత రాహుల్ గాంధీ ఫేక్ ఓట్లు గురించి తప్పుడు ప్రచారం మొదలుపెట్టారన్నారు. బిజెపి ఓడినప్పుడు ఈవీఎంల గురించి, ఫేక్ ఓట్లు అంటూ ఎప్పుడూ తప్పుడు ప్రచారం చేయలేదన్నారు. ఓడినా, గెలిచినా బిజెపి ప్రజాస్వామ్యాన్ని నమ్ముతుందన్నారు. ఆపరేషన్ సిందూర్ గురించి తప్పుడు ప్రచారం చేసిన, దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ ఒక ‘ఫేక్ ఇండియన్’ అని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీ వెనుక అర్బన్ నక్సల్స్, దేశ వ్యతిరేక శక్తులు ఉన్నాయని తెలిపారు. ఎన్. రాంచందర్ రావు, బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్ సమక్షంలో నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బిజెపిలో చేరారు. హైదరాబాద్ బిజెపి రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో బిజెపిలో చేరిన గువ్వల బాలరాజుకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. బాలరాజుతో పాటు పెద్ద సంఖ్యలో ఆయన అనుచరులు పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా ఎన్. రాంచందర్ రావు మాట్లాడుతూ.. ‘‘తెలంగాణలో బిజెపి ప్రత్యామ్నాయంగా మారుతోంది. గత 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 13.9% ఓటుశాతం సాధించగా, 2024 పార్లమెంట్ (లోక్‌సభ) ఎన్నికల్లో 36 శాతానికి పైగా ఓటుశాతం పెరిగింది. 8 ఎంపీ సీట్లలో గెలిచింది. బీఆర్ఎస్కు లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాలేదు. ఆ పార్టీ పరిస్థితి సున్నా అయింది. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి 2 సీట్లు కైవసం చేసుకుంది. బిజెపి తెలంగాణలో క్రమంగా పెరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా చాలామంది బిజెపిలో చేరేందుకు సిద్ధమయ్యారు. నేను బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకొని నెలరోజులు గడిచింది. ఈ నెలరోజుల్లో నేను 16 జిల్లాల్లో 3500 కి.మీ. మేరకు పర్యటించాను. వేలాదిమంది కార్యకర్తలను, ప్రజలను కలిసాను. ఈ పర్యటనల్లో ప్రజా సమస్యలపై ప్రజల నుంచి వందలాది పిటిషన్లు మాకు అందాయి. ఎక్కడికెళ్లినా ఎంపీపీలు, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు అనేకమంది పార్టీలో చేరారు. అన్ని జిల్లాల్లో ప్రజలు స్వచ్ఛందంగా బిజెపిలో చేరుతున్నారు. ఇది ప్రజల విశ్వాసానికి నిదర్శనం.
రేవంత్‌రెడ్డి దిల్లీ టూర్లపై దృష్టి పెట్టడం బదులు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌పై దృష్టి సారించి హైదరాబాద్ అభివృద్ధిపై శ్రద్ధ పెట్టాలి. ఓవైపు వర్షాలతో అస్తవ్యవస్తమవుతుంటే ఇవేమీ పట్టనట్లు “గేట్‌వే ఆఫ్ హైదరాబాద్” అంటూ మాటలు చెబుతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తీవ్రమైన అవినీతి, కుటుంబ పాలన, నిరంకుశ పాలన ప్రజలను విసిగించారు. ప్రజలు కాంగ్రెస్‌ను నమ్మి ఓటు వేసినా, 19 నెలల పాలనలో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. గత రెండు పార్టీలకు ప్రజలు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు ఆ రెండు పార్టీలు ప్రజావ్యతిరేక విధానాలతో ప్రజలను మోసం చేశాయి. ఇప్పుడు బిజెపికి ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరుతున్నాం. ప్రజా స్పందన చూస్తుంటే, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు బిజెపిని ఆదరించడమే కాదు, అత్యధిక స్థానాల్లో బిజెపి విజయం సాధించడం ఖాయం.’’ అని అన్నారు.
ఈ సందర్భంగా గువ్వల బాలరాజు మాట్లాడుతూ.. ‘‘తెలంగాణలో గత దశాబ్దాలుగా అది బీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ అయినాప్రజలను మోసం చేస్తూ, వంచిస్తూ, దగాకోరు వ్యవహారాలను ముందుకు తీసుకువెళ్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో, ఈ వేదికపై ఉన్న ప్రతి కాషాయ సైనికుడు, బిజెపి నాయకుడు, కార్యకర్త అద్భుతంగా పోరాటం చేస్తున్నారు. ఆ పోరాటాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. పార్టీలోకి వచ్చే ముందు కొంత పరిశోధన చేశాను. అంతకుముందు బిజెపి ఒక రకమైన సామాజిక వర్గాన్ని మాత్రమే ప్రోత్సహిస్తుందని అనుకున్నాను. కానీ దగ్గరగా చూసిన తర్వాత తెలిసింది, కరుడు గట్టిన దేశభక్తి కలిగిన ఎంతో మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముఖ్యంగా మైనారిటీ సోదర సోదరీమణులు కూడా బిజెపిలో ఉన్నారని. కాంగ్రెస్ “గరీబీ హటావో” నినాదాన్ని ఇచ్చి, దేశాన్ని అమ్మడానికి, తాకట్టు పెట్టడానికి, విదేశీ నాయకత్వాన్ని మనమీద రుద్దడానికి ప్రయత్నించింది. మళ్ళీ శాసన సభ్యుడిని కావాలని, పార్లమెంట్ సభ్యుడిని కావాలని, నామినేటెడ్ పదవులు కావాలన్న కోరిక నాకు లేదు. ఈ కుటుంబంలో నా ప్రయాణాన్ని ఒక సామాన్య కార్యకర్తలా మొదలు పెడతా. పార్టీ పెద్దల ఆలోచనలతో వారు ఇచ్చే సలహాలు, సూచనలతో దేశ రక్షణ కోసం, తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడడం కోసం ఒక నిబద్ధత కలిగిన కార్యకర్తగా పని చేస్తాను.’’ అని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, డా. కాసం వెంకటేశ్వర్లు, పార్టీ రాష్ట్ర కోశాధికారి శాంతి కుమార్, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మీడియా ఇంచార్జ్ ఎన్.వి.సుభాష్, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులు సోలంకి శ్రీనివాస్, కట్టా సుధాకర్, సీనియర్ నాయకులు ఆచారి, నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు నరేందర్ రావు తదితరులు పాల్గొన్నారు.

