కవితను రాజకీయంగా నడిపిస్తుందెవరు?
కల్వకుంట్ల కవిత పట్టుబట్టి శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చేత ఎమ్మెల్సీ పదవికి రాజీనామాను ఆమోదింప చేసుకున్నారు. దీంతో ఆమె అధికారికంగా మండలి సభ్యత్వాన్ని కోల్పోయారు. కవిత 2021 డిసెంబరులో నిజామాబాద్ స్థానిక సంస్థల కోటాలో బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్సీగా ఎన్నికై, 2022 జనవరిలో బాధ్యతలు చేపట్టారు. అయితే, గత ఏడాది కాలంగా పార్టీ నాయకత్వంతో ఆమె అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా 2024 ఏప్రిల్ 27న బీఆర్ఎస్ ఆవిర్భావ సభ అనంతరం పార్టీ అధినేత కేసీఆర్కు తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఆమె లేఖ రాయడం, ఆ లేఖ లీక్ కావడంతో ఓ విధంగా రాజకీయ వర్గాల్లో కలకలం రేగింది. అప్పటి నుండి తన రాజకీయ ఉనికి కాపాడుకొనేందుకు ఆమె విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మొదట్లో బీసీ కార్డు ప్రయోగించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత నేరుగా బీఆర్ఎస్ నాయకులపై విమర్శనాస్త్రాలు ప్రయోగిస్తూ వస్తున్నారు. ఇదే సమయంలో ఆమె తన దాడిని బిజెపిపై ఎక్కు పెడుతున్నారు. దిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయినప్పటి నుండి ఆమె బిజెపిని గురిపెట్టి దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆమె ఈ కుంభకోణంలో చిక్కుకున్న కారణంగా రాష్ట్రంలో పార్టీ అప్రతిష్టకు గురయిందని, 2023 అసెంబ్లీ ఎన్నికలలో పరాజయానికి అదొక ప్రధాన కారణం అని బీఆర్ఎస్ నాయకులే ఎక్కువగా విశ్వసిస్తున్నారు. అందుకనే ఆమెను పార్టీ క్రియాశీల కార్యక్రమాలకు దూరంగా ఉంచుతూ వచ్చారు.
తెలంగాణ ఉద్యమకాలంలోనే రాష్ట్ర విభజన జరిగి, టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని అమెరికా నుండి హడావుడిగా హైదరాబాద్ చేరుకున్న కేటీఆర్, కవిత పార్టీలో, ఉద్యమంలో తామే ముందుండే ప్రయత్నం చేస్తూ వచ్చారు. పార్టీలో మొదటి నుండి పనిచేస్తున్న పలువురిని పక్కకు నెట్టివేసి తమ ప్రాబల్యం పెంచుకునే ప్రయత్నం చేస్తూ వచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాగానే కేటీఆర్ రాష్ట్ర మంత్రివర్గంలో చేరగా, కవిత లోక్ సభకు ఎన్నికై కేంద్ర మంత్రివర్గంలో చేరేందుకు విఫల ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు బిజెపిలో పార్టీని విలీనం చేస్తున్నారని గగ్గోలు పెడుతున్న ఆమె అప్పట్లో నేరుగా బిజెపి జాతీయ నాయకులను కలిసి ఎన్డీయేలో టీఆర్ఎస్ చేరుతుందని, తనను మంత్రివర్గంలో చేర్చుకోమని కోరలేదా? అయితే మొదటి నుండి ఈ విషయంలో అప్రమత్తంగా ఉంటూ వచ్చిన బిజెపి నాయకత్వం తెలంగాణలో సొంతంగా తన బలాన్ని పెంచుకొనే ప్రయత్నం చేస్తూ వచ్చింది. మద్యం కేసులో అరెస్టయి వచ్చినప్పటి నుంచి సొంత పార్టీలో ఉనికి ప్రశ్నార్థకంగా మారేందుకు బిజెపి కారణం అంటూ ఆ పార్టీని దుమ్మెత్తి పొసే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. ఈ ప్రయాణంలో కాంగ్రెస్ లేవనెత్తిన బీసీ అజెండాను భుజంపై వేసుకోవడం ద్వారా ఆమెను వెనుక నుండి రాజకీయంగా మరెవ్వరో నడిపిస్తున్నారని విషయం స్పష్టం అవుతుంది.
ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేస్తున్న కవిత ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎపుడైనా విధానపరమైన అంశాలపై మాట్లాడారా? అప్పుడు కూడా కేసీఆర్ కుమార్తెగా దిల్లీలో తన పలుకుబడి పెంచుకునే ప్రయత్నం చేస్తూ వచ్చారు. చివరకు ఆప్ ప్రభుత్వంతో కుమ్మక్కయిన్నట్లు వెల్లడైంది. ఇప్పటి వరకు ఈ కేసు నుంచి, ఆరోపణల నుంచి ఆమె బయట పడలేదు. ఈ విషయంలో ఆమె సొంత పార్టీ నాయకులే ఆమెకు మద్దతు ఇచ్చేందుకు వెనకడుగు వేస్తూ వచ్చారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా ఆమోదం పొందగానే ఆమె త్వరలో తమ పార్టీలో చేరే అవకాశం ఉందంటూ కాంగ్రెస్ నాయకుడు మల్రెడ్డి రంగారెడ్డి వాఖ్యానించడం గమనార్హం. దానం నాగేందర్, కడియం శ్రీహరి తమ పార్టీలోకి వస్తారని ఊహించలేదని, చివరికి వారు వచ్చారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. పలు సందర్భాల్లో ఆమె కాంగ్రెస్ ప్రయోజనాలకు అనుగుణంగా అడుగులు వేస్తున్నట్లు స్పష్టం అవుతూ వచ్చింది. కాంగ్రెస్ లో చేరే విషయమై వస్తున్న కథనాలను గతంలో కవిత కొట్టిపారేసారు. ఆమె ప్రస్తుతం తన సొంత సంస్థ జాగృతిని రాజకీయ పార్టీగా మార్చబోతున్నట్లు ప్రకటించినా ఆమె అసలు ఉద్దేశ్యం రాష్ట్రంలో అధికారంలోకి రాగాల పార్టీలో చేరడమే అని ఆమె మాటలే స్పష్టం చేస్తున్నాయి. ఆమెను బిజెపిలో చేర్చుకునే అవకాశాలు కనిపించడం లేదు. అందుకే ఆమె ఎక్కువగా ఆ పార్టీపై, కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. బీఆర్ఎస్ పై విమర్శలు చేస్తున్నా అవి కేవలం ఎంపిక చేసుకొని, కొద్ది మంది నాయకులను లక్ష్యంగా చేసుకోవడం ఆసక్తి కలిగిస్తోంది. కాంగ్రెస్ నాయకులు చేస్తున్న విమర్శలు, ఆమె చేస్తున్న విమర్శలకు పోలిక కూడా కనిపిస్తున్నది. భవిష్యత్తులో అవసరమైతే కాంగ్రెస్ కు దగ్గరయ్యేందుకు వ్యూహాత్మకంగా కేసీఆర్, కేటీఆర్ ఆమెను అటువైపు పంపుతున్నారా? లేదా నిజంగా సొంత పార్టీకి తెలంగాణలో ఇక రాజకీయ మనుగడ కష్టమని గ్రహించి ఏదో దారి చూసుకునే ప్రయత్నం చేస్తున్నారా? అనే అనుమానాలు ఈ సందర్భంగా కలుగుతున్నాయి.
కవిత ప్రకటనలు, వ్యక్తం చేస్తున్న ఆవేదనలు అన్ని తన రాజకీయ ఉనికి ప్రశ్నార్థకంగా మారిందనే ఆందోళనలనే వెల్లడి చేస్తున్నాయి. ఆమె చెబుతున్నట్లు ‘సామజిక తెలంగాణ’ కోసం ప్రజల సమస్యలు, బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనలలో పేరుకుపోయిన అవినీతి, ప్రజా వ్యతిరేక విధానాలు వంటి వాటి పట్ల ఆమె పెద్దగా ఆందోళన వ్యక్తం చేస్తున్న సూచనలు కనిపించడం లేదు. ఆమె మాటలను బట్టే సొంత పార్టీలోనే తనకు ఘోర అవమానం జరిగిందని, తన గొంతు నొక్కే ప్రయత్నం చేశారని, అందుకే మరో దారి చూస్తుకుంటున్నానని ఆమె స్పష్టం చేశారు. అంటే, ప్రజా సమస్యలపై, విధానపరమైన అంశాలపై ఆమెకు పెద్దగా నిబద్ధత లేదని స్పష్టం అవుతుంది. పార్టీ నిర్ణయాల్లో తనను పక్కన పెట్టడం, ప్రాధాన్యత తగ్గించడం వంటి అంశాలే ఆమెను కొత్త పార్టీ నిర్ణయం వైపు నడిపించాయని తెలుస్తుంది. అయితే, కాంగ్రెస్ లోని బలమైన శక్తులు ఆమెను నడిపిస్తున్నాయనే విమర్శలు ఈ సందర్భంగా వస్తున్నాయి. ఆమె మాటలు సైతం అందుకు బాసటగా నిలుస్తున్నాయి. ఏదిఏమైనా ఆమె రాజకీయ ఉనికి కోసం చేస్తున్న ప్రయత్నాలను తెలంగాణ ప్రజలు పట్టించుకొనే అవకాశం లేదు.
కృష్ణ చైతన్య

